
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నిమిషం నిబంధన విధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన సదరు విద్యార్థిని పరీక్షాకేంద్రంలోకి అనుమతించరు. వాస్తవానికి గతేడాది ఈ నిబంధన అమలు చేయాలని భావించినా చివరకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కల్పించారు.
రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,109 పాఠశాలల నుంచి 5,38,867 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 5,09,117 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,542 పరీక్షాకేంద్రాలను విద్యాశాఖ ఎంపిక చేసింది. ఇందులో రెగ్యులర్ విద్యార్థుల కోసం 2,375 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షలను ప్రతి క్షణం పరిశీలించేందుకు విద్యాశాఖ 431 కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment