హైదరాబాద్: వివిధ రాష్ట్రాలలోని సంస్కృతి, సంప్రదాయాలను యవతకు తెలియబరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్), బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)లు.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్టీసీటీసీ) సహకారంతో యువసంగమం కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విభిన్న నేపథ్యాల యువతకు ఆతిథ్యం అందించారు. ఈ యువసంగమం ఫేజ్-3లో తెలంగాణకు చెందిన స్థానిక వంటకాలు, జీవనశైలి, హస్తకళలు, సంస్కృతి, సాంకేతికత, ఆవిష్కరణలు తెలంగాణలోని ఇతర అంశాలపై ఉత్తరప్రదేశ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాల యువత మధ్య బంధాలను బలోపేతం చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. దేశంలోని యువతలో ఐక్యత, అవగాహనను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. యువ సంగమం ఫేజ్-3లో ఉత్తరప్రదేశ్, తెలంగాణల మధ్య ఒక వారం రోజుల పాటు సాంస్కృతిక మార్పిడి సాగింది. ముగింపు ఉత్సవంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ప్రత్యేక ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ సెషన్ జరిగింది.
యువ సంగమం ప్రధాన లక్ష్యం.. పర్యాటకం, సంప్రదాయాలు, అభివృద్ధి, పరస్పర అనుసంధానం, టెక్నాలజీలపై యువతకు అవగాహన కల్పించడం. తెలంగాణ వారసత్వంలోని విభిన్న కోణాలను ప్రదర్శిస్తూ, రోజు వారీగా ప్రణాళికాబద్ధంగా ఈ సాంస్కృతిక ప్రయాణం సాగింది. ముందుగా వారణాసి నుంచి వచ్చిన ప్రతినిధులకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. తరువాత అంతర్జాతీయ అతిథి గృహంలో వారికి వసతి కల్పించారు. అనంతరం సమగ్ర క్యాంపస్ పర్యటన, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కాంప్లెక్స్‌లను సందర్శించారు.
తెలంగాణ పర్యాటకానికి ఆనవాళ్లయి చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం మొదలైనవాటిని ప్రతినిధులు సందర్శించారు. అలాగే ఐఐటీహెచ్ క్యాంపస్‌లో ఎఐసిటిఇ ఛైర్మన్ ప్రొఫెసర్ టిజి సీతారాము, ఐఐటిహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తిల సహకారంతో గోల్కొండ కోట చారిత్రక వైభవాన్ని పరిశీలించారు. తరువాత బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
ముగింపు కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులకు, యువతకు వివిధ అంశాలపై అవగాహన కలుగుతుందన్నారు. ప్రొఫెసర్ బి ఎస్ మూర్తి మాట్లాడుతూ యువ సంగమం పేరుతో తమకు ఇటువంటి అవకాశాన్ని కల్పించినందుకు విద్యా మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాల వలన యువత వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోగలుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment