2 నుంచి ‘టెన్త్‌’ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ | 10th Class Advanced Supplementary Exams from June 2 | Sakshi
Sakshi News home page

2 నుంచి ‘టెన్త్‌’ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

Published Wed, May 31 2023 2:42 AM | Last Updated on Wed, May 31 2023 2:42 AM

10th Class Advanced Supplementary Exams from June 2 - Sakshi

సాక్షి, అమరావతి: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 2 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల కోసం 2,12,221 మంది విద్యా­ర్థులు రిజిస్ట్రేషన్‌ చేసు­కోగా.. 915 పరీక్ష కేంద్రా­లను అధికారులు సిద్ధం చేశారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వ­హి­స్తామని ఎస్‌ఎస్‌సీ పరీక్షల విభాగం సంచాల­­కులు దేవానందరెడ్డి మంగళవారం తెలిపారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు.

పరీక్షల నిర్వహణకు 915 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, మరో 915 మంది డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు, 11 వేల మంది ఇన్విజిలేటర్లు, 86 ఆకస్మిక తనిఖీ బృందాల(ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌)ను నియమించినట్లు పేర్కొన్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్లతో సహా ఎవరూ సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, కెమెరాలు, ఇయర్‌ ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌ పరికరాలు తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు.

మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడినా, ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకెళ్లినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్‌ 13, 14 తేదీల్లో రాష్ట్రంలోని 23 కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతుందని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణపై సందేహాల నివృత్తి కోసం విజయవాడలో 0866–2974540 నంబర్‌తో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇది జూన్‌ 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement