
కొడంగల్: కొడంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని, ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నరేందర్‌రెడ్డి ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీ చేస్తే కోట్ల రూపాయలు బయటపడ్డాయన్నారు. కోస్గి మండలం మీర్జాపూర్‌లో పట్నం నరేందర్‌రెడ్డి నివాసం ఉంటున్న బంగ్లాలో ఐటీ అధికారుల దాడులు జరిగాయని, ఆ సమయంలో నరేందర్‌రెడ్డి కుటుంబసభ్యులు, ఆయన బావమరిది శ్రీధర్‌రెడ్డి ఉన్నట్లు చెప్పారు. అక్కడ రూ.51 లక్షలు సీజ్ చేసినట్లు ఐటీ అధికారులు ప్రకటించినట్లు చెప్పారు.
వాస్తవానికి రూ.17.51 కోట్లు దొరికినట్లు చెప్పారు. నగదు తో పాటు అక్కడ దొరికిన పత్రాల్లో ఎవరికి ఎంత మొత్తం ఇచ్చిన వివరాలు ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని 26 గ్రామాలకు మద్యం సరఫరా చేసిన వివరాలు ఉన్నట్లు తెలిపారు. కోస్గి మండల నాయకులకు రూ.60 లక్షలు, బొంరాస్‌పేట మండల నాయకులకు రూ.40 లక్షలు ఇచ్చినట్లు డైరీలో రాసి ఉందన్నారు. మొత్తం రూ.4.46 కోట్లకు సంబంధించిన లెక్కల ఆధారాలు ఉన్నట్లు వివరించారు. ఏ రకంగా చూసినా ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఖర్చు రూ.28లక్షల లోపు ఉండాలన్నారు. మద్యం సరఫరా చేశారని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని ఎన్నికల కమిషన్ ఎందుకు అనర్హుడిగా ప్రకటించట్లేదో అర్థం కావట్లేదన్నారు. ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటే కొడంగల్ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment