రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరగనున్న టెన్త్ పబ్లిక్‌పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందిలేకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతోంది. వారికి అవసరమైన ఫర్నిచర్, మంచినీటి సదుపాయంతో పాటు అత్యవసర సమయాల్లో సేవలందించేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతోంది. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చర్యలు చేపట్టారు. కొత్తగా పునర్విభజించిన 26 జిల్లాల ప్రాతిపదికన ఇవి జరుగుతాయి. ఆయా జిల్లాల డీఈఓలు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ అన్ని జిల్లాల అధికారులు, వివిధ శాఖల అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. – సాక్షి, అమరావతి
ఉ.9:30 నుంచి మ.12:45 గంటల వరకు..
ఈ పరీక్షలు ఉ.9:30 నుంచి మ.12:45 గంటల వరకు 3.15 గంటల పాటు నిర్వహిస్తారు. అభ్యర్థులను ఉ.8:45 నుంచి 9:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. తద్వారా వారు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలను రాయగలుగుతారని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. అలాగే.. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌తో సహా, ఎవరూ మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లడానికి అనుమతించరు.
ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కెమెరాలు, ఇయర్‌ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలనూ అనుమతించరు. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. విద్యాశాఖతో పాటు రెవెన్యూ, పోలీసు, పోస్టల్, ఆర్టీసీ, వైద్యారోగ్య శాఖ, ఏపీ ట్రాన్స్‌కో తదితర విభాగాలు ఈ పరీక్షల ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నాయి.
ప్రతి పాయింట్లోనూ పోలీసు భద్రత
పరీక్ష పత్రాల రక్షణ దృష్ట్యా అన్ని డిస్ట్రిబ్యూషన్, స్టోరేజ్ పాయింట్‌ల వద్ద కాన్ఫిడెన్షియల్ ఎగ్జామినేషన్ మెటీరియల్‌కు భద్రత ఉండేలా పోలీసులను ఏర్పాటు చేయనున్నారు. వీటిని తీసుకెళ్లే వాహనాలకు జిల్లా కేంద్రాల నుంచి ఎస్కార్ట్ ఏర్పాటుచేస్తారు. పరీక్షా కేంద్రాల సందర్శనకు పోలీసు ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు కేంద్రాల వద్ద సాయుధ గార్డులను పెట్టనున్నారు.
ఇక ప్రశ్నపత్రాల లీకేజీ, నకిలీ ప్రశ్నపత్రాలు మొదలైన వాటికి సంబంధించిన పుకార్లను నిలువరించే చర్యలకు వీలుగా మొబైల్ పోలీస్ స్క్వాడ్‌లకు సూచనలు అందిస్తారు. ఎక్కడైనా తప్పిదాలు జరిగితే సంబంధిత సిబ్బందిని వెంటనే విధుల నుంచి తప్పించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేస్తారు.
శాంతిభద్రతల నిర్వహణకు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించనున్నారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్, నెట్‌సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాలకు పరీక్షలు జరిగినన్ని రోజులూ నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఇక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల రాకపోకలకు వీలుగా ఆర్టీసీ కూడా చర్యలు తీసుకుంటోంది. అన్ని రూట్లలో ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపనున్నారు. హాల్ టికెట్ ఉన్న అభ్యర్థులు అన్ని పరీక్షల రోజుల్లో వారి నివాసం నుండి పరీక్షా కేంద్రానికి ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తారు. అలాగే..
♦ఎండల దృష్ట్యా విద్యార్థులు అస్వస్థతకు, అనారోగ్యానికి గురికాకుండా పరీక్ష కేంద్రాల్లో ఏఎన్‌ఎంల నియామకంతో పాటు తగిన మెడికల్ కిట్లను వైద్యశాఖ ఏర్పాటుచేయనుంది. మొబైల్ మెడికల్ వాహనాలను కూడా అందుబాటులో ఉంచనుంది.
♦ అన్ని పరీక్ష కేంద్రాల్లో ఫర్నిచర్‌తో పాటు వెంటిలేషన్, పరిశుభ్ర వాతావరణం, ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది.
♦ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌లో సహా అన్ని జిల్లాల విద్యాధికారి కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేయనున్నారు. డైరెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 0866–2974540
♦ వొకేషనల్ పబ్లిక్ పరీక్షలతో సహా అన్ని సబ్జెక్టులకు బార్‌కోడింగ్ విధానాన్ని పొడిగించనున్నారు. కోడింగ్ విధానంపై జిల్లా స్థాయిలో బార్‌కోడ్ సూపర్‌వైజర్లు, ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇస్తారు. సమాధాన పత్రాలను కోడింగ్ విధానంలో మూల్యాంకనం చేయనున్నారు.
♦ కోడింగ్ నంబర్ల పరిశీలన తదితర పనులు నిర్వహించాల్సి ఉన్నందున ఇన్విజిలేటర్లు ఉ.8:15లోపు సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌కి రిపోర్ట్ చేయాలి.
♦ విద్యార్థులకు ఇచ్చే గ్రాఫ్‌లు, మ్యాప్ పాయింట్లు, సమాధానాల బుక్‌లెట్లపై రోల్ నెంబర్, పేరు వంటివి రాయకూడదు. గ్రాఫ్‌లు, మ్యాప్ పాయింట్లు అటుఇటు కాకుండా ఉండేందుకు బుక్‌లెట్‌పై క్రమసంఖ్యను రాసేలా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment