కేవలం నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసినట్లు వెల్లడి
ట్రయల్ కోర్టు రిమాండ్ ఉత్తర్వులను కొట్టేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి
తానెలాంటి నేరాంగీకార ప్రకటన ఇవ్వలేదని కొడంగల్ కోర్టుకు అఫిడవిట్
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, జిల్లా అధికారులపై దాడి ఘటనలో తన ప్రమేయం లేదని, రాజకీయ ప్రేరేపణతో తనపై కేసు నమోదు చేశారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురు వారం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆధారాలు లేకుండా తనపై నమోదు చేసిన కేసును, వికారాబాద్ జిల్లా కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ‘బొమ్రాస్‌పేట్ స్టేషన్‌లో నమోదైన కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు.
కేవలం నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే నన్ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు కనీసం కారణాలను వెల్లడించలేదు. న్యాయవాదితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. పోలీసులు తూతూ మంత్రంగా దాఖలు చేసిన రిమాండ్ డైరీని ట్రయల్ కోర్టు ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసింది. టీఐఐసీ కోసం భూమి కోల్పోయే బాధితులే అధికారులపై దాడి చేశారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా, దురుద్దేశంతో, రాజకీయ కారణాలతో నమోదు చేసిన కేసులో విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలి..’అని నరేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ ఈనెల 18న విచారణకు వచ్చే అవకాశం ఉంది.
పోలీసులు కట్టుకథ అల్లారు
కలెక్టర్, జిల్లా అధికారులపై దాడి ఘటనలో తన పాత్ర ఉందంటూ పోలీసులు కట్టు కథ అల్లారని నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశాలతో రైతులను దాడులకు పురికొల్పినట్లుగా తాను నేరాంగీకార ప్రకటన ఇచ్చానని పోలీసులు చెబుతున్నట్లు తెలిసిందన్నారు. చర్లపల్లి జైల్లో ఉన్న నరేందర్‌రెడ్డి.. ఈ మేరకు గురువారం తన న్యాయవాదుల ద్వారా కొడంగల్ కోర్టును ఉద్దేశించి అఫిడవిట్ పంపించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న తనను పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బలవంతంగా వికారాబాద్ పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకెళ్లి నిర్బంధించినట్లు తెలిపారు.
ఆ తర్వాత పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకుని కోర్టుకు తీసుకెళ్లారన్నారు. కోర్టులో ప్రవేశ పెట్టిన తర్వాత లగచర్ల ఘటనలో తాను ప్రథమ ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం ఇచ్చినట్లు వివరించారు. తన అరెస్టు విషయంలో పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, అరెస్టు సమాచారాన్ని కనీసం తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఇవ్వలేదని తెలిపారు. తాను అఫిడవిట్‌లో పేర్కొన్న వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని సరైన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
బెయిల్ కోసం జిల్లా కోర్టులో పిటిషన్
అనంతగిరి: లగచర్ల ఘటనలో అరెస్టు అయిన తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నరేందర్‌రెడ్డి గురువారం వికారాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నరేందర్‌రెడ్డి తరఫున బీఆర్‌ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు పిటిషన్ వేశారు. దీనిపై ఈ నెల 18న విచారణ జరుగుతుందని న్యాయవాది శుభప్రద్ పటేల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment