కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతా | minister ktr road show in kodangal | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతా

Nov 22 2018 4:47 AM | Updated on Aug 30 2019 8:24 PM

minister ktr road show in kodangal - Sakshi

కొడంగల్‌ రోడ్‌షోలో ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో మంత్రి మహేందర్‌రెడ్డి

సాక్షి, వికారాబాద్‌: కొడంగల్‌లో టీఆర్‌ఎస్‌ను గెలి పిస్తే ఈ ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకొచ్చి రైతు ల కాళ్లు కడిగి రుణం తీర్చుకుంటామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొడంగల్‌ నియోజకవర్గ కేంద్రంలో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాబందుల ప్రభుత్వం కావాలో.. ‘రైతు బంధు’ప్రభుత్వం కావాలో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు.

నాణ్యమైన కరెంటు పగటి పూట ఇవ్వాలని అడిగిన రైతులను కాల్చి చంపిన కాంగ్రెస్‌ను గెలిపించి మోసపోవద్దని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తే సంక్షేమమని, మహాకూటమి గెలిస్తే సంక్షోభమని అన్నారు. కాంగ్రెస్‌లో 40 మంది సీఎం అభ్యర్థులున్నారని, వారంతా కలిసి 60 నెలలు పాలిస్తారని ఎద్దేవాచేశారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తే కేసీఆర్‌ సీఎం అని, కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగల రా అంటూ ప్రశ్నించారు. జిల్లాకు నలుగురు సీఎం అభ్యర్థులున్నారని, వీరిలో రేవంత్‌రెడ్డి, డీకే.అరుణ, చిన్నారెడ్డిలున్నారని తెలిపారు.

కాంగ్రెస్‌ గెలిస్తే టికెట్ల కోసం, బీ ఫాంలకోసం, చివరకు బాత్‌రూంకు వెళ్లాలన్నా అనుమతికి ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుం దని తెలిపారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తే సొంత స్థలంలో ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం, పింఛన్ల పెంపు, పింఛన్‌కు అర్హత వయసు 57 ఏళ్లు, నిరుద్యోగ భృతి, రూ.లక్షలోపు రైతు రుణమాఫీ, ఉద్యోగాల కల్పన వేగవంతం, తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. దేశంలోని సీఎంలు నేర్చుకునేలా కేసీఆర్‌ పాలన ఉందని తెలిపారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటా
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మరి ‘మహా కూటమి’ ఓడిపోతే రాజకీయాల నుంచి నిష్క్రమించడానికి రేవంత్‌ సిద్ధమేనా అని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. ఆయన చేతలమనిషైతే  సవాల్‌ను స్వీకరించాలన్నారు. టీవీల ముందు కూర్చుని మాటలు చెప్పి, పోజులు కొడితే పనులు కావని, అభివృద్ధి కావాలంటే చిత్తశుద్ధి ఉండాలన్నారు. మహాకూటమి గెలిస్తే మన జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంటుందన్నారు. ఈ ప్రాంతానికి పాలమూరు నీరు రాకుండా 30 ఉత్తరాలు రాసిన బాబును మనం గెలిపిద్దామా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని తిడితే పెద్దవాళ్లు అయిపోతారా అని ప్రశ్నించారు. ఆయనకు దమ్ముంటే నరేందర్‌రెడ్డిపై గెలిచి చూపించాలన్నారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, హైదరాబాద్‌ మేయర్‌ దొంతు రామ్మోహన్, రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్‌ పాల్గొన్నారు.


బుధవారం కొడంగల్‌ రోడ్‌షోకు భారీగా హాజరైన జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement