కొడంగల్: నియోజకవర్గ ప్రజల తీర్పు విభిన్నం. మార్పు కావాలనుకుంటే ఎలాంటి వారికైనా పరాభవం తప్పదు. ఇది గతంలో నిరూపితమైంది. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2014లో తెలంగాణ ఉద్యమాన్ని పక్కకు పెట్టి టీడీపీకి అవకాశం ఇచ్చారు. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల నాడీ నాయకులకు అంతుపట్టడం లేదు. ఓటరును ప్రసస్నం చేసేందుకు అభ్యర్థులు, వారి అనుచరులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. అయితే కొడంగల్‌లో ఎవరు గెలిచినా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.
అందులో ఒకరు రేవంత్‌రెడ్డి. ఆయన పీసీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన విజయం ఖరారైతే రాజకీయంగా మరింత పట్టు సాధిస్తాడనడంలో ఎలాటి సంషయం లేదు. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలకుపైగా గెలిస్తే రేవంత్ సీఎం అవుతాడని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం కొడంగల్ ప్రజల తలరాత మారుస్తుందని హస్తం నేతలు అంటున్నారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి గెలిస్తే మంత్రి పదవి లభిస్తుంది. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ అధినేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు ఇప్పటికే ప్రకటించారు. బీఆర్‌ఎస్ గెలిస్తే మంత్రి పదవి, కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కొడంగల్‌కు వరిస్తుందని జనం భావిస్తున్నారు. ఇద్దరిలో ఎవరిని గెలిపించాలనే విషయంపై ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు పలు సర్వేల్లో బహిర్గతమవుతోంది. ఈనెల 30న సాయంత్రం 5 గంటల తర్వాత వెలువడే ఎగ్జిట్‌పోల్‌లో ఈ విషయం బయట పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఓటమి కోసం శ్రమిస్తున్న నేతలు..?
నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే ప్రమోషన్ వస్తుందని బీఆర్‌ఎస్ అధినేతలు ఏ క్షణంలో ప్రకటించారో కాని అప్పటి నుంచి ఆయనకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రజల మనిషిగా పేరుగాంచిన ఆయనకు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో అఽభిమానులు ఉన్నారు. ఆయన కోసం గట్టిగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. ఆయన నామినేషన్ వేస్తే అలవోకగా గెలిచేంతగా పట్టు సాధించారు. అయితే ప్రమోషన్ ఇస్తామని బహిరంగంగా చెప్పడంతో బీఆర్‌ఎస్ జిల్లా నేతలే ఆయన ఓటమి కోసం శ్రమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన గెలిస్తే తమకు రాజకీయంగా ప్రాధాన్యత తగ్గుతుందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయన ఓడితేనే తమకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని జిల్లా నేతలు భావిస్తున్నట్లు పీఎన్‌ఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
గురునాథ్‌రెడ్డి కేడర్ రేవంత్‌కే జై
కొడంగల్‌లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కీలకంగా మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్ పక్షాన ప్రచారం చేసి నరేందర్‌రెడ్డిని అసెంబ్లీ మెట్లెక్కించారు. గురునాథ్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం దక్కకపోవడంతో ఆయన కారు దిగి కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. గురునాథ్‌రెడ్డితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డిలతో పాటు నియోజకవర్గంలోని ఆయన కేడర్ మొత్తం రేవంత్ పక్షాన నిలిచింది.
హస్తం విజయం కోసం గట్టిగా పని చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న తన అనుచరులను కాంగ్రెస్‌లో చేర్పించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర వాతావరణం కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొడంగల్‌లో బీఆర్‌ఎస్‌ను ఓడించాలనే నిర్ణయానికి వచ్చారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఎవరి తలరాతను మారుస్తుందోనని స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment