కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌ | BRS Ex-MLA Patnam Narender Reddy Arrest At KBR Park | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌

Published Wed, Nov 13 2024 7:54 AM | Last Updated on Wed, Nov 13 2024 8:09 PM

BRS Ex-MLA Patnam Narender Reddy Arrest At KBR Park

Updates..

👉కొడంగల్‌ దాడుల కేసులో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం, పట్నం నరేందర్‌ రెడ్డిని వికారాబాద్‌లోని డీటీసీ సెంటర్‌లో ఉంచారు. అక్కడి నుంచే ఆయనను నేరుగా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. డీటీసీ సెంటర్‌కే వైద్యులను పిలిపించి అక్కడే నరేందర్‌ రెడ్డికి వైద్య పరీక్షలు చేయించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

👉మరోవైపు.. నరేందర్‌ రెడ్డి ఇంటికి సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్‌ రెడ్డి భార్య, కుటుంబ సభ్యులను సబిత పరామర్శించారు. 

👉తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈరోజు ఉదయం కేబీఆర్‌ పార్క్‌లో వాకింగ్‌ చేస్తుండగా నరేందర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయడం గమనార్హం.

👉తెలంగాణలోని వికారాబాద్‌ ఘటనలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం తెల్లవారుజామున ఆయన మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, అధికారులపై దాడికి సూత్రధారిగా అనుమానిస్తున్న బీఆర్‌ఎస్‌ నేత సురేష్‌తో నరేందర్‌ రెడ్డి పలుమార్లు ఫోన్‌ కాల్స్‌ మాట్లాడినట్టు పోలీసులు చెబుతున్నారు. కాల్‌ డేటా ఆధారంగానే పట్నం నరేందర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. అలాగే, నరేందర్‌ రెడ్డి ఫోన్‌ కాల్‌ డేటా, సంభాషణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్‌ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో ఇప్పటికే 55 మందిని  పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరికి బీఆర్‌ఎస్‌కు చెందిన నేతలు కూడా ఉన్నారు. దీంతో, కాంగ్రెస్‌ తీరును బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. 

👉వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటుకు స్థల సేకరణ కోసం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఫార్మాసిటీకి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేని గ్రామస్థులు.. కలెక్టర్ సహా అధికారులపై కర్రలు, రాళ్లతో దాడిచేశారు. ఈ దాడి నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్ తప్పించుకున్నారు. కలెక్టర్, అధికారుల కార్లను రైతులు ధ్వంసం చేశారు.

👉ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పట్టుకుని కర్రలు, రాళ్లతో దాడిచేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వారి నుంచి తప్పించుకున్న వెంకట్‌రెడ్డి పొలాల వెంట పరుగులు పెట్టారు. ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిపైనా రైతులు దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో దాడికి పాల్పడిన 55 మందిని గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement