సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు(శుక్రవారం) కోర్టుకు సెలవు కావడంతో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి.. నేరస్తులతో కలిపి ఉంచారని పిటిషన్ వేశారు. స్పెషల్ బ్యారక్‌లో పట్నం నరేందర్‌ను ఉంచాలని న్యాయవాది కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రీ రిజక్ట్ చేసింది.
లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై దాడికి పాల్పడ్డ కేసులో నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం హైదరాబాద్లోని ఫిల్మ్‌నగర్‌లో ఆయనను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి వికారాబాద్లోని పోలీస్ ఆఫీస్‌కు, తర్వాత జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. రిమాండ్రిపోర్టులో ఆయనను ఏ1గా చేర్చారు.
కన్ఫెషన్ స్టేట్మెంట్లో తానే సురేష్‌తో దాడి చేయించానని, ఆర్థికంగా సహకరించారనని నరేందర్‌రెడ్డి ఒప్పుకోవడంతో ఏ1గా ఆయనను చేర్చినట్లు, ఏ2గా సురేష్‌ను మార్చినట్లు పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు వరకు సురేష్ పేరు ఏ1గా ఉండేది. బుధవారం సాయంత్రం కొండగల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట నరేందర్‌రెడ్డిని హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.
కాగా, కలెక్టర్, జిల్లా అధికారులపై దాడి ఘటనలో తన పాత్ర ఉందంటూ పోలీసులు కట్టు కథ అల్లారని నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశాలతో రైతులను దాడులకు పురికొల్పినట్లుగా తాను నేరాంగీకార ప్రకటన ఇచ్చానని పోలీసులు చెబుతున్నట్లు తెలిసిందన్నారు. చర్లపల్లి జైల్లో ఉన్న నరేందర్‌రెడ్డి.. ఈ మేరకు గురువారం తన న్యాయవాదుల ద్వారా కొడంగల్ కోర్టును ఉద్దేశించి అఫిడవిట్ పంపించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న తనను పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బలవంతంగా వికారాబాద్ పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకెళ్లి నిర్బంధించినట్లు తెలిపారు.
ఆ తర్వాత పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకుని కోర్టుకు తీసుకెళ్లారన్నారు. కోర్టులో ప్రవేశ పెట్టిన తర్వాత లగచర్ల ఘటనలో తాను ప్రథమ ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం ఇచ్చినట్లు వివరించారు. తన అరెస్టు విషయంలో పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, అరెస్టు సమాచారాన్ని కనీసం తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఇవ్వలేదని తెలిపారు. తాను అఫిడవిట్‌లో పేర్కొన్న వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని సరైన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment