Telangana Tenth Class 2022 Examinations Date Announced, Schedule Released Soon - Sakshi
Sakshi News home page

TS SSC 2022: మేలో టెన్త్‌ పరీక్షలు

Published Fri, Feb 11 2022 2:26 AM | Last Updated on Fri, Feb 11 2022 9:20 AM

Telangana: Tenth Ssc Class Examination In May 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదవ తరగతి పరీక్షలు మే నెలలో నిర్వహించాలని ఎస్సెస్సీ బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. త్వరలో పరీక్షల షెడ్యూల్‌ను వెల్లడించే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇటీవల పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సమగ్ర వివరాలతో కూడిన జాబితాలను రూపొందించి వీలైనంత త్వరగా వీటిని జిల్లా విద్యాశాఖాధికారులకు పంపాలని ఆదేశించారు. త్వరగా టెన్త్‌ సిలబస్‌ పూర్తిచేసి రివిజన్‌ చేపట్టాలని, పరీక్షల కోణంలో విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు. 

కోవిడ్‌ కేసుల తగ్గుముఖంతో..
వాస్తవానికి టెన్త్‌ పరీక్షలు ఏప్రిల్‌లోనే జరగాల్సి ఉంది. ఇందుకోసం నవంబర్‌ నుంచే అధికారులు కసరత్తు చేయడం ఆనవాయితీ. అయితే కోవిడ్‌ మూలంగా పరీక్షలు లేకుండానే గతేడాది విద్యార్థులను పాస్‌ చేశారు. ఈసారి కూడా కోవిడ్‌ మూడోవేవ్‌ను దృష్టిలో  ఉంచుకుని పరీక్షలు ఉంటాయా? లేదా? అనే డోలాయమానంలో ఇప్పటివరకు విద్యాశాఖ ఉంది. తాజాగా కేసులు తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఏప్రిల్‌లో ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా పరీక్షలకు అవసరమైన బందోబస్తు సమస్య తలెత్తకుండా ఇంటర్‌ పరీక్షలు ముగిసిన వారం రోజుల్లో టెన్త్‌ పరీక్షలు నిర్వహించే వీలుందని అధికార వర్గాల సమాచారం. మే 5వ తేదీతో ఇంటర్‌ పరీక్షలు ముగియనున్నాయి.

వారం రోజుల్లో విద్యార్థులపై స్పష్టత
మరో వారం రోజుల్లో పరీక్షకు ఎంత మంది విద్యార్థులు హాజరవుతారు? ఇందులో ప్రైవేటు, ప్రభుత్వ స్కూల్‌ విద్యార్థులు ఎంతమంది అనే డేటా సేకరించనున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈసారి 5.20 లక్షల మంది పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే వీలుందని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా పరీక్ష కేంద్రాల ఎంపిక చేసేందుకు మార్చి మొదటి వారంలో చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.  

ప్రశ్నపత్రాల రూపకల్పన వేగవంతం
టెన్త్‌ పరీక్షల నిర్వహణకు అవసరమైన ప్రశ్నపత్రాల రూపకల్పన ప్రక్రియకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. కానీ ఈసారి అంత సమయం లేకపోవడంతో వేగంగా వీటిని తయారు చేయాలని భావిస్తున్నారు. సీనియర్‌ అధ్యాపకుల చేత కొన్ని ప్రశ్నపత్రాల సెట్లను ఇప్పటికే సిద్ధం చేయించినట్టు పరీక్షల విభాగం అధికారి ఒకరు తెలిపారు. వీటిల్లో కొన్నింటిని ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నామని వెల్లడించారు. అయితే అత్యంత రహస్యంగా జరిగే ఈ ప్రక్రియకు కొంతమంది అధికారులను నియమించినట్టు తెలిసింది. కోవిడ్‌ మూలంగా అరకొరగా బోధన జరిగిన విషయాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని, వీలైనంత వరకూ చాయిస్‌ ఎక్కువ ఉండేలా ప్రశ్నపత్రాలు రూపొందించాలని భావిస్తున్నట్టు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement