పంచతంత్రం.. ఫలితం అద్భుతం
పంచతంత్రం.. ఫలితం అద్భుతం
Published Sat, Feb 4 2017 10:21 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM
టెన్త్ విద్యార్థులకు 40 రోజుల ప్రణాళిక
నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ఏలూరు సిటీ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ’పశ్చిమ’ అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ 40 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ విద్యాసంవత్సరంలో జిల్లా విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచేందుకు ’పంచతంత్రం’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు జిల్లాలోని 30 వేల మంది ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను అందించారు. ఈ నేపథ్యంలో పంచతంత్రం పక్కాగా అమలు చేసి మంచి ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమష్టిగా కృషి చేసేందుకు సన్నద్ధమయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు ఆధ్వర్యంలో పంచతంత్రాన్ని ప్రయోగించనున్నారు.
1) విద్యార్థుల వర్గీకరణ
విద్యార్థులను సమ్మెటివ్ ఎసెస్‌మెంట్2 పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా నాలుగు గ్రేడులుగా విభజించారు. 034 శాతం మార్కులు సాధిస్తే పశ్చిమ ఆశాజ్యోతులు, 3570 శాతం పశ్చిమ బంగారాలు, 7190 శాతం పశ్చిమ వజ్రాలు, 91100 శాతం మార్కులు సాధిస్తే పశ్చిమ ఆణిముత్యాలుగా విభజించారు. ఈ గ్రేడుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి కనీసం ఉత్తీర్ణత సాధించేలా శిక్షణ ఇస్తారు.
2) విద్యార్థుల దత్తత
ఆయా పాఠశాలల్లో ప్రతి ఉపాధ్యాయుడు కనీసం 5 నుంచి 10 మంది విద్యార్థులను దత్తత తీసుకోవాలి. ప్రతి గ్రూపులోనూ అన్నివర్గాల విద్యార్థులూ ఉంటారు. సబ్జెక్టుల్లో ఫెయిలవుతున్న విద్యార్థులను ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులే దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఏఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి ఉదయం, సాయంత్రం ఒక్కో గంట సమయాన్ని కేటాయించి ప్రత్యేకంగా బోధించాలి.
3) మార్గదర్శక బృందాలు
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారానికి రెండుసార్లు విద్యార్థుల ఇళ్లను సందర్శించాలి. విద్యార్థి తల్లీదండ్రీతో పిల్లల ప్రగతిని చర్చించాలి. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకూ, వేకువజాము 5 గంటల నుంచి 6.30 గంటల వరకూ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి సందేహాలు నివృత్తి చేయాలి. వారానికి రెండు సార్లు ఇళ్లను సందర్శించాలి. మహిళా ఉపాధ్యాయులకు ఉదయం మినహాయింపు ఇచ్చారు. సోమవారం, గురువారంగణితం, పీఎస్, ఎన్‌ఎస్, మంగళవారం, శుక్రవారంఇంగ్లిష్, సోషల్, బుధవారం, శనివారంతెలుగు, హిందీ సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లను సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
4) వారాంతపు పరీక్షలు
విద్యార్థులకు పంపిణీ చేసిన స్టడీ మెటీరియల్ మేరకు వారం రోజులు బోధించిన సబ్జెక్టుల్లో 25 మార్కులకు వారాంతపు పరీక్షలు నిర్వహించాలి. పంచతంత్రం వీక్లీ టెస్ట్‌లను ఆయా సబ్జెక్టు పీరియడ్స్‌లోనే నిర్వహించాలి. ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులు, ప్రగతిని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి నివేదించాలి. సోమవారంతెలుగు, మంగళవారంహిందీ, బుధవారంఇంగ్లిష్, గురువారంగణితం, శుక్రవారం సైన్సు, శనివారంసోషల్ సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించాలి.
5) స్టడీ క్యాంపులు
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారి నివాస గ్రామాల ఆధారంగా ఆయా గ్రామాల్లో 1015 మంది విద్యార్థుల చొప్పున స్టడీ క్యాంపు ఏర్పాటు చేస్తారు. ఆ గ్రామంలో నివాసముంటున్న ఉపాధ్యాయులను కేర్‌టేకర్‌గా నియమిస్తారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా స్టడీ క్యాంపులు నిర్వహిస్తారు. ఇవి రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు, ఉదయం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకూ ఉంటాయి. తరగతుల్లోనూ టెన్త్ విద్యార్థులకు ప్రత్యేకంగా లాంగ్ పీరియడ్స్ నిర్వహించి సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన చేస్తారు.
అత్యుత్తమ ఫలితాలే లక్ష్యం
జిల్లా విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. 40 రోజుల ప్రణాళిక రూపొందించాం. జిల్లాలోని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల సమష్టి కృషితో మంచి ఫలితాలు సాధించేందుకు పంచతంత్రాన్ని తయారు చేశాం. విద్యార్థి భవిష్యత్‌కు అత్యంత కీలకమైన పబ్లిక్ పరీక్షల్లో వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ ప్రోత్సహించాలని నిర్ణయించాం.
డి.మధుసూదనరావు, జిల్లా విద్యాశాఖ అధికారి
Advertisement
Advertisement