
హైదరాబాద్, సాక్షి: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. వికారాబాద్ లగచర్లలో ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని అన్నారు. ఆమె బుధవారం సాక్షి మీడియాతో మాట్లాడారు.
‘‘అధికారులపై జరిగిన ఘటన కూడా బాధాకరం. అహంకారంగా భూమి లాక్కోవడం ఎంతవరకు సమంజసం. అహంకారంతో భూమి లాక్కుంటే ప్రతిఘటన ఏవిధంగా ఉంటుందో రుచి చూపించారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్?. మాజీ శాసనసభ్యుడు కాబట్టి ప్రజల పక్షాన నిలబడ్డాడు. ప్రతిసారి ఇష్యూను సీఎం రేవంత్ రెడ్డి డైవర్ట్ చేస్తున్నారు.
అక్కడి ఘటనలో బీఆర్ఎస్ నేతలే కాదు.. కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. మూసి దగ్గర సమస్య వచ్చినప్పుడు అక్కడున్న ఇల్లు కూలగొడతామన్నారు. సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కారం చేయకుండా ప్రతిపక్షాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు. కొడంగల్‌లో గతంలో రేవంత్ రెడ్డిని ఓడగోట్టాడు కాబట్టే రాజకీయ ప్రత్యర్థిని తొక్కేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారు’’ అని అన్నారు.
