సాక్షి, వనపర్తి: తెలంగాణ రాజకీయాల్లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కొత్తకోట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు.
ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా చేపట్టిన పాదయాత్రను అడ్డుకునే క్రమంలో పోలీసులు నరేందర్ రెడ్డి, నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోలెపల్లి ఎల్లమ్మ దేవస్థానం నుంచి దుద్వాల్ ఎమ్మార్వో ఆఫీసు వరకు పాదయాత్ర చేయాలని బీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో పాదయాత్రకు అనుమతి లేదని చెబుతూ తుంకిమెట్ల వద్ద బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..‘రైతుల కోసం పాదయాత్ర చేస్తామని మేము ముందే పోలీసులకు చెప్పాము. ప్రశాంతమైన వాతావరణంలో పాదయాత్ర చేసుకోమని వాళ్లు పర్మిషన్ ఇచ్చారు. కొడంగల్‌లో పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు రైతులు తరలి రావడం చూసి సీఎం రేవంత్ రెడ్డి భయపడ్డాడు. దీంతో, మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి వనపర్తి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముఖ్యమంత్రిని ఒకటే నేను ప్రశ్నిస్తున్నా.. మీ సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.
హైదరాబాద్‌లో ఫార్మా సిటీ కోసం మహేశ్వరంలో 14వేల ఎకరాలు సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌ను వదిలేసి కొడంగల్‌లో పచ్చని పంటలు పండే మూడు వేల ఎకరాలను ఫార్మా సిటీ కోసం ఎందుకు ఎంపిక చేశారు. మహేశ్వరంలో ఉన్న వేల ఎకరాలలో రియల్ ఎస్టేట్ కోసం ప్లాన్ చేశారా?. ఫార్మా కంపెనీలు కాకుండా కొడంగల్‌కు మంచి కంపెనీలు తీసుకురావాలి. ప్రభుత్వం రైతుల పొట్ట కొట్టొద్దు. యువతకు ఉపాధినిచ్చే ఐటీ కంపెనీలను తీసుకొస్తే దానికి మేము వ్యతిరేకం కాదు. కాబట్టి వెంటనే ఫార్మా కంపెనీల భూముల విషయంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. చివరి వరకు కొడంగల్ రైతుల పక్షాన నిలబడి పోరాడుతాము’ అని చెప్పారు.
ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ..‘రైతులకు మద్దతుగా పాదయాత్ర చేస్తుంటే ప్రభుత్వం ఓర్చుకోవడం లేదు. తన సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీలు కాకుండా ఏ కంపెనీలు నెలకొల్పినా మాకు అభ్యంతరం లేదు. భూములను తీసుకునేటప్పుడు ఆ గ్రామాల ప్రజలను కూర్చోబెట్టి ఒప్పించి భూములు తీసుకోవాలి. వారికి ఇష్టం లేనిదే వారి భూములు తీసుకోవడం ఎంత వరకు సమంజసం?. యువతకు ఉపయోగపడే కంపెనీలను తీసుకురావాలి. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చుతోంది. రైతులకు ఇబ్బంది కలిగిస్తే సీఎం ఇంటిని ముట్టడిస్తాం’ అంటా హెచ్చరించారు.
ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ పాలన
కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు
ఫార్మా కంపెనీ పేరుతో చేసే రియల్ ఎస్టేట్ దందాను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ఎన్ని… pic.twitter.com/cI4mGemzp2— BRS Party (@BRSparty) October 9, 2024
Comments
Please login to add a commentAdd a comment