public exam
-
పరీక్షలకు భయపడి పాఠశాలకు రాని లక్షమంది విద్యార్థులు.. ఎక్కడంటే!
కొరుక్కుపేట(చెన్నై): పబ్లిక్ పరీక్షలకు భయపడి దాదాపు లక్ష మంది 10వ తరగతి విద్యార్థులు పాఠశాలలకు రాకుండా నిలిచిపోయారు. ప్రసుత్త విద్యా సంవత్సరంలో లక్షమందికి పైగా విద్యార్థులు పాఠశాలలకు రావడం మానేసినట్లు వెల్లడైంది. తమిళనాడు వ్యాప్తంగా జిల్లాల వారీగా నిర్వహించిన సర్వేలో ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఈనేపథ్యంలో ఆ విద్యార్థులను పబ్లిక పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. గైర్హాజరైన విద్యార్థుల పేర్లు, వివరాలు సేకరించి పరీక్షకు తీసుకురావాలని, ఆ బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదేనని తేల్చింది. -
తగ్గేదేలే.. 58 ఏళ్ల వయసులో పదో తరగతి పరీక్ష రాసిన ఎమ్మెల్యే
భువనేశ్వర్: ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూ పొలం పనుల్లో చురుగ్గా పాల్గొంటున్న ఫుల్బణి ఎమ్మెల్యే అంగద కన్హర్(58) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. విద్యార్థులతో కలిసి మెట్రిక్యులేషన్ పరీక్షలు రాయడం రాష్ట్రవ్యాప్తంగా ట్రెండింగ్ మారింది. కందమాల్ జిల్లా ఫుల్బాణి మండలం పితాబరి గ్రామంలోని రుజంగి ఉన్నత పాఠశాల కేంద్రంలో ఆయన పరీక్షకు హాజరయ్యారు. 1978లో అర్ధాంతరంగా విద్యాభ్యాసం ముగించిన ఆయన.. ఇన్నాళ్లకు పునఃప్రారంభించడం విశేషం. కుటుంబ పరిస్థితులతో అప్పట్లో చదువు కొనసాగించలేక పోయానని, 50 ఏళ్లు పైబడిన వారు కూడా మెట్రిక్యులేషన్ పరీక్షలు రాసి, ఉత్తీర్ణులైనట్లు ఇటీవల వార్తల్లో విన్నానని తెలిపారు. ఉన్నత అభ్యాసానాకి వయస్సు అడ్డు కాదన్నారు. ఇదే ఉత్సాహంతో పరీక్షలకు హాజరైనట్లు ఎమ్మెల్యే వివరించారు. స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎస్‌ఐఓఎస్) వర్గం కింద ఈ ఏడాది 63మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్లు కేంద్రం పరిశీలకురాలు, హెచ్ఎం అర్చనా బాస్ వెల్లడించారు. ఇందులో ఎమ్మల్యే అంగద తోపాటు లుయిసింగి పంచాయతీ సర్పంచ్ సుదర్శన్ కంహర్ కూడా ఉన్నారని ప్రకటించారు. 1985లో క్రీయాశీల రాజకీయాల్లో ప్రవేశించిన అంగద కన్హర్.. వరుసగా 3సార్లు కెరండిబాలి పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందారు. మరో సారి పొకారి పంచాయతీ నుంచి ఎన్నికయ్యా రు. పంచాయతీరాజ్ వ్యవస్థలో అంచెలంచెలుగా ఎదిగారు. ఫిరింగియా మండల అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ సభ్యుడిగా ప్రజాభిమానాన్ని సంపాదించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం ఫుల్బాణి నుంచి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేసి, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా కారణంగా పరీక్షలు జరగక పోవడంతో రాయలేక పోయానని చెప్పిన ఎమ్మెల్యే.. శుక్రవారం సాధారణ విద్యార్థిగా ప్రవేశ ద్వారం వద్ద హాల్ టికెట్ చూపించి, కేంద్రంలోకి ప్రవేశించారు. మరో ఇద్దరు మిత్రులతో కలిసి పరీక్షకు రాగా.. వీరిలో ఒకరు స్థానిక సర్పంచ్ కావడం గమనార్హం. చదవండి: King Cobra: కిచెన్‌లోకి వెళ్లిన భార్య ఒక్కసారిగా భయంతో.. -
10th Class Exams: టెన్త్‌లో ఈ ఏడాదీ 7 పేపర్లే..
సాక్షి, అమరావతి: వచ్చే మార్చిలో జరగనున్న 2021–22 విద్యాసంవత్సరపు పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 11 పేపర్లకు బదులు 7 పేపర్లలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం జీవో నంబర్ 79ను విడుదల చేశారు. కోవిడ్ కారణంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఈ ఏడాది కూడా ఏడు పేపర్లకు కుదిస్తున్నట్లు పేర్కొన్నారు. 2021–22 విద్యాసంవత్సరంలో టెన్త్ పరీక్షలకు 6 లక్షల మందికి పైగా హాజరుకానున్నారు. కరోనా ఉధృతి కారణంగా 2019–20, 2020–21లో టెన్త్ పబ్లిక్ పరీక్షలను 11 పేపర్లకు బదులు ఏడింటికి కుదించిన సంగతి తెలిసిందే. అయినా పరీక్షలను నిర్వహించలేకపోయారు. 2019–20 విద్యాసంవత్సరంలో విద్యార్థులను ఆల్‌పాస్‌గా ప్రకటించి మార్కులు, గ్రేడ్లు లేకుండా ధ్రువపత్రాలు ఇచ్చారు. దీనివల్ల విద్యార్థులు ఆపై తరగతుల్లో చేరేందుకు, కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు సమస్యలు ఎదుర్కొన్నారు. 2020–21లో కూడా టెన్త్ పరీక్షలను నిర్వహించలేక విద్యార్థులను ఆల్‌పాస్‌గా పేర్కొన్నప్పటికీ.. వారి పైచదువులకు, ఉద్యోగాలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు వారి అంతర్గత మార్కులను అనుసరించి గ్రేడ్లు ప్రకటించారు. రిటైర్డ్ ఐఏఎస్ ఛాయారతన్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు టెన్త్, ఇంటర్ విద్యార్థులకు వారి అంతకు ముందరి తరగతుల్లోని అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించారు. 2020లో 6,37,354 మంది, 2021లో 6,26,981 మంది టెన్త్ విద్యార్థులకు ఇలా అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. -
ప్రణాళిక ఫలించేనా?
కర్నూలు సిటీ/ఆదోని అర్బన్: విద్యార్థులకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కీలకమైనవి. వీటిని గట్టెక్కేందుకు తీవ్రస్థాయిలో కష్టపడతారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులపై కూడా ఒత్తిడి ఉంటుంది. విద్యాశాఖ కూడా ఇందుకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాల్సి ఉంది. అయితే విద్యాశాఖ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈ విద్యా సంవత్సరం ఆశించిన మేరకు ఫలితం వస్తుందా..లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, ఏపీ ఆదర్శ స్కూల్స్, కస్తూర్బా స్కూళ్లతో పాటు రెసిడెన్షియల్ స్కూళ్లకు చెందిన విద్యార్థులు 34,576 మంది, ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన 17,885 మంది... మొత్తంగా 52,461 మంది విద్యార్థులు 2019 మార్చి 18 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. ఇందుకు మరో 79రోజులు మాత్రమే గడువు ఉంది. పది ఫలితాల్లో గత ఏడాది జిల్లా 96.12 శాతం ఉత్తీర్ణత సాధించి.. రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. దీంతో ఈ ఏడాది ఈ ప్రాంతంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇవీ అడ్డంకులు.. ♦ ఇప్పటికే బోధన ప్రక్రియను పూర్తి చేసి ప్రత్యేక తరగతుల ద్వారా పరీక్షలకు సన్నద్ధం చేయాల్సి ఉంది. అయితే పాఠ్యాంశాల బోధనే నత్తనడకన సాగుతోంది. ♦ భాషోపాధ్యాయులు డిమాండ్ల పరిష్కారం కోసం 20 రోజులు సమ్మెబాట పట్టారు. దీంతో విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల బోధన కరువైంది. ♦ కొన్ని పాఠశాలల్లో ప్రధాన సబ్జెక్టులకు కూడా ఉపాధ్యాయులు లేరు. దీనికి తోడు ప్రత్యేక తరగతుల శిక్షణ కానరావడం లేదు. ♦ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం చాలీచాలని పుస్తకాలు అందించింది. పదో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఒకరికి ఇస్తే ఇంకొరికి ఇవ్వలేదు. చాలా చోట్ల పూర్తిస్థాయిలో పుస్తకాలు పంపిణీ చేయలేదు. ♦ వెనకబడిన విద్యార్థులకు పది పరీక్షలో మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు ప్రభుత్వం కరదీపికలకు ఇస్తోంది. అయితే ప్రతి పాఠశాలకు ఒక పుస్తకాన్ని అందస్తోంది. ప్రతి విద్యార్థికి అందజేస్తే ఉపయుక్తంగా ఉంటుంది. ♦ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఈ ఏడాది వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్ని పాఠ్య పుస్తకాలు లేవు కొన్ని పాఠ్యపుస్తకాలు లేనందున చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాను. కరదీపిక పుస్తకాలు కూడా ఇవ్వలేదు. పాఠశాలకు ఒకటే ఇచ్చారు. ఎలా చదువుకోవాలి. పరీక్షలు దగ్గరకు వచ్చాయి. ఒత్తిడి పెరుగుతోంది. –రుచిత, పదో తరగతి విద్యార్థిని ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదు పదో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించి మెరుగైన బోధన ఇవ్వడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ప్రజాప్రతినిధులు కూడా రానున్న ఎన్నికలపైనే ప్రధాన దృష్టి సారిస్తున్నారే కాని విద్యార్థుల చదువుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి తోడు విద్యాశాఖ కూడా ముందస్తు ప్రణాళికతో విద్యార్థులను సన్నద్ధం చేయడంలో పూర్తిగా వెనకబడింది.–నాగరాజు, ఏబీవీపీ నాయకుడు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పదో తరగతిలో ఈ ఏడాది 100 శాతం ఫలితాలు సాధించడంకోసం 90 రోజుల ప్రత్యేక ప్రణాళికను తయారు చేశాం. ప్రతి సబ్జెక్టులో కూడా విద్యార్థులకు సులువైన విధానంలో భోధన చేసేందుకు టీచర్లకు శిక్షణ ఇచ్చాం. ముందుగా ఈ ఏడాది స్టడీ మెటిరియల్‌ను విద్యార్థులకు అందజేశాం. కరువుతో వలస వెళ్లిన వారికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసి చదువు చెప్పిస్తున్నాం. వచ్చే నెల 2వ తేదీ నుంచి రివిజన్ టెస్ట్‌లు మొదలు కానున్నాయి.–తాహెరా సుల్తానా, డీఈఓ -
పరీక్షల బెంగతో విద్యార్థి ఆత్మహత్య
పీలేరు : మండలంలోని తలపుల పంచాయతీ జంగంపల్లెలో చెరువులో దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. జంగంపల్లెకు చెందిన జి.ఎం.కృష్ణయ్య, రేణుక దంపతుల పెద్ద కొడుకు భానుప్రకాష్ (15) తలపుల హాస్టల్లో ఉంటూ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. ఎంత చదివినా పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తున్నాయని నెల రోజులుగా మథనపడే వాడు. మరింత కష్టపడితే పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని తల్లిదండ్రులు ధైర్యం చెప్పేవారు. మంగళవారం సాయంత్రం పాఠశాలలో సంకల్పం కార్యక్రమంలో భాగంగా సోషియల్ పరీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో భానుప్రకాష్తోపాటు అతని స్నేíßహితుడు బిట్లను చూసి రాసినట్టు గుర్తించిన ఉపాధ్యాయుడు ఇద్దరినీ మందలించారు. ఇలా చేయడం వల్ల పబ్లిక్ పరీక్షల్లో పట్టుబడితే డిబార్ అవుతారని హెచ్చరించారు. మరింత కష్టపడితే మంచి మార్కులు వస్తాయని వివరించారు. ఈ విషయాన్ని భానుప్రకాష్ తండ్రి కృష్ణయ్యకు ఉపాధ్యాయుడు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. మార్కులు తక్కువ వస్తున్నాయని.. ఎంత చదివినా పాఠ్యాంశాలు గుర్తుండకపోవడం, మార్కులు తక్కువగా వస్తుండడంతో ఆవేదన చెం దాడు. స్కూల్ నుంచి హాస్టల్‌కు వెళ్లిన భానుప్రకాష్ హాస్టల్లో పుస్తకాల బ్యాగు పెట్టి ఎక్కడికో వెళ్లి పోయాడు. భానుప్రకాష్ కనిపించడం లేదన్న విషయాన్ని హాస్టల్ ఇన్చార్జి వార్డెన్‌కు పిల్లలు తెలి పారు. ఆందోళనకు గురైన వార్డెన్ వెంటనే విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిసర గ్రామాలు, బంధువుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ లేదు. బుధవారం సాయంత్రం హాస్టల్ సమీపంలోని గోవిందరెడ్డి చెరువులో విద్యార్థి మృతదేహం తేలడాన్ని స్థానికులు గుర్తించారు. విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులు, బంధువులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పీలేరు ఎస్ఐ సుధాకర్‌రెడ్డి విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి మృతిపై తలపుల హెచ్ఎం బాబురెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కష్టపడి చదివి ఉద్దరిస్తాడనుకున్న కొడుకు అకాలమరణంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. -
కన్నీటి పరీక్ష
పర్చూరు: చిన్నతనం నుంచి కష్టపడి చదివిస్తున్న తండ్రి పార్దివ దేహం ఓ వైపు.. ఏడాదంతా కష్టపడి.. ఇష్టపడి చదువుకున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మరో వైపు! చనిపోయిన తండ్రి తిరిగిరాడు.. పరీక్షకు వెళ్లకుంటే ఈ అకాశం మళ్లీరాదు. ఏం చేయాలి? అనే సంఘర్షణ ఆ విద్యార్థి మనసును కలచి వేసింది. తన భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్న విద్యార్థికి కాలం కన్నీటి పరీక్ష పెట్టింది. చివరికు తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలని బాగా పరీక్షలు రాసి ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని నిర్ణయం తీసుకున్నాడు ఆ విద్యార్థి. బాగా చదువుకో మంచి భవిష్యత్ ఉంటుంది అని చెప్పే తండ్రి లేడని తెలిసి కన్నీరు మున్నీరయ్యాడు. దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు హాజరయ్యాడు. యద్దనపూడి మండలం గర్లమూడి గ్రామానికి చెందిన గుంజి వెంకటరావు (50) గుండెపోటు రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బుధవారం ఆపరేషన్ చేశారు. గురువారం వేకువజామున 2 గంటలకు మరణిం చాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు గుంజి సాయికుమార్ జాగర్లమూడి అడ్డగడ సుబ్బారావు హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. సంవత్సరం అంతా కష్టపడి చదివిని సాయికుమార్ ఇప్పటీకే తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పరీక్షలు రాశాడు. గురువారం రాయాల్సిన గణితం పేపరు–1 పరీక్ష కోసం సాధన చేసుకుంటున్నాడు. విజయవాడలో ప్రయివేటు ఆసుపత్రిలో సర్జరీ చేసిన అనంతరం తండ్రి వెంకటరావు మరణించాడనే విషయం తెలిసి, ఆ చిన్న హృదయంలో విషాదం నెలకొంది. నాన్న గుండె ఆగిందని.. తల్లడిల్లాడు.. తీరని శోకాన్ని... ఆగని వేదనని. పంటి బిగువున భరించి అసలైన కఠిన పరీక్షకు హాజరయ్యాడు. పేద కుటుంబానికి చెందిన సాయికుమార్ బాగా కష్టపడి చదువుతాడని తెలిపిన పాఠశాల ఉపాధ్యాయులు గురువారం అతడిని వెంటబెట్టుకుని పరీక్ష హాలుకు తీసుకెళ్లారు. -
ఒకరికి బదులు ఒకరు రాస్తూ..
హైదరాబాద్‌సిటీ: ఒకరికి బదులుగా ఒకరు పరీక్ష రాస్తూ స్వ్కాడ్ చేతికి చిక్కారు. ఈ ఘటన చాంద్రాయణ గుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బార్కాస్ సలాల హైస్కూల్లో జరిగింది. సొహైల్ అనే విద్యార్థికి బదులుగా షరీఫ్ అనే విద్యార్థి పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. ఇది పదవ తరగతి గణిత పరీక్షకు హాజరైన స్క్వాడ్ తనిఖీలో బయటపడింది. షరీఫ్ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. -
పంచతంత్రం.. ఫలితం అద్భుతం
టెన్త్ విద్యార్థులకు 40 రోజుల ప్రణాళిక నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యం ఏలూరు సిటీ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ’పశ్చిమ’ అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ 40 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ విద్యాసంవత్సరంలో జిల్లా విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచేందుకు ’పంచతంత్రం’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు జిల్లాలోని 30 వేల మంది ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను అందించారు. ఈ నేపథ్యంలో పంచతంత్రం పక్కాగా అమలు చేసి మంచి ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమష్టిగా కృషి చేసేందుకు సన్నద్ధమయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు ఆధ్వర్యంలో పంచతంత్రాన్ని ప్రయోగించనున్నారు. 1) విద్యార్థుల వర్గీకరణ విద్యార్థులను సమ్మెటివ్ ఎసెస్మెంట్2 పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా నాలుగు గ్రేడులుగా విభజించారు. 034 శాతం మార్కులు సాధిస్తే పశ్చిమ ఆశాజ్యోతులు, 3570 శాతం పశ్చిమ బంగారాలు, 7190 శాతం పశ్చిమ వజ్రాలు, 91100 శాతం మార్కులు సాధిస్తే పశ్చిమ ఆణిముత్యాలుగా విభజించారు. ఈ గ్రేడుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి కనీసం ఉత్తీర్ణత సాధించేలా శిక్షణ ఇస్తారు. 2) విద్యార్థుల దత్తత ఆయా పాఠశాలల్లో ప్రతి ఉపాధ్యాయుడు కనీసం 5 నుంచి 10 మంది విద్యార్థులను దత్తత తీసుకోవాలి. ప్రతి గ్రూపులోనూ అన్నివర్గాల విద్యార్థులూ ఉంటారు. సబ్జెక్టుల్లో ఫెయిలవుతున్న విద్యార్థులను ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులే దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఏఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి ఉదయం, సాయంత్రం ఒక్కో గంట సమయాన్ని కేటాయించి ప్రత్యేకంగా బోధించాలి. 3) మార్గదర్శక బృందాలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారానికి రెండుసార్లు విద్యార్థుల ఇళ్లను సందర్శించాలి. విద్యార్థి తల్లీదండ్రీతో పిల్లల ప్రగతిని చర్చించాలి. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకూ, వేకువజాము 5 గంటల నుంచి 6.30 గంటల వరకూ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి సందేహాలు నివృత్తి చేయాలి. వారానికి రెండు సార్లు ఇళ్లను సందర్శించాలి. మహిళా ఉపాధ్యాయులకు ఉదయం మినహాయింపు ఇచ్చారు. సోమవారం, గురువారంగణితం, పీఎస్, ఎన్ఎస్, మంగళవారం, శుక్రవారంఇంగ్లిష్, సోషల్, బుధవారం, శనివారంతెలుగు, హిందీ సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లను సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 4) వారాంతపు పరీక్షలు విద్యార్థులకు పంపిణీ చేసిన స్టడీ మెటీరియల్ మేరకు వారం రోజులు బోధించిన సబ్జెక్టుల్లో 25 మార్కులకు వారాంతపు పరీక్షలు నిర్వహించాలి. పంచతంత్రం వీక్లీ టెస్ట్‌లను ఆయా సబ్జెక్టు పీరియడ్స్‌లోనే నిర్వహించాలి. ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులు, ప్రగతిని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి నివేదించాలి. సోమవారంతెలుగు, మంగళవారంహిందీ, బుధవారంఇంగ్లిష్, గురువారంగణితం, శుక్రవారం సైన్సు, శనివారంసోషల్ సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించాలి. 5) స్టడీ క్యాంపులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారి నివాస గ్రామాల ఆధారంగా ఆయా గ్రామాల్లో 1015 మంది విద్యార్థుల చొప్పున స్టడీ క్యాంపు ఏర్పాటు చేస్తారు. ఆ గ్రామంలో నివాసముంటున్న ఉపాధ్యాయులను కేర్‌టేకర్‌గా నియమిస్తారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా స్టడీ క్యాంపులు నిర్వహిస్తారు. ఇవి రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు, ఉదయం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకూ ఉంటాయి. తరగతుల్లోనూ టెన్త్ విద్యార్థులకు ప్రత్యేకంగా లాంగ్ పీరియడ్స్ నిర్వహించి సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన చేస్తారు. అత్యుత్తమ ఫలితాలే లక్ష్యం జిల్లా విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. 40 రోజుల ప్రణాళిక రూపొందించాం. జిల్లాలోని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల సమష్టి కృషితో మంచి ఫలితాలు సాధించేందుకు పంచతంత్రాన్ని తయారు చేశాం. విద్యార్థి భవిష్యత్‌కు అత్యంత కీలకమైన పబ్లిక్ పరీక్షల్లో వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ ప్రోత్సహించాలని నిర్ణయించాం. డి.మధుసూదనరావు, జిల్లా విద్యాశాఖ అధికారి -
మాస్ కాపీయింగ్‌పై చర్యలేవి?
► తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను నిలదీసిన హైకోర్టు ► 4 వారాల్లో పూర్తి వివరాలతో అఫిడవిట్ల దాఖలుకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన, అందుకు సహకరించిన వారిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎంత మందిపై కేసులు నమోదు చేశారు, ఎంత మందిని ప్రాసిక్యూట్ చేశారు, ఎంత మందికి శిక్ష పడింది.. తదితర పూర్తి వివరాలు తమకు అందజేయాలని ఆదేశించింది. ఎన్ని విద్యా సంస్థల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందు తర్వాత పరీక్షల ఫలితాలు ఎలా ఉన్నయనే వివరాలను కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. గడువులోగా అఫిడవిట్లు దాఖలు చేయని పక్షంలో విద్యాశాఖల ముఖ్య కార్యదర్శులు కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు పట్టించుకోవడం లేదు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు మాస్ కాపీయింగ్, పుస్తకాలు చూసుకుంటూ పరీక్షలు రాయడాన్ని అడ్డుకోవడంలో విఫలమవుతున్నారని... దీనిని అడ్డుకునేందుకు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశించాలని కోరుతూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ గుంటుపల్లి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం ఆ వ్యాజ్యంపై మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఇప్పుడు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, టీచర్లకు మార్కులే పరమావధి అయిపోయింది. సబ్జెక్ట్ నేర్చుకునే విషయం పక్కకు వెళ్లిపోయింది. బీహార్ ఉదంతంలో టాప్ ర్యాంకర్లు చివరికి ఎలా మిగిలారో అందరూ చూశారు. ఎంసెట్ లీకేజీనీ చూశాం. లక్షల రూపాయలు చేతులు మారాయి. ఇటువంటి అనైతిక చర్యల వల్ల విద్యా వ్యవస్థ నాశనమైపోతోందని..’’ అని వ్యాఖ్యానించింది. అనంతరం నిరంజన్‌రెడ్డి వాదన వినిపిస్తూ.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ కార్యక్రమాలకు కోట్లు ఖర్చు చేస్తున్నాయని, సీసీ కెమెరాల ఏర్పాటుకు మాత్రం డబ్బు లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ స్పందిస్తూ.. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రభుత్వం వెనక్కి వెళ్లడం లేదని, వాటి కోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని అంచనా కూడా వేశామని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. తమ ఉత్తర్వుల కోసం ఎదురుచూడటం ఎందుకని, సీసీ కెమెరాలు పెట్టాలనుకుంటే పెట్టేయాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. అందరికీ కావాల్సింది విద్యార్థుల భవిష్యత్తేనని.. తెలంగాణ చేస్తున్నప్పుడు ఏపీ ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. ఇప్పటివరకు మాస్ కాపీయింగ్ వ్యవహారంలో తీసుకున్న మొత్తం చర్యలను వివరిస్తూ నాలుగు వారాల్లోగా అఫిడవిట్ సమర్పించాలని ఇరు రాష్ట్రాలను ధర్మాసనం ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది. -
శిష్యులకు పరీక్ష.. గురువులకు శిక్ష
మారిన సిలబస్, పాత పరీక్షా విధానం పదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు 40 రోజుల ఇంటెన్సివ్ కోచింగ్ కార్యక్రమాన్ని రూపొందించారు. పరీక్షలకు సన్నద్ధ తరగతులు ఏ మేరకు ఫలితాలను ఇస్తాయో అనేది తేలని పరిస్థితి నెలకొంది. విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి చేతులు దులుపుకుంది. నిర్వహణ, ప్రశ్నపత్రాల రూపకల్పన అందుకు అవసరమయ్యే నిధులు అందజేయడంలో జోగుతోంది. నెల్లూరు (విద్య): జిల్లా వ్యాప్తంగా 34,680 మంది విద్యార్థులు టెన్త పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికి ఉదయం 9.30 నుంచి 10.30 వరకు, 11.40 నుంచి 12.50 వరకు, 1.50 నుంచి 2.50 వరకు, 2.50 నుంచి 3.50 వరకు, 4.00 నుంచి సాయంత్రం 5.30 గంటలకు ప్రత్యేక రివిజన్ కార్యక్రమాన్ని సబ్జెక్టుల వారీగా రూపొందిం చారు. తెలుగుకు 16 స్టడీ అవర్స్, నాలుగు పరీక్షలు, హిందీకు 15 స్టడీ అవర్స్, 3 రివిజన్ పరీక్షలు, ఇంగ్లీష్‌కు 19 స్టడీ అవర్స్, 5 రివిజన్ పరీక్షలు, మ్యాథ్స్‌కు 23 స్టడీ అవర్స్, 6 రివిజన్ టెస్టులు, పీఎస్‌కు 12 స్టడీ అవర్స్, 3 రివిజన్ టెస్టులు, బీఎస్‌కు 12 స్టడీ అవర్స్, 3 రివిజన్ పరీక్షలు, సోషల్‌కు 17 స్టడీ అవర్స్, 5 రివిజన్ టెస్టులు ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించారు. మొత్తం 114 స్టడీ అవర్స్‌లో 29 ప్రిపరేషన్ పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలకు ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాలకు అవసరమయ్యే నిధులు మాత్రం విద్యాశాఖ విడుదల చేయలేదు. కొన్ని ప్రాంతాల్లో డబ్బులులేవని పరీక్షలు పెట్టడంలేదు. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులతో ప్రశ్నాపత్రాలకు డబ్బులు వసూలు చేస్తున్నారు. మరికొంత మంది ఉపాధ్యాయులు పరీక్షలు నిర్వహించినా వాటిని మూల్యాంకనం చేయడంలేదు. ఈ క్రమంలో సన్నద్ధ ప్రత్యేక 40 రోజుల కార్యక్రమంలో విద్యార్థి సామర్థ్యాన్ని లెక్కించే పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కొత్త పాఠ్యాంశాలను అభ్యసించారు. ఉపాధ్యాయులకు మాత్రం సమాధానపత్రాలను మూల్యాంకనం చేయడంలో కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యాసంవత్సరం ఆరంభం నుంచి ఏడు నెలల వరకు పరీక్షా విధానం ఖరారు కాలేదు. ఉపాధ్యాయులు పాత పద్ధతిలోనే మూల్యాంకనం చేశారు. నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతి ద్వారా ప్రస్తుతం 40 రోజుల ప్రత్యేక సన్నద్ధ కార్యక్రమంలో విద్యార్థులు రాసే సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ఉపాధ్యాయుల వద్దే లేకపోవడం గమనార్హం. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఉపాధ్యాయులకు పునశ్ఛరణ తరగతులు నిర్వహించకుండా సంవత్సరం చివరిలో మొక్కుబడిగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల బోధన సమయాన్ని కాస్త స్వాహా చేశారు. ఉపాధ్యాయులకే అర్థంకాని అంశాలను వారు విద్యార్థులకు ఎలా అందజేస్తారనేది ప్రశ్నార్థకం. పాఠశాలల్లో సిలబస్ పూర్తికాక ముందే పదో తరగతి విద్యార్థులకు రోజు వారి బోధన కార్యక్రమాలను రద్దు చేసి 40 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హడావిడిగా రూపొందించిన ఈ కార్యక్రమానికి ప్రశ్నాపత్రాల అంశంలో మరీ అలసత్వం వహించారు. కష్టతరమైన సబ్జెక్టును బట్టి తరగతులు, పరీక్షలు ఏర్పాటు చేశారు. కామన్ బోర్డు ద్వారా ప్రశ్నపత్రాలను ప్రింట్ చేయడానికి అవకాశంలేదు. గతంలోనే కామన్ బోర్డును రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలు నిర్వహించే బాధ్యత ప్రధానోపాధ్యాయులపై పడింది. స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ప్రశ్నాపత్రాలను ప్రధానోపాధ్యాయుల నిధుల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వివిధ పాఠశాలల్లో నెలకొన్నాయి. ప్రింటర్లు, జెరాక్స్ సెంటర్ల నుంచి ప్రశ్నాపత్రాలను కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఆర్భాటమేనా... నూటికి నూరుశాతం ఫలితాలు సాధించాలని జిల్లా ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు పదేపదే ప్రకటించడం ప్రచార ఆర్భాటమేనా అనే సందేహాలు రాకమానవు. కార్యక్రమ రూపకల్పనలో అమలు చేయడంలో క్షేత్రస్థాయిలో ఏర్పడే సమస్యలను ప్రతిభంబించకుండానే ఈ ప్రత్యేక 40 రోజుల కార్యక్రమాన్ని రూపొందించడం ప్రచార ఆర్భాటమేనని అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. గమ్యంలేని ‘మార్గదర్శిని’...? ప్రశ్నావిధానంపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన మార్గదర్శిని గమ్యంలేదని అభిప్రాయాలు ఉన్నాయి. విద్యార్థులకు ముఖ్యంగా, పేద విద్యార్థులకు పరీక్షా విధానంపై అవగాహన కలిగించేందుకు జెడ్పీ చైర్మన్ ప్రత్యేక శ్రద్ధతో అందజేసిన మార్గదర్శిని (ప్రత్యేక మెటీరియల్) ప్రయత్నం మంచిదే అయినప్పటికీ అందులో రూపొందించిన ప్రశ్నలు చాలా వరకు పాఠ్యపుస్తకాల్లో లేవు. పాఠ్యపుస్తకాల్లో లేని ప్రశ్నలకు అప్పటికప్పుడు జవాబులు రూపొందించడం ఉపాధ్యాయులకు సాధ్యంకాని పని. ఒకవేళ జవాబులు రూపొందించినా విద్యార్థులందరికీ అది చేరవేయడానికి సరిపోయినంత సమయం లేదు. ఇప్పటిదాకా నేర్చుకున్న ప్రశ్నలను రివ్వ్యూ చేయడానికి సమయం చాలని పరిస్థితిలో కొత్త ప్రశ్నలకు జవాబులు రాయడం సాధారణ విద్యార్థికి తలకు మించిన భారం అవుతుంది. మొత్తం మీద ఈ సారి పదవ తరగతి ఫలితాలు జిల్లా విద్యారంగంపై పెనుప్రభావాన్ని చూపగలవని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. ప్రణాళిక అవసరం : నిర్ధిష్టమైన టైమ్‌టేబుల్ లేనప్పుడు తక్కువ సమయంలో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకు ప్రణాళిక అవసరం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. పరీక్షలు నిర్వహించేందుకు ప్రశ్నపత్రాలకు సంబంధించి నిధుల విషయం ఆలోచించాలి. అలాగే మూల్యాంకనం విషయం ఉపాధ్యాయులకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. -మోహన్‌దాస్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఈ ఏడాది అస్తవ్యస్తం : ఈ విద్యాసంవత్సరం అస్తవ్యస్తం. ఏప్రిల్‌లో ఒక డీఈఓ సస్పెండ్ అయ్యారు. తర్వాత ఇన్చార్జ్ డీఈఓ పాఠశాలల పర్యవేక్షణను విస్మరించారు. ఇలా విద్యాసంవత్సరంలో ఎనిమిది నెలలు గడచి పోయాయి. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డీఈఓ మిగిలిన కాలంలో ఏం చేయగలరు. ఈ ప్రభావాలు విద్యార్థులపై పడకుండా ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి. -చిరంజీవి, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
నో..‘టెన్’షన్
గుంటూరు ఎడ్యుకేషన్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పాత విధానంలోనే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నూతనంగా ప్రవేశపెట్టేందుకు నిర్ణయించిన తొమ్మిది పేపర్ల విధానాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసి, వచ్చే విద్యా సంవత్సరంలో అమలు పర్చాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. మారిన టెన్త్ సిలబస్‌పై ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకపోవడం, నూతన పరీక్ష విధానానికి విద్యార్థులు సన్నద్ధం కాలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జాతీయ స్థాయి విద్యా విధానాన్ని అనుసరిస్తూ రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి (ఎస్ఈఆర్టీ) పదవ తరగతి పాఠ్యాంశాల్లో సమూల మార్పులు చేసింది. దీనిలో భాగంగా పబ్లిక్ పరీక్షల విధానంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయని పాఠశాల విద్యాశాఖ వేసవి సెలవులకు ముందు ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పటి వరకూ 11 పేపర్లతో పదో తరగతి పరీక్షలను నిర్వహించగా, కొత్త విధానంలో తొమ్మిది పేపర్లతో పరీక్ష నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు చేసిన ప్రకటనలు ఇటు తల్లిదండ్రులు, అటు అధికారులను సైతం అయోమయానికి గురి చేశాయి. 30, 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పదో తరగతి సిలబస్‌లో సమూల మార్పులు చేసిన ప్రభుత్వం దానికి తగ్గట్లుగా ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించడంలో విఫలమైంది. పాఠశాలలు తెరిచిన తరువాత టెలీ కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కల్పించి చేతులు దులుపుకున్న పాఠశాల విద్యాశాఖ కొత్త విధానంలోనే పరీక్షలు జరుగుతాయని హడావుడిగా ప్రకటిం చేసింది. అయితే నూతన విధానంలో పరీక్షల నిర్వహణ సాధ్యమేనా అనే అంశం పరిశీలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న పరిస్థితుల్లో ఇది అసాధ్యమని తేలింది. అంతేకాక పదో తరగతిలో కొత్త పరీక్ష విధానం ప్రైవేట్విద్యార్థులకు ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని గుర్తించారు. ఇంటర్నల్ అసెస్మెంట్ విధానంతో ప్రైవేటుగా హాజరయ్యే విద్యార్థులపై వేటు పడనుంది. - రెగ్యులర్ విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్మెంట్ విధానంలో 20 మార్కులను నిర్ణయించాల్సి ఉండగా, ప్రైవేటు విద్యార్థులకు అలాంటి అవకాశమే ఉండదని తేలింది. స్పష్టమైన నిర్ణయం వెలువడాల్సి ఉంది.. పదవ తరగతి పరీక్షల నిర్వహణకు కొత్త విధానమా, లేక పాత పద్ధతిలోనా అనే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పటి వరకూ దీనిపై ఉపాధ్యాయులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. ప్రైవేటు విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. - డి. ఆంజనేయులు, జిల్లా విద్యాశాఖాధికారి -
సామాన్యుడి గుండెకోత
ఉదయాన్నే అల్పాహారం తయారు చేయాలంటే మిక్సీ ఆడదు.. వచ్చే పబ్లిక్ పరీక్షలకు సిద్ధం కావాలని పుస్తకం పట్టుకొని స్విచ్వేస్తే బల్బు వెలగదు.. ఆర్డర్లమీద ఆర్డర్లు వచ్చాయి.. ఇక వ్యాపారం పుంజుకుంటుంది అనుకున్న తరుణంలో మిషన్ పరుగెత్తదు.. అర్జెంట్ ఫైల్ ఆన్లైన్లో హైదరాబాద్‌కు పంపాలంటే కంప్యూటర్ పనిచేయదు.. ఇలా ఎన్నో సమస్యలు.. తాజాగా ప్రకటించిన విద్యుత్ కోతల కారణంగా జనం పడుతున్న అవస్థలు. పంట చేతికొస్తే అప్పులు తీరుద్దామని కలలుగన్న అన్నదాత పరిస్థితి మరీ దయనీయం. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పైరు కళ్లముందే ఎండుతోంది. కోట్ల రూపాయలు రుణాలు తెచ్చి స్థాపించిన పరిశ్రమ నష్టాలను మూటగడుతోంది. ఉపాధి లేక వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇవేకాదు.. మరెన్నో గాథలు.. కరెంట్ కోతల కారణంగా సామాన్యుడి గుండెను నలిపే బాధలు.. న్యూస్‌లైన్ పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలు మీకోసం.. - న్యూస్‌లైన్ నెట్వర్క్ వ్యవసాయానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్ అస్తవ్యస్తంగా మారింది. మొదట్లో ఏడు గంటలు ఇస్తామని చెప్పారు. రబీలో పంటలు సాగు చేసిన తరువాత దానిని ఆరు గంటలకు కుదించారు. అదన్నా ఇస్తున్నారంటే మళ్లీ కోతలు విధిస్తున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని పరిస్థితిలో అన్నదాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రాత్రీ, పగలు అని తేడా లేకుండా పొలాల దగ్గర నిరీక్షించాల్సి వస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్ సక్రమంగా సరఫరా అయ్యేదని, ఇపుడు కరె ంటు కోసం తీవ్ర అవస్థలు పడుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. పగలు మూడు గంటలు, రాత్రి మూడు గంటలు చొప్పున కరెంటు సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నా..అందులో సగం కూడా సరఫరా కావడం లేదని ఆరోపిస్తున్నారు. వ్యవసాయానికి చీ‘కట్’లే! చాగలమర్రి మండలంలో వ్యవసాయానికి రాత్రి 2 గంటలు, పగలు 2గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. గతంలో ఆరు గంటల వరుకు విద్యుత్ సరఫరా అమ్యేదని, రెండు వారాల నుంచి కోత ఎక్కువైందని రైతులు తెలుపుతున్నారు. మళ్లీ విద్యుత్ కోతలు విధించడంతో మూడు గంటలు కూడా సరఫరా చేయరేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు మండలంలో 586 విద్యుత్ కనెక్షన్ల కింద 2650 ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి. కోడుమూరులో 2000 విద్యుత్ కనెక్షన్ల కింద 7508 ఎకరాలు, సి.బెళగల్లో 2786 కనెక్షన్ల కింద 8675 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. విద్యుత్ కోత కారణంగా పంటలు ఎండిపోతుంటే ఆయిల్ మోటర్లు పెట్టుకొని పైర్లను రైతులు కాపాడుకుంటున్నారు. గోనెగండ్ల మండల పరిధిలో 2709 వ్యవసాయ బోర్లు, బావుల కింద వేరుశెనగ, పత్తి, ఉల్లి, మిరప తదితర పంటలను సాగు చేశారు. ఈనెల 3వ తేదీ నుంచి ఏడు గంటల విద్యుత్ సరఫరాలో ఓక గంట కుదించి 6 గంటలు సరఫరా చేస్తున్నారు. అది కూడా పగటి పూట సక్రమంగా సరఫరా కాక రైతుల అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. మెయిన్‌లైన్ లాస్ పేరుతో ప్రతి రోజు నాలుగైదు గంటలకంటే ఎక్కువ సరఫరా కావడంలేదని రైతులంటున్నారు. ఉయ్యాలవాడ మండలంలో బోరు బావుల కింద, కుందూ నది తీరం వెంట వరి 350 హెక్టార్లు, మిరప 450 హెక్టార్లు, మొక్కజొన్న 110 హెక్టార్లలో సాగు చేశారు. విద్యుత్ కోతలతో తమ పొలాలకు నీరు పారించుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి 4 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. ఎమ్మిగనూరు మండలంలో 3700 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఏ గ్రేడ్ కింద ఉదయం 12 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, రాత్రి 9 నుంచి ఆర్థరాత్రి 12 వరకు సరఫరా ఇస్తున్నారు. అలాగే బి గ్రేడ్ కింద ఆర్థరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, 3 నుంచి ఉదయం 6 వరకు పంటలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే అనధికార కోతలతో నీరందక పైర్లు ఎండిపోతున్నాయి. నందవరం మండలంలో 1649 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. మిరప, వరి, వేరుశనగ తదితర పంటలను రైతులు సాగు చేశారు. నందవరం, నాగలదిన్నె, మంత్రాలయం విద్యుత్ సబ్స్టేషన్లు ద్వారా కరెంట్ సరఫరా చేస్తున్నారు. సరఫరా సరిగా లేదంటూ రైతులు రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. అయినా మార్పు లేదని రైతులు సుబ్బారావు, దత్తాత్రేయగౌడ్, నరసప్పలు పేర్కొన్నారు. అప్రకటిత కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని వారు తెలిపారు. దొర్నిపాడు మండలంలో కుందూనది, బోర్ల కింద వరి, మొక్కజొన్న. ఉల్లి తదితర పంటలను 4వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ఈ గ్రామాల్లో 301 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. పగలు మూడు గంటలే కరెంట్ వస్తోంది. రాత్రి వేళల్లో ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని రైతులు పేర్కొంటున్నారు. పరిశ్రమలకు వాత వేసవి రాకముందే విద్యుత్ కోతలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారీ పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు కుదేలవుతున్నాయి. జిరాక్స్, వెల్డింగ్, కూల్‌డ్రింక్ షాపులు నిర్వహించే వారు తీవ్రంగా నష్టపోతున్నారు. పరిశ్రమలకు విద్యుత్ కోత లేదని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నప్పటికీ అనధికారికంగా రోజూ సరఫరా నిలిపివేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా కోతలు విధిస్తున్నారు. అనధికారిక విద్యుత్ కోతలతో ఉత్పత్తులు నిలిచి ఫ్యాక్టరీ యజమానులు లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది. విద్యుత్ కోతల ప్రభావం నాపరాతి పాలీస్ ప్యాక్టరీలపై పడింది. జిల్లాలో బనగానపల్లె, డోన్ సబ్ డివిజన్ పరిధిలో సుమారు రెండువేల ప్యాక్టరీలు ఉన్నాయి. ఇందులో 30-40 వేల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. గత సంవత్సరం పెంచిన సర్‌చార్జీల ప్రభావంతో ఎక్కువ శాతం పరిశ్రమలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టడుతున్నాయి. నేడు విద్యుత్ కోతలతో అవి మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నగర పంచాయతీ, మండల కేంద్రాల్లో రోజుకు 6 గంటల విద్యుత్ కోతను అమలుపరుస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే అనధికారికంగా మరో 2-3 గంటల అదనపు విద్యుత్ కోతను అమలు పరుస్తున్నట్లు ఫ్యాక్టరీల యజమానులు, కార్మికులు తెలుపుతున్నారు. తగ్గిన రవాణా ఇక్కడ తయారైన పాలీస్ రాయిని లారీల ద్వారా బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్, నాగపూర్, విజయవాడ.. తదితర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. అయితే విద్యుత్ కోతలతో పాలీస్ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి తగ్గింది. దీంతో కార్మికులకూ జీవనోపాధి కరువైంది. డోన్ పట్టణంలో 150 గ్రానైట్, 20 ప్లాస్టిక్, మరో 300 ఇతర ఫ్యాక్టరీలు ఉన్నాయి. పరిశ్రమలకు దాదాపు 10 గంటలపాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. దీంతో ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయి.. కోట్ల రూపాయల్లో నష్టం వస్తోందని వ్యాపారులు తెలుపుతున్నారు. బేతంచెర్ల మండలంలో 550 పరిశ్రమలున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడువేల కుటుంబాలు వీటిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో కార్మికుల వేతనాల్లో కోత పడుతోంది. రోజంతా పనిచేస్తే రూ. 100 కూడా రావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.