సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలను ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ వెల్లడించారు. పరీక్షల ఏర్పాట్లపై ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్‌తో కలిసి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 2,542 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు మొత్తంగా 5,38,867 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. 26 సమస్యాత్మక కేంద్రాలతోపాటు మరో 405 పరీక్ష కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లను పంపిం చామని, అవి అందని వారు, స్కూళ్లు నిరాకరిస్తే వెబ్‌సైట్ (ఠీఠీఠీ.bట్ఛ.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn) నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చని చెప్పారు.
5 నిమిషాలు గ్రేస్ పీరియడ్..
పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు జరుగుతాయని (కొన్ని సబ్జెక్టులు 12:45 గంటల వరకు), విద్యార్థులు ఉదయం 8:45 గంటల కల్లా పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలని కిషన్ సూచించారు. అయితే నిర్ణీత సమయం 9:30 గంటల తరువాత 5 నిమిషాల వరకే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు.
విద్యార్థులు, ఇన్విజిలేటర్లపైనా చర్యలు
మాల్‌ప్రాక్టీస్ చేసే విద్యార్థులతోపాటు ఇన్విజిలేటర్లపైనా చర్యలు ఉంటాయని కిషన్ హెచ్చరించారు. ఎంఈవో, డీఈవోలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తమ కేంద్రంలో మాల్‌ప్రాక్టీస్ జరక్కుండా చూసుకుంటామని, జరిగితే తమదే బాధ్యత అని ఇన్విజిలేటర్లు రాసివ్వాల్సిందేనని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకే ఆ నిబంధన విధించినట్లు చెప్పారు. పరీక్షలకు సంబంధించి తమ టోల్‌ఫ్రీ నంబర్ 18004257462కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. డీఈవో, ఎంఈవోలు ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేస్తారని, వాటికి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎండల దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నామని, ఏఎన్‌ఎంలు ఉంటారని చెప్పారు. పాఠశాలల యాజమాన్యాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించవద్దని, ప్రాథమిక తరగతులు నిర్వహించవద్దని స్పష్టం చేశారు.
విద్యార్థులకు సూచనలు
- ముందు రోజే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలి.
- రైటింగ్‌ప్యాడ్ తీసుకెళ్లాలి. సివిల్ డ్రెస్‌లోనే పరీక్షకు హాజరు కావాలి.
- సరిపడా పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేలు తీసుకెళ్లాలి.
- ఓఎంఆర్, మెయిన్ ఆన్సర్ షీట్ తమదే అని ధ్రువీకరించుకున్న తర్వాతే పరీక్ష రాయాలి.
- ప్రశ్నపత్రంలోని ప్రతి పేజీపై విద్యార్థి హాల్‌టికెట్ నంబరు వేయాలి.
- అడిషనల్ ఆన్సర్ షీట్స్, గ్రాఫ్, బిట్ పేపర్లపై మెయిన్ ఆన్సర్ షీట్ సీరియల్ నంబర్ రాయాలి. హాల్‌టికెట్ నంబర్ రాయొద్దు. అవి విడిపోకుండా గట్టిగా దారం కట్టాలి.
- సీసీఈ విధానం కాబట్టి ప్రశ్న అడిగిన తీరును అర్థం చేసుకుని జవాబులు రాయాలి.
మరిన్ని వివరాలు..
మొత్తం స్కూళ్లు – 11,103, పరీక్ష కేంద్రాలు – 2542,విద్యార్థులు – 5,38,867 (బాలురు – 2,76,388, బాలికలు –2,62,479), రెగ్యులర్ విద్యార్థులు – 5,03,117, ప్రైవేటు విద్యార్థులు – 35,750, అదనంగా వొకేషనల్ విద్యార్థులు – 20,838
మీడియం వారీగా విద్యార్థులు..
తెలుగు – 1,78,901, ఇంగ్లిష్ – 3,12,535, ఉర్దూ – 11,038, హిందీ – 370, మరాఠీ – 189, కన్నడ – 77, తమిళ్ – 07.
Comments
Please login to add a commentAdd a comment