సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షల మార్కులపై తనిఖీలకు విద్యాశాఖ రంగంలోకి దిగింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల అంతర్గత మార్కుల నమోదుపై ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్‌లోని ప్రతి మండల పరిధిలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
ఈ బృందాలు టెన్త్ ఇంటర్నల్ మార్కుల నమోదు తీరును పరిశీలించి ఉన్నత కమిటీకి నివేదిక సమర్పించనున్నాయి. ఆ తర్వాతే ఇంటర్నల్ మార్కులను ఎస్సెస్సీ బోర్డు వెబ్‌సైట్‌లో నమోదుకు వెసులుబాటు ఉంటుంది. ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థులకు ఫార్మేటివ్ టెస్టులు నిర్వహించడంతో పాటు ప్రాజెక్టులు, రికార్డులను పరిశీలించి ఆయా సబ్జెకుల ఉపాధ్యాయులు మార్కులు నమోదు చేసిన విషయం విదితమే.
మూడు రోజుల పాటు..
మహానగర పరిధిలో పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్, ప్రాజెక్టుల మార్కుల నమోదు పరిశీలన మూడురోజుల పాటు జరగనుంది. డీఈఓల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు మండలాల వారీగా రంగంలో దిగి క్షేత్రస్థాయి పరిశీలనకు శ్రీకారం చుట్టాయి. కరోనా ప్రభావంతో అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు రెండు ఎఫ్‌ఏ టెస్టులు మాత్రమే నిర్వహించారు. వీటితో పాటు ప్రాజెక్టులు, ఇతర రికార్డులను సైతం ప్రత్యేక బృందాలు పర్యవేక్షించనున్నాయి. ప్రతి ఎఫ్‌ఏ టెస్టుకు 5 మార్కుల చొప్పున నాలుగు టెస్టులకు 20 మార్కులు కేటాయించాల్సి ఉంటుంది. ప్రాజెక్టులకు ప్రత్యేక మార్కులు ఉంటాయి. రెండు ఎఫ్‌ఏ టెస్టులు మాత్రమే నిర్వహించిన కారణంగా మొత్తం మార్కులను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆ తర్వాత జిల్లా పరీక్షల విభాగం ఆమోదంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మార్కులను ఎస్సెస్సీ బోర్డుకు అందజేయాల్సి ఉంటుంది.
ప్రైవేటు దూమారం
ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు అశాస్త్రీయంగా అంతర్గత మార్కులు వేశాయనే ఆరోపణల దుమారం రేగింది. స్కూల్ పరిధిలో నిర్వహించిన ఫార్మేటివ్ టెస్ట్‌లో విద్యార్థికి అతితక్కువ మార్కులు వచ్చినా, ప్రాజెక్టు వర్కే చేయకపోయినా గరిష్ట మార్కులు వేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిని తప్పుబట్టిన విద్యాశాఖ వాస్తవ పరిస్థితి కోసం ప్రైవేటుతోపాటు ప్రభుత్వ స్కూళ్లలోనూ సైతం క్షేత్రస్థాయి విచారణ బృందాలను రంగంలోకి దింపింది. (క్లిక్: బస్తీ బడి.. దాతల ఒడి)
అంతర్గత మార్కులు ఇలా..
ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో ప్రతి పేపర్ 80 మార్కులకు ఉంటుంది. మరో 20 మార్కులను తరగతి గదిలో ఆయా సబ్జెక్టుల వారీగా కనబరిచే ప్రతిభ ఆధారంగా ఇంటర్నల్‌గా కేటాయిస్తారు. సరిగా నాలుగేళ్ల క్రితం కంటిన్యూస్ అండ్ కాంప్రెహెన్సివ్ ఇవాల్యుయేషన్ (సీసీఈ) విధానంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఆయా స్కూళ్లు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ) పేరిట ప్రతి విద్యార్థి చేసే ప్రాజెక్టు వర్క్, స్కూల్‌లో నిర్వహించే స్లిప్ టెస్ట్ ప్రకారం మార్కులు కేటాయిస్తూ వస్తున్నాయి. ఇలా కేటాయిస్తున్న మార్కులను ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ఆన్‌లైన్ ద్వారా టెన్త్ పరీక్షల విభాగానికి డీఈవోల ద్వారా పంపాల్సి ఉంటుంది. కాగా.. ఇవేవీ నిర్వహించకుండానే ప్రైవేటు స్కూళ్లు ఇష్టానుసారం గరిష్టంగా మార్కులు వేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. (క్లిక్: సెల్ ఫోన్ డ్రైవింగ్ వీకెండ్‌లోనే ఎక్కువ.. ఎందుకంటే!)
Comments
Please login to add a commentAdd a comment