Patnam narendar Reddy
-
లగచర్ల దాడి కేసు: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్‌లోని లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ దాడి కేసులో ఏ1గా బోగమోని సురేష్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేయగా.. మరో 30 మంది పరారీలో ఉన్నట్టు రిపోర్టులో పోలీసులు తెలిపారు.కలెక్టర్‌పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టు ఇలా.. ఈ దాడికి సంబంధించి బూంరాస్‌పేట్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. 153/2024 క్రైం నెంబర్ కేసు.. సెక్షన్ 61(2), 191(4),132,109,121(1) 126(2)324 r/w190BNS Sec 30Of pdpp act, 128Of bnss కింద కేసులు నమోదయ్యాయి. అలాగే.. హత్యాయత్నం, అసాల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ కూడా కేసులు నమోదు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ దాడి కేసులో మొత్తం 46మందిని నిందితులుగా చేర్చారు.ఇదీ చదవండి: నరేందర్ రెడ్డిని తొక్కేయాలని రేవంత్ కుట్రఎఫ్ఐఆర్లో బోగమోని సురేష్‌ను ప్రధాన నిందితుడుగా(ఏ1) పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16మందిని అరెస్ట్ చేయగా.. మరో 30 మంది పరారీలో ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడిచేశారు. రాళ్లు, కర్రలు, కారంపొడి ముందే సిద్ధం చేసుకున్నారు. అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశాడు A1 నిందితుడు సురేష్. అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ పాటు 29 మంది పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు గాయాలయ్యాయి. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారు. దాడి కేసులో నిందితుడు సురేష్ కీలకంగా మారాడు. సురేష్ ప్లాన్ ప్రకారమే కలెక్టర్‌ను లగచర్లకు తీసుకెళ్లాడు’ అని పోలీసులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: లగచర్ల ఘటన: మార్నింగ్ వాక్‌లో పట్నం అరెస్ట్ -
నరేందర్‌రెడ్డిని తొక్కేయాలని రేవంత్ కుట్ర: సబితా
హైదరాబాద్, సాక్షి: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. వికారాబాద్ లగచర్లలో ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని అన్నారు. ఆమె బుధవారం సాక్షి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారులపై జరిగిన ఘటన కూడా బాధాకరం. అహంకారంగా భూమి లాక్కోవడం ఎంతవరకు సమంజసం. అహంకారంతో భూమి లాక్కుంటే ప్రతిఘటన ఏవిధంగా ఉంటుందో రుచి చూపించారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్?. మాజీ శాసనసభ్యుడు కాబట్టి ప్రజల పక్షాన నిలబడ్డాడు. ప్రతిసారి ఇష్యూను సీఎం రేవంత్ రెడ్డి డైవర్ట్ చేస్తున్నారు. అక్కడి ఘటనలో బీఆర్ఎస్ నేతలే కాదు.. కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. మూసి దగ్గర సమస్య వచ్చినప్పుడు అక్కడున్న ఇల్లు కూలగొడతామన్నారు. సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కారం చేయకుండా ప్రతిపక్షాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు. కొడంగల్‌లో గతంలో రేవంత్ రెడ్డిని ఓడగోట్టాడు కాబట్టే రాజకీయ ప్రత్యర్థిని తొక్కేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారు’’ అని అన్నారు. -
పట్నం అరెస్ట్‌పై స్పందించిన కేటీఆర్.. మరో ఉద్యమం తప్పదంటూ..
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేతలు. నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం అంటూ హెచ్చరించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం.తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్రకార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది.ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారు.పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ లు తప్పవని బెదిరిస్తున్నారుప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుంది.రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్ లు ఎన్నో చూసింది.ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం.పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా.వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేశారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం.తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్రకార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు…— KTR (@KTRBRS) November 13, 2024 పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌ను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు. పచ్చని పొలాల్లో ఫార్మా సిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా?. నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా?. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరు. మీ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతం. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటాం. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డి, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు. పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా?…— Harish Rao Thanneeru (@BRSHarish) November 13, 2024 మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ..‘కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ ఖండిస్తున్నాను. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజల గొంతుకై ప్రశ్నించడం ప్రతిపక్షాల యొక్క బాధ్యత. సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రభుత్వ పనిగా మారింది. ప్రభుత్వం బాధ్యతని మరిచినప్పుడు ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, అది తప్పా?’ అని ప్రశ్నించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ ఖండిస్తున్నాను. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజల గొంతుకై ప్రశ్నించడం ప్రతిపక్షాల యొక్క బాధ్యత. సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రభుత్వ పనిగా మారింది. ప్రభుత్వం బాధ్యతని మరిచినప్పుడు ప్రతిపక్షం…— Sabitha Reddy (@BrsSabithaIndra) November 13, 2024 -
వికారాబాద్‌కు పట్నం.. కాసేపట్లో వైద్య పరీక్షలు!
Updates..👉కొడంగల్ దాడుల కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్‌లోని డీటీసీ సెంటర్లో ఉంచారు. అక్కడి నుంచే ఆయనను నేరుగా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. డీటీసీ సెంటర్‌కే వైద్యులను పిలిపించి అక్కడే నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షలు చేయించే అవకాశం ఉన్నట్టు సమాచారం.👉మరోవైపు.. నరేందర్ రెడ్డి ఇంటికి సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి భార్య, కుటుంబ సభ్యులను సబిత పరామర్శించారు. 👉తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తుండగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం గమనార్హం.👉తెలంగాణలోని వికారాబాద్ ఘటనలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తెల్లవారుజామున ఆయన మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అధికారులపై దాడికి సూత్రధారిగా అనుమానిస్తున్న బీఆర్ఎస్ నేత సురేష్‌తో నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు చెబుతున్నారు. కాల్ డేటా ఆధారంగానే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అలాగే, నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటా, సంభాషణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో ఇప్పటికే 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి బీఆర్ఎస్కు చెందిన నేతలు కూడా ఉన్నారు. దీంతో, కాంగ్రెస్ తీరును బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. 👉వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటుకు స్థల సేకరణ కోసం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఫార్మాసిటీకి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేని గ్రామస్థులు.. కలెక్టర్ సహా అధికారులపై కర్రలు, రాళ్లతో దాడిచేశారు. ఈ దాడి నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్ తప్పించుకున్నారు. కలెక్టర్, అధికారుల కార్లను రైతులు ధ్వంసం చేశారు.👉ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పట్టుకుని కర్రలు, రాళ్లతో దాడిచేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వారి నుంచి తప్పించుకున్న వెంకట్‌రెడ్డి పొలాల వెంట పరుగులు పెట్టారు. ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిపైనా రైతులు దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో దాడికి పాల్పడిన 55 మందిని గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.Government Takes Serious Note of Attack on Vikarabad Collector; Investigation Orderedవికారాబాద్ అడిషనల్ కలెక్టర్, KADA ఛైర్మన్ మరియు ఇతర అధికారులపైన దాడిలో ప్రత్యేక్షంగా గాని పరోక్ష్యంగా గాని పాల్గొన్న వారిని ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.-- శ్రీ వి.సత్యనారాయణ,IPS. pic.twitter.com/XfjZqUonAa— Congress for Telangana (@Congress4TS) November 12, 2024 -
కొండగల్‌లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
సాక్షి, వనపర్తి: తెలంగాణ రాజకీయాల్లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కొత్తకోట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా చేపట్టిన పాదయాత్రను అడ్డుకునే క్రమంలో పోలీసులు నరేందర్ రెడ్డి, నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోలెపల్లి ఎల్లమ్మ దేవస్థానం నుంచి దుద్వాల్ ఎమ్మార్వో ఆఫీసు వరకు పాదయాత్ర చేయాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో పాదయాత్రకు అనుమతి లేదని చెబుతూ తుంకిమెట్ల వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..‘రైతుల కోసం పాదయాత్ర చేస్తామని మేము ముందే పోలీసులకు చెప్పాము. ప్రశాంతమైన వాతావరణంలో పాదయాత్ర చేసుకోమని వాళ్లు పర్మిషన్ ఇచ్చారు. కొడంగల్‌లో పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు రైతులు తరలి రావడం చూసి సీఎం రేవంత్ రెడ్డి భయపడ్డాడు. దీంతో, మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి వనపర్తి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముఖ్యమంత్రిని ఒకటే నేను ప్రశ్నిస్తున్నా.. మీ సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.హైదరాబాద్‌లో ఫార్మా సిటీ కోసం మహేశ్వరంలో 14వేల ఎకరాలు సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌ను వదిలేసి కొడంగల్‌లో పచ్చని పంటలు పండే మూడు వేల ఎకరాలను ఫార్మా సిటీ కోసం ఎందుకు ఎంపిక చేశారు. మహేశ్వరంలో ఉన్న వేల ఎకరాలలో రియల్ ఎస్టేట్ కోసం ప్లాన్ చేశారా?. ఫార్మా కంపెనీలు కాకుండా కొడంగల్‌కు మంచి కంపెనీలు తీసుకురావాలి. ప్రభుత్వం రైతుల పొట్ట కొట్టొద్దు. యువతకు ఉపాధినిచ్చే ఐటీ కంపెనీలను తీసుకొస్తే దానికి మేము వ్యతిరేకం కాదు. కాబట్టి వెంటనే ఫార్మా కంపెనీల భూముల విషయంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. చివరి వరకు కొడంగల్ రైతుల పక్షాన నిలబడి పోరాడుతాము’ అని చెప్పారు.ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ..‘రైతులకు మద్దతుగా పాదయాత్ర చేస్తుంటే ప్రభుత్వం ఓర్చుకోవడం లేదు. తన సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీలు కాకుండా ఏ కంపెనీలు నెలకొల్పినా మాకు అభ్యంతరం లేదు. భూములను తీసుకునేటప్పుడు ఆ గ్రామాల ప్రజలను కూర్చోబెట్టి ఒప్పించి భూములు తీసుకోవాలి. వారికి ఇష్టం లేనిదే వారి భూములు తీసుకోవడం ఎంత వరకు సమంజసం?. యువతకు ఉపయోగపడే కంపెనీలను తీసుకురావాలి. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చుతోంది. రైతులకు ఇబ్బంది కలిగిస్తే సీఎం ఇంటిని ముట్టడిస్తాం’ అంటా హెచ్చరించారు.ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ పాలనకొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులుఫార్మా కంపెనీ పేరుతో చేసే రియల్ ఎస్టేట్ దందాను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ఎన్ని… pic.twitter.com/cI4mGemzp2— BRS Party (@BRSparty) October 9, 2024 -
‘కొడంగల్’ సింహం ఎవరో?
కొడంగల్: నియోజకవర్గ ప్రజల తీర్పు విభిన్నం. మార్పు కావాలనుకుంటే ఎలాంటి వారికైనా పరాభవం తప్పదు. ఇది గతంలో నిరూపితమైంది. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2014లో తెలంగాణ ఉద్యమాన్ని పక్కకు పెట్టి టీడీపీకి అవకాశం ఇచ్చారు. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల నాడీ నాయకులకు అంతుపట్టడం లేదు. ఓటరును ప్రసస్నం చేసేందుకు అభ్యర్థులు, వారి అనుచరులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. అయితే కొడంగల్‌లో ఎవరు గెలిచినా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. అందులో ఒకరు రేవంత్‌రెడ్డి. ఆయన పీసీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన విజయం ఖరారైతే రాజకీయంగా మరింత పట్టు సాధిస్తాడనడంలో ఎలాటి సంషయం లేదు. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలకుపైగా గెలిస్తే రేవంత్ సీఎం అవుతాడని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం కొడంగల్ ప్రజల తలరాత మారుస్తుందని హస్తం నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి గెలిస్తే మంత్రి పదవి లభిస్తుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు ఇప్పటికే ప్రకటించారు. బీఆర్ఎస్ గెలిస్తే మంత్రి పదవి, కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కొడంగల్‌కు వరిస్తుందని జనం భావిస్తున్నారు. ఇద్దరిలో ఎవరిని గెలిపించాలనే విషయంపై ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు పలు సర్వేల్లో బహిర్గతమవుతోంది. ఈనెల 30న సాయంత్రం 5 గంటల తర్వాత వెలువడే ఎగ్జిట్‌పోల్‌లో ఈ విషయం బయట పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటమి కోసం శ్రమిస్తున్న నేతలు..? నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే ప్రమోషన్ వస్తుందని బీఆర్ఎస్ అధినేతలు ఏ క్షణంలో ప్రకటించారో కాని అప్పటి నుంచి ఆయనకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రజల మనిషిగా పేరుగాంచిన ఆయనకు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో అఽభిమానులు ఉన్నారు. ఆయన కోసం గట్టిగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. ఆయన నామినేషన్ వేస్తే అలవోకగా గెలిచేంతగా పట్టు సాధించారు. అయితే ప్రమోషన్ ఇస్తామని బహిరంగంగా చెప్పడంతో బీఆర్ఎస్ జిల్లా నేతలే ఆయన ఓటమి కోసం శ్రమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన గెలిస్తే తమకు రాజకీయంగా ప్రాధాన్యత తగ్గుతుందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయన ఓడితేనే తమకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని జిల్లా నేతలు భావిస్తున్నట్లు పీఎన్ఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గురునాథ్‌రెడ్డి కేడర్ రేవంత్‌కే జై కొడంగల్‌లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కీలకంగా మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ పక్షాన ప్రచారం చేసి నరేందర్‌రెడ్డిని అసెంబ్లీ మెట్లెక్కించారు. గురునాథ్‌రెడ్డికి బీఆర్ఎస్లో సముచిత స్థానం దక్కకపోవడంతో ఆయన కారు దిగి కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. గురునాథ్‌రెడ్డితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డిలతో పాటు నియోజకవర్గంలోని ఆయన కేడర్ మొత్తం రేవంత్ పక్షాన నిలిచింది. హస్తం విజయం కోసం గట్టిగా పని చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న తన అనుచరులను కాంగ్రెస్‌లో చేర్పించారు. ఇప్పటికే బీఆర్ఎస్కు ఇబ్బందికర వాతావరణం కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొడంగల్‌లో బీఆర్ఎస్ను ఓడించాలనే నిర్ణయానికి వచ్చారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఎవరి తలరాతను మారుస్తుందోనని స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
రేవంత్ ఈపీ విచారణకు ఓకే
సాక్షి, హైదరాబాద్: కొడంగల్ నియోజకవర్గం నుంచి పట్నం నరేందర్‌రెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి ఎ.రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్(ఈపీ)ను హైకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులైన పట్నం నరేందర్‌రెడ్డి, ఎన్నికల బరిలో నిలిచిన 8 మంది అభ్యర్థులకు, రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో ఈ నియోజకవర్గ పరిధిలో భద్రపరిచిన ఈవీఎంలను ఉపయోగించుకునేందుకు అనుమతివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అభ్యర్థనపై సానుకూలంగా స్పందించింది. ఈవీఎంల ఉపయోగానికి అనుమతిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం నరేందర్‌రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అందువల్ల అతని ఎన్నిక రద్దు చేసి కొడంగల్ నుంచి తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని కోరుతూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో ఈపీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ షావిలి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన రూ.50 లక్షలను పట్నం నరేందర్‌రెడ్డి మనుషుల నుంచి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ మొత్తం రూ.5 కోట్ల వరకు ఉంటుందని, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలన్న విషయాలను నరేందర్‌రెడ్డి బావమరిది తన పుస్తకంలో స్పష్టంగా రాసుకున్నారని, దీనిని కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు. నరేందర్‌రెడ్డి తన అక్రమాలకు ఫామ్‌హౌజ్‌ను వేదికగా చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో రూ.14 కోట్ల వరకు ఖర్చుపెట్టిన నరేందర్‌రెడ్డి, ఎన్నికల అఫిడవిట్లో మాత్రం కేవలం రూ.26 లక్షలే ఖర్చు చేసినట్లు తప్పుడు లెక్కలు చూపారన్నారు. నరేందర్‌రెడ్డి అక్రమాలకు ప్రాథమిక ఆధారాలున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ ఎన్నికల పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని అభ్యర్థించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు. ఈవీఎంలు వాడుకోండి... ఎన్నికల పిటిషన్ నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఉపయోగించిన ఈవీఎంలను భద్రపరిచామని, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఉపయోగించుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఓ అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కూడా జస్టిస్ షావిలి విచారణ జరిపారు. ఎన్నికల సంఘం తరఫు, రేవంత్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈవీఎంలను ఉపయోగించుకునేందుకు ఈసీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
చేవెళ్ల పార్లమెంట్ సీటుపై హేమాహేమీల గురి
చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనేది దాదాపుగా ఖరారైంది. టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఇక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై అన్ని పార్టీలు గురిపెట్టాయి. ఈ స్థానం నుంచి పోటీచేసేందుకు అర్థబలం, అంగబలం ఉన్న అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తిచేశాయి. ప్రధానంగా అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో హేమాహేమీలు ఈసారి బరిలోకి దిగనుండడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంత సమ్మిళితమైన ఈ గడ్డపై పాగా వేసేందుకు ఆయా పార్టీలు రంగం సిద్ధంచేసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను దాదాపుగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక అధికార ప్రకటనే తరువాయి. ‘పట్నా’నికి లైన్ క్లియర్ అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున పట్నం మహేందర్‌రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ స్థానానికి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సైతం పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఆయనకు మల్కాజిగిరి టికెట్ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని స్వామిగౌడ్‌కు ఇప్పటికే సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల మీద ఆశలు పెట్టుకున్నప్పటికీ.. పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడి నుంచైనా పోటీచేస్తానని స్వామిగౌడ్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలకుతోడు టికెట్‌పై మహేందర్‌రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పట్నంకు టికెట్ దాదాపు ఖరారైందనడానికి బలం చేకూరుతోంది. కాంగ్రెస్ నుంచి ‘కొండా’నే.. ఇక కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు ఫైనల్ అయింది. మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈయన అప్పటి మంత్రి మహేందర్‌రెడ్డితో విభేదాలు తలెత్తడం, ఆధిపత్యం పోరు తదితర కారణాల వల్ల కాంగ్రెస్‌లో చేరారని ప్రచారం జరిగింది. అయితే కారణం ఏదైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేవెళ్ల టికెట్ ఆయనకు ఖరారు చేసిన తర్వాతే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని వినికిడి. ఈ నేపథ్యంలో ఆయనకు కాకుండా మరొకరిని బరిలోకి దించే అవకాశం లేదు. పైగా జిల్లాలో విస్తృత క్యాడర్ ఉన్న మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిని ఢీకొట్టాలంటే సమఉజ్జీ కావాలి. ఆర్థికంగా బలంగా ఉండటమేగాక పార్టీ శ్రేణుల్లోనూ కొండాకు మంచి పేరుంది. దీంతో విశ్వేశ్వర్ రెడ్డి వైపు కాంగ్రెస్ మొగ్గుచూపిందని సమాచారం. మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నప్పటికీ కొండా పేరే ఖరారు కానుంది. ఇప్పటికే పీసీసీ కూడా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరును కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి సూచించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డికి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈయన సికింద్రాబాద్ టికెట్‌ను ఆశిస్తున్నా.. పార్టీ ఆదేశాల మేరకు చేవెళ్ల నుంచి బరిలో దిగుతారని తాజా పరిణామాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. ఈయన ఆశలు పెట్టుకున్న సికింద్రాబాద్ స్థానంపై కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వెనక్కి తగ్గడం లేదు. ఈ స్థానం నుంచి వీరిద్దరిలో ఒకరికి ఫైనల్ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ క్రమంలో కిషన్‌రెడ్డికి ప్రత్యామ్నాయం చేవెళ్ల స్థానమే. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేగా గెలవడం, రాష్ట్ర పార్టీ బాధ్యతలు నిర్వహించడం ఈయనకు కలిసివచ్చే అంశాలు. పైగా పార్టీ శ్రేణుల్లోనూ మాస్ లీడర్‌గా పేరు సంపాదించారు. దీనికితోడు కిషన్‌రెడ్డి సొంతూరు ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకే వస్తోంది. ఈ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి బెక్కరి జనార్దన్‌రెడ్డి కూడా టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే పలు సమీకరణనల నేపథ్యంలో కిషన్‌రెడ్డి వైపే పార్టీ మొగ్గుచూపుతోందని తెలుస్తోంది. -
ఎమ్మెల్సీ పదవికి నరేందర్‌రెడ్డి రాజీనామా
ఇటీవల కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానిక సంస్థల కోటా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జోడు పదవుల నేపథ్యంలో నరేందర్ ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. కాగా, ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై వేటు వేసేందుకు గులాబీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎమ్మెల్సీ పదవికి పట్నం నరేందర్‌రెడ్డి రాజీనామా చేశారు. గురువారం ఆయన తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు అందజేశారు. స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి సభ్యుడిగా గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి.. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. జంట పదవుల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ పదవిని త్యజించారు. తొలిసారి 2007లో ఎమ్మెల్సీగా పెద్దల సభలోకి నరేందర్ అడుగు పెట్టారు. ఆ తర్వాత రెండోసారి 2015లోనూ స్థానిక సంస్థల కోటాలోనే ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఇటీవల ఆయన వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డిని ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అయితే, జోడు పదవులను అనుభవించ వద్దనే కారణంగా మండలికి నరేందర్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు. ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే! నరేందర్‌రెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయినా.. ఇప్పట్లో భర్తీ చేసే అవకాశం కనిపించడం లేదు. ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉన్న ఈ సీటును స్థానిక సంస్థల ఓటర్లతో భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ పదవులకు 2015లోనే ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఒకరు నరేందర్‌రెడ్డి గెలవగా.. మరొకరు శంభీపూర్ రాజు ఎన్నికయ్యారు. అయితే, ఈ ఫిబ్రవరిలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో.. అప్పటిలోగా ఈ ఖాళీని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటిఫికేషన్ ద్వారా గుర్తిస్తుందా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. యాదవరెడ్డిపై వేటు? ఇటీవల గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై వేటు వేయాలని టీఆర్ఎస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంతో ఆయను పార్టీ నుంచి అధినాయకత్వం బహిష్కరించిన విషయం తెలిసిందే.చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్ అధినాయకత్వంపై తిరుగుబాటు చేసిన తరుణంలోనే ఆయనతో కలిసి యాదవరెడ్డి కూడా ధిక్కారస్వరం వినిపించిన సంగతి విదితమే. తాజాగా ఎసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడం.. ఆఖండ విజయం సాధించడంతో ఊపుమీద ఉన్న టీఆర్ఎస్ హైకమాండ్.. ఎన్నికల వేళ తిరుగుబాటు చేసిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన యాదవరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసే అంశాన్ని పరిశీలిస్తోంది. కేవలం యాదవరెడ్డే కాకుండా... మరికొందరు రెబల్స్‌పై వేటు వేయాలని నిర్ణయించిన టీఆర్ఎస్ హైకమాండ్.. ఒకట్రెండు రోజుల్లో స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. అయితే, ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాంగ్రెస్ తరుఫున గెలిచి.. టీఆర్ఎస్లో చేరిన దామోదరరెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరిపై చర్యలకు ఇది సాంకేతికంగా అడ్డుగా మారిన నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి అడుగు వేస్తుందో వేచిచూడాల్సిందే! -
‘పట్నం’ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు
కొడంగల్: కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని, ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నరేందర్‌రెడ్డి ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీ చేస్తే కోట్ల రూపాయలు బయటపడ్డాయన్నారు. కోస్గి మండలం మీర్జాపూర్లో పట్నం నరేందర్‌రెడ్డి నివాసం ఉంటున్న బంగ్లాలో ఐటీ అధికారుల దాడులు జరిగాయని, ఆ సమయంలో నరేందర్‌రెడ్డి కుటుంబసభ్యులు, ఆయన బావమరిది శ్రీధర్‌రెడ్డి ఉన్నట్లు చెప్పారు. అక్కడ రూ.51 లక్షలు సీజ్ చేసినట్లు ఐటీ అధికారులు ప్రకటించినట్లు చెప్పారు. వాస్తవానికి రూ.17.51 కోట్లు దొరికినట్లు చెప్పారు. నగదు తో పాటు అక్కడ దొరికిన పత్రాల్లో ఎవరికి ఎంత మొత్తం ఇచ్చిన వివరాలు ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని 26 గ్రామాలకు మద్యం సరఫరా చేసిన వివరాలు ఉన్నట్లు తెలిపారు. కోస్గి మండల నాయకులకు రూ.60 లక్షలు, బొంరాస్‌పేట మండల నాయకులకు రూ.40 లక్షలు ఇచ్చినట్లు డైరీలో రాసి ఉందన్నారు. మొత్తం రూ.4.46 కోట్లకు సంబంధించిన లెక్కల ఆధారాలు ఉన్నట్లు వివరించారు. ఏ రకంగా చూసినా ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఖర్చు రూ.28లక్షల లోపు ఉండాలన్నారు. మద్యం సరఫరా చేశారని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని ఎన్నికల కమిషన్ ఎందుకు అనర్హుడిగా ప్రకటించట్లేదో అర్థం కావట్లేదన్నారు. ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటే కొడంగల్ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉందన్నారు. -
నరేందర్ రెడ్డికి ఎన్నికల కమీషన్ నోటీసులు
కొడంగల్: మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి ఎన్నికల కమిషన్(ఈసీ) నోటీసులు జారీ చేసింది. సోదాల్లో దొరికిన రూ.50 లక్షల నగదుకు వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది. నరేందర్ రెడ్డి బంధువుకు చెందిన ఫాంహౌస్‌లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ.50 లక్షల నగదు దొరికిన సంగతి తెల్సిందే. కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో సోదాలు జరిగాయని, రూ.17.51 కోట్ల ధనం దొరికిందని కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గురువారం ఆరోపించిన సంగతి తెల్సిందే. కేసు రూపుమాపే విధంగా టీఆర్ఎస్ నాయకులు ఐటీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. -
ఆ సీల్డ్ కవర్లో ముఖ్య వివరాలే ఉండొచ్చు
సాక్షి, హైదరాబాద్: కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలకు సంబంధించి ఐటీ నుంచి ఒక సీల్డ్ కవర్ నివేదిక అందిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్‌కుమార్ వెల్లడించారు. అయితే అందులో ఏముందో తానింకా చూడలేదని, దీనిపై వివరాలు మీడియాకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. ‘సీల్డ్ కవర్ వచ్చింది కాబట్టి అందులో ఏదో ముఖ్యమైన వివరాలే ఉండొచ్చు. లేకుంటే సీల్డ్ కవర్ ఎందుకొస్తుంది..’అని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. మొత్తం సీజ్ విలువ రూ.104.41 కోట్లు.. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కొందరు వ్యక్తులు ముందుగానే మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి నిల్వ పెట్టుకుంటున్నారని వాటిని గుర్తించి ధ్వంసం చేయాలని సీఈఓ ఆదేశించారు. పోలింగ్‌కు ఒకట్రెండు రోజుల ముందు మద్యం పంపిణీ యోచనలో ఉన్నట్లు సమాచారం ఉందని, దీనిపై ఎక్సైజ్ శాఖకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇక ఇప్పటివరకు నగదు, మద్యం, గంజాయి సహా మొత్తం సీజ్ విలువ రూ.104.41 కోట్లకు చేరిందన్నారు. అందులో నగదు రూ.87.98 కోట్లు ఉందన్నారు. మద్యం విలువ రూ.8.86 కోట్లుగా పేర్కొన్నారు. సీజ్ చేసిన నగదులో రాజకీయ పార్టీలవి కొంత మొత్తమే ఉన్నట్లు నిర్ధారించామని, అందులో అధికార పార్టీ నుంచే అధికంగా ఉందన్నారు. పట్టుబడిన వాటిలో కొందరు ఆధారాలు చూపించి, నగదును వెనక్కి తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే కొంత సొమ్ము మూలాలు తెలియడం లేదన్నారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పరిస్థితిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా సహకారం తీసుకుంటామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో కొన్ని చోట్ల నక్సలైట్లు, ఇతరత్రా సమస్యలున్నందున ప్రత్యేకంగా చర్యలు చేపట్టామని వెల్లడించారు. అధికారులు, పార్టీలకు ఆ జాబితాలు నకిలీ ఓటర్లు ఓటు హక్కు వినియోగించకుండా అబ్సెన్టి, షిప్టెడ్, డూప్లికెట్ కింద ఒక జాబితాను తయారు చేసి పోలింగ్ అధికారులకు, రాజకీయ పార్టీలకు అందివ్వనున్నట్లు సీఈఓ చెప్పారు. ఓటర్ల జాబితా సక్రమంగా ఉంటే ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. నియోజకవర్గాల వారీగా ఎవరెవరు పోటీలో ఉన్నారనే అభ్యర్థుల జాబితాను సీఈవో వెబ్సైట్లో పెడతామని తెలిపారు. కొందరు అభ్యర్థులు ఈసీ నిబంధనలకు అనుగుణంగా పాస్‌ఫొటోలు సమర్పించనందునే కొంత ఆలస్యమైందని చెప్పారు. పెరిగిన అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బ్యాలట్ యూనిట్లు (బీయూ) 4,570 బెంగళూరు నుంచి వస్తున్నాయన్నారు. అభ్యర్థుల వారీగా బీయూలో మీటలను సెట్ చేస్తామన్నారు. ఈవీఎం బ్యాలెట్ ముద్రణ కూడా పూర్తవుతుందన్నారు. వచ్చే ఒకటో తేదీ వరకు ఈ ప్రకియను ముగిస్తామన్నారు. మంత్రి హరీశ్‌పై చర్యలు తీసుకుంటాం ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఈసీ ఆదేశాలకు అనుగుణంగా మంత్రి హరీశ్‌రావుపై ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం సెక్షన్ 125 ప్రకారం చర్యలు తీసుకుంటామని రజత్‌కుమార్ చెప్పారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో ఒకే పార్టీకి హోర్డింగ్స్‌కి అవకాశం కల్పిస్తున్నారనే ఫిర్యాదులు అందాయని, అయితే అందరికీ అవకాశమివ్వాలని ఎన్నికల అధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. మీడియాకు స్వేచ్ఛ ఉంది మీడియాకు స్వేచ్ఛ ఉందని, కొన్ని విషయాల్లో నియంత్రించడం సరికాదని రజత్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉందని, అయితే సర్వే చేసుకుని ఎవరికెన్ని సీట్లు అనేది మాత్రం పబ్లిష్ చేసుకోవచ్చునని తెలిపారు. దీనిపై మీడియాకు స్వేచ్ఛ ఉందన్నారు. దివ్యాంగుల కోసం చేసిన ఏర్పాట్లపై ఈసీ నుంచి వచ్చిన యాక్సెసబుల్ అబ్జర్వర్స్ సంతృప్తి వ్యక్తం చేశారని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామని కితాబిచ్చారన్నారు. గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్థి మిస్సింగ్‌పై పోలీసుల నుంచి నివేదిక కోరామని తెలిపారు. ఓటర్లు స్లిప్పుల వెనుక గూగుల్ మ్యాప్ ఓటరు స్లిప్పుల పంపిణీ మొదలైందని, వాటి వెనక భాగంలో పోలింగ్ కేంద్రానికి దారిచూపే గూగుల్ మ్యాప్ కూడా ఉంటుందని సీఈఓ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వచ్చే నెల 2 వరకు పంపిణీ చేయాల్సి ఉందని, అయితే అంతకంటే ముందే ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. మొత్తం నమోదైన 2.80 కోట్ల ఓటర్లలో 19 లక్షల మంది కొత్తగా నమోదు చేసుకున్నారని వివరించారు. ఇందులో దాదాపు 7.5 లక్షల మంది ఓటర్లు 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్నవారేనన్నారు. బూత్ లెవెల్ స్థాయి అధికారులపై అనేక ఫిర్యాదులు అందినప్పటికీ, ఓటరు నమోదు ప్రక్రియ సంతృప్తికరంగానే ముగిసిందని చెప్పారు. -
టీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ దాడులు.. భారీగా డబ్బు?
సాక్షి, వికారాబాద్: కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. కోస్గి మండలం మీర్జాపూర్‌లోని ఆయన నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున ఈ సోదాలు దాదాపు 45 నిమిషాలపాటు జరిగినట్టు తెలుస్తోంది. ఐటీ అధికారుల సోదాల్లో నరేందర్ రెడ్డి నివాసంలో పెద్దమొత్తంలో నగదు దొరికినట్లు సమాచారం. పట్నం నరేందర్ రెడ్డి నివాసంలో జరిగిన ఐటీ సోదాలపై ఎన్నికల సంఘం సీఈవో రజత్ కుమార్ స్పందించారు. ఆయన నివాసంలో ఐటీ సోదాలు నిజమేనని, ఈ మేరకు సీల్డ్ కవర్ నివేదిక తమకు అందిందని ఆయన వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్‌రెడ్డిపై పట్నం నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండటంతో ఇక్కడ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. గెలుపు కోసం రేవంత్‌రెడ్డి, నరేందర్ రెడ్డి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతా
సాక్షి, వికారాబాద్: కొడంగల్‌లో టీఆర్ఎస్ను గెలి పిస్తే ఈ ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకొచ్చి రైతు ల కాళ్లు కడిగి రుణం తీర్చుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబందుల ప్రభుత్వం కావాలో.. ‘రైతు బంధు’ప్రభుత్వం కావాలో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. నాణ్యమైన కరెంటు పగటి పూట ఇవ్వాలని అడిగిన రైతులను కాల్చి చంపిన కాంగ్రెస్‌ను గెలిపించి మోసపోవద్దని హెచ్చరించారు. టీఆర్ఎస్ గెలిస్తే సంక్షేమమని, మహాకూటమి గెలిస్తే సంక్షోభమని అన్నారు. కాంగ్రెస్‌లో 40 మంది సీఎం అభ్యర్థులున్నారని, వారంతా కలిసి 60 నెలలు పాలిస్తారని ఎద్దేవాచేశారు. టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ సీఎం అని, కాంగ్రెస్ గెలిస్తే సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగల రా అంటూ ప్రశ్నించారు. జిల్లాకు నలుగురు సీఎం అభ్యర్థులున్నారని, వీరిలో రేవంత్‌రెడ్డి, డీకే.అరుణ, చిన్నారెడ్డిలున్నారని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే టికెట్ల కోసం, బీ ఫాంలకోసం, చివరకు బాత్రూంకు వెళ్లాలన్నా అనుమతికి ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుం దని తెలిపారు. టీఆర్ఎస్ గెలిస్తే సొంత స్థలంలో ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం, పింఛన్ల పెంపు, పింఛన్‌కు అర్హత వయసు 57 ఏళ్లు, నిరుద్యోగ భృతి, రూ.లక్షలోపు రైతు రుణమాఫీ, ఉద్యోగాల కల్పన వేగవంతం, తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. దేశంలోని సీఎంలు నేర్చుకునేలా కేసీఆర్ పాలన ఉందని తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకుంటా టీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మరి ‘మహా కూటమి’ ఓడిపోతే రాజకీయాల నుంచి నిష్క్రమించడానికి రేవంత్ సిద్ధమేనా అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఆయన చేతలమనిషైతే సవాల్‌ను స్వీకరించాలన్నారు. టీవీల ముందు కూర్చుని మాటలు చెప్పి, పోజులు కొడితే పనులు కావని, అభివృద్ధి కావాలంటే చిత్తశుద్ధి ఉండాలన్నారు. మహాకూటమి గెలిస్తే మన జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంటుందన్నారు. ఈ ప్రాంతానికి పాలమూరు నీరు రాకుండా 30 ఉత్తరాలు రాసిన బాబును మనం గెలిపిద్దామా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని తిడితే పెద్దవాళ్లు అయిపోతారా అని ప్రశ్నించారు. ఆయనకు దమ్ముంటే నరేందర్రెడ్డిపై గెలిచి చూపించాలన్నారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, హైదరాబాద్ మేయర్ దొంతు రామ్మోహన్, రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ పాల్గొన్నారు. బుధవారం కొడంగల్ రోడ్‌షోకు భారీగా హాజరైన జనం -
రవాణా వ్యవస్థతోనే పల్లెల అభివృద్ధి
మర్పల్లి: రవాణా వ్యవస్థ అభివృద్ధి చెం దినప్పుడే పల్లెసీమలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని పంచలింగాల గ్రామం నుండి వికారాబాద్ వరకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నడిపే ఆర్టీసీ బస్సు సర్వీసును వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు స్థానిక నాయకులకు విన్నపం మేరకు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆర్టీసీ అధికారులను ఆదేశించటంతో ఈ బస్సుసర్వీసును ప్రారంభిం చినట్లు పేర్కొన్నారు. ఈ బస్సు నడుపటంతో పంచలింగాల, నర్సాపూర్, పిల్లిగుండ్లతోపాటు చుట్టు ప్రక్కల గ్రామాలకు, మోమిన్‌పేట్ మండలం కొత్తకోల్కుందా, పాత కోల్‌కుందా, అమ్రాదికుర్ధు, వనంపల్లి గ్రామాల ప్రజలకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే సం జీవరావు మాట్లాడుతూ తార్రోడ్డు, బీటీ రోడ్డు ఉన్న ప్రతి కుగ్రామానికి ఆర్టీసీ బస్సులు నడిపే విషయాన్ని మంత్రి మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకుపోతానన్నారు. బస్సులో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ప్రయాణం పంచలింగాల నుండి వికారాబాద్ వరకు వెళ్ళే ఆర్టీసీ బస్సు ప్రారంభించిన ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజీవరావులతో పాటు మర్పల్లి ఎంీ పపీ సుమిత్రమ్మ, వైస్ ఎంపీపీ అంజ య్య, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండల్‌రెడ్డి, తుమ్మలపల్లి ఎంపీటీసీ సంజీవరెడ్డి, పార్టీ నాయకులు మోమిన్‌పేట్ వరకు బస్సులో ప్రయాణించారు. సమయం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు బస్సుల్లో వెళితే సామాన్య ప్రజలు సైతం ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండల్‌రెడ్డి, ఎం. రామేశ్వర్, అనంత్‌రెడ్డి, యాదయ్య, అశోక్, నాయబ్‌గౌడ్, మల్లేశం, నారాయణ్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, నాగేష్, ధరంసింగ్, కిషన్, కిష్టయ్య, అడివయ్య,హన్మయ్య, అడివయ్య, సర్దార్, విజయ్ పాల్గొన్నారు.