tenth advanced supplementary exams
-
2 నుంచి ‘టెన్త్’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, అమరావతి: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల కోసం 2,12,221 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 915 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు నిర్వహిస్తామని ఎస్ఎస్సీ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి మంగళవారం తెలిపారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణకు 915 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 915 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 11 వేల మంది ఇన్విజిలేటర్లు, 86 ఆకస్మిక తనిఖీ బృందాల(ఫ్లైయింగ్ స్క్వాడ్)ను నియమించినట్లు పేర్కొన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఎవరూ సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, కెమెరాలు, ఇయర్ ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 13, 14 తేదీల్లో రాష్ట్రంలోని 23 కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతుందని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణపై సందేహాల నివృత్తి కోసం విజయవాడలో 0866–2974540 నంబర్‌తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇది జూన్ 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు. -
టెన్త్ సప్లిమెంటరీ 2,07,160, బెటర్మెంట్ పరీక్షలకు 8,609 మంది విద్యార్థులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, బెటర్మెంట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 15వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. 986 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.30 నుంచి 9.30 గంటలలోపు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకుని రిపోర్టు చేయాల్సి ఉంటుంది. తొలిసారిగా ఈసారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీతోపాటు బెటర్మెంట్ పరీక్షను కూడా బోర్డు నిర్వహిస్తోంది. ఎస్సెస్సీ రెగ్యులర్ పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు భావిస్తుండటంతో మార్కులు పెంచుకునేందుకు ఈ బెటర్మెంట్ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 2,07,160 మంది, బెటర్మెంట్ పరీక్షలకు 8,609 మంది హాజరుకానున్నారు. ఇంతకుముందు పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలు, ఇతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సెస్సీ బోర్డు అనేక జాగ్రత్తలు చేపట్టింది. అన్ని కేంద్రాలను నోఫోన్ జోన్లుగా ప్రకటించింది. చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఏ ఒక్కరూ పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకెళ్లడానికి వీల్లేదు. డిజిటల్ డివైజ్‌లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పోలీసులతో కూడిన మొబైల్ స్క్వాడ్లను ఏర్పాటుచేసింది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఉంటుంది. -
10 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 10 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 24 వరకు జరిగే ఈ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు జరుగుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 260 పరీక్ష కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 7,642 పాఠశాలలకు చెందిన 61,431 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. అందులో 36,931 మంది బాలురు ఉండగా, 24,500 మంది బాలికలు ఉన్నట్లు వివరించారు. హాల్‌టికెట్లను తమ వెబ్సైట్లో www.bse.telangana.gov.in ఉంచినట్లు తెలిపారు. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాటిని డౌన్లోడ్ చేసుకొని, వాటిపై సంతకం, స్టాంపు వేసి విద్యార్థులకు జారీ చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు నియమించిన సిబ్బంది కూడా పరీక్ష కేంద్రంలోకి ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. -
10 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 10 నుంచి పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించింది. జూన్ 10 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమై 24న ముగుస్తాయి. రోజూ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం12.15 గంటలకు ముగుస్తుంది. పరీక్షలకు సమయం తక్కువగా ఉండటంతో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఎదురుచూడొద్దని ప్రభుత్వం సూచించింది. అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి ఫీజు చెల్లింపు గడువు ఈనెల 25 వరకు ఉంది. ఈనెల 29న పరీక్ష ఫీజును సంబంధిత పాఠశాల యాజమాన్యం ట్రెజరీలో జమచేసి ఈ నెల 31 నాటికి జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయానికి కంప్యూటర్ ఎక్స్ట్రాక్ట్స్ సమర్పించాలని, వీటిని జూన్ 3లోగా జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రభుత్వ పరీక్షల విభాగానికి సమర్పించాలని స్పష్టం చేసింది. అపరాధరుసుము రూ.50తో పరీక్షలకు రెండ్రోజుల ముందు వరకు చెల్లించే వెసులుబాటు కల్పించినా గడువు తేదీలోగా చెల్లించాలని విద్యార్థులకు సూచించింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం.. పదోతరగతి పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఫలితాలు వెలువడిన నాటి నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ చేయించాలనుకుంటే ప్రతి సబ్జెక్టుకు రూ.500 చొప్పున ప్రభుత్వ ఖజానా హెడ్ అకౌంట్‌టో నిర్దేశిత హెడ్లలో చెల్లించాలి. లేదా డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, తెలంగాణ, హైదరాబాద్ కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్ కోసం ప్రతి సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున చలానా కట్టాలి. దరఖాస్తు పత్రాన్ని www. bse. telangana. gov. in లేదా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి తీసుకోవాలని సూచించింది. డిమాండ్ డ్రాఫ్ట్‌లను అంగీకరించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. రీవెరిఫికేషన్ కేటగిరీలో రీటోటలింగ్, అన్ని జవాబులకు మార్కులు వేశారా లేదా చూస్తారు. మూల్యాంకనం చేయని జవాబులను తిరిగి లెక్కిస్తారు. రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదని సూచించింది. -
జూన్ 4 నుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 4 నుంచి 19 వరకు నిర్వహించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం షెడ్యూల్ జారీ చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్టు పేర్కొంది. ద్వితీయ భాష పరీక్ష మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందని వెల్లడించింది. విద్యార్థులు మే 21 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఫీజును ప్రధానోపాధ్యాయుడికి చెల్లించాలని, రూ. 50 ఆలస్య రుసుముతో సంబంధిత సబ్జెక్టు పరీక్షకు రెండు రోజుల ముందు కూడా ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. మూడు లేదా అంతకంటే తక్కువ సబ్జెక్టులకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 ఫీజు చెల్లించాలని తెలిపింది. మరిన్ని వివరాలు http://bse.telangana.gov.in/ వెబ్సైట్లో పొందవచ్చని సూచించింది. -
జూన్ 4 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, హైదరాబాద్: పదో తరగతిలో ఫెయిలైన, సరైన మార్కులు రాని విద్యార్థులకు జూన్ 4 నుంచి 19 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. టెన్త్ ఫలితాల విడుదల సందర్భంగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. నిర్ణీత రోజుల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని.. విద్యార్థులు మే 21వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీవాల్యుయేషన్, వెరిఫికేషన్‌కు దరఖాస్తులు విద్యార్థులు జవాబు పత్రాల రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీలను పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని కడియం సూచించారు. రీకౌంటింగ్‌కు 15 రోజుల్లోగా స్టేట్ బ్యాంక్ బ్రాంచీలో రూ.500 చలానా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులను పోస్టు ద్వారా కానీ, నేరుగా కానీ పంపించవచ్చని తెలిపారు. రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీకి దరఖాస్తు ఫారాలను సంబంధిత ప్రధానోపాధ్యాయుడితో ధ్రువీకరణ సంతకం చేయించి, హాల్‌టికెట్ జిరాక్స్ కాపీ జత చేసి సంబంధిత డీఈవో కార్యాలయాల్లోని ప్రత్యేక కౌంటర్లో అందజేయాలని సూచించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయానికి పోస్ట్/కొరియర్ ద్వారా పంపించే దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు. దరఖాస్తు ఫారం నమూనాను www. bse.telangana.gov.in వెబ్సైట్లో పొందవచ్చని తెలిపారు. రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చలానా చెల్లించి.. 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇందులో గ్రేడ్ మారితేనే ఆయా విద్యార్థులకు సవరించిన ఫలితాలను ప్రకటిస్తామని వివరించారు. -
16 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
పీఎన్‌కాలనీ: ఈ నెల 16 నుంచి 28 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏజేసీ ఎండీ హషీమ్ షరీఫ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్లో పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఆదివారం మినహా 16 నుంచి 28 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -1 (గ్రూప్-ఎ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 (కాంపోజిట్ కోర్సు), 17న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -2 (గ్రూప్-ఎ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపరు-2 (కాంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1 (సాంస్కృతం, ఆరబిక్, పార్శియన్), 18న సెకండ్ లాంగ్వేజ్, 19న ఇంగ్లీష్ పేపర్ -1 (కోడ్ నెంబర్లు 13 లేదా 29), 20న ఇంగ్లీష్ పేపర్ -2 (కోడ్ నెంబర్లు 14 లేదా 30), 21న గణితం పేపర్ -1, 23న గణితం -2, 24న జనరల్సైన్స్ పేపర్ -1, 25న జనరల్ పేపర్-2, 26న సాంఘికశాస్త్రం -1, 27న సాంఘికశాస్త్రం 2, 28న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సాంస్కృతం, అరబిక్, పార్శియన్) జరుగుతాయని తెలిపారు. జిల్లాలోని 22 కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలకు 5789 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు తెలిపారు. జిల్లాలోని 22 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22 మంది డిపార్టుమెంట్ ఆఫీసర్లు, ఐదు ఫ్లైయింగ్స్వాడ్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. సమావేశంలో డీఈవో ఎస్ అరుణకుమారి, పోస్టల్ సూపరింటెండెంట్ జె. ప్రసాదబాబు, సహాయ పోస్టల్ సూపరింటెండెంట్ అరవింద్ పండా, ఆర్టీసీ డీపో మేనేజర్ ఎం. ముకుందరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి. జగన్నాదరావు, పరీక్షల సహాయ కమిషనర్ జీటీ నాయు డు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.