సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల విధానంలో మార్పులపై వస్తున్న విమర్శల నేపథ్యంలో విద్యాశాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసి.. పరీక్ష విధానం కాస్త తేలికగా ఉండేలా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ‘టెన్‌్త’కు కఠిన పరీక్ష శీర్షికన ఈ నెల 2న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. చాయిస్ తగ్గించడం, వ్యాసరూప ప్రశ్నల విధానాన్ని కఠినం చేయడం, ఒకేరోజు సైన్స్ సబ్జెక్టుకు సంబంధించిన రెండు పేపర్లు నిర్వహించడంపై విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను ఈ కథనం వెలుగులోకి తెచ్చింది.
పలు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఈ అంశాలను ఎత్తిచూపుతూ.. విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై స్పందించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో సమాలోచనలు జరిపారు. ఇబ్బందికరంగా ఉన్న ప్రశ్నపత్రాలు, విధానంలో మార్పు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్టీ) రంగంలోకి దిగింది. అభ్యంతరాలను పరిశీలించి, పరీక్ష పేపర్లలో మార్పులు తెస్తూ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఆమోదించగానే ప్రశ్నపత్రాలను మార్చనున్నారు.
చాయిస్ పెంపు.. ప్రశ్నల తగ్గింపు..
రెండేళ్ల కరోనా కాలం తర్వాత ఈసారి వందశాతం సిలబస్‌తో టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 3 నుంచి పరీక్షల నిర్వహణకు బోర్డు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈసారి 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతోనే పరీక్షలు ఉంటాయంటూ.. సంబంధించిన మోడల్ పేపర్లను విడుదల చేసింది. ఆ పేపర్లను చూశాక విద్యార్థులు, విద్యారంగ నిపుణులు ఆశ్చర్యపోయారు. రెండు, మూడు మార్కుల సూక్ష్మప్రశ్నలకు గతంలో ఉన్న చాయిస్ ఎత్తివేయడంతో.. ఏ ఒక్క ప్రశ్నకు జవాబు తెలియకపోయినా విద్యార్థి ఆ మేర మార్కులు కోల్పోవాల్సి వస్తుందనే ఆందోళన మొదలైంది.
ఇక వ్యాసరూప ప్రశ్నలను సెక్షన్ మాదిరి కాకుండా, గ్రూపులుగా ఇచ్చారు. సెక్షన్ మాదిరిగా అంటే మొత్తం 12 ప్రశ్నలు ఇచ్చి అందులోంచి ఆరింటికి సమాధానాలు రాయాలని కోరుతారు. దీనిలో విద్యార్థులకు చాయిస్ ఎక్కువగా ఉండి, ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మోడల్ పేపర్లలో రెండు ప్రశ్నల చొప్పున ఆరు గ్రూపులుగా ఇచ్చి.. ప్రతి గ్రూప్‌లో ఒకదానికి సమాధానం రాయాలని పేర్కొన్నారు. ఆ గ్రూపులోని రెండు ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే.. ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. మిగతా గ్రూపుల్లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగినా ప్రయోజనం ఉండదు.
ఈ ఆందోళనను ఎస్‌సీఈఆర్టీ అధికారులు పరిగణనలోనికి తీసుకున్నారు. సూక్ష్మప్రశ్నలకు ఎక్కువ చాయిస్ ఇవ్వడం మంచిదని.. వ్యాసరూప ప్రశ్నలనూ సెక్షన్ విధానంలో ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. అంతేగాకుండా వ్యాసరూప ప్రశ్నల సంఖ్యను తగ్గించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్–కెవిుస్ట్రీ/బయాలజీ పేపర్లను వేర్వేరు రోజుల్లో నిర్వహించాలనే డిమాండ్‌ను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని.. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బంది ఉండబోదని భావిస్తున్నట్టు తెలిసింది.
మార్పులను పరిశీలిస్తున్నాం.. త్వరలో వెల్లడిస్తాం
టెన్త్ ప్రశ్నపత్రాల విధానం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని వివిధపక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. అధికారుల నివేదిక వచ్చాక ఏతరహా మార్పులు చేయాలనేది నిర్ణయిస్తాం. ఇప్పటికే సంబంధిత విభాగం ప్రశ్నపత్రాల మార్పులపై నిశితంగా అధ్యయనం చేస్తోంది. విద్యార్థుల ప్రయోజనం కోసం అవసరమైన మార్పులు చేస్తాం.
– వాకాటి కరుణ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ
Comments
Please login to add a commentAdd a comment