
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13 వరకు జరిగే ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో కలిపి మొత్తం 4,94,620 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇప్పటికే వారికి హాల్‌టికెట్లు అందాయి. మొత్తం 2,652 కేంద్రాల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి.
సైన్స్, కాంపోజిట్ సబ్జెక్టులకు 20 నిమిషాల అదనపు సమయం ఇవ్వనున్నారు. కోవిడ్ మూలంగా గత రెండేళ్లుగా 70 శాతం సిలబస్ ఆధారంగానే పరీక్షలు జరగ్గా ఈసారి వంద శాతం సిలబస్‌తో పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే 11 పేపర్లకు బదులు ఈసారి ఆరు పేపర్లతోనే పరీక్షలు జరగనుండటం గమనార్హం.
మరోవైపు టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన నేపథ్యంలో ఆ తరహా అనుభవాలు ఎదురవకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని రాష్ట్ర కార్యాలయం నుంచి పరిశీలించనున్నారు. మరోవైపు పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఈ సౌకర్యం పొందొచ్చు.