కొత్త మేయర్ ఎవరు ?
చిత్తూరు: చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ మృతితో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది. స్థానికంగా ఈ విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. మేయర్ ఎన్నిక జరగాలంటే ఆమె మృతితో ఖాళీ అయిన 33వ డివిజన్‌కు ఎన్నిక జరగాల్సి ఉంది. నిబంధనల మేరకు ఖాళీ అయిన స్థానంలో ఆరునెలలలోపు ఎన్నిక జరగాలి. ఆ తరువాతనే 50 మంది కార్పొరేటర్లు మేయర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. దీనికి కొంత సమయం పట్టే అవకాశమున్నా అనురాధ మరణంతో తదుపరి మేయర్‌గా ఎవరిని ఎన్నుకుంటారనే విషయం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగామారింది.
రిజర్వేషన్‌లో భాగంగా చిత్తూరు మే యర్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. కఠారి మోహన్ ఓసీ అయినా సతీమణి అనూరాధ తండ్రి తరఫున (ఈడిగబలిజ) బీసీ కావడంతో అప్పట్లో ఆమె మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆమె మృతితో మేయర్ పద వి ఎవరికి కట్టబెట్టాలన్న విషయం తెరపైకి వచ్చింది. అనురాధ స్థానంలో కఠారి మో హన్ కోడలు హేమలతను కార్పొరేటర్‌గా గెలిపించి ఆ తరువాత మేయర్‌ను చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కఠారి మోహన్ ఓసీ కావడంతో ఆయన కోడలు కూడా ఓసీకి చెందినవారవుతారు.
కానీ అనూరాధలాగే కోడలు హేమలత కూడా తండ్రి తరఫున (ఈడిగ బలిజ) బీసీ అయిన పక్షంలో ఆమెను మేయరుగా ఎన్నుకొనే అవకాశముందనేది విశ్లేషకుల అభిప్రా యం. అలాకాని పక్షంలో కఠారి కుటుంబానికి మేయర్ పదవిదక్కే అవకాశం ఉండదని తెలుస్తోంది. అయితే చిత్తూరు మేయర్ పదవిని కఠారి కుటుంబానికే ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చిత్తూరు టీడీపీ నేతలకు చెప్పినట్లు సమాచారం. అయినా పదిరోజుల పాటు మేయర్ ఎన్నిక విష యం పక్కన బెట్టాలని, ఆ తరువాతే ఆ విషయం మాట్లాడుదామని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి నిర్ణయాన్ని బట్టి మేయర్ ఎంపికపై తదుపరి కార్యాచరణకు దిగాలని చిత్తూరు టీడీపీ నేతలు భావిస్తున్నారు. కఠారి కుటుంబానికి రిజర్వేషన్ సమస్య ఎదురైతే ఆ తరువాత మేయ ర్ పదవి తమవర్గీయులకే కట్ట బెట్టాలని కొందరు స్థానిక టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కార్పొరేషన్‌లో 3, 7, 27, 30, 42, 45, 47, 48 డివిజన్ల నుంచి ఎనిమిది మంది బీసీ వర్గాలకు చెందిన మహిళలు కార్పొరేటర్లుగా ఉన్నా రు. వీరిలో పలువురు కార్పొరేటర్ల మేయర్ పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే వారు స్థానిక టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు.
అయితే బీసీ మహిళ అన్న దానికంటే మొదటి నుం చి టీడీపీలో ఉండి పార్టీపట్ల విధేయత ఉన్న వారి నే మేయర్‌గా ఎంపిక చేస్తామని తెలుగుదేశం నేత లు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో ముందు కఠా రి కుటుంబం రిజర్వేషన్ వ్యవహారం తేలాల్సివుం ది. మోహన్ కోడలు బీసీ అయితే మేయర్ పదవిని సీఎం ఆమెకే కట్టబెట్టే అవకాశాలున్నాయి. అలా కాని పక్షంలో ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ల నుండి ఒకరిని మేయర్‌గా ఎంపిక చేస్తారా? లేక అనూరాధ స్థానంలో వేరొకరిని కార్పొరేటర్‌గా గెలిపించి వారికి మేయర్ పదవి కట్టబెడతారా? అన్నది వేచి చూడాల్సి వుంది.
మున్సిపాలిటీగా ఉన్న చిత్తూరు 2012 జులై లో కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయ్యింది. ఆ తరువాత 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచి అధికారం చేపట్టింది. మొత్తం 50 డివిజన్ల ఉండగా 33 స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. ఆ తరువాత ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు టీడీపీలో చేరడం తో వారి సంఖ్య 36కు పెరిగింది.