పన్ను వసూలుకు టెక్నాలజీ వినియోగం
పన్ను వసూలుకు టెక్నాలజీ వినియోగం
Published Tue, Nov 8 2016 10:05 PM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
- సీసీ కెమెరా ఏర్పాటు చేసిన వాణిజ్య పన్నుల శాఖ
కర్నూలు(హాస్పిటల్): తెలంగాణ నుంచి కర్నూలు మీదుగా వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి పన్ను వసూలు చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆధునిక టెక్నాలజీ వాడుకుంటున్నారు. ఈ మేరకు హై డెఫనేషన్ సీసీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. మంగళవారం స్థానిక నగర శివారులోని పంచలింగాల గ్రామం వద్ద ఉన్న వాణిజ్య పన్నుల శాఖ తనిఖీ కేంద్రం వద్ద సీసీ కెమెరాలను బిగించారు. ఇకపై అలంపూర్ టోల్ గేట్ నుంచి కర్నూలు మీదుగా వెళ్లే వాహనాలు తనిఖీ కేంద్రం వద్ద ఆగివెళ్లి పత్రాలు చూపించాల్సిందే. అలాకాకుండా కన్ను గప్పి వెళ్లాలనుకుంటే మాత్రం హెచ్‌డీ కెమెరా వాహనం నెంబర్‌తో సహా ఇట్టే పట్టేస్తుంది. వెంటనే అధికారులు అప్రమత్తమై సదరు వాహనాన్ని వెంబడించి మరీ పన్ను వసూలు చేయడం, సరుకు సీజ్ చేయడం వంటి చర్యలకు చేపట్టేందుకు సులభతరం చేసుకుంటున్నారు. తెలంగాణ నుంచి కర్నూలు మీదుగా ప్రతిరోజూ 1400 నుంచి 1600 వరకు వాహనాలు తనిఖీ చేసుకుని వెళ్తున్నాయి. వీటిలో కొన్ని వాహనాలు తనిఖీ చేసుకోకుండా వెళ్తున్నాయని అధికారులు గుర్తించారు. ప్రతిసారీ అధికారులు, సిబ్బంది రోడ్డుపై కాపు కాసి వాహనాలను పట్టుకోవడం కష్టం కాబట్టి, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటే మంచి ఫలితం ఉంటుందని అధికారులు భావించారు. ఈ మేరకు మంగళవారం నుంచి హెచ్‌డి సీసీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చారు.
Advertisement
Advertisement