- కబ్జాదారులను వదిలే ప్రసక్తే లేదు
- ఐటీ రంగంలో రూ 40 వేల కోట్ల టర్నోవరే లక్ష్యం
- టీడీపీ మైనారిటీ విభాగం సర్వసభ్య సమావేశంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి
చిత్తూరు(సిటీ): కేంద్రం సాయం చేసినా, చేయకపోయినా రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేసి తీరుతామని రాష్ట్ర పౌర సంబంధాలు, ఐటీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన చిత్తూరులో టీడీపీ జిల్లా కార్యాల యంలో జరిగిన పార్టీ మైనారిటీ విభాగం కార్యకర్తల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మసీదు స్థలా లు, వక్ఫ్ భూములు, మైనారిటీల శ్మశాన స్థలాలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. దీనిపై తాను ఇప్పటికే విచారణకు ఆదేశించానని, విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం సాయం చేసినా, చేయకపోయినా 1,20,000 మంది రైతులకు చెందిన రూ.37వేల కోట్ల రుణ బకాయిలు, మరో 7,500 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణపై తెలంగాణ సీఎం కేసీఆర్ రాద్ధాంతం చేయడం తగదన్నారు. చిత్తూరు, తంబళ్లపల్లె ఎమ్మెల్యేలు సత్యప్రభ, శంకర్ మాట్లాడుతూ మైనారిటీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బీఎన్,రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, రాజ్యసభ మాజీ సభ్యురాలు దుర్గ మాట్లాడారు. అనంతరం ముస్లింలు మంత్రికి సన్మానం చేశారు. ఈ సమావేశంలో పార్టీ పీలేరు నియోజకవర్గ నేత ఇక్బాల్ అహ్మద్, మైనారిటీ నేతలు షబ్బీర్, రఫీ, జహంగీర్‌ఖాన్, నౌషద్, జహంగీర్‌ఖాన్, పర్వీన్‌తాజ్, నగర మేయర్ కఠారి అనురాధ, డెప్యూటీ మేయర్ సుబ్రమణ్యం, మహిళా నేతలు వైవీ.రాజేశ్వరి, ఇందిర పాల్గొన్నారు.