మారిన సిలబస్, పాత పరీక్షా విధానం పదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు 40 రోజుల ఇంటెన్సివ్ కోచింగ్ కార్యక్రమాన్ని రూపొందించారు. పరీక్షలకు సన్నద్ధ తరగతులు ఏ మేరకు ఫలితాలను ఇస్తాయో అనేది తేలని పరిస్థితి నెలకొంది. విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి చేతులు దులుపుకుంది. నిర్వహణ, ప్రశ్నపత్రాల రూపకల్పన అందుకు అవసరమయ్యే నిధులు అందజేయడంలో జోగుతోంది.
నెల్లూరు (విద్య): జిల్లా వ్యాప్తంగా 34,680 మంది విద్యార్థులు టెన్‌త పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికి ఉదయం 9.30 నుంచి 10.30 వరకు, 11.40 నుంచి 12.50 వరకు, 1.50 నుంచి 2.50 వరకు, 2.50 నుంచి 3.50 వరకు, 4.00 నుంచి సాయంత్రం 5.30 గంటలకు ప్రత్యేక రివిజన్ కార్యక్రమాన్ని సబ్జెక్టుల వారీగా రూపొందిం చారు. తెలుగుకు 16 స్టడీ అవర్స్, నాలుగు పరీక్షలు, హిందీకు 15
స్టడీ అవర్స్, 3 రివిజన్ పరీక్షలు, ఇంగ్లీష్‌కు 19 స్టడీ అవర్స్, 5 రివిజన్ పరీక్షలు, మ్యాథ్స్‌కు 23 స్టడీ అవర్స్, 6 రివిజన్ టెస్టులు, పీఎస్‌కు 12 స్టడీ అవర్స్, 3 రివిజన్ టెస్టులు, బీఎస్‌కు 12 స్టడీ అవర్స్, 3 రివిజన్ పరీక్షలు, సోషల్‌కు 17 స్టడీ అవర్స్, 5 రివిజన్ టెస్టులు ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించారు.
మొత్తం 114 స్టడీ అవర్స్‌లో 29 ప్రిపరేషన్ పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలకు ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాలకు అవసరమయ్యే నిధులు మాత్రం విద్యాశాఖ విడుదల చేయలేదు. కొన్ని ప్రాంతాల్లో డబ్బులులేవని పరీక్షలు పెట్టడంలేదు. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులతో ప్రశ్నాపత్రాలకు డబ్బులు వసూలు చేస్తున్నారు. మరికొంత మంది ఉపాధ్యాయులు పరీక్షలు నిర్వహించినా వాటిని మూల్యాంకనం చేయడంలేదు. ఈ క్రమంలో సన్నద్ధ ప్రత్యేక 40 రోజుల కార్యక్రమంలో విద్యార్థి సామర్థ్యాన్ని లెక్కించే పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
కొత్త పాఠ్యాంశాలను అభ్యసించారు. ఉపాధ్యాయులకు మాత్రం సమాధానపత్రాలను మూల్యాంకనం చేయడంలో కొత్త కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యాసంవత్సరం ఆరంభం నుంచి ఏడు నెలల వరకు పరీక్షా విధానం ఖరారు కాలేదు. ఉపాధ్యాయులు పాత పద్ధతిలోనే మూల్యాంకనం చేశారు. నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతి ద్వారా ప్రస్తుతం 40 రోజుల ప్రత్యేక సన్నద్ధ కార్యక్రమంలో విద్యార్థులు రాసే సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంది.
అందుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ఉపాధ్యాయుల వద్దే లేకపోవడం గమనార్హం. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఉపాధ్యాయులకు పునశ్ఛరణ తరగతులు నిర్వహించకుండా సంవత్సరం చివరిలో మొక్కుబడిగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల బోధన సమయాన్ని కాస్త స్వాహా చేశారు. ఉపాధ్యాయులకే అర్థంకాని అంశాలను వారు విద్యార్థులకు ఎలా అందజేస్తారనేది ప్రశ్నార్థకం.
పాఠశాలల్లో సిలబస్ పూర్తికాక ముందే పదో తరగతి విద్యార్థులకు రోజు వారి బోధన కార్యక్రమాలను రద్దు చేసి 40 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హడావిడిగా రూపొందించిన ఈ కార్యక్రమానికి ప్రశ్నాపత్రాల అంశంలో మరీ అలసత్వం వహించారు. కష్టతరమైన సబ్జెక్టును బట్టి తరగతులు, పరీక్షలు ఏర్పాటు చేశారు. కామన్ బోర్డు ద్వారా ప్రశ్నపత్రాలను ప్రింట్ చేయడానికి అవకాశంలేదు. గతంలోనే కామన్ బోర్డును రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలు నిర్వహించే బాధ్యత ప్రధానోపాధ్యాయులపై పడింది. స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ప్రశ్నాపత్రాలను ప్రధానోపాధ్యాయుల నిధుల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వివిధ పాఠశాలల్లో నెలకొన్నాయి. ప్రింటర్లు, జెరాక్స్ సెంటర్ల నుంచి ప్రశ్నాపత్రాలను కొనుగోలు చేయాల్సి వస్తుంది.
ఆర్భాటమేనా... నూటికి నూరుశాతం ఫలితాలు సాధించాలని జిల్లా ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు పదేపదే ప్రకటించడం ప్రచార ఆర్భాటమేనా అనే సందేహాలు రాకమానవు. కార్యక్రమ రూపకల్పనలో అమలు చేయడంలో క్షేత్రస్థాయిలో ఏర్పడే సమస్యలను ప్రతిభంబించకుండానే ఈ ప్రత్యేక 40 రోజుల కార్యక్రమాన్ని రూపొందించడం ప్రచార ఆర్భాటమేనని అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
గమ్యంలేని ‘మార్గదర్శిని’...?
ప్రశ్నావిధానంపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన మార్గదర్శిని గమ్యంలేదని అభిప్రాయాలు ఉన్నాయి. విద్యార్థులకు ముఖ్యంగా, పేద విద్యార్థులకు పరీక్షా విధానంపై అవగాహన కలిగించేందుకు జెడ్పీ చైర్మన్ ప్రత్యేక శ్రద్ధతో అందజేసిన మార్గదర్శిని (ప్రత్యేక మెటీరియల్) ప్రయత్నం మంచిదే అయినప్పటికీ అందులో రూపొందించిన ప్రశ్నలు చాలా వరకు పాఠ్యపుస్తకాల్లో లేవు. పాఠ్యపుస్తకాల్లో లేని ప్రశ్నలకు అప్పటికప్పుడు జవాబులు రూపొందించడం ఉపాధ్యాయులకు సాధ్యంకాని పని. ఒకవేళ జవాబులు రూపొందించినా విద్యార్థులందరికీ అది చేరవేయడానికి సరిపోయినంత సమయం లేదు. ఇప్పటిదాకా నేర్చుకున్న ప్రశ్నలను రివ్వ్యూ చేయడానికి సమయం చాలని పరిస్థితిలో కొత్త ప్రశ్నలకు జవాబులు రాయడం సాధారణ విద్యార్థికి తలకు మించిన భారం అవుతుంది. మొత్తం మీద ఈ సారి పదవ తరగతి ఫలితాలు జిల్లా విద్యారంగంపై పెనుప్రభావాన్ని చూపగలవని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.
ప్రణాళిక అవసరం :
నిర్ధిష్టమైన టైమ్‌టేబుల్ లేనప్పుడు తక్కువ సమయంలో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకు ప్రణాళిక అవసరం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. పరీక్షలు నిర్వహించేందుకు ప్రశ్నపత్రాలకు సంబంధించి నిధుల విషయం ఆలోచించాలి. అలాగే మూల్యాంకనం విషయం ఉపాధ్యాయులకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి.
-మోహన్‌దాస్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్
ఈ ఏడాది అస్తవ్యస్తం :
ఈ విద్యాసంవత్సరం అస్తవ్యస్తం. ఏప్రిల్‌లో ఒక డీఈఓ సస్పెండ్ అయ్యారు. తర్వాత ఇన్‌చార్జ్ డీఈఓ పాఠశాలల పర్యవేక్షణను విస్మరించారు. ఇలా విద్యాసంవత్సరంలో ఎనిమిది నెలలు గడచి పోయాయి. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డీఈఓ మిగిలిన కాలంలో ఏం చేయగలరు. ఈ ప్రభావాలు విద్యార్థులపై పడకుండా ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి. -చిరంజీవి, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
శిష్యులకు పరీక్ష.. గురువులకు శిక్ష
Published Sat, Feb 21 2015 3:17 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement