భువనేశ్వర్: ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూ పొలం పనుల్లో చురుగ్గా పాల్గొంటున్న ఫుల్బణి ఎమ్మెల్యే అంగద కన్హర్(58) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. విద్యార్థులతో కలిసి మెట్రిక్యులేషన్ పరీక్షలు రాయడం రాష్ట్రవ్యాప్తంగా ట్రెండింగ్ మారింది. కందమాల్ జిల్లా ఫుల్బాణి మండలం పితాబరి గ్రామంలోని రుజంగి ఉన్నత పాఠశాల కేంద్రంలో ఆయన పరీక్షకు హాజరయ్యారు. 1978లో అర్ధాంతరంగా విద్యాభ్యాసం ముగించిన ఆయన.. ఇన్నాళ్లకు పునఃప్రారంభించడం విశేషం.
కుటుంబ పరిస్థితులతో అప్పట్లో చదువు కొనసాగించలేక పోయానని, 50 ఏళ్లు పైబడిన వారు కూడా మెట్రిక్యులేషన్ పరీక్షలు రాసి, ఉత్తీర్ణులైనట్లు ఇటీవల వార్తల్లో విన్నానని తెలిపారు. ఉన్నత అభ్యాసానాకి వయస్సు అడ్డు కాదన్నారు. ఇదే ఉత్సాహంతో పరీక్షలకు హాజరైనట్లు ఎమ్మెల్యే వివరించారు. స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎస్‌ఐఓఎస్) వర్గం కింద ఈ ఏడాది 63మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్లు కేంద్రం పరిశీలకురాలు, హెచ్‌ఎం అర్చనా బాస్ వెల్లడించారు. ఇందులో ఎమ్మల్యే అంగద తోపాటు లుయిసింగి పంచాయతీ సర్పంచ్ సుదర్శన్ కంహర్ కూడా ఉన్నారని ప్రకటించారు.
1985లో క్రీయాశీల రాజకీయాల్లో ప్రవేశించిన అంగద కన్హర్.. వరుసగా 3సార్లు కెరండిబాలి పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందారు. మరో సారి పొకారి పంచాయతీ నుంచి ఎన్నికయ్యా రు. పంచాయతీరాజ్ వ్యవస్థలో అంచెలంచెలుగా ఎదిగారు. ఫిరింగియా మండల అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ సభ్యుడిగా ప్రజాభిమానాన్ని సంపాదించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం ఫుల్బాణి నుంచి బీజేడీ అభ్యర్థిగా పోటీ చేసి, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా కారణంగా పరీక్షలు జరగక పోవడంతో రాయలేక పోయానని చెప్పిన ఎమ్మెల్యే.. శుక్రవారం సాధారణ విద్యార్థిగా ప్రవేశ ద్వారం వద్ద హాల్ టికెట్ చూపించి, కేంద్రంలోకి ప్రవేశించారు. మరో ఇద్దరు మిత్రులతో కలిసి పరీక్షకు రాగా.. వీరిలో ఒకరు స్థానిక సర్పంచ్ కావడం గమనార్హం.
చదవండి: King Cobra: కిచెన్‌లోకి వెళ్లిన భార్య ఒక్కసారిగా భయంతో..
Comments
Please login to add a commentAdd a comment