ఇంటర్ పరీక్షల తర్వాతే టెన్త్ పరీక్షలు!
- పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ కసరత్తు
- రెండూ కలిపి నిర్వహించడం కష్టమేనంటున్న అధికారులు
- మూడు, నాలుగు రోజుల్లో తుది నిర్ణయం.. తేదీల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలను కలిపి నిర్వహిం చాలా? వేర్వేరుగా నిర్వహించాలా? అన్న అంశం ఓ కొలిక్కి వచ్చింది. పాత పద్ధతిలో మొదట ఇంటర్ పరీక్షలు నిర్వహించి, ప్రధాన పరీక్షలు పూర్తయ్యాక పది పరీక్షలు ప్రారంభిస్తే సమస్య లు లేకుండా సాగవచ్చన్న అభిప్రాయానికి విద్యాశాఖ వచ్చింది. సీబీఎస్‌ఈ తరహాలో పాఠశాలల్లో పైతరగతుల బోధనను మార్చి 21 నుంచి ప్రారంభిస్తున్నందునా పదో తరగతి పరీక్షలనూ ముందుగానే నిర్వహించాలని విద్యాశాఖ ఇదివరకే ఓ నిర్ణయానికి వచ్చింది. దీనిలో భాగంగానే మార్చి మొదటి వారంలోనే ఒకే తేదీల్లో రెండింటి పరీక్షలను ప్రారంభించి, ఒకే తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో టెన్‌త, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావించింది.
దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అభిప్రాయానికి విద్యాశాఖ వచ్చిం ది. 2 రోజుల కిందట పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కిషన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తదితరులు సమావేశమై చర్చించారు. మధ్యా హ్నం నిర్వహించే పరీక్షల జవాబు పత్రాలను తీసుకెళ్లడంలో సమస్యలు ఎదురవుతాయన్న భావనకు వచ్చినట్లు తెలిసింది. పైగా 2 రకాల పరీక్షలను నిర్వహించడం, ఒక పరీక్ష తర్వాత మరో పరీక్ష కోసం హాల్‌టికెట్ల నంబర్లు వేయడం సమస్యగా మారుతుందన్న భావనకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలను పక్కనబెట్టి ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాల ఏర్పాటు విషయంలో పట్టుదలతో ఉంది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లోనే పరీక్ష కేంద్రా లను ఏర్పాటుచేసి, నిర్వహించాలంటే ఒకదాని తర్వాత మరొకటి నిర్వహించడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై అధికారికంగా నిర్ణయాన్ని త్వరలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో మరోసారి చర్చించి తీసుకోనున్నారు. పాత పద్ధతిలో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక, టెన్‌త పరీక్షలను నిర్వహించడంవైపే అధికారులు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇంటర్, టెన్‌త పరీక్షల తేదీలపైనా కసరత్తు చేస్తున్నారు.
మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు..?
ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభిం చే ఆలోచనలు చేస్తున్నారు. మరీ ముందస్తు అవుతుందని, నిర్వహించడం సాధ్యమేనా? అన్న అంశంపై చర్చిస్తున్నారు. మార్చి 8 నుంచి ప్రారంభిస్తే ఆలస్యమవుతుందన్న భావనా ఉంది. మార్చి 2 లేదా 3వ తేదీల్లో పరీక్షలను ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు 2 కలిపి నిర్వహించాలని మొదట్లో భావించిన దృష్ట్యా మార్చి 3 లేదా 4 తేదీల్లో.. వీలుకాకపోతే 7 లేదా 8 తేదీల్లో నిర్వహించా లన్న ఆలోచన చేశారు. ప్రస్తుతం ఇంటర్ తర్వాతే పది పరీక్షలను నిర్వహించాలన్న అభిప్రాయానికి వచ్చిన దృష్ట్యా మార్చి 15 నాటికి పదో తరగతి పరీక్షలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిసింది. పరీక్షల నిర్వహణ, పరీక్షల ప్రారంభ తేదీలపై మూడు, నాలుగు రోజుల్లో డిప్యూటీ సీఎం కడియంతో చర్చించిన తర్వాత పరీక్షల టైమ్‌టేబుళ్లను ప్రకటించే అవకాశం ఉంది.