- వ్యాట్ నుంచి జీఎస్‌టీ దిశగా పన్నుల మార్పు
- వాణిజ్య పన్నుల శాఖ ఎన్‌జీఓ అధికారుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
ఏయూ క్యాంపస్ : పన్నుల విధానంలో ఏకీకృత వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ఉద్యోగ సంఘాలు కృషి చేయాలని ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఎన్‌జీఓ అధికారుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ సూచించారు.
సంఘం ఆధ్వర్యంలో ఏయూ వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వస్తు, సేవా పన్ను (జీఎస్‌టీ)పై శనివారం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. వ్యాట్ నుంచి నేడు జీఎస్‌టీ దిశగా పన్నులు మార్పు చెందనున్నాయన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా మనం ఎంతవరకు లబ్ధిపొందుతున్నామనే విషయం పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర పన్ను సంస్థలన్నీ సమైక్యంగా పనిచేయాలని సూచించారు.
సదస్సు ముఖ్య సమన్వయకర్త, కమర్షియల్ ట్యాక్స్ అదనపు కమిషనర్ జి.లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలనే లక్ష్యంతో ఏకీకృత పన్నుల విధానం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనిపై ఉద్యోగులు విస్తృత అవగాహన పెంచుకోవాలన్నారు. ఏఐఎఫ్‌టీపీ కేంద్ర జీఎస్‌టీ కమిటీ చైర్మన్ ముకుల్ గుప్తా మాట్లాడుతూ జీఎస్‌టీ అమలు చేయాలంటే బలమైన కేంద్రం ఉండాలని, ప్రస్తుత పరిస్థితులలో ఇది సాధ్యపడుతుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక రాష్ట్రాలలో జీఎస్‌టీ అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలో జీఎస్‌టీకి సామీప్యంగా భారత్‌లో దీన్ని రూపొం దిస్తున్నారని చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ న్యా య విభాగం రిటైర్‌డ అదనపు కమిషనర్ యోగేందర్ కుమార్, ట్యాక్స్ రెగ్యులేటరీ సర్వీసెస్ సభ్యుడు ప్రశాంత్ రైజాడా తదితరులు జీఎస్‌టీపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ రిటైర్‌డ సంయుక్త కమిషనర్ పి.వి.సుబ్బారావు, డిప్యూటీ కమిషనర్ ఎస్.శేఖర్, విశాఖ డిప్యూటీ కమిషనర్ టి.శివ శంకరరావు, సంస్థ కార్యదర్శి జి.సత్యనారాయణ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, ఉద్యోగులు, యూపీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, పాండిచ్చేరి తదితర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.