సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీకి సర్వం సిద్ధమైంది. రూ. లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 36.80 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులని తేలగా అందులో గతేడాది 2.96 లక్షల మంది రైతులకు చెందిన రూ. 25 వేల వరకు రుణాలపై రూ. 408 కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 5,225 కోట్లు కేటాయించింది. అయితే ఈసారి ఏ రకంగా రుణమాఫీ సొమ్ము విడుదల చేయాలన్న దానిపై వ్యవసాయ శాఖ కసరత్తు చేసింది. అందుకోసం రెండు రకాల ఆప్షన్లను ప్రభుత్వం ముందుంచింది.
గతంలో రూ. 25 వేల వరకు రుణాలు మాఫీ చేసినందున ఈసారి రూ. 25 వేల నుంచి రూ. 50 వేల మధ్య ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేయాలన్నది ఒక ఆప్షన్. ఈ కేటగిరీలో 8.02 లక్షల మంది రైతులు అర్హులుగా తేలారు. వారి కోసం రూ. 4,900 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇక రెండోది ప్రతి ఒక్కరికీ రూ. 25 వేలు మాఫీ చేయాలన్న ఆప్షన్‌ను తయారు చేశారు. అంటే రూ. 25 వేల నుంచి రూ. లక్షలోపు రుణాలున్న వారందరికీ రూ. 25 వేలు మాఫీ అవుతాయన్నమాట. ఈ ఆప్షన్ ప్రకారం చూస్తే 13.45 లక్షల మంది రైతులు అర్హులుగా తేలారు. అందుకోసం రూ. 5,100 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వం మాత్రం రెండో ఆప్షన్ వైపే మొగ్గుచూపుతోందని వ్యవసాయ అధికారి ఒకరు తెలిపారు. వాస్తవంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ప్రతి ఒక్కరికీ ఊరటనిచ్చే విధంగానే రుణమాఫీ సొమ్ము విడుదల చేయాలి. కాబట్టి ఆ ప్రకారమే సర్కారు నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. రుణమాఫీకి సంబంధించి ఈ రెండు ఆప్షన్ల ప్రకారం రైతుల జాబితాను సిద్ధంగా ఉంచామని, ఆ మేరకు వివరాలను సర్కారుకు పంపించామని అధికారులు తెలిపారు. వీలైనంత త్వరలో సొమ్ము విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
చదవండి: రుణమాఫీ నిధులు విడుదల చేయాలి
Comments
Please login to add a commentAdd a comment