వాణిజ్య పన్నుల శాఖలో స్పెషల్ దోపిడీ
► దారికి రాని వ్యాపారులపై ఆడిట్ కొరడా
► ఏసీబీ దాడులకూ వెరవని అధికారులు
విజయవాడ సిటీ : వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి పెచ్చరిల్లింది. రకరకాల కొర్రీలతో వ్యాపారుల నుంచి ముక్కు పిండి మరీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఇవ్వని వారిని చట్టాల కొరడా ఝళిపించి దారికి తెచ్చుకుంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖ సేవల్లో పారదర్శకత కోసం ఈ-రిజిస్ట్రేషన్లు, ఈ-వే బిల్లులు, ఈ-వసూళ్లు సహా ఎన్ని కొత్త విధానాలు అమలులోకి తెస్తున్నా.. ఆ శాఖలో వేళ్లూనుకున్న అవినీతికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. తరచూ జరుగుతున్న ఏసీబీ దాడులే దీనికి నిదర్శనం. మామూళ్లు గుంజేందుకు వాణిజ్య చట్టంలోని ‘స్పెషల్ ఆడిట్’ను అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
మామూళ్ల వసూలుకు సీటీవో (కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్)లు పథకం రచన చేస్తే.. సీనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు వసూళ్లకు తెగబడుతున్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద సర్కిళ్లలజుో ఒకటైన నందిగామ (భవానీపురం) వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడుల్లో దొరికిన రూ.1.02 లక్షల అనధికార నగదే ఇక్కడి అవినీతికి నిదర్శనం. మిగిలిన సర్కిళ్లలో పరిస్థితి కూడా ఇందుకు భిన్నమేమీ కాదనేది వ్యాపారుల ఆరోపణ.
ఇలా చేస్తారు...
సర్కిల్ పరిధిలోని వ్యాపారులు, ట్రేడర్ల జాబితాను అధికారులు తమ వద్ద అట్టిపెట్టుకుంటారు. వారు నిర్వహించే వ్యాపారాలను బట్టి వార్షిక టర్నోవర్‌ను అంచనా వేస్తారు. ఆపై ఆయా వ్యాపారుల సంఘాలు, మధ్యవర్తుల ద్వారా మూమూళ్లకు తెరలేపుతారు. ఒక్కొక్క వ్యాపారి కనిష్టంగా రూ.10 వేలు, గరిష్టంగా రూ.30 వేలు వీరికి ఏటా మామూళ్లు ఇవ్వాలి. లేకుంటే వారిని రకరకాలుగా వేధిస్తుంటారు. ఆయా వ్యాపారుల నుంచి ఒకేసారి మామూళ్లు తీసుకోకుండా కేటగిరీలుగా విభజించి నెలవారీ వసూళ్లు నిర్దేశిస్తారు. ఒక్క నందిగామ (భవానీపురం) సర్కిల్‌లోనే 3800 మంది డీలర్లు(వ్యాపారులు) ఉన్నట్టు అధికారిక సమాచారం. వీరి వద్ద నుంచి ఏడాదికి సగటున ఒక్కొక్కరి నుంచి రూ.15 వేలు మామూళ్లు తీసుకున్నా.. అక్రమంగా వచ్చే ఆదాయం రూ.4 కోట్ల పైమాటే ఉంటుంది. ఆ మొత్తాన్ని అధికారులు, సిబ్బంది స్థాయిని బట్టి పంపకాలు జరుగుతుంటాయి.
మామూళ్లు ఇవ్వకుంటే ఇలా...
నిర్దేశించిన మేరకు మామూళ్లు ఇవ్వని వ్యాపారులపై ‘స్పెషల్ ఆడిట్’ను ప్రయోగిస్తారు. ఆయా వ్యాపారుల లొసుగులను ముందుగానే గుర్తిస్తారు. ఆపై వారికి నోటీసులు జారీ చేస్తారు. ఇక ఫైళ్ల తనిఖీ పేరిట రకరకాల కొర్రీలు పెడుతుంటారు. రికార్డుల్లో నమోదు కాని వస్తువుల ఖరీదుతో పాటు పెనాల్టీ కింద వ్యాపారుల కళ్లు తిరిగే మొత్తాలను చెపుతారు. దీంతో బెంబేలెత్తిన వ్యాపారులు అధికారుల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునేందుకు సిద్ధమవుతారు. ఇక దారికి వస్తాడనుకుంటే తమ ఉద్యోగులను పంపి వారితో బేరసారాలు సాగిస్తారు. తమ వద్ద పనిచేసే సీనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు సహా కలెక్షన్లలో చురుకుగా వ్యవహరించే వారికి మామూళ్ల వసూళ్ల బాధ్యతలను అప్పగిస్తారు. వీరు ఆయా వ్యాపారుల సామర్థ్యాన్ని బట్టి ‘ప్రత్యేక’ మామూళ్లు వసూలు చేస్తారు. నందిగామ సర్కిల్‌లో ఏసీబీ అధికారుల దాడికి ముందు స్పెషల్ ఆడిట్ నోటీసు అందుకున్న ఓ వ్యాపారి రూ.80 వేలు లంచంగా ఇచ్చినట్టు వెలుగు చూసింది.
ఏడాదిలో నలుగురు దొరికారు...
గత ఏడాది కాలంలో జిల్లాలోని ఇద్దరు సీటీవోలు, ఒక ఏసీటీవో, ఒక సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు వచ్చిన ఆరోపణలపై తిరువూరు వద్ద ఏర్పాటు చేసిన బోర్డర్ చెక్‌పోస్టును ఏసీబీ అధికారులు తనిఖీ చేసి అనధికారిక నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మంగళవారం నందిగామ సర్కిల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసి రూ.1.02 లక్షల అనధికారిక నగదును స్వాధీనం చేసుకోవడం విశేషం.