నిఘాపై నీలినీడలు
►పది’ పరీక్షల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై పునరాలోచన
పదో తరగతి పరీక్షలను నిఘా నీడల నిర్వహించాలనే రాష్ట్ర పరీక్షల విభాగం తీసుకున్న నిర్ణయానికి చుక్కెదురవుతోంది. కనీసం క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించకుండా.. జిల్లా విద్యాశాఖాధికారులను సంప్రదించకుండా అదరాబాదరగా చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలాఉంటే పరీక్షలు నిర్వహించనున్న సగం కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేవని డీఈఓల క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల నడుమ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయంపై సర్కారు పునరాలోచన చేస్తోంది.
రంగారెడ్డిజిల్లా ప్రతినిధి : మాస్ కాపీయింగ్, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలను నిఘా కెమెరాల మధ్య నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలున్నాయో లెక్క తేల్చమని డీఈఓలను ఆదేశించింది. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన విద్యాశాఖాధికారులు సగానికిపైగా విద్యాసంస్థల్లో కెమెరాలు లేవని తేల్చారు. ఈ తరుణంలో సీసీ కెమెరాల నడుమ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయంపై పునరాలోచన చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్న నేపథ్యంలో ఏం చేయాలనేదానిపై మల్లగుల్లాలు పడుతోంది. సొంత నిధులతో పాఠశాలల్లో కెమెరాలను బిగించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చినప్పటికీ, ప్రైవేటు పాఠశాలల్లో కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించడం ఎంత వరకు సమంజసమని ఉపాధ్యాయసంఘాలు వాదిస్తున్నాయి.
కేవలం 135 స్కూళ్లలోనే..
రాష్ట్రవ్యాప్తంగా 2,528 పరీక్షా కేంద్రాలుండగా.. వీటిలో కేవలం 202 కేంద్రాల్లోనే కెమెరాలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 401 పరీక్ష కేంద్రాలకుగాను కేవలం 135 స్కూళ్లలో మాత్రమే సీసీ కెమెరాలున్నట్లు డీఈఓ నివేదిక సమర్పించారు. కెమెరాలు లేని వాటిలో ప్రభుత్వ పాఠశాలలకంటే ప్రైవేటు స్కూళ్లే ఎక్కువగా ఉన్నాయి. జిల్లా పరిషత్ పరిధిలోని 108 స్కూళ్లలో కెమెరాలు లేకపోగా.. అదే ప్రైవేటు విషయానికి వస్తే 150 విద్యాసంస్థల్లో కెమెరాల ఆనవాళ్లు లేవని తేలింది. ప్రభుత్వ 3, టీడబ్ల్యుఆర్‌ఎస్ 1, సాంఘిక సంక్షేమ శాఖ 1, కేజీబీవీ 1, రెండు మోడల్ స్కూళ్లలో కెమెరాలు లేవని తేల్చారు. 266 పరీక్షా కేంద్రాల్లో కెమెరాలు లేవని స్పష్టమైనందున.. తప్పనిసరిగా పరీక్షలను కెమెరాల నీడన నిర్వహించాలనే అంక్షలను సడలించే అవకాశంలేకపోలేదని తెలుస్తోంది.
నిధులెట్లా?
ఒక్కో పాఠశాలలో పది తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటే కనిష్టంగా రూ.లక్ష వరకు ఖర్చు వస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్థాయిలో నిధులు అందుబాటులో లేవు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లోనూ వీటిని ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఆయా యాజమాన్యాలు అంతగా సాహసం చేయడం లేదు. ప్రత్యేకంగా నిధులిస్తేనే సీసీ కెమెరాలను అమర్చే అవకాశం ఉందని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో తప్పనిసరిగా పరీక్షలను నిఘా కళ్లల్లో నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వి నియోగించుకోవడంపై అభ్యంతరం లేకున్నా.. హడావుడిగా నిర్ణయం తీసుకోవడం సరికాదని ఉపాధ్యాయసంఘాలు అంటున్నాయి.