31లోగా టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు | Tenth examination payment of fee this month on oct31st | Sakshi
Sakshi News home page

31లోగా టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు

Published Fri, Oct 7 2016 2:29 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

31లోగా టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు

31లోగా టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు

* ఆలస్య రుసుముతో డిసెంబర్ 7 వరకు
* ఈసారికి పాత ఫీజులే.. వచ్చే ఏడాదే కొత్త ఫీజులు

సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 31లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. దసరా సెలవుల తరువాత ఈ నెల 13న స్కూళ్లు ప్రారంభం కాగానే ఫీజు చెల్లించాలని చెప్పారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125 ఫీజుగా చెల్లించాలన్నారు. ప్రైవేటు విద్యార్థులు 3 సబ్జెక్టులకు రూ.110, 3 కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలని, వొకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజుతోపాటు అదనంగా రూ.60 చెల్లించాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు చెందిన, పట్టణ ప్రాంతాల్లో రూ.24 వేల లోపు వార్షికాదాయం గల తల్లిదండ్రుల పిల్లలు, గ్రామాల్లో అయితే రూ.20 వేల లోపు ఆదాయం గల వారి పిల్లలు ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి ఫీజు మినహాయింపు పొందవచ్చన్నారు. ప్రస్తుతం దినసరి వేతనకూలీకి రూ.24 వేలకంటే ఎక్కువే వార్షికాదాయం ఉండటంతో ఈ నిబంధన అశాస్త్రీయంగా ఉందని..దీనిని మార్పు చేయాలని  పరీక్షల విభాగం ప్రభుత్వానికి లేఖ రాసింది. దానిపై నిర్ణయం వెలువడలేదు. దీంతో ఈసారి మార్పులు లేకుండా పాత నిబంధనల ప్రకారమే ఫీజుల వసూలుకు చర్యలు చేపట్టింది.
 
ఉదయం వేళల్లో టెన్త్ పరీక్షలు

వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్‌తో పాటే టెన్త్ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. టెన్త్ పరీక్షలను ఉదయం పూటే నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది.
 
పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు
ఈ నెల 31వరకు ఆలస్య రుసుములు లేకుండా ఫీజు చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుముతో వచ్చేనెల 15 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో వచ్చేనెల 30 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 7 వరకు చెల్లించవచ్చు.
 
ప్రభుత్వ విద్యార్థులకు లభించని మినహాయింపు
పరీక్ష ఫీజులకు సంబంధించి పాత విధానాన్నే అమలు చేస్తుండటంతో ఈసారి ప్రైవేటు స్కూల్ విద్యార్థులపై పడాల్సిన భారం తప్పింది. ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్తు పాఠశాలలు, వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగం ఇదివరకే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఓసీ విద్యార్థులకు మాత్రం రూ. 125 ఉన్న ఫీజును రూ. 100లకు తగ్గించాలని పేర్కొంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును రూ. 125 నుంచి రూ. 700కు పెంచాలని పేర్కొంది. అయితే ప్రభుత్వం ఈ ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో కొత్త ఫీజులు అమలుకు నోచుకోవడం లేదు. 2018 మార్చిలో జరిగే పరీక్షలకే కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement