సాక్షి, హైదరాబాద్: నగరంలో ‘జీరో’ వ్యాపారం జోరుగా సాగుతోంది. బిల్లులు లేకుండా లక్షల్లో లావాదేవీలు తెల్లకాగితాల పైనే నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. జీఎస్‌టీ లాంటి పన్ను విధానాలు అమలు చేస్తున్నా..కొందరు వ్యాపారులు అడ్డదారుల్లో బిల్లులు ఇవ్వకుండా జీరో వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ‘ఏ వస్తువు కొనుగోలు చేసినా..బిల్లు తీసుకోవటం తప్పనిసరి. బిల్లు అడగటం వినియోగ దారుడి హక్కు. మేలుకో వినియోగదారుడా మేలుకో’ అంటూ వినియోగదారుల శాఖ...‘సకాలంలో పన్నులు చెల్లించండి.. దేశాభివృద్ధిలో పాలుపంచుకోండి’ అంటూ వాణిజ్య పన్నుల శాఖ చేస్తున్న ప్రచారం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది.
బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, మొజంజాహీ మార్కెట్, ట్రూప్‌బజార్, సికింద్రాబాద్, మలక్‌పేట్ గంజ్, చార్మినార్, పత్తర్‌ఘాట్‌తో పాటు నగరం వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల మార్కెట్‌లలో బిల్లులు ఇవ్వకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. నగరంలో కొన్ని షాపింగ్ మాల్స్‌లో సైతం బిల్లులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కొందరు మాత్రం వినియోగదారులు అడిగితే ఇవ్వడం..లేదంటే వదిలేయడం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులకు ఈ విషయం తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. వారికి మామూళ్లు మడుతున్నందున జీరో వ్యాపారం జోరుగా సాగుతోందిని పలువురు ఆరోపిస్తున్నారు.
జీఎస్టీ ఉన్నా...
జీఎస్‌టీ చట్టం అమలులో ఉన్నా జీరో బిజినెస్ మాత్రం ఆగడం లేదు. అమ్మకాల విలువలో కొంత శాతం మాత్రమే వాణిజ్య పన్నుల శాఖ రికార్డుల్లో కనిపిస్తుంది. ఎంత పెద్ద మొత్తంలో బిల్లు అయినా తెల్ల కాగితంపై రాసిస్తారు. దీనిపై తీసుకున్న వస్తువుల పేర్లు, దుకాణం పేరు, రిజిస్టర్ నెంబర్ కనిపించవు. వినియోగదారులకు బిల్లు ఇస్తే ట్యాక్స్‌తో వస్తువుల ధర పెరుగుతుందని వ్యాపారులు చెబుతారు. దీంతో వినియోగదారులు సైతం ఎక్కువ మొత్తం చెల్లించలేక బిల్లులు ఇవ్వకున్నా నిమ్మకుండిపోతున్నారు. ఈ విషయం వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు కూడా తెలుసు. అయినా చర్యలు తీసుకోవటంలో విఫలమవుతున్నారు. పన్ను వసూళ్లు పెరిగేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడంలేదు. దీంతో అక్రమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది.
అన్ని వస్తువులూ అంతే...
చౌక ధరకే వస్తువులు లభించటం బేగంబజార్ ప్రత్యేకత. 1770 నుంచే ఇక్కడ మార్కెట్ కొనసాగు తోంది. వందల సంఖ్యలో ఉన్న దుకాణాల్లో రోజూ రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. దుకాణాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. గృహోపకరణాలు, మేకప్ వస్తువులు, డ్రైఫూట్స్, మసాలాలు, సుగంధ ద్రవ్యాలు, స్టీల్ వస్తువులు, కిరాణా, ట్రాన్స్‌పోర్టు, దీపావళి టపాసులు, ప్లాసిక్ వస్తువులు, ఫర్నిచర్, బంగారం...ఇలా అనేక వ్యాపారాలకు బేగంబజార్ ప్రసిద్ధి. ఇక్కడి నుంచే జిల్లాలకు వస్తువులు సరఫరా అవుతుంటాయి. జిల్లాల్లో రిటైల్, హోల్‌సేల్ దుకాణాలు నిర్వహించే వారు సరుకుల్ని ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటారు. బేగంబజార్‌ను ఆనుకొని ఉన్న ముక్తియార్‌గంజ్, కిషన్‌గంజ్, ఉస్మాన్‌గంజ్, మహరాజ్‌గంజ్ తదితర మార్కెట్లలో చిరుధాన్యాలు, పిండి, బియ్యం, నూనె హోల్‌సేల్ వ్యాపారం జరుగు తుంది. దుకాణాలు చూసేందుకు చిన్నగా కనిపిస్తాయి. వీటికి సంబంధించిన గోడౌన్లు ప్రత్యేకంగా ఉంటాయి. కేవలం బిల్లు మాత్రమే దుకాణాల్లో ఇస్తారు. సరుకు మాత్రం గోడౌన్ల నుంచే సరఫరా చేస్తారు. ఇలా నిత్యం పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతున్నా కొంతమంది లెక్కల్లో కనిపించేది మాత్రం స్వల్పమే.
ప్రభుత్వ ఆదాయానికి గండి
రాష్ట్రవ్యాప్తంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి అమ్మకం పన్ను రూపంలో దాదాపు రూ.60 వేల కోట్లు ఆదాయం సమకూరిందని అధికారుల చెబుతున్నారు.. ఇందులో హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయమే సుమారు 60–65 శాతంగా ఉంటు ంది. నగరంలో పన్నులు చెల్లించని జీరో వ్యాపారం పెరిగిపోవటంతో ఆశించినంత స్థాయిలో ఆదాయం రావటం లేదు. వాణిజ్య పన్నుల శాఖ లెక్కల ప్రకా రం బేగం బజార్ సర్కిల్‌లో సుమారు 2 వేల వరకు రిజిస్టర్డ్ డీలర్లు ఉన్నారు. ఇందులో రిటైల్, హోల్‌సేల్ వ్యాపారులున్నారు. వీరిలో కొంతమంది పూర్తిస్థాయి లో అమ్మకాల లెక్కలు చూపటం లేదు. మిగిలిన మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment