సాక్షి, హైదరాబాద్: తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అంటూ చర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్‌రెడ్డి లేఖ రాశారు. లగచర్ల దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌పై ఆయన స్పందిస్తూ.. కేటీఆర్ గురించి పోలీసులకు నేనేమీ చెప్పలేదు. పోలీసులు నా గురించి ఎలాంటి స్టేట్‌మెంట్ తీసుకోలేదు, నేను ఎవరి పేరు చెప్పలేదు. చెప్పనిది చెప్పినట్లు రాశారు’’ అంటూ లేఖలో పేర్కొన్నారు.
నిన్న రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు చేర్చిన పోలీసులు.. దాడి వెనుక కేటీఆర్ ఉన్నట్లు నరేందర్‌రెడ్డి అంగీకరించాడంటూ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కాగా, బెయిల్ కోరుతూ వికారాబాద్ కోర్టులో పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, నరేందర్‌రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఏడు రోజులు కస్టడీకి ఇవాలని పోలీసులు కోరారు.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనలో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు ఈ కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. హైదరాబాద్‌లో నాటకీయంగా అరెస్టు చేసిన నరేందర్‌రెడ్డిని కోర్టులో హాజరుపరచడం, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడం, పోలీసులు ఆయన్ను జైలుకు తరలించడం చకచకా జరిగిపోయాయి.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పేరును నరేందర్‌రెడ్డి ప్రస్తావించారంటూ రిమాండ్ రిపోర్టులో పేర్కొనడంలో కలకలం రేపింది. నరేందర్‌రెడ్డిని కేటీఆర్ స్వయంగా ప్రోత్సహించినట్లుగా దర్యాప్తులో వెల్లడైందని... ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. లగచర్లలో దాడి చేసినట్లుగా గుర్తించిన 46 మందిలో 19 మందికి భూములు లేవని తేలిందని ఐజీ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: ‘సెగ’చర్ల.. నరేందర్‌రెడ్డి అరెస్టు.. టార్గెట్ కేటీఆర్?
Comments
Please login to add a commentAdd a comment