మాస్ కాపీయింగ్‌పై చర్యలేవి?
► తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను నిలదీసిన హైకోర్టు
► 4 వారాల్లో పూర్తి వివరాలతో అఫిడవిట్ల దాఖలుకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన, అందుకు సహకరించిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎంత మందిపై కేసులు నమోదు చేశారు, ఎంత మందిని ప్రాసిక్యూట్ చేశారు, ఎంత మందికి శిక్ష పడింది.. తదితర పూర్తి వివరాలు తమకు అందజేయాలని ఆదేశించింది. ఎన్ని విద్యా సంస్థల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందు తర్వాత పరీక్షల ఫలితాలు ఎలా ఉన్నయనే వివరాలను కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. గడువులోగా అఫిడవిట్లు దాఖలు చేయని పక్షంలో విద్యాశాఖల ముఖ్య కార్యదర్శులు కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అధికారులు పట్టించుకోవడం లేదు
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు మాస్ కాపీయింగ్, పుస్తకాలు చూసుకుంటూ పరీక్షలు రాయడాన్ని అడ్డుకోవడంలో విఫలమవుతున్నారని... దీనిని అడ్డుకునేందుకు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశించాలని కోరుతూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ గుంటుపల్లి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం ఆ వ్యాజ్యంపై మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఇప్పుడు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, టీచర్లకు మార్కులే పరమావధి అయిపోయింది. సబ్జెక్ట్ నేర్చుకునే విషయం పక్కకు వెళ్లిపోయింది. బీహార్ ఉదంతంలో టాప్ ర్యాంకర్లు చివరికి ఎలా మిగిలారో అందరూ చూశారు. ఎంసెట్ లీకేజీనీ చూశాం. లక్షల రూపాయలు చేతులు మారాయి.
ఇటువంటి అనైతిక చర్యల వల్ల విద్యా వ్యవస్థ నాశనమైపోతోందని..’’ అని వ్యాఖ్యానించింది. అనంతరం నిరంజన్‌రెడ్డి వాదన వినిపిస్తూ.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ కార్యక్రమాలకు కోట్లు ఖర్చు చేస్తున్నాయని, సీసీ కెమెరాల ఏర్పాటుకు మాత్రం డబ్బు లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ స్పందిస్తూ.. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రభుత్వం వెనక్కి వెళ్లడం లేదని, వాటి కోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని అంచనా కూడా వేశామని కోర్టుకు తెలిపారు.
వాదనలు విన్న అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. తమ ఉత్తర్వుల కోసం ఎదురుచూడటం ఎందుకని, సీసీ కెమెరాలు పెట్టాలనుకుంటే పెట్టేయాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. అందరికీ కావాల్సింది విద్యార్థుల భవిష్యత్తేనని.. తెలంగాణ చేస్తున్నప్పుడు ఏపీ ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. ఇప్పటివరకు మాస్ కాపీయింగ్ వ్యవహారంలో తీసుకున్న మొత్తం చర్యలను వివరిస్తూ నాలుగు వారాల్లోగా అఫిడవిట్ సమర్పించాలని ఇరు రాష్ట్రాలను ధర్మాసనం ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.