లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో కీలక పరిణామాలు
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు.. తర్వాత టార్గెట్ కేటీఆర్?
రిమాండ్ రిపోర్టులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావన
నరేందర్‌రెడ్డిని కేటీఆర్ ప్రోత్సహించారని వికారాబాద్ పోలీసుల అభియోగం
కుట్ర ఆరోపణలను ఖండించిన బీఆర్‌ఎస్
తాజా పరిణామాలతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ
అరెస్టు అనుమానంతో కేటీఆర్ నివాసానికి పోటెత్తిన నేతలు, కార్యకర్తలు
అర్ధరాత్రి వరకు మాజీ మంత్రి హరీశ్, ఇతర నేతలతో కేటీఆర్ భేటీ
రేవంత్ ప్రభుత్వ తీరుపై క్షేత్రస్థాయి పోరాటాలు చేపట్టాలని నేతల నిర్ణయం
ఒకట్రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించేందుకు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనలో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు ఈ కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. హైదరాబాద్‌లో నాటకీయంగా అరెస్టు చేసిన నరేందర్‌రెడ్డిని కోర్టులో హాజరుపరచడం, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడం, పోలీసులు ఆయన్ను జైలుకు తరలించడం చకచకా జరిగిపోయాయి.
ముఖ్యంగా నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పేరును ప్రస్తావించడం కలకలం రేపింది. నరేందర్‌రెడ్డిని కేటీఆర్ స్వయంగా ప్రోత్సహించినట్లుగా దర్యాప్తులో వెల్లడైందని... ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. లగచర్లలో దాడి చేసినట్లుగా గుర్తించిన 46 మందిలో 19 మందికి భూములు లేవని తేలిందని ఐజీ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు అధికారులపై దాడిని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందని, ఇందులో ఎంతటివారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. తాజా పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో, ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
అరెస్టు ప్రచారం.. కేటీఆర్ నివాసానికి బీఆర్‌ఎస్ నేతలు
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పిన కేటీఆర్.. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అయితే లగచర్ల ఘటనకు సంబంధించి కేటీఆర్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారంతో బీఆర్‌ఎస్ పార్టీ అప్రమత్తమైంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు.
కేటీఆర్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు pic.twitter.com/FYP4USvaop
— Telugu Scribe (@TeluguScribe) November 13, 2024
Video Credits: Telugu Scribe
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్తీక్‌రెడ్డి తదితర నేతలు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అక్కడే వేచి ఉన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నందినగర్ నివాసానికి చేరుకుని కేటీఆర్‌తో భేటీ అయ్యారు. లగచర్ల ఘటన అనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు.
లగచర్ల ఘటనలో ఎలాంటి కుట్ర లేదని.. బలవంతంగా భూసేకరణ చేస్తుండడంతో కడుపు మండిన రైతులు తిరగబడ్డారే తప్ప మరొకటి కాదని నేతలు పేర్కొంటున్నారు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాలపై క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ నేతలు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించాలని భావిస్తున్నారు. కాగా కలెక్టర్, ఇతర అధికారులపై దాడిని పలు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
Comments
Please login to add a commentAdd a comment