
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. లగచర్ల కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయనతో సహా మరో 24 మంది నిందితులకు బెయిల్ లభించింది.
లగచర్ల కేసులో నిందితులు దాదాపు నెలకు పైగానే జైల్లో ఉన్నారు. మరోవైపు మూడు నెలలపాటు ప్రతీ బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. పట్నంకు రూ.50వేల షూరిటీ, అలాగే మిగతా వాళ్లకు రూ.20వేలతో రెండు షూరిటీలు సమర్పించాలని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.
నవంబర్ 11వ తేదీన వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై దాడి జరిగింది. ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం జిల్లా కలెక్టర్ సహా ఇతర అధికారులు వచ్చిన సమయంలో కొందరు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పలువురు గ్రామస్తులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో.. ఆయన్ని హైదరాబాద్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.