ఆదాయం ఢమాల్..
⇒ఆబ్కారీ శాఖ మినహా.. సర్కారీ విభాగాల కుదేలు
⇒పెద్ద నోట్ల రద్దుతో భారీ గండి
⇒లక్ష్య సాధనలో చతికిలబడ్డ శాఖలు
సిటీబ్యూరో: ఆదాయార్జనలో నగరంలోని పలు ప్రభుత్వ విభాగాలు చతికిలపడ్డాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆబ్కారీ శాఖ మినహా.. రవాణా, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఈ శాఖలు ఆర్జించిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. పెద్దనోట్ల రద్దు దెబ్బతో రియల్ ఎస్టేట్ రంగంతో పాటు సకల వ్యాపార, వాణిజ్య రంగాలకు గట్టి దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఆయా విభాగాలకు ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యానికి భారీగా గండిపడింది.
ఆర్టీఏ ఆదాయానికి బ్రేకులు..
ఈ ఏడాది (2016–2017) రవాణాశాఖ ఆదాయానికి బ్రేకులు పడ్డాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వాహనాల అమ్మకాలు తగ్గడంతో పాటు.. జీవితకాల పన్నుపై భారీగా ప్రభావం చూపాయి. త్రైమాసిక పన్ను కూడా కొంతమేర తగ్గింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం లక్ష్యంలో 85 శాతమే సాధించగలిగారు. అంటే అనుకున్న లక్ష్యంలో 15 శాతం మేర కోత పడింది.
తగ్గిన ‘వాణిజ్య పన్నుల’ రాబడి
గ్రేటర్ హైదరాబాద్‌లో వాణిజ్య పన్నుల శాఖ ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్య సాధనలో వెనుకబడింది. 2016–17లో సుమారు రూ.24 వేల కోట్ల ఆదాయాన్ని పన్నుల రూపంలో సమకూర్చుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. కానీ మార్చి చివరి నాటికి కేవలం రూ.19 వేల కోట్లతో సరిపెటుకొంది. ఈ శాఖకు సమకూరే ఆదాయంలో మహానగర రాబడి అత్యంత కీలకం. ఈ శాఖలో మొత్తం 12 డివిజన్లు ఉండగా, సిటీలో ఏడు డివిజన్లు ఉన్నాయి. నగరంలోని అబిడ్స్, చార్మినార్, బేగంపేట, పంజగుట్ట, సికింద్రాబాద్, సరూర్‌నగర్, హైదరాబాద్ రూరల్ డివిజన్ల పరిధి నుంచే అత్యధికంగా ఆదాయం సమకూరుతోంది. కానీ, అధికారులు చేతివాటం, పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంతో ఆదాయానికి గండి కొట్టినట్లయింది. ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ తీరును కాగ్ తప్పు పట్టిన విషయం తెలిసిందే.
లక్ష్యం చేరని రిజిస్ట్రేషన్ శాఖ
రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ సైతం ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేక చతికిలబడింది. 2016–17లో గ్రేటర్‌లో రూ.3 వేల కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించుకుంది. కానీ మార్చి చివరికి రూ.2400 కోట్లకు మించలేదు. పెద్దనోట్ల రద్దు, కరెన్సీ కట్టడితో స్థిరాస్తి లావాదేవీలు భారీగా తగ్గిపోయాయి. దీంతో ఈ రంగం కుదేలైంది. రిజిస్ట్రేషన్ శాఖలో మొత్తం 12 జిల్లా రిజిస్ట్రార్లు (డీఆర్) ఉండగా అందులో మహానగరంలో నాలుగు డీఆర్ పరిధులు ఉన్నాయి. వీటిలో 41 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేస్తున్నాయి. మొత్తంమీద రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలో మహానగరం వాటా 68.89 శాతం ఉంది. కానీ, ఈ ఏడాది వరుసగా ఐదు మాసాలుగా స్థిరాస్తి రంగం స్తబ్ధతగా మారడంతో ఆ ప్రభావం రిజిస్ట్రేషన్ శాఖపై పడినట్లయింది.