శామ్యూల్ మ్యూజికల్ చైర్! | Samuel Musical Chair! | Sakshi
Sakshi News home page

శామ్యూల్ మ్యూజికల్ చైర్!

Published Sat, Jan 31 2015 2:07 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

శామ్యూల్  మ్యూజికల్ చైర్! - Sakshi

శామ్యూల్ మ్యూజికల్ చైర్!

విద్యాశాఖలో మూడు పదవులాట
కొనసాగుతున్న ఇన్‌చార్జ్ పాలన
పెరిగిన పని ఒత్తిడి

 
చిత్తూరు: ఓ వైపు డీఎస్సీ పరీక్షలు జరగాలి. మరో వైపు రాబోయే టెన్త్ పబ్లిక్ పరీక్షలు, తరువాత సంవత్సరాంతపు పరీక్షలు నిర్వహించాలి. ఈ దశలో ప్రభుత్వం జిల్లా విద్యాశాఖలో ఒకే అధికారికి తలకు మించిన అధికారాలు కట్టబెట్టి వేడుక చూస్తోంది. జిల్లా విద్యాశాఖలో మూడు కుర్చీలాట సాగుతోంది. ప్రభుత్వం కట్టబెట్టిన మూడు పదవుల్లో చిత్తూరు ఇన్‌చార్జ్ డీఈవో శామ్యూల్ తలమునకలై ఉన్నారు. మదనపల్లె డెప్యూటీ డీఈవోగా ఉన్న శామ్యూల్‌కు ఆ తరువాత తిరుపతి ఇన్‌చార్జ్ డెప్యూటీ డీఈవోగా రెండో కుర్చీ ఇచ్చారు. చిత్తూరు డీఈవోగా ఉన్న ప్రతాప్‌రెడ్డి కడపకు బదిలీ కావడంతో ఇన్‌చార్జ్ డీఈవోగా ముచ్చటగా మూడో కుర్చీ లభించింది. ఒక దశలో శామ్యూల్ రెగ్యులర్ డీఈవో పోస్టు కోసం జిల్లాకు చెందిన మంత్రి, మాజీ మంత్రితోపాటు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుని  తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగించినట్లు ప్రచారం జరిగింది. డీఈవో పోస్టు ఇవ్వకపోయినా కనీసం ఇన్‌చార్జ్‌గానైనా నియమించాలని కోరినట్లు, ఆ మేరకు ఇన్‌చార్జ్ డీఈవోగా కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఒకే వ్యక్తిని మూడు హోదాల్లో కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శామ్యూల్ మూడు పదవులను సమర్థవంతంగా నిర్వహించలేని పరిస్థితి నెలకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖలో పనిభారం పెరిగింది. డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 1300లకు పైగా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం డీఎస్సీని సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ సాగుతోంది. ఇప్పటివరకు 42వేల మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా బుధవారం నాటికి 28వేల మంది అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించారు. ఫిబ్రవరి 5 నాటికి దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. మరో 14వేల మంది వరకు దరఖాస్తులు చేయాల్సి ఉంది. ఈ దరఖాస్తులు, అనుబంధ సర్టిఫికెట్లను పరిశీలించాలి. మే 9,10,11 తేదీల్లో కీలకమైన డీఎస్సీ పరీక్షలు, మార్చి 26వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు, ఏప్రిల్‌లో సంవత్సరాంతపు పరీక్షలను పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారి పైనే ఉంటుంది. అలాంటి పరిస్ధితుల్లో అదనపు బాధ్యతలు లేని రెగ్యులర్ డీఈవో అయితేనే ఒత్తిడికి గురి కాకుండా అన్నింటినీ సక్రమంగా నిర్వహించవచ్చు. మూడు పోస్టులతో సతమతమవుతున్న శామ్యూల్ ఏ ఒక్క పోస్టుకూ సరైన న్యాయం చేసే పరిస్థితి ఉండదని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులుస్పందించి ఇన్‌చార్జ్ స్థానంలో రెగ్యులర్ డీఈవోను నియమించాల్సిన అవసరం ఉంది.
 
 డీఈవో పోస్టుకు కొనసాగుతున్న పోటీ

 జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు దక్కించుకునేందుకు ఇప్పటికే పలువురు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. గతంలో  నెల్లూరు విద్యాధికారిగా పనిచేసిన మువ్వా రామలింగం మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావును ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.  ఇక పాడేరులో ఐటీడీఏలో అధికారిగా పనిచేస్తున్న దేవానందరెడ్డి సైతం  చిత్తూరు డీఈవోగా వచ్చేందుకు అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి ద్వారా ముమ్ముర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement