
సాక్షి, హైదరాబాద్: పదో తరగతిలో ఫెయిలైన, సరైన మార్కులు రాని విద్యార్థులకు జూన్ 4 నుంచి 19 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. టెన్త్ ఫలితాల విడుదల సందర్భంగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. నిర్ణీత రోజుల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని.. విద్యార్థులు మే 21వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రీవాల్యుయేషన్, వెరిఫికేషన్‌కు దరఖాస్తులు
విద్యార్థులు జవాబు పత్రాల రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీలను పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని కడియం సూచించారు. రీకౌంటింగ్‌కు 15 రోజుల్లోగా స్టేట్ బ్యాంక్ బ్రాంచీలో రూ.500 చలానా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులను పోస్టు ద్వారా కానీ, నేరుగా కానీ పంపించవచ్చని తెలిపారు. రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీకి దరఖాస్తు ఫారాలను సంబంధిత ప్రధానోపాధ్యాయుడితో ధ్రువీకరణ సంతకం చేయించి, హాల్‌టికెట్ జిరాక్స్ కాపీ జత చేసి సంబంధిత డీఈవో కార్యాలయాల్లోని ప్రత్యేక కౌంటర్‌లో అందజేయాలని సూచించారు.
ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయానికి పోస్ట్/కొరియర్ ద్వారా పంపించే దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు. దరఖాస్తు ఫారం నమూనాను www. bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు. రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల ఫొటో కాపీ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చలానా చెల్లించి.. 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇందులో గ్రేడ్ మారితేనే ఆయా విద్యార్థులకు సవరించిన ఫలితాలను ప్రకటిస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment