దేశానికి ఆదర్శంగా నిలిచాం: ఈటల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే పరిపాలనపై పట్టు సాధించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే మార్గాల్ని అన్వేషించేందుకు బుధవారం కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంట్ నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంలో వాణిజ్య పన్నుల శాఖదే కీలక పాత్ర అని, ఆర్థిక శాఖ కేవలం నిధుల్ని ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలను మాత్రమే రూపొందిస్తుందన్నారు. ‘‘రాష్ట్ర ఏర్పాటుకు ముందు మనం నిలదొక్కుకోగలమా అని అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారని, కానీ నేడు దేశ మన్ననలు పొందిన ఏకైక రాష్ట్రం తెలంగాణే’’ అని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ సమర్థులైన అధికారులకు బాధ్యతలు అప్పగించారని, ఆ నమ్మకాన్ని వాళ్లు నిలబెట్టుకున్నారంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌ను మంత్రి అభినందించారు. దౌర్జన్యంగా పన్నులు వసూలు చేయాల్సిన అవసరం లేదన్నారు. పన్నులు చెల్లిస్తే సొమ్ము భద్రంగా ఉంటుందనే భావన అందరిలోనూ వచ్చిందని, అందుకే చెల్లించే వారి సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిధుల విషయంలో పురోగతి సాధిం చామన్నారు. నీళ్ల విషయంలో ముందడుగు వేస్తున్నామని, ఉపాధి కల్పనలోనూ వృద్ధి సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతు న్నాయని వివరించారు.