Tenth examinations
-
2 నుంచి ‘టెన్త్’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, అమరావతి: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల కోసం 2,12,221 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 915 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహిస్తామని ఎస్ఎస్సీ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి మంగళవారం తెలిపారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణకు 915 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 915 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 11 వేల మంది ఇన్విజిలేటర్లు, 86 ఆకస్మిక తనిఖీ బృందాల(ఫ్లైయింగ్ స్క్వాడ్)ను నియమించినట్లు పేర్కొన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఎవరూ సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, కెమెరాలు, ఇయర్ ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 13, 14 తేదీల్లో రాష్ట్రంలోని 23 కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతుందని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణపై సందేహాల నివృత్తి కోసం విజయవాడలో 0866–2974540 నంబర్‌తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇది జూన్ 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు. -
Telangana: నేటి నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13 వరకు జరిగే ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో కలిపి మొత్తం 4,94,620 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇప్పటికే వారికి హాల్‌టికెట్లు అందాయి. మొత్తం 2,652 కేంద్రాల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. సైన్స్, కాంపోజిట్ సబ్జెక్టులకు 20 నిమిషాల అదనపు సమయం ఇవ్వనున్నారు. కోవిడ్ మూలంగా గత రెండేళ్లుగా 70 శాతం సిలబస్ ఆధారంగానే పరీక్షలు జరగ్గా ఈసారి వంద శాతం సిలబస్‌తో పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే 11 పేపర్లకు బదులు ఈసారి ఆరు పేపర్లతోనే పరీక్షలు జరగనుండటం గమనార్హం. మరోవైపు టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన నేపథ్యంలో ఆ తరహా అనుభవాలు ఎదురవకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని రాష్ట్ర కార్యాలయం నుంచి పరిశీలించనున్నారు. మరోవైపు పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఈ సౌకర్యం పొందొచ్చు. -
టెన్త్ పరీక్షలకు సకలం సిద్ధం
రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరగనున్న టెన్త్ పబ్లిక్పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందిలేకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతోంది. వారికి అవసరమైన ఫర్నిచర్, మంచినీటి సదుపాయంతో పాటు అత్యవసర సమయాల్లో సేవలందించేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతోంది. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చర్యలు చేపట్టారు. కొత్తగా పునర్విభజించిన 26 జిల్లాల ప్రాతిపదికన ఇవి జరుగుతాయి. ఆయా జిల్లాల డీఈఓలు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ అన్ని జిల్లాల అధికారులు, వివిధ శాఖల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. – సాక్షి, అమరావతి ఉ.9:30 నుంచి మ.12:45 గంటల వరకు.. ఈ పరీక్షలు ఉ.9:30 నుంచి మ.12:45 గంటల వరకు 3.15 గంటల పాటు నిర్వహిస్తారు. అభ్యర్థులను ఉ.8:45 నుంచి 9:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. తద్వారా వారు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలను రాయగలుగుతారని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అలాగే.. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్‌తో సహా, ఎవరూ మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లడానికి అనుమతించరు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కెమెరాలు, ఇయర్ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలనూ అనుమతించరు. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. విద్యాశాఖతో పాటు రెవెన్యూ, పోలీసు, పోస్టల్, ఆర్టీసీ, వైద్యారోగ్య శాఖ, ఏపీ ట్రాన్స్‌కో తదితర విభాగాలు ఈ పరీక్షల ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నాయి. ప్రతి పాయింట్లోనూ పోలీసు భద్రత పరీక్ష పత్రాల రక్షణ దృష్ట్యా అన్ని డిస్ట్రిబ్యూషన్, స్టోరేజ్ పాయింట్ల వద్ద కాన్ఫిడెన్షియల్ ఎగ్జామినేషన్ మెటీరియల్‌కు భద్రత ఉండేలా పోలీసులను ఏర్పాటు చేయనున్నారు. వీటిని తీసుకెళ్లే వాహనాలకు జిల్లా కేంద్రాల నుంచి ఎస్కార్ట్ ఏర్పాటుచేస్తారు. పరీక్షా కేంద్రాల సందర్శనకు పోలీసు ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు కేంద్రాల వద్ద సాయుధ గార్డులను పెట్టనున్నారు. ఇక ప్రశ్నపత్రాల లీకేజీ, నకిలీ ప్రశ్నపత్రాలు మొదలైన వాటికి సంబంధించిన పుకార్లను నిలువరించే చర్యలకు వీలుగా మొబైల్ పోలీస్ స్క్వాడ్లకు సూచనలు అందిస్తారు. ఎక్కడైనా తప్పిదాలు జరిగితే సంబంధిత సిబ్బందిని వెంటనే విధుల నుంచి తప్పించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేస్తారు. శాంతిభద్రతల నిర్వహణకు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించనున్నారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్, నెట్‌సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాలకు పరీక్షలు జరిగినన్ని రోజులూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల రాకపోకలకు వీలుగా ఆర్టీసీ కూడా చర్యలు తీసుకుంటోంది. అన్ని రూట్లలో ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపనున్నారు. హాల్ టికెట్ ఉన్న అభ్యర్థులు అన్ని పరీక్షల రోజుల్లో వారి నివాసం నుండి పరీక్షా కేంద్రానికి ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తారు. అలాగే.. ♦ఎండల దృష్ట్యా విద్యార్థులు అస్వస్థతకు, అనారోగ్యానికి గురికాకుండా పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంల నియామకంతో పాటు తగిన మెడికల్ కిట్లను వైద్యశాఖ ఏర్పాటుచేయనుంది. మొబైల్ మెడికల్ వాహనాలను కూడా అందుబాటులో ఉంచనుంది. ♦ అన్ని పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్‌తో పాటు వెంటిలేషన్, పరిశుభ్ర వాతావరణం, ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ♦ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌లో సహా అన్ని జిల్లాల విద్యాధికారి కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేయనున్నారు. డైరెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 0866–2974540 ♦ వొకేషనల్ పబ్లిక్ పరీక్షలతో సహా అన్ని సబ్జెక్టులకు బార్‌కోడింగ్ విధానాన్ని పొడిగించనున్నారు. కోడింగ్ విధానంపై జిల్లా స్థాయిలో బార్కోడ్ సూపర్వైజర్లు, ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇస్తారు. సమాధాన పత్రాలను కోడింగ్ విధానంలో మూల్యాంకనం చేయనున్నారు. ♦ కోడింగ్ నంబర్ల పరిశీలన తదితర పనులు నిర్వహించాల్సి ఉన్నందున ఇన్విజిలేటర్లు ఉ.8:15లోపు సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌కి రిపోర్ట్ చేయాలి. ♦ విద్యార్థులకు ఇచ్చే గ్రాఫ్‌లు, మ్యాప్ పాయింట్లు, సమాధానాల బుక్లెట్లపై రోల్ నెంబర్, పేరు వంటివి రాయకూడదు. గ్రాఫ్‌లు, మ్యాప్ పాయింట్లు అటుఇటు కాకుండా ఉండేందుకు బుక్లెట్పై క్రమసంఖ్యను రాసేలా చూడాలి. -
Telangana: ‘టెన్త్’కు కఠిన పరీక్ష!
‘పరీక్షల’పై ప్రశ్నలు, ఆందోళనలివీ.. ► టెన్త్ పరీక్షల్లో గతంలో ఇచ్చినట్టుగా ఈసారి రెండు, మూడు మార్కుల సూక్ష్మ ప్రశ్నలకు చాయిస్ ఇవ్వలేదు. ఆరు చొప్పున ప్రశ్నలిచ్చి అన్నీ రాయాలన్నారు. ఏ ఒక్క ప్రశ్న తెలియకపోయినా విద్యార్థి ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. అన్ని చాప్టర్లపై పట్టులేనప్పుడు దీనితో చాలా నష్టం. ► వ్యాసరూప ప్రశ్నల తీరును కఠినం చేశారు. సెక్షన్ మాదిరి కాకుండా, గ్రూపు మాదిరి చాయిస్ ఇవ్వడం విద్యార్థులకు ఇబ్బందేనని నిపుణులు చెప్తున్నారు. సెక్షన్ మాదిరిగా అంటే మొత్తం 12 ప్రశ్నలు ఇచ్చి అందులోంచి ఆరింటికి సమాధానాలు రాయాలి. దీనిలో విద్యార్థులకు చాయిస్ ఎక్కువగా ఉండి, ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఒక్కో గ్రూప్‌లో రెండు ప్రశ్నల చొప్పున ఆరు గ్రూపులుగా ప్రశ్నలు ఇచ్చారు. ప్రతి గ్రూప్‌లోని రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయాలి. ఆ రెండింటికి సమాధానం తెలియకపోతే.. ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. మిగతా గ్రూపుల్లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగినా ప్రయోజనం ఉండదు. ► పరీక్ష సమయం మొత్తం 3 గంటలు.. ఇందులో ఆరు వ్యాసరూప ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికే రెండు గంటల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ముందే మిగతా ప్రశ్నలకు జవాబులు రాస్తే.. వ్యాసరూప ప్రశ్నలకు సమయం సరిపోదని అంటున్నారు. అందువల్ల వ్యాసరూప ప్రశ్నలను నాలుగుకు తగ్గించాలని సూచిస్తున్నారు. ► సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్/కెమిస్ట్రీ ఒకటి.. బయాలజీ మరొకటిగా పేపర్లు ఉంటాయి. రెండింటి ప్రిపరేషన్ వేర్వేరుగా ఉంటుంది. వీటన్నింటినీ ఒకేరోజు, ఒకే సమయంలో పెట్టడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రశ్నపత్రంలో చాయిస్ పెంచాలి ప్రశ్నపత్రంలో జవాబుల చాయిస్ పెంచాలి. అన్ని విభాగాల్లో కనీసం 30 శాతమైనా ఇవ్వాలి. విరామం లేకుండా పరీక్షల నిర్వహణ అశాస్త్రీయం. తక్షణమే పరీక్షల తీరుపై అధికారులు సమీక్షించాలి. – రాజా భానుచంద్రప్రకాశ్, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు సాక్షి, హైదరాబాద్: ఎస్సెస్సీ పరీక్షల చుట్టూ వివాదం ముసురుతోంది. పరీక్ష విధానం, నిర్వహణ, సిలబస్, చాయిస్‌లలో చేసిన మార్పులపై పునః సమీక్షించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను పరిశీలించిన ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి వివిధ రూపాల్లో తమ అభ్యంతరాలు తెలిపాయి. తమ సూచనలను పరిగణనలోకి తీసుకోకుంటే.. విద్యార్థులకు ఇబ్బంది తప్పదని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ అంశాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతుండటంతో.. విద్యాశాఖ ఉన్నతాధికారులు డోలాయమానంలో పడ్డారు. మోడల్ పేపర్లను చూసి.. ఇటీవల టెన్త్ పరీక్షల టైం టేబుల్ విడుదల చేసిన ఎస్సెస్సీ బోర్డు పరీక్షల మోడల్ పేపర్లనూ ఆన్లైన్లో పెట్టింది. ఈ మోడల్ పేపర్లను బట్టి పరీక్ష విధానం కఠినంగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు నిర్ధారణకు వచ్చాయి. అసలే కోవిడ్ వల్ల రెండేళ్లుగా అభ్యసన నష్టాలు ఉన్నప్పుడు పరీక్షను కఠినతరం చేస్తే విద్యార్థులకు నష్టమని అంటున్నాయి. టెన్త్ పరీక్షలు రాయబోయే దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల్లో.. 2 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లవారు ఉంటారని.. వీరిలో 1.2 లక్షల మంది కనీస స్థాయిలో, మరో 45 వేల మంది అంతకన్నా తక్కువగా సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నట్టు ఇటీవలి అంచనాల్లో వెల్లడైందని పేర్కొంటున్నాయి. కోవిడ్ పరిణామాలతో ప్రైవేటు విద్యార్థుల్లోనూ ప్రమాణాలు తగ్గాయని.. ఇలాంటప్పుడు క్లిష్టమైన ప్రశ్నలు, సంక్లిష్టమైన సమాధాన రూపం ఉండటం సరికాదని స్పష్టం చేస్తున్నాయి. గ్యాప్ ఇవ్వాల్సిందే.. సీబీఎస్సీ సిలబస్‌తో కొనసాగే కేంద్ర విద్యాసంస్థల్లో ప్రతీ పరీక్షకు మధ్య సన్నద్ధతకు సెలవు ఉంటుంది. మన రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డ్ మాత్రం ఈ విధానాన్ని పాటించ లేదు. ప్రభుత్వ సెలవు దినాలు మినహా ప్రతీ సబ్జెక్టు పరీక్షల మధ్య విరామం ఇవ్వలేదు. ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లుగా పరీక్షలు (40 మార్కుల చొప్పున) నిర్వహించినప్పుడు మధ్యలో ఒకరోజు విరామం ఇచ్చారు. ఇప్పుడు మొత్తం 80 మార్కులతో ఒకే పరీక్ష నిర్వహించనున్నా మధ్యలో విరామం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ విషయాన్ని విద్యామంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. కోవిడ్ నష్టాలున్న కాలం కాబట్టి విరామం, ఇతర వెసులుబాట్లు అమలు చేయాలని కోరినట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. చాయిస్ పెంచాలి.. ఒకే పేపర్‌గా పరీక్ష నిర్వహిస్తుండటం వల్ల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. ప్రశ్నపత్రంలోని ఒకటి, రెండు సెక్షన్లలో కూడా చాయిస్ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. 2 మార్కులు, 3 మార్కుల ప్రశ్నలకు కనీసం 30శాతం చాయిస్ ఇవ్వాలని అంటున్నారు. మూడో సెక్షన్లో వ్యాస రూప ప్రశ్నలను తగ్గించాలని.. ఫిజిక్స్/కెమిస్ట్రీ, బయాలజీ పరీక్షలు ఒకేరోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని సూచిస్తున్నారు. ఎస్సెస్సీ బోర్డు ఈ సూచనలు పాటించకపోతే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో ముందుగా బోధన ప్రారంభం కావడం, రివిజన్ రెండు సార్లు చేయడం వల్ల తేలికగా పరీక్షలు రాసే వీలు ఉందని అంటున్నారు. అదే ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికీ సిలబస్ పూర్తి కాలేదని, ఉపాధ్యాయుల కొరత ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. పరీక్షల తీరులో మార్పులు చేయాలి రెండేళ్లుగా కోవిడ్ వల్ల తరగతులే సరిగా జరగలేదు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రశ్నపత్రాలు ఉంటే మంచిది. కానీ మోడల్ పేపర్లు చూస్తే చాలా కఠి నంగా ఉన్నాయి. పరీక్షలపై సంఘాల నేతలతో కలిసి చర్చించి, మార్పులు చేయాలి. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ వ్యాస రూప ప్రశ్నలు తగ్గించాలి మోడల్ పేపర్లను బట్టి చూస్తే వ్యాస రూప ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది. వాటిని తగ్గించాలి. భౌతిక, రసాయన శాస్త్రాలు.. జీవశాస్త్రం పేపర్లను ఒకేరోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించాలి. – బీరెల్లి కమలాకర్‌రావు, పీఆర్టీయూటీఎస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా వెలగపూడిలోని సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం జూలై 1 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. టెన్త్‌లో 7 పేపర్లు: పాఠశాలలను 220 రోజులు నిర్వహించాల్సి ఉండగా కరోనా వల్ల ఈసారి 167 రోజులే నిర్వహించగలుగుతున్నాం. సిలబస్‌లో 35 శాతం తగ్గించి పరీక్షలు నిర్వహిస్తాం. జూన్ 5వ తేదీ వరకు పదో తరగతి క్లాసులు నిర్వహిస్తాం. జూన్ 7నుంచి 16వ తేదీ వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో ఏడు పేపర్లు ఉంటాయి. లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2, ఇంగ్లిష్, లెక్కలు, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులలో 100 మార్కులకు ఒక్కొక్క పేపర్ చొప్పున ఉంటుంది. సైన్స్‌కు మాత్రం రెండు పేపర్లు ఉంటాయి. ఫిజికల్ సైన్స్ 50 మార్కులకు, బయలాజికల్ సైన్స్ 50 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తాం. జూలై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం మే నెల 15వ తేదీ వరకు 1 నుంచి 9వ తరగతి క్లాసులు నిర్వహిస్తాం. ఈ సారి వేసవి సెలవులు లేవు. పరిస్థితిని బట్టి ఒంటిపూట బడులు నిర్వహించే విషయంపై నిర్ణయం తీసుకుంటాం. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మే 3 నుంచి 15 వరకు వార్షిక పరీక్షలు నిర్వహిస్తాం. మే 16 నుంచి జూన్ 30 వరకు సెలవులు ఇస్తాం. జూలై 1న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. మే 5 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ఇంటర్మీడియెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించిన విధంగా మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తాం. మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు రెండు సెషన్లుగా జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తాం. ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్షల ఫీజును 30 శాతం పెంచాల్సి ఉంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఫీజులు పెంచొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దాంతో గత ఏడాది మాదిరిగానే పరీక్ష ఫీజు రూ.490, దరఖాస్తు ఫీజు రూ.10, ప్రాక్టికల్స్ ఫీజు రూ.190 చొప్పున మాత్రమే ఈ ఏడాది వసూలు చేస్తాం. గత ఏడాది కరోనా కారణంగా అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ నిర్వహించలేకపోయాం. ఈ ఏడాది నిర్వహించే పరీక్షలతోపాటు ప్రస్తుతం రెండో సంవత్సరంలో ఉన్నవారు మొదటి ఏడాది పరీక్షలు ఇంప్రూవ్మెంట్ కోసం రాసుకోవచ్చు. గత ఏడాది ఇంటర్మీడియెట్ పాస్ అయిన వారు కూడా ఇప్పుడు ఆ పరీక్షలకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసే అవకాశం కల్పించాం. -
టెన్త్ పరీక్షల నిర్వహణకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను ఈనెల 8 నుంచి నిర్వహించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కరోనా నేపథ్యంలో హైకోర్టు జారీ చేయబోయే మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహిస్తామని, అందుకు అనుమతి ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించింది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారో లేదో వివరించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తాము నివేదిక అందజేశామని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ తెలిపారు. తమకు ఆ నివేదిక ప్రతి అందనందున విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా వైరస్ వ్యాప్తిలో ఉన్నందున పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఎం.బాలకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యంతో పరీక్షలను నిర్వహించాలనే నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీహెచ్ సాయిమణివరుణ్ దాఖలు చేసిన మరో ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. పరీక్షలు నిర్వహించరాదని ఇచ్చిన స్టే ఉత్తర్వులను గతంలోనే హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 8 నుంచి పరీక్షల నిర్వహణకు తీసుకున్న చర్యలపై నివేదిక ధర్మాసనానికి అందకపోవడంతో విచారణ వాయిదా పడింది. పరీక్షల నిర్వహణకు పక్కా జాగ్రత్తలు.. ‘ఈ నెల 8 నుంచి పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నాం. పరీక్షకు పరీక్షకు మధ్య రెండ్రోజుల వ్యవధి ఉండేలా జాగ్రత్త తీసుకున్నాం. పరీక్షకు ముందు, తర్వాత పరీక్ష కేంద్రాలను, పరిసరాలను, భవనాలను క్రిమిసంహారాలతో శుభ్రం చేస్తాం. చిన్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను, పరీక్షలు నిర్వహించే స్థితిలోని పాఠశాలల్లో ఉన్న విద్యార్థులను పెద్ద ప్రాంగణాలున్న పాఠశాలలకు, కాలేజీలకు తరలించేలా చర్యలు తీసుకున్నాం. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే విద్యార్థులను స్క్రీనింగ్ చేసేందుకు వీలుగా కేంద్రాల వల్ల తగినన్ని థర్మల్ స్క్రీనింగ్‌తోపాటు శానిటైజర్లు, మాస్క్‌లు సిద్ధం చేశాం. డీఈవోల పర్యవేక్షణలో హెల్ప్‌లైన్ ఏర్పాటుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పరీక్ష కేంద్రాలు, ఇతర సమాచారాన్ని తెలిపే ఏర్పాట్లు చేశాం. ఒక్కో పరీక్ష కేంద్రంలో గతంలో 200 – 240 మంది విద్యార్థులుండే సంఖ్యను గరి ష్టంగా 120కి తగ్గించాం. ఒక్కో విద్యార్థి మధ్య 5 నుంచి 6 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసు కుంటాం. పరీక్ష కేంద్రాల్ని 2,530 నుంచి 4,535కి పెంచాం. ఒక్కో ఇన్విజిలేటర్ 10 నుంచి 12 మంది విద్యార్థులను మాత్రమే పర్యవేక్షించేలా చూస్తున్నాం. 26,422 మంది అదనపు సిబ్బంది సేవలను వినియోగిస్తాం. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య సిబ్బంది ఉంటారు. ఆయుష్ శాఖ ద్వారా రోగనిరోధక మం దులు తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. జిల్లాల్లో విద్యార్థుల రవాణా సౌకర్యానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. జీహెచ్ఎంసీ పరిధిలోనూ విద్యార్థుల కోసం బస్సులు నడుపుతాం. పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు హాల్‌టికెట్‌నే ప్రయాణ పాస్‌గా పరిగణిస్తారు. విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటాం. విద్యా ర్థులకు థర్మల్ పరీక్షలు చేసి, జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారిని ప్రత్యేక గదుల్లో ఉంచుతాం. గదుల వద్ద శానిటైజర్లు, మరుగుదొడ్ల వద్ద సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి. పరీక్షకు ముందు, తరువాత పరీక్ష కేంద్రాలను సోడి యం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేస్తాం. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడే టీచర్లు, ఇతర సిబ్బందిని విధులకు దూరంగా ఉంచుతాం’అని ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. -
లాక్ డౌన్ ముగిశాకే ‘టెన్త్’పై నిర్ణయం
సాక్షి, అమరావతి: లాక్డౌన్ ముగిశాకే రాష్ట్రంలో టెన్త్ పరీక్షలపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ చెబుతోంది. ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుందని భావిస్తోంది. తొలుత మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించేలా ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. అదే సందర్భంలో స్థానిక ఎన్నికల ప్రకటన వెలువడటంతో మార్చి 31 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్‌ను సవరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31 నుంచి జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. కనీసం 15 రోజుల వ్యవధి అవసరం ► కొత్త షెడ్యూల్ ప్రకటించినా కనీసం 15 రోజుల వ్యవధి కావాల్సి ఉంటుందని.. ఆ తరువాతే పరీక్షల తేదీలను నిర్ణయించాల్సి ఉంటుందని ఎస్ఎస్సీ బోర్డు చెబుతోంది. ► కరోనా నేపథ్యంలో విద్యార్థులను దూరదూరంగా కూర్చోబెడతామని ఇంతకుముందే బోర్డు ప్రకటించింది. ► ఈ దూరం పెంచితే పరీక్ష కేంద్రాలు సరిపోవు. ఇంతకుముందు గుర్తించిన పరీక్ష కేంద్రాల ప్రకారం విద్యార్థులకు గూగుల్ మ్యాపింగ్‌తో కూడిన హాల్ టికెట్లను బోర్డు జారీ చేసింది. ► జంబ్లింగ్ విధానంలో ఎవరెవరికి ఏయే పరీక్ష కేంద్రాలు కేటాయించారో కూడా వాటిలో వివరంగా ఇచ్చారు. ► ఇప్పుడు కొత్తగా మరిన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. ఎవరెవరికి ఏయే సెంటర్లు కేటాయించారో తెలియజేస్తూ తిరిగి మళ్లీ హాల్ టికెట్లు జారీ చేయాల్సి వస్తుంది. ► ఇది సమస్యతో కూడుకున్న పని కావడంతో మొత్తం ప్రక్రియ మొదటికొచ్చి పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యం అవుతుంది. ► ఈ దృష్ట్యా ప్రస్తుతం గుర్తించిన పరీక్ష కేంద్రాల్లోనే అదనపు సదుపాయాలు కల్పించాలనే ఆలోచనలో ఉంది. సీబీఎస్ఈకి కూడా.. ► రాష్ట్రంలో 1నుంచి 5 తరగతి విద్యార్థులకు సంవత్సరాంత పరీక్షలు పూర్తయ్యాయి. ► 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సంవత్సరాంత పరీక్షలు లేకుండా అందరూ పాసైనట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ► సీబీఎస్ఈ కూడా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సంవత్సరాంత పరీక్షలు రద్దు చేయాలన్న ఆలోచనకు వచ్చింది. ► సీబీఎస్ఈలో 9, 11 తరగతుల వార్షిక పరీక్షలు ఇంకా నిర్వహించనందున ఆ విద్యార్థులను ప్రాజెక్ట్ వర్క్, టర్మ్ ఎగ్జామ్స్ ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేయాలన్న ఆలోచన ఉంది. ► 10, 12 తరగతుల పరీక్షలను వాయిదా వేసిన బోర్డు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానుసారం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. 29 మెయిన్ పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించే ఆలోచన ఉన్నట్లు కేంద్రం తెలిపింది. -
10 పరీక్షలు వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కావలసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. లాక్డౌన్ ప్రకటించినందున ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వాయిదా వేస్తున్నామని తెలిపారు. పరీక్షలు ఈనెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకు నిర్వహించాల్సి ఉంది. 2 వారాలు వాయిదా వేస్తున్నందున తదుపరి పరీక్షల షెడ్యూల్‌ను ఈనెల 31వ తేదీ తరువాత ప్రకటిస్తామని వివరించారు. ప్రజారవాణా నిలిచిపోవడంతో.. - ప్రజారవాణా నిలిచిపోవడం, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లన్నీ మూతవేయడం తదితర కారణాల వల్ల విద్యార్థులు హాల్‌టికెట్లను పొందడంతో పాటు పరీక్ష కేంద్రాలకు చేరడంలో ఇబ్బందులు ఏర్పడనున్నాయి. - సంక్షేమ విభాగాల రెసిడెన్షియల్ స్కూళ్లు మూతపడినందున అక్కడి విద్యార్థులు తమ ఇళ్లకు చేరుకున్నారు. వారు రావడానికి సమస్య అవుతుంది. అలాగే సిబ్బంది కూడా పరీక్ష కేంద్రాలకు చేరుకోలేరు. - ఈనేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కాగా, అంతకుముందు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. -
మార్చి 23 నుంచి పదో తరగతి పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేశ్, అనిల్‌కుమార్ యాదవ్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలను ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ వెల్లడించారు. పరీక్షల ఏర్పాట్లపై ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్‌తో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 2,542 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు మొత్తంగా 5,38,867 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. 26 సమస్యాత్మక కేంద్రాలతోపాటు మరో 405 పరీక్ష కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లను పంపిం చామని, అవి అందని వారు, స్కూళ్లు నిరాకరిస్తే వెబ్సైట్ (ఠీఠీఠీ.bట్ఛ.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn) నుంచి డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చని చెప్పారు. 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్.. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు జరుగుతాయని (కొన్ని సబ్జెక్టులు 12:45 గంటల వరకు), విద్యార్థులు ఉదయం 8:45 గంటల కల్లా పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలని కిషన్ సూచించారు. అయితే నిర్ణీత సమయం 9:30 గంటల తరువాత 5 నిమిషాల వరకే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లపైనా చర్యలు మాల్‌ప్రాక్టీస్ చేసే విద్యార్థులతోపాటు ఇన్విజిలేటర్లపైనా చర్యలు ఉంటాయని కిషన్ హెచ్చరించారు. ఎంఈవో, డీఈవోలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తమ కేంద్రంలో మాల్‌ప్రాక్టీస్ జరక్కుండా చూసుకుంటామని, జరిగితే తమదే బాధ్యత అని ఇన్విజిలేటర్లు రాసివ్వాల్సిందేనని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకే ఆ నిబంధన విధించినట్లు చెప్పారు. పరీక్షలకు సంబంధించి తమ టోల్‌ఫ్రీ నంబర్ 18004257462కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. డీఈవో, ఎంఈవోలు ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేస్తారని, వాటికి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎండల దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నామని, ఏఎన్ఎంలు ఉంటారని చెప్పారు. పాఠశాలల యాజమాన్యాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించవద్దని, ప్రాథమిక తరగతులు నిర్వహించవద్దని స్పష్టం చేశారు. విద్యార్థులకు సూచనలు - ముందు రోజే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలి. - రైటింగ్‌ప్యాడ్ తీసుకెళ్లాలి. సివిల్ డ్రెస్‌లోనే పరీక్షకు హాజరు కావాలి. - సరిపడా పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేలు తీసుకెళ్లాలి. - ఓఎంఆర్, మెయిన్ ఆన్సర్ షీట్ తమదే అని ధ్రువీకరించుకున్న తర్వాతే పరీక్ష రాయాలి. - ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీపై విద్యార్థి హాల్‌టికెట్ నంబరు వేయాలి. - అడిషనల్ ఆన్సర్ షీట్స్, గ్రాఫ్, బిట్ పేపర్లపై మెయిన్ ఆన్సర్ షీట్ సీరియల్ నంబర్ రాయాలి. హాల్‌టికెట్ నంబర్ రాయొద్దు. అవి విడిపోకుండా గట్టిగా దారం కట్టాలి. - సీసీఈ విధానం కాబట్టి ప్రశ్న అడిగిన తీరును అర్థం చేసుకుని జవాబులు రాయాలి. మరిన్ని వివరాలు.. మొత్తం స్కూళ్లు – 11,103, పరీక్ష కేంద్రాలు – 2542,విద్యార్థులు – 5,38,867 (బాలురు – 2,76,388, బాలికలు –2,62,479), రెగ్యులర్ విద్యార్థులు – 5,03,117, ప్రైవేటు విద్యార్థులు – 35,750, అదనంగా వొకేషనల్ విద్యార్థులు – 20,838 మీడియం వారీగా విద్యార్థులు.. తెలుగు – 1,78,901, ఇంగ్లిష్ – 3,12,535, ఉర్దూ – 11,038, హిందీ – 370, మరాఠీ – 189, కన్నడ – 77, తమిళ్ – 07. -
పది పరీక్షల్లో ‘నిమిషం’ నిబంధన
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నిమిషం నిబంధన విధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన సదరు విద్యార్థిని పరీక్షాకేంద్రంలోకి అనుమతించరు. వాస్తవానికి గతేడాది ఈ నిబంధన అమలు చేయాలని భావించినా చివరకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కల్పించారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,109 పాఠశాలల నుంచి 5,38,867 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 5,09,117 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,542 పరీక్షాకేంద్రాలను విద్యాశాఖ ఎంపిక చేసింది. ఇందులో రెగ్యులర్ విద్యార్థుల కోసం 2,375 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షలను ప్రతి క్షణం పరిశీలించేందుకు విద్యాశాఖ 431 కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. -
మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు
- ముందుగా ఓరియంటల్ ఎస్సెస్సీ పరీక్షలు - 17వ తేదీ నుంచి 30 వరకు ప్రధాన టెన్త్ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది (2017) మార్చి 14వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది. తొలుత ఓఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభమవుతాయి. 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రధాన టెన్త్ పరీక్షలు జరుగుతారుు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థారుు సమావేశంలో టైంటేబుల్ ను ఖరారు చేశారు. అనంతరం ప్రభుత్వ పరీక్షల విభాగం టైం టేబుల్‌ను విడుదల చేసింది. ముందుగా ఓఎస్సెస్సీకి.. పరీక్షల టైంటేబుల్లో ఈసారి కొన్ని మార్పులు చేశారు. సాధారణంగా ప్రధాన టెన్త పరీక్షలను ముందుగా ప్రారంభించి, చివరలో ఓరియంటల్ ఎస్సెస్సీ భాషా పేపర్లు, వొకేషనల్ ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి ఓరియంటల్ ఎస్సెస్సీ భాషా పేపర్లు, వొకేషనల్ ఎస్సెస్సీ పరీక్షలను ముందు నిర్వహించి... తరువాత ప్రధాన టెన్త పరీక్షలను నిర్వహించేలా టైంటేబుల్ ఖరారు చేశారు. మార్చి 14 నుంచి 16 వరకు ఓరియంటల్ ఎస్సెస్సీ, ఎస్సెస్సీ వొకేషనల్ కోర్సుల పరీక్షలు నిర్వహించి... 17వ తేదీ నుంచి ప్రధాన టెన్త్ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ బి. శేషుకుమారి తెలిపారు. ఆబ్జెక్టివ్ పేపర్‌ను పరీక్షలో చివరి అరగంట ముందుగా ఇస్తారని తెలిపారు. -
ఇంటర్ పరీక్షల తర్వాతే టెన్త్ పరీక్షలు!
- పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ కసరత్తు - రెండూ కలిపి నిర్వహించడం కష్టమేనంటున్న అధికారులు - మూడు, నాలుగు రోజుల్లో తుది నిర్ణయం.. తేదీల ప్రకటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలను కలిపి నిర్వహిం చాలా? వేర్వేరుగా నిర్వహించాలా? అన్న అంశం ఓ కొలిక్కి వచ్చింది. పాత పద్ధతిలో మొదట ఇంటర్ పరీక్షలు నిర్వహించి, ప్రధాన పరీక్షలు పూర్తయ్యాక పది పరీక్షలు ప్రారంభిస్తే సమస్య లు లేకుండా సాగవచ్చన్న అభిప్రాయానికి విద్యాశాఖ వచ్చింది. సీబీఎస్ఈ తరహాలో పాఠశాలల్లో పైతరగతుల బోధనను మార్చి 21 నుంచి ప్రారంభిస్తున్నందునా పదో తరగతి పరీక్షలనూ ముందుగానే నిర్వహించాలని విద్యాశాఖ ఇదివరకే ఓ నిర్ణయానికి వచ్చింది. దీనిలో భాగంగానే మార్చి మొదటి వారంలోనే ఒకే తేదీల్లో రెండింటి పరీక్షలను ప్రారంభించి, ఒకే తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో టెన్త, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావించింది. దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అభిప్రాయానికి విద్యాశాఖ వచ్చిం ది. 2 రోజుల కిందట పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కిషన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తదితరులు సమావేశమై చర్చించారు. మధ్యా హ్నం నిర్వహించే పరీక్షల జవాబు పత్రాలను తీసుకెళ్లడంలో సమస్యలు ఎదురవుతాయన్న భావనకు వచ్చినట్లు తెలిసింది. పైగా 2 రకాల పరీక్షలను నిర్వహించడం, ఒక పరీక్ష తర్వాత మరో పరీక్ష కోసం హాల్‌టికెట్ల నంబర్లు వేయడం సమస్యగా మారుతుందన్న భావనకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలను పక్కనబెట్టి ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాల ఏర్పాటు విషయంలో పట్టుదలతో ఉంది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లోనే పరీక్ష కేంద్రా లను ఏర్పాటుచేసి, నిర్వహించాలంటే ఒకదాని తర్వాత మరొకటి నిర్వహించడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై అధికారికంగా నిర్ణయాన్ని త్వరలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో మరోసారి చర్చించి తీసుకోనున్నారు. పాత పద్ధతిలో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక, టెన్త పరీక్షలను నిర్వహించడంవైపే అధికారులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇంటర్, టెన్త పరీక్షల తేదీలపైనా కసరత్తు చేస్తున్నారు. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు..? ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభిం చే ఆలోచనలు చేస్తున్నారు. మరీ ముందస్తు అవుతుందని, నిర్వహించడం సాధ్యమేనా? అన్న అంశంపై చర్చిస్తున్నారు. మార్చి 8 నుంచి ప్రారంభిస్తే ఆలస్యమవుతుందన్న భావనా ఉంది. మార్చి 2 లేదా 3వ తేదీల్లో పరీక్షలను ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు 2 కలిపి నిర్వహించాలని మొదట్లో భావించిన దృష్ట్యా మార్చి 3 లేదా 4 తేదీల్లో.. వీలుకాకపోతే 7 లేదా 8 తేదీల్లో నిర్వహించా లన్న ఆలోచన చేశారు. ప్రస్తుతం ఇంటర్ తర్వాతే పది పరీక్షలను నిర్వహించాలన్న అభిప్రాయానికి వచ్చిన దృష్ట్యా మార్చి 15 నాటికి పదో తరగతి పరీక్షలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిసింది. పరీక్షల నిర్వహణ, పరీక్షల ప్రారంభ తేదీలపై మూడు, నాలుగు రోజుల్లో డిప్యూటీ సీఎం కడియంతో చర్చించిన తర్వాత పరీక్షల టైమ్‌టేబుళ్లను ప్రకటించే అవకాశం ఉంది. -
31లోగా టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు
* ఆలస్య రుసుముతో డిసెంబర్ 7 వరకు * ఈసారికి పాత ఫీజులే.. వచ్చే ఏడాదే కొత్త ఫీజులు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 31లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. దసరా సెలవుల తరువాత ఈ నెల 13న స్కూళ్లు ప్రారంభం కాగానే ఫీజు చెల్లించాలని చెప్పారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125 ఫీజుగా చెల్లించాలన్నారు. ప్రైవేటు విద్యార్థులు 3 సబ్జెక్టులకు రూ.110, 3 కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలని, వొకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజుతోపాటు అదనంగా రూ.60 చెల్లించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు చెందిన, పట్టణ ప్రాంతాల్లో రూ.24 వేల లోపు వార్షికాదాయం గల తల్లిదండ్రుల పిల్లలు, గ్రామాల్లో అయితే రూ.20 వేల లోపు ఆదాయం గల వారి పిల్లలు ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి ఫీజు మినహాయింపు పొందవచ్చన్నారు. ప్రస్తుతం దినసరి వేతనకూలీకి రూ.24 వేలకంటే ఎక్కువే వార్షికాదాయం ఉండటంతో ఈ నిబంధన అశాస్త్రీయంగా ఉందని..దీనిని మార్పు చేయాలని పరీక్షల విభాగం ప్రభుత్వానికి లేఖ రాసింది. దానిపై నిర్ణయం వెలువడలేదు. దీంతో ఈసారి మార్పులు లేకుండా పాత నిబంధనల ప్రకారమే ఫీజుల వసూలుకు చర్యలు చేపట్టింది. ఉదయం వేళల్లో టెన్త్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్‌తో పాటే టెన్త్ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. టెన్త్ పరీక్షలను ఉదయం పూటే నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు ఈ నెల 31వరకు ఆలస్య రుసుములు లేకుండా ఫీజు చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుముతో వచ్చేనెల 15 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో వచ్చేనెల 30 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 7 వరకు చెల్లించవచ్చు. ప్రభుత్వ విద్యార్థులకు లభించని మినహాయింపు పరీక్ష ఫీజులకు సంబంధించి పాత విధానాన్నే అమలు చేస్తుండటంతో ఈసారి ప్రైవేటు స్కూల్ విద్యార్థులపై పడాల్సిన భారం తప్పింది. ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్తు పాఠశాలలు, వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగం ఇదివరకే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఓసీ విద్యార్థులకు మాత్రం రూ. 125 ఉన్న ఫీజును రూ. 100లకు తగ్గించాలని పేర్కొంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును రూ. 125 నుంచి రూ. 700కు పెంచాలని పేర్కొంది. అయితే ప్రభుత్వం ఈ ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో కొత్త ఫీజులు అమలుకు నోచుకోవడం లేదు. 2018 మార్చిలో జరిగే పరీక్షలకే కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
5 నిమిషాలు దాటితే నో ఎంట్రీ
మరికొద్ది గంటల్లో టెన్త్ పరీక్షలు.. సర్వం సిద్ధం ♦ పరీక్షలకు హాజరు కానున్న 5.67 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యే టెన్త్ విద్యార్థులకు ముఖ్య సూచనలు ♦ స్కూల్ యూనిఫారంలో రావద్దు ♦ విద్యార్థులు పరీక్షలకు పాఠశాల యూనిఫారం వేసుకొని రావద్దు. ♦ యూనిఫారం వేసుకొని వస్తే అనుమతించరు. వేరే దుస్తులు ధరించాలి. ♦ ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగ్‌లు, పుస్తకాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు. ♦ బ్లాక్ లేదా బ్లూ పెన్నుతోనే పరీక్షలు రాయాలి. ఇతర రంగుల పెన్నులతో పరీక్ష రాయవద్దు. ♦ జవాబుపత్రాల లోపల ఎలాంటి గుర్తులు పెట్టవద్దు. హాల్‌టికెట్ నెంబరు, ఫోన్‌నెంబరు వంటి రాయవద్దు. అలా రాస్తే ఆ జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేయరు. ♦ ఏదైనా సహాయం అవసరం అయితే ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో ఏర్పాటు చేసే హెల్ప్‌లైన్ కేంద్రానికి (040-23230942) ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. ♦ డీఈవో కార్యాలయాల్లో ఉండే హెల్ప్ కేంద్రాలకు కూడా ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. ♦ విద్యార్థులకు కేటాయించిన కేంద్రంలోనే పరీక్ష రాయాలి. ♦ ఆలస్యం అయిందన్న కారణంతో సమీపంలోని కేంద్రానికి వెళితే అనుమతించరు. ♦ ఏప్రిల్ 11 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ♦ ప్రభుత్వ పరీక్షల విభాగం ♦ డెరైక్టర్ డా.సురేందర్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21వ తేదీ(రేపటి) నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. ప్రతిరోజు పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులను ఉదయం 9:35 గంటల వరకే పరీక్ష హాల్లోకి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. అంతకుమించి ఆలస్యమైతే అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ద్వితీయభాష పరీక్ష మాత్రం ఉదయం 9:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్షల ఏర్పాట్లపై శనివారం సురేందర్‌రెడ్డి విలేక రులతో మాట్లాడారు. విద్యార్థులను గంట ముందుగానే(ఉదయం 8:30 గంటలకే) పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని, ఆ సమయాన్ని వినియోగించుకొని ముందుగానే రావాలన్నారు. వీలైతే ఈ నెల 20 నాడే తమ పరీక్ష కేంద్రాలు ఎక్కడున్నాయో వెళ్లి చూసుకోవాలన్నారు. హాల్‌టికెట్లు అందని వారు వెబ్సైట్ www.bsetelangana.org నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకొని హాజరు కావచ్చన్నారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన మరిన్ని అంశాలు ఆయన మాటల్లోనే.. వికలాంగులు 20 మార్కుల కే పాస్ అంధ, మూగ, చెవిటి, అంగవైకల్యం కలిగిన విద్యార్థులు ఉత్తీర్ణత మార్కులను 20కి తగ్గించారు. వీరికి జంబ్లింగ్ విధానం ఉండదు. వారు మూడు లాంగ్వేజెస్ పేపర్లకు బదులు ఒక్క భాషా పేపరు రాస్తే చాలు. డిస్లెక్సియాతో బాధపడేవారు ఇంగ్లిషు పేపరు రాయాల్సిన అవసరం లేదు. 9వ తరగతి విద్యార్థిని సహాయకునిగా ఇవ్వడంతోపాటు గంట అదనంగా సమయం ఇస్తారు. జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 11 నుంచి ప్రారంభిస్తారు. 5 ఏళ్ల సర్వీసున్నవారినే మూల్యాంకన విధులకు తీసుకుంటారు. మూల్యాంకనం ప్రారంభమయ్యాక 7 వారాల తరువాతే ఫలితాలను వెల్లడించేందుకు వీలు ఉంటుంది. మాల్‌ప్రాక్టీస్‌కు సహకరిస్తే చర్యలు మాల్‌ప్రాక్టీస్‌కు సహకరిస్తే ఇన్విజిలేటర్లపైనా చర్యలు ఉంటాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఇన్విజిలేటర్లు కొంత మంది ప్రైవేటు స్కూళ్ల టీచర్లను తీసుకున్నామని, 425 కేంద్రాల్లో ఫర్నిచర్ కొరత ఉంటే ఇతర స్కూళ్ల నుంచి తెప్పించి సర్దుబాటు చేశామన్నారు. జిల్లాకు ఒక సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, 5 మార్కులు కలిగిన ఆబ్జెక్టివ్ పేపర్‌ను చివరి అరగంట సమయంలో ఇస్తారని తెలిపారు. పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ మినహా మరెవరూ సెల్ఫోన్లు వాడటానికి వీల్లేదని, చీఫ్ సూపరింటెండెంట్లు కెమెరా లేని సెల్ఫోన్లనే వినియోగించాలన్నారు. మొత్తం 5 లక్షల 67 వేల 478 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5 లక్షల 21 వేల 46 మంది, ప్రైవేట్ విద్యార్థులు 35,711 మంది, ఓరియంటల్ ఎస్సెస్సీ, ఒకేషనల్ విద్యార్థులు మరో 10,721 మంది ఉన్నారు. 392 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్స్ ఉంటాయని, 144 ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. -
డేగ కళ్ల నిఘా
పదో తరగతి పరీక్షల్లో అక్రమాల అదుపునకు చర్యలు తొలిసారిగా కొన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు విద్యాశాఖ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత రాయవరం/బాలాజీచెరువు(కాకినాడ) : పదో తరగ తి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. మార్చి 21 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్రమాలకు తావు లేకుండా డేగ కళ్లతో పర్యవేక్షించేందుకు పరీక్షా కేంద్రాల్లో తొలిసారిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చే యాలని భావించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖకు ఆదేశాలందాయి. తొలుత అన్ని కేంద్రాల్లో వీటిని అమర్చాలనుకున్నా.. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా కొన్ని చోట్లే ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 70,428 మంది విద్యార్థులు 319 కేంద్రాల్లో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 2,461 మంది ప్రైవేటుగా రాయనుండగా 67,967 మంది రెగ్యులర్ విద్యార్థులు. వీరిలో 35,545 మంది బాలురు, 34,968 మంది బాలికలు. పదో తరగతి పరీక్షల్లో ఏటా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పలువురు విద్యార్థులు పట్టుబడుతున్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే మారుమూల ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. దీనిని నివారించేందుకు పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగానే పాఠశాల విద్యాశాఖ సీసీ కెమెరాల నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీని ప్రకారం ఎంపిక చేసిన కొన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పరీక్షల విభాగంలోని మెయిన్ సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. దీంతో ఆ కేంద్రాల్లో విద్యార్థులు, ఇన్విజిలేటర్ల కదలికలను, పరీక్ష జరుగుతున్న తీరును ఎప్పకప్పుడు పర్యవేక్షించేందుకు వీలుంటుంది. అవకతవకలు చోటు చేసుకుంటే వీడియో ఫుటేజీ ఆధారంగా బాధ్యులపై చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. కాగా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ఉపాధ్యాయ సంఘా లు వ్యతిరేకిస్తున్నాయి. సీసీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటు సమర్థనీయం కాదని సంఘాల నేతలు అంటున్నారు. దీని వల న విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొ నే అవకాశం ఉందని వాదిస్తున్నారు. విద్యార్థి స్థాయిని పరీక్షించేందుకు పలు రకాల పద్ధతులు ఉన్నాయంటున్నారు. -
నిఘాపై నీలినీడలు
► పది’ పరీక్షల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై పునరాలోచన పదో తరగతి పరీక్షలను నిఘా నీడల నిర్వహించాలనే రాష్ట్ర పరీక్షల విభాగం తీసుకున్న నిర్ణయానికి చుక్కెదురవుతోంది. కనీసం క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించకుండా.. జిల్లా విద్యాశాఖాధికారులను సంప్రదించకుండా అదరాబాదరగా చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలాఉంటే పరీక్షలు నిర్వహించనున్న సగం కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేవని డీఈఓల క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల నడుమ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయంపై సర్కారు పునరాలోచన చేస్తోంది. రంగారెడ్డిజిల్లా ప్రతినిధి : మాస్ కాపీయింగ్, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలను నిఘా కెమెరాల మధ్య నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలున్నాయో లెక్క తేల్చమని డీఈఓలను ఆదేశించింది. దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన విద్యాశాఖాధికారులు సగానికిపైగా విద్యాసంస్థల్లో కెమెరాలు లేవని తేల్చారు. ఈ తరుణంలో సీసీ కెమెరాల నడుమ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయంపై పునరాలోచన చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్న నేపథ్యంలో ఏం చేయాలనేదానిపై మల్లగుల్లాలు పడుతోంది. సొంత నిధులతో పాఠశాలల్లో కెమెరాలను బిగించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చినప్పటికీ, ప్రైవేటు పాఠశాలల్లో కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించడం ఎంత వరకు సమంజసమని ఉపాధ్యాయసంఘాలు వాదిస్తున్నాయి. కేవలం 135 స్కూళ్లలోనే.. రాష్ట్రవ్యాప్తంగా 2,528 పరీక్షా కేంద్రాలుండగా.. వీటిలో కేవలం 202 కేంద్రాల్లోనే కెమెరాలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 401 పరీక్ష కేంద్రాలకుగాను కేవలం 135 స్కూళ్లలో మాత్రమే సీసీ కెమెరాలున్నట్లు డీఈఓ నివేదిక సమర్పించారు. కెమెరాలు లేని వాటిలో ప్రభుత్వ పాఠశాలలకంటే ప్రైవేటు స్కూళ్లే ఎక్కువగా ఉన్నాయి. జిల్లా పరిషత్ పరిధిలోని 108 స్కూళ్లలో కెమెరాలు లేకపోగా.. అదే ప్రైవేటు విషయానికి వస్తే 150 విద్యాసంస్థల్లో కెమెరాల ఆనవాళ్లు లేవని తేలింది. ప్రభుత్వ 3, టీడబ్ల్యుఆర్ఎస్ 1, సాంఘిక సంక్షేమ శాఖ 1, కేజీబీవీ 1, రెండు మోడల్ స్కూళ్లలో కెమెరాలు లేవని తేల్చారు. 266 పరీక్షా కేంద్రాల్లో కెమెరాలు లేవని స్పష్టమైనందున.. తప్పనిసరిగా పరీక్షలను కెమెరాల నీడన నిర్వహించాలనే అంక్షలను సడలించే అవకాశంలేకపోలేదని తెలుస్తోంది. నిధులెట్లా? ఒక్కో పాఠశాలలో పది తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటే కనిష్టంగా రూ.లక్ష వరకు ఖర్చు వస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్థాయిలో నిధులు అందుబాటులో లేవు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లోనూ వీటిని ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఆయా యాజమాన్యాలు అంతగా సాహసం చేయడం లేదు. ప్రత్యేకంగా నిధులిస్తేనే సీసీ కెమెరాలను అమర్చే అవకాశం ఉందని పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో తప్పనిసరిగా పరీక్షలను నిఘా కళ్లల్లో నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వి నియోగించుకోవడంపై అభ్యంతరం లేకున్నా.. హడావుడిగా నిర్ణయం తీసుకోవడం సరికాదని ఉపాధ్యాయసంఘాలు అంటున్నాయి. -
విజయోస్తు!
నేటి నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి ఏవైనా ఫిర్యాదులుంటే 08572-229189కు ఫోన్ చేయండి 20 సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ విలేకరుల సమావేశంలో డీఈవో శామ్యూల్ చిత్తూరు(ఎడ్యుకేషన్): పది విద్యార్థులకు అంతా మంచే జరగాలని డీఈవో శామ్యూల్ ఆకాంక్షించారు. జిల్లాలోని 270 కేంద్రాల్లో గురువారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై డీఈవో కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి ఎలాంటి మాస్‌కాపీయింగ్‌కు తావులేకుండా పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 56,607మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. వీరిలో 28,672 బాలురు, 2,635 బాలికలు రెగ్యులర్‌గా, 1,300 మంది విద్యార్థులు ప్రైవేటు అభ్యర్థులుగా పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం, ప్రాథమిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పరీక్ష కేంద్రాలన్నింటిలోనూ డెస్కులపైనే విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. అలాగే జంబ్లింగ్ విధానంలోనే పరీక్షలు జరుగుతాయన్నారు. 2,700 మంది ఇన్విజిలేటర్లను నియమించామని, విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, పరీక్ష హాలులోకి పంపాలని సూచించారు. జిల్లాలో సమస్యాత్మకమైన 20 పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు కట్టుదిట్టంగా జరిపేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ఏవైనా ఫిర్యాదులున్నా, ఎక్కడైనా కాపీయింగ్ జరుగుతున్నట్లు పక్కా సమాచారం ఉంటే 08572-229189 నంబర్‌కు ఫోన్‌చేస్తే డీఈవో కార్యాలయ సిబ్బంది స్పందిస్తారని స్పష్టం చేశారు. ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. స్కూల్ యూనిఫామ్ ధరించి పరీక్ష హాజరు కావద్దని తెలిపారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఈసారి పరీక్షలు నిష్పక్షపాతంగా జరుపుతామన్నారు. పరీక్ష హాలులో మాస్‌కాపీయింగ్‌కు ఇన్విజిలేటర్ల సహకారం ఉందని నిర్ధారణకు వస్తే ఇన్విజలేటర్లపై చర్యలు తప్పవన్నారు. ఉదయం 8.30 గంటలకు ప్రశ్నపత్రం సెట్ నంబరును తెలుపుతామని, ఆ తర్వాత నిర్దేశిత పోలీస్స్టేషన్ల నుంచి ప్రశ్న పత్రాలను పోలీసు బలగాల మధ్య తీసుకెళ్లాలన్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల చీఫ్ సూపర్వైజర్లు, డీవోలు విధిగా ఉదయం 9.15 నుంచి 9.30 గంటల మధ్య మాత్రమే ప్రశ్నపత్రాల బండిళ్లను విప్పాలని సూచించారు. ఆలస్యానికి ఏదైనా బలమైన కారణం చూపితే మొదటి రెండు పరీక్షలకు మాత్రం పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల వరకు విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతిస్తామన్నారు. జిల్లాలో 68 సీ సెంటర్లు(పోస్టాఫీస్, పోలీస్‌స్టేషన్ లేని కేంద్రాలు) ఉన్నాయని, సమీపంలోని పోస్టాఫీసులో వీరు జవాబుపత్రాలను చేర్చాలని సూచించారు. ఏప్రిల్ 2వ తేదీ మహావీర్ జయంతి సందర్భంగా పోస్టాఫీసులకు సెలవని, ఆ రోజు జరగనున్న గణితం మొదటి పేపరు జవాబు పత్రాలను సంబంధిత పోలీస్స్టేషన్లలో భద్రపరచాలని, 3వ తేదీ గుడ్‌ఫ్రైడే సందర్భంగా పరీక్ష లేదని, 4వ తేదీ జరగనున్న గణితం పేపరు-2 పరీక్ష జవాబు పత్రాలతోపాటు పోలీస్‌స్టేషన్‌లో భద్రపరచిన గణితం మొదటి పేపర్ జవాబు పత్రాలను పోస్ట్ఫీసులకు చేర్చాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అబ్జర్వర్ రఘుకుమార్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ నిరంజన్‌కుమార్ పాల్గొన్నారు. -
శామ్యూల్ మ్యూజికల్ చైర్!
విద్యాశాఖలో మూడు పదవులాట కొనసాగుతున్న ఇన్చార్జ్ పాలన పెరిగిన పని ఒత్తిడి చిత్తూరు: ఓ వైపు డీఎస్సీ పరీక్షలు జరగాలి. మరో వైపు రాబోయే టెన్త్ పబ్లిక్ పరీక్షలు, తరువాత సంవత్సరాంతపు పరీక్షలు నిర్వహించాలి. ఈ దశలో ప్రభుత్వం జిల్లా విద్యాశాఖలో ఒకే అధికారికి తలకు మించిన అధికారాలు కట్టబెట్టి వేడుక చూస్తోంది. జిల్లా విద్యాశాఖలో మూడు కుర్చీలాట సాగుతోంది. ప్రభుత్వం కట్టబెట్టిన మూడు పదవుల్లో చిత్తూరు ఇన్చార్జ్ డీఈవో శామ్యూల్ తలమునకలై ఉన్నారు. మదనపల్లె డెప్యూటీ డీఈవోగా ఉన్న శామ్యూల్‌కు ఆ తరువాత తిరుపతి ఇన్చార్జ్ డెప్యూటీ డీఈవోగా రెండో కుర్చీ ఇచ్చారు. చిత్తూరు డీఈవోగా ఉన్న ప్రతాప్‌రెడ్డి కడపకు బదిలీ కావడంతో ఇన్చార్జ్ డీఈవోగా ముచ్చటగా మూడో కుర్చీ లభించింది. ఒక దశలో శామ్యూల్ రెగ్యులర్ డీఈవో పోస్టు కోసం జిల్లాకు చెందిన మంత్రి, మాజీ మంత్రితోపాటు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుని తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగించినట్లు ప్రచారం జరిగింది. డీఈవో పోస్టు ఇవ్వకపోయినా కనీసం ఇన్‌చార్జ్‌గానైనా నియమించాలని కోరినట్లు, ఆ మేరకు ఇన్చార్జ్ డీఈవోగా కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఒకే వ్యక్తిని మూడు హోదాల్లో కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శామ్యూల్ మూడు పదవులను సమర్థవంతంగా నిర్వహించలేని పరిస్థితి నెలకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖలో పనిభారం పెరిగింది. డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 1300లకు పైగా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ సాగుతోంది. ఇప్పటివరకు 42వేల మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా బుధవారం నాటికి 28వేల మంది అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించారు. ఫిబ్రవరి 5 నాటికి దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. మరో 14వేల మంది వరకు దరఖాస్తులు చేయాల్సి ఉంది. ఈ దరఖాస్తులు, అనుబంధ సర్టిఫికెట్లను పరిశీలించాలి. మే 9,10,11 తేదీల్లో కీలకమైన డీఎస్సీ పరీక్షలు, మార్చి 26వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు, ఏప్రిల్‌లో సంవత్సరాంతపు పరీక్షలను పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారి పైనే ఉంటుంది. అలాంటి పరిస్ధితుల్లో అదనపు బాధ్యతలు లేని రెగ్యులర్ డీఈవో అయితేనే ఒత్తిడికి గురి కాకుండా అన్నింటినీ సక్రమంగా నిర్వహించవచ్చు. మూడు పోస్టులతో సతమతమవుతున్న శామ్యూల్ ఏ ఒక్క పోస్టుకూ సరైన న్యాయం చేసే పరిస్థితి ఉండదని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులుస్పందించి ఇన్చార్జ్ స్థానంలో రెగ్యులర్ డీఈవోను నియమించాల్సిన అవసరం ఉంది. డీఈవో పోస్టుకు కొనసాగుతున్న పోటీ జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు దక్కించుకునేందుకు ఇప్పటికే పలువురు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో నెల్లూరు విద్యాధికారిగా పనిచేసిన మువ్వా రామలింగం మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావును ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇక పాడేరులో ఐటీడీఏలో అధికారిగా పనిచేస్తున్న దేవానందరెడ్డి సైతం చిత్తూరు డీఈవోగా వచ్చేందుకు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి ద్వారా ముమ్ముర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.