Farmers debt
-
చిన్న కమతం.. ఎక్కువ వ్యయం!
ఓ కుటుంబానికి ఇరవై ఏళ్ల కిందట 20 ఎకరాల భూమి ఉండేది. ఆ భూమిని నలుగురు అన్నదమ్ములు సమష్టిగా సాగుచేసుకునే వారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉమ్మడి కుటుంబాలు విడిపోతున్నాయి. ఆ క్రమంలోనే నలుగురు అన్నదమ్ములు విడిపోయారు. ఒక్కొక్కరికి ఐదెకరాల పొలమే వచ్చింది. ఆ నలుగురు అన్నదమ్ముల పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. వారు విడిపోయి పొలాలను పంచుకున్నారు. చివరకు వారి పిల్లలు ఒక్కొక్కరికి వచ్చింది సగటున ఎకరన్నర పొలమే. సమష్టిగా వ్యవసాయం చేసుకున్న సమయంలో పెట్టుబడి వ్యయం కలిసి వచ్చేది. ఇంటి వారందరూ కలిసి పనులు చేసుకునేవారు. కానీ ఇప్పుడు విడిపోవడంతో ఎవరి పెట్టుబడి వారు పెట్టుకోవడంతో అనవసర వ్యయం కొంత పెరిగింది. మరోవైపు అందరికీ ఆశించిన మేరకు ఆదాయం అందడం లేదు. ఇది ఈ ఒక్క కుటుంబం పరిస్థితే కాదు.. దాదాపుగా చిన్న కమతాలు చేస్తున్న అందరి పరిస్థితీ ఇదే. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ దేశంలో భూ కమతాల విస్తీర్ణం తగ్గుతోంది. వ్యవసాయ పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. దీనితో రైతులు అప్పుల పాలవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర సరిగా రాక పోవడం, మధ్య దళారీల దోపిడీతో సాగు భారంగా మారుతోంది. ప్రభుత్వాలు చేస్తున్న సాయం ఆశించిన మేరకు రైతులను ఆదుకోవడం లేదు. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ చిన్న, సన్నకారు రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో చిన్న కమతాల వల్ల ఉత్పత్తి తగ్గుతోందన్న ప్రచారంలో వాస్తవం లేదనే విషయం స్పష్టమవుతోంది. గడిచిన ఎనిమిదేళ్లుగా దేశ వ్యాప్తంగా కానీ, రాష్ట్రంలో కానీ పంటల దిగుబడి చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. చిన్న కమతాల వల్ల పెట్టుబడి వ్యయం పెరుగుతోందని, దిగుబడికి సంబంధించి ఇబ్బంది లేకపోయినా.. ఆదాయం విషయంలోనే ఇబ్బందులు వస్తున్నాయని వ్యవసాయ రంగ నిపుణులు సైతం పేర్కొంటున్నారు. ఈ కారణంగానే కొందరు వ్యవసాయం వదిలిపెట్టి చిన్నచిన్న ఉద్యోగాల కోసం పట్టణాలకు తరలివెళ్తున్నారని చెబుతున్నారు. చాలావరకు హెక్టార్ కంటే తక్కువే.. దేశంలో చిన్న, సన్నకారు రైతులే దాదాపు 98 శాతం మేరకు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. చాలావరకు భూ కమతాలు ఒక హెక్టార్ (రెండున్నర ఎకరాలు) కంటే తక్కువగానే ఉన్నాయి. రెండు మూడు ఎకరాలున్న కుటుంబం విడిపోతే..ఆ భూమిని పంచుకోవడం వల్ల భూ కమతం మరీ తగ్గుతోంది. దీనితో కొందరు ఇతరుల పొలాలను కూడా కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నారు. రెండు హెక్టార్ల కంటే తక్కువ పొలాలు ఉన్న వారు దేశ రైతాంగంలో 86.2 శాతం ఉంటే, నాలుగు హెక్టార్ల కంటే తక్కువ తక్కువ భూ కమతాలున్న వారి శాతం 13.2 శాతంగా ఉంది. ఇక నాలుగు హెక్టార్ల కంటే అధికంగా భూ కమతం ఉన్నవారు కేవలం 0.96 శాతం మాత్రమే. రెండు హెక్టార్ల కంటే తక్కువ కమతాలున్న వారు 86.2 శాతం ఉన్నప్పటికీ.. వారి ఆధీనంలో సాగు అవుతున్న పొలం కేవలం 47.3 శాతం మాత్రమే కావడం గమనార్హం. మధ్యతరహా రైతులు 43.6 శాతం పొలాలు సాగు చేస్తుంటే.. అదే ఎక్కువ విస్తీర్ణంలో (4 హెక్టార్ల కంటే ఎక్కువ) కమతాలున్న రైతులు సాగు చేస్తున్న భూమి తొమ్మిది శాతం ఉండడం గమనార్హం. గణనీయంగా పెరిగిన చిన్నకారు రైతులు కేంద్రం ఐదేళ్లకోసారి నిర్వహించే వ్యవసాయ గణన ప్రకారం 2010–11లో ఒక హెక్టార్ కంటే తక్కువ పొలం ఉన్న చిన్నకారు రైతులు 117.25 మిలియన్లు ఉండగా, 2015–16 నాటికి 125.38 మిలియన్లకు పెరిగారు. అదే సమయంలో 1–4 హెక్టార్లలోపు కమతాలున్న వారు 19.72 మిలియన్ల నుంచి 19.30 మిలియన్లకు పడిపోగా, నాలుగు హెక్టార్ల కంటే అధికంగా ఉన్నవారు 0.98 లక్షల నుంచి 0.83 లక్షలకు తగ్గినట్లు వ్యవసాయ గణన వెల్లడించింది. దిగుబడులు పైపైకే.. భూ కమతాలు తగ్గితే దిగుబడులు తగ్గుతాయన్న దానిపై భిన్నమైన వాదనలు ఉన్నా.. గత పదేళ్ల లెక్కలు చూస్తే మాత్రం దేశంలో దిగుబడులు పెరుగుతూనే ఉన్నాయి. వాతావరణం సరిగా లేకపోవడం, అతివృష్టి, అనావృష్టి, తుపానులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే దిగుబడులు తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పొలంలో ఒకే రకమైన పంటలు వేయడం వల్ల కూడా ఆశించిన ఆదాయం రావడం లేదని చెబుతున్నారు. పంటను మారుస్తూ ఉండడంతోపాటు, పొలం సారవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటే దిగుబడులు మరింత పెరుగుతాయంటున్నారు... ఏ పంటలు సాగు చేస్తున్నామనేదే ముఖ్యం చిన్న కమతాలతో దిగుబడి తగ్గుతుందన్నది వాస్తవం కాదు. అసలు చిన్న కమతాల్లోనే ఎక్కువ సామర్థ్యంతో పంట పండించవచ్చు. అయితే ఏయే పంటలు వేస్తున్నామన్నది ముఖ్యం. ఓ కుటుంబానికి పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా వ్యవసాయంపై ఆదాయం రాకపోవడంతో అప్పులపాలు అవుతున్నారు. ఒక ఎకరా పొలం ఉన్న రైతుకు వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోని పరిస్థితి. దీనితో అప్పులు పెరుగుతున్నాయి. అయితే అంతర పంటలు వేయడం ద్వారా అదనపు ఆదాయం కోసం ప్రయత్నించడం మంచిది. విదేశాల్లో మనకంటే ఎక్కువ సబ్సిడీ అక్కడి రైతులు పొందుతున్నా.. వారు కూడా వ్యవసాయం చేయలేని పరిస్థితి అమెరికా, యూకే లాంటి దేశాల్లో ఉంది. – దొంతి నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయరంగ నిపుణులు -
రుణాలు బడా వ్యాపారులకేనా.. రైతులకు ఇవ్వరా?
సాక్షి, హైదరాబాద్: బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయలను నిరర్ధక ఆస్తుల(ఎన్పీఏ) కింద రద్దు చేసే పాలకులు, ఆరుగాలం కష్టపడే రైతుకు రుణమాఫీ చేయమంటే మాత్రం వెనకాడుతారెందుకని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అంబానీ, అదానీ, ఇతర సంపన్నులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.12 లక్షల కోట్ల రుణాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. గురువారం ఇక్కడి సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ రైతు ప్రభుత్వమా? లేక కార్పొరేట్ల ప్రభుత్వమా? అని నిలదీశారు. తెలంగాణ పర్యటనకు వచ్చి వెళ్లిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రైతు రుణమాఫీ గురించి చొరవ చూపితే బాగుండేదని హితవు పలికారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇప్పించి ఉంటే బాగుండేదన్నారు. కానీ, కేంద్రమంత్రి పర్యటన ఉపన్యాసాలకే పరిమితం కావడం విచారకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో రైతు రుణమాఫీ అమలు చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని, దీంతో రైతులు ఎక్కువ వడ్డీకి ప్రైవేట్ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాలతో పంట దిగుబడి రాక ప్రైవేటు అప్పులు తీర్చలేని పరిస్థితిల్లో రైతులు ఉన్నారని, ఈ దుస్థితి వారి ఆత్మహత్యలకు దారితీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి సమీక్ష నిర్వహించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు బ్యాంకర్ల నుంచి కొత్త రుణాలు ఇప్పించాలని భట్టి డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ‘నన్ను అవమానిస్తున్నారు’.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై ఫైర్ -
అప్పట్లో అత్యధిక సగటు అప్పు ఏపీ రైతులదే
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలోని రైతు కుటుంబాలు 2018లో సగటున రూ.2,45,554 మేర అప్పుల పాలయ్యారని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) నిర్వహించిన ఒక సర్వే తెలిపింది. 2018 జూలై నుంచి డిసెంబర్, 2019 జనవరి నుంచి జూన్ మధ్య తీసుకున్న సమాచారంతో 2019 జనవరి–డిసెంబర్ మధ్య నిర్వహించిన 77వ రౌండ్ సర్వే ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని భూములు, పశు సంపద, వ్యవసాయ కుటుంబాల పరిస్థితి అంచనాపై కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా రైతుల అప్పు సగటున రూ.74,121గా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా రైతుల అప్పు సగటున రూ.2,45,554గా ఉంది. ఏపీలో 93.2 శాతం రైతు కుటుంబాలపై అప్పుల భారం ఉంది. అలాగే తెలంగాణలో రైతు కుటుంబాల అప్పు సగటున రూ.1,52,113గా ఉంది. ఇక్కడ 91.7 శాతం రైతు కుటుంబాలపై అప్పుల భారం ఉందని సర్వే వెల్లడించింది. నెలవారీ ఆదాయం రూ.10 వేలే 2018–19 వ్యవసాయ సంవత్సరంలో వ్యవసాయ కుటుంబానికి నెలవారీ సగటు ఆదాయం రూ.10,218గా ఉందని సర్వే పేర్కొంది. 2018 జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రుణభారం 35 శాతం, పట్టణ ప్రాంతంలో ఇది 22.4 శాతంగా ఉందని మరో సర్వే నివేదికలో వెల్లడించింది. -
తెలంగాణలో రైతు రుణమాఫీకి సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీకి సర్వం సిద్ధమైంది. రూ. లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 36.80 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులని తేలగా అందులో గతేడాది 2.96 లక్షల మంది రైతులకు చెందిన రూ. 25 వేల వరకు రుణాలపై రూ. 408 కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 5,225 కోట్లు కేటాయించింది. అయితే ఈసారి ఏ రకంగా రుణమాఫీ సొమ్ము విడుదల చేయాలన్న దానిపై వ్యవసాయ శాఖ కసరత్తు చేసింది. అందుకోసం రెండు రకాల ఆప్షన్లను ప్రభుత్వం ముందుంచింది. గతంలో రూ. 25 వేల వరకు రుణాలు మాఫీ చేసినందున ఈసారి రూ. 25 వేల నుంచి రూ. 50 వేల మధ్య ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేయాలన్నది ఒక ఆప్షన్. ఈ కేటగిరీలో 8.02 లక్షల మంది రైతులు అర్హులుగా తేలారు. వారి కోసం రూ. 4,900 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇక రెండోది ప్రతి ఒక్కరికీ రూ. 25 వేలు మాఫీ చేయాలన్న ఆప్షన్‌ను తయారు చేశారు. అంటే రూ. 25 వేల నుంచి రూ. లక్షలోపు రుణాలున్న వారందరికీ రూ. 25 వేలు మాఫీ అవుతాయన్నమాట. ఈ ఆప్షన్ ప్రకారం చూస్తే 13.45 లక్షల మంది రైతులు అర్హులుగా తేలారు. అందుకోసం రూ. 5,100 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం రెండో ఆప్షన్ వైపే మొగ్గుచూపుతోందని వ్యవసాయ అధికారి ఒకరు తెలిపారు. వాస్తవంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ప్రతి ఒక్కరికీ ఊరటనిచ్చే విధంగానే రుణమాఫీ సొమ్ము విడుదల చేయాలి. కాబట్టి ఆ ప్రకారమే సర్కారు నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. రుణమాఫీకి సంబంధించి ఈ రెండు ఆప్షన్ల ప్రకారం రైతుల జాబితాను సిద్ధంగా ఉంచామని, ఆ మేరకు వివరాలను సర్కారుకు పంపించామని అధికారులు తెలిపారు. వీలైనంత త్వరలో సొమ్ము విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. చదవండి: రుణమాఫీ నిధులు విడుదల చేయాలి -
కుటుంబీకులే కాడెడ్లుగా..
పెద్దేముల్: ఇదివరకు పండించిన పంట గిట్టుబాటు కాక ఇప్పుడు మళ్లీ సాగు చేయలేని పరిస్థితులు రైతులకు ఏర్పడ్డాయి. దీంతో రైతులు తమ రెక్కలనే నమ్ముకున్నారు. ఈ క్రమంలో ఎడ్లకు అదనంగా చెల్లించలేక తన భార్యాకు మారుడిని కాడెడ్లుగా చేసుకుని పొలంలో దంతె పనులు చేయించాడు ఓ రైతు. ఆయనే పెద్దేముల్ మండలం కందనెల్లితండాకు చెందిన రైతు మాన్సింగ్. బుధవారం తన కుటుంబీకులతో పని చేయిస్తున్న దృశ్యం. -
59% రైతులకు రుణాలు అందడం లేదు
న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 59 శాతం రైతులకు రుణ పథకాలు అందడం లేదని ఓ సర్వేలో వెల్లడైంది. రుణ పథకాల సమాచారం వారికి అందనందునే ఇలా జరుగుతోందని వివరించింది. ‘గావ్ కనెక్షన్’ అనే స్వచ్ఛంద సంస్థ తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్ సహా 19 రాష్ట్రాల్లోని 18 వేల మంది రైతులను సర్వే చేసి ఈ విషయాలను గుర్తించింది. ప్రతి ఐదుగురు రైతుల్లో ఒకరు వాతావరణ మార్పుల కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు తేల్చింది. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రవమైన, వడగండ్ల వర్షాలు కారణంగా దేశవ్యాప్తంగా లక్షల మంది అన్నదాతలు సవాళ్లు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. ఉత్పత్తులకు సరైన ధర రావడం లేదని 43.6 శాతం మంది, పంట ధరలను నిర్ణయించే వెసులుబాటు తమకే ఉండాలని 62 శాతం మంది రైతులు అభిప్రాయపడ్డారు. అధిక రుణాల కారణంగా ఇబ్బందులు పడుతున్నట్టు 13 శాతం మంది పేర్కొన్నారు. సాగు సమాచారం కోసం ఫేస్బుక్, వాట్సాప్ వంటి వాటిని ఉపయోగిస్తామని 38 శాతం మంది రైతులు తెలిపారు. రైతు కుటుంబాల్లో తర్వాతి తరం వారు వ్యవసాయం చేయడానికి 48 శాతం మంది ఇష్టపడటం లేదని సర్వే తేల్చింది. -
ఆ వెయ్యితోనే సరా?
‘హలో.. 1100 అండీ.. నాపేరు మల్లేశ్వరరావు, మాది చీరాల. అన్నదాతా సుఖీభవ పధకం కింద తొలిసారి వేసిన వెయ్యి రూపాయలు వచ్చాయి గానీ రెండోసారి రూ.3 వేలు రాలేదండి. లైన్లో ఉంటా, ఒక్కసారి కనుక్కుంటారా?’ ‘మీ ఆధార్ నెంబర్ చెప్పండి.. మీకు అన్నదాతా సుఖీభవ వర్తించదు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా పంపిన నిబంధనల ప్రకారం మీరు అర్హులు కారు. ఒకసారి పీఎం కిసాన్ నిబంధనలు చదువుకోండి..’ (ఫోన్ కట్) ..మల్లేశ్వరరావు మళ్లీ ఫోన్ చేసి.. ‘ఒక్క నిమిషం నామాట వినండి.. తొలి విడత వెయ్యి రూపాయలు వచ్చాయండి. అందువల్ల నేను అర్హుడినే. రెండో విడత డబ్బులు మాత్రం రాలేదండీ..’ ‘అప్పుడు ఎన్నికలు అని అందరికీ వేసినట్టున్నారు. ఇప్పుడు మాత్రం మీరు అర్హులు కాదని రికార్డులు చెబుతున్నాయి. ఇంతకు మించి మాకు ఏమీ తెలియదు...’ సాక్షి, అమరావతి : అన్నదాతా సుఖీభవ పథకానికి సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే 1100 నెంబర్లో సంప్రదించాలని సూచించిన టీడీపీ సర్కారు ఇప్పుడు ఆ పేరు చెబితేనే ఫోన్ కట్ చేస్తున్నారని రైతన్నలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతా సుఖీభవ డబ్బులు తమ ఖాతాలకు జమ కాలేదంటూ 1100 కాల్ సెంటర్‌కు నిత్యం వందల సంఖ్యలో కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నా అటువైపు నుంచి మాత్రం ఒకే సమాధానం వస్తోంది. ‘ఆ పథకం మీకు వర్తించదు... కావాలంటే నిబంధనలు చదువుకోండి’ అంటూ ఫోన్ కట్ చేస్తున్నారు. నది దాటే వరకు ఓడ మల్లయ్య.. దాటాక బోడి మల్లయ్య అంటే ఇదేనంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇప్పటికే రైతులందరికీ ఈ పథకం కింద డబ్బులు జమ కావాల్సి ఉండగా ప్రభుత్వం చేతులెత్తేసింది. అంతా ఆయనే ఇస్తున్నట్లు ప్రచారం ఐదు ఎకరాల లోపు పొలం ఉండే రైతు కుటుంబాలకు ఏటా రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రకటించింది. ఇది చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకూ ఈ పథకం వర్తించదు. రాష్ట్రంలో 85 లక్షల మందికిపైగా రైతులుండగా 37,97,234 మంది పీఎం కిసాన్ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు హడావుడిగా అన్నదాతా సుఖీభవ పథకాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబు రైతు కుటుంబాలకు రూ.9 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఈ లెక్కన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఇచ్చే మొత్తం రూ.15 వేలు అవుతుంది. అయితే ఇదంతా తానొక్కడినే ఇస్తున్నాననే తరహాలో చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. అనుకూల మీడియాలో ప్రచారం పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.2 వేలను జమ చేసిన అనంతరం అన్నదాతా సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా తొలి విడతగా రూ.వెయ్యి జమ చేస్తున్నట్లు ప్రకటించుకుంది. అయితే ఐదు ఎకరాలకుపైగా ఉన్న వారి నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుండడంతో ఓట్ల కోసం పీఎం కిసాన్ పథకం పరిధిలోకి రాని రైతులకు కూడా ఏడాదికి రూ.10 వేలు ఇస్తామంటూ చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు రూ.వందల కోట్లలో నిధులు విడుదలైనట్లు తన అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. ఎన్నికలు ముగియడంతో అసలు బండారం బయట పడుతోంది. రుణమాఫీ తరహాలోనే ఈ పథకం కూడా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం ఆకర్షణీయమైన హామీలిచ్చి తరువాత గాలికి వదిలేయడం ఆయనకు అలవాటేనని మండిపడుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత కోటయ్య కమిటీ, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో వడ్డీలకు కూడా చాలని విధంగా దగా చేయడంతో డిఫాల్టర్లుగా మిగలడం తెలిసిందే. ఇప్పుడు అన్నదాతా సుఖీభవ పథకం కూడా అదే కోవలోకి చేరింది. ఎన్నికలకు ముందు తొలి విడతగా రూ.వెయ్యి అందుకున్న వారు మలివిడత రూ.3 వేలు పొందేందుకు ఎందుకు అర్హులు కారో బోధపడటం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బకాయి చెల్లించు..ఓటు అడుగు!
చంద్రబాబు మోసానికి పరాకాష్ట ఖరీఫ్–2013లో జరిగిన పంట నష్టానికి సంబంధించి రూ.643.37 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ (పెట్టుబడిరాయితీ)ని చెల్లిస్తామంటూ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఘనంగా ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన పంట నష్టాలు తనకు సంబంధం లేదంటూ బుకాయించారు. 2013 ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 8,98,402 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. అందులో ప్రధాన పంట వేరుశనగ 7,11,145 హెక్టార్లలో వేశారు. ఖరీఫ్ పంటల సాగు కోసం రూ.2 వేల కోట్లు వరకు పెట్టుబడి రూపంలో రైతులు ఖర్చు చేశారు. దాదాపు రూ.3,500 కోట్లు విలువ చేసే పంట దిగుబడులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వరుణుడు మొహం చాటేయడంతో పంటలన్నీ దాదాపు ఎండిపోయాయి. సెప్టెంబర్ నెలల్లో మంచి వర్షాలు కురిసినా అప్పటికే నష్టం జరిగిపోయింది. పంట కోత ప్రయోగాలు చూస్తే హెక్టారుకు సగటున కేవలం 350 కిలోలు కూడా రాలేదు. అందులోనూ పామిడి మండలంలో హెక్టారుకు 76 కిలోలు, శెట్టూరు మండలంలో 77 కిలోలు, రాప్తాడు మండలంలో 86 కిలోలు, కంబదూరులో 87 కిలోలు, తాడిపత్రిలో 95 కిలోలు, పెద్దపప్పూరులో 98 కిలోలు... ఇలా చాలా మండలాల్లో వేరుశనగ, ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 63 మండలాలను కరువు జాబితాలోకి చేర్చడంతో అధికారులు పంట నష్టం అంచనాలు వేశారు. చివరకు 7.43 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు. 6,21,528 మంది రైతులకు రూ.643.37 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం వెంటనే ఆమోదించి రైతులకు పరిహారం చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. అయితే 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పంట నష్టం తనకు సంబంధం లేదంటూ రూ.643 కోట్లు ఇవ్వకుండా మోసం చేయడంతో రైతులు కోలుకోలేకపోయారు. రుణమాఫీ పరిస్థితి ఇలా... ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేయకపోవడంతో రైతులు ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నాటికి జిల్లాలో పంట, బంగారు నగలు, ఇతరత్రా అనుబంధ రంగాలకు సంబంధించి 10.24 లక్షల ఖాతాల పరిధిలో రూ.6,817 కోట్ల మేర రుణాలు ఉన్నాయి. చంద్రబాబు చెప్పినట్లుగా ఇవన్నీ మాఫీ చేయాలి... కోటయ్య కమిటీ, కుటుంబరావు కమిషన్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, కుటుంబ సభ్యుల పరిమితి, పంట, బంగారు నగలు అంటూ... రకరకాల నిబంధనలు, షరతులు పెట్టి ఏడాది పాటు కాలయాపన చేశారు. చివరకు పంట, బంగారు నగలకు సంబం«ధించి రూ.2,744 కోట్లు మాఫీకి అంగీకరించారు. అది కూడా ఒకేసారి కాకుండా విడతల వారీ అంటూ నాన్చేశారు. 2018లోపు ఐదు విడతల్లో ఇస్తామని ప్రకటించి.. ఇప్పటికీ నాలుగు, ఐదు విడతలు పెండింగ్‌లో పెట్టారు. అలాగే మూడో విడత కింద కొంత పెండింగ్ ఉంది. మొత్తమ్మీద రుణమాఫీ కింద 5.50 లక్షల మంది రైతులకు రూ.1,165 కోట్లను ఈ ప్రభుత్వం ఎగనామం పెట్టింది. పంటల బీమా పరిస్థితి ఇలా.. 2017 రబీలో ఫసల్‌బీమా కింద 12 వేల మంది పప్పుశెనగ రైతులు రూ.2 కోట్ల వరకు బీమా ప్రీమియం చెల్లించారు. పంట దారుణంగా దెబ్బతిన్నా... ఇప్పటి వరకూ పరిహారంపై అతీగతి లేదు. 2018 ఖరీఫ్‌లో 5.40 లక్షల మంది వేరుశనగ రైతులు తమ వాటా కింద రూ.83 కోట్ల వరకు బీమా ప్రీమియం కట్టారు. పంట మొత్తం పోయినా పరిహారం ప్రకటించలేదు. అదే ఏడాది రబీలో కూడా 1.05 లక్షల మంది పప్పుశెనగ రైతులు రూ.5 కోట్లకు పైగా బీమా ప్రీమియం చెల్లించారు. ఎకరాకు 50 కిలోలు కూడా దిగుబడులు రాలేదు. ఈ పరిహారాన్ని చెల్లించకుండా మోసం చేశారు. ఇలా బీమా పథకాల కింద ఎంతలేదన్నా... రూ.1,000 నుంచి రూ.1,200 కోట్లు పరిహారాన్ని రైతులకు ఈ ప్రభుత్వం దక్కకుండా చేసింది. అలాగే రుణమాఫీ ఆలస్యం కావడంతో 2014లో జిల్లా రైతులకు పంట రుణాలు దక్కలేదు. ప్రీమియం చెల్లించే అవకాశం లేకపోవడం కారణంగా పంటలు దెబ్బతిన్నా... పంటల బీమా కింద పరిహారం దక్కకుండా పోయింది. దీని వల్ల దాదాపు రూ.200 కోట్లు మేర జిల్లా రైతులు నష్టపోయారు. ఇలా... చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు అడుగడుగునా నష్టాలను మూటగట్టుకున్నారు. ఇవన్నీ మరిపించే యత్నంగా అన్నదాత సుఖీభవ అంటూ ఒక్కో రైతుకుటుంబం ఖాతాలో కేవలం రూ.1,000 జమ చేస్తున్నారు. దీని కింద ఇప్పటివరకూ జిల్లా రైతుల ఖాతాల్లోకి రూ.50 కోట్ల మేర జమ అయినట్లు చెబుతున్నారు. ఇంకా లక్ష మందికి పైగా రైతులు సుఖీభవ సొమ్ము కోసం తిరుగుతున్నారు. జిల్లా రైతులకు అందాల్సిన పరిహారం ఇలా... ఇన్పుట్ సబ్సిడీ 2,460కోట్లు ఇన్సూరెన్స్ 1,200కోట్లు రుణమాఫీ 1,165కోట్లు ఇతరాత్ర 175కోట్లు మొత్తం 5,000కోట్లు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రైతులకు రమారమి రూ. 5వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2013 ఇన్పుట్ మొదలుకుని... వాతావరణ బీమా, ఫసల్‌బీమా, రుణమాఫీ, 2018 ఇన్పుట్ వరకు... జిల్లా రైతులకు అందజేయాల్సిన ఇంత పెద్ద మొత్తాన్ని ఇవ్వకుండా మభ్య పెడుతూ వచ్చారు. చివరకు అన్నదాత సుఖీభవ అంటూ రూ.50 కోట్లు చిల్లర విదిలించి పండుగ చేసుకోండంటూ రైతులను దగా చేశారు. ఐదేళ్ల పాటు రైతులను కన్నీళ్లు పెట్టించిన చంద్రబాబు సర్కారు.. ఎన్నికల సమయంలో తనదైన శైలి మోసపూరిత వాగ్ధానాలతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అన్నదాతపై వరాలు, వాగ్ధానాలు గుప్పించి గట్టెక్కగానే రైతు సంక్షేమాన్ని విస్మరించడం చంద్రబాబుకు ముందు నుంచి అలవాటు. రైతులకు దక్కాల్సిన ఇన్పుట్ పరిహారం ఇలా.. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2013 ఖరీఫ్‌లో జరిగిన పంట నష్టం సొమ్ము రూ.643 కోట్లను రైతులకు చెల్లించకుండా చంద్రబాబు సర్కార్ ఎగ్గొట్టింది. ఈ పంట నష్టం తమ ప్రభుత్వ హయాంలోనిది కాదంటూ బుకాయించి, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మోసానికి తెరలేపారు. దీంతో 6.21 లక్షల మంది రైతులకు ఇన్పుట్ పరిహారం దక్కకుండా పోయింది. 2014 ఖరీఫ్‌లో జరిగిన పంట నష్ట పరిహారానికి సంబంధించి రూ.567 కోట్లు ఇవ్వగా అందులో రూ.35 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మళ్లించి, ఇతర అవసరాలకు వాడుకున్నారు. 2015లో రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఇన్పుట్ పరిహారం మంజూరు చేసిన చంద్రబాబు సర్కారు... పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన ‘అనంత’ రైతులకు మాత్రం పైసా విదల్చలేదు. దీంతో ఎంతలేదన్నా రూ.500 కోట్లు పరిహారం రైతులు కోల్పోయారు. 2015 నవంబర్‌లో సంభవించిన వరుస తుఫాన్లకు వేరుశనగ పంట పొలాల్లోనే కుళ్లిపోయి కనీసం పశుగ్రాసానికి కూడా పనికిరాకుండా పోయింది. ఇందుకు సంబంధించి జిల్లాలోని 16 వేల మంది రైతులకు రూ.23 కోట్లు ఇన్పుట్ ఇస్తామని అతీగతి లేకుండా చేశారు. 2016 ఖరీఫ్‌కు సంబంధించి మంజూరు చేసిన ఇన్పుట్ పరిహారంలో ఇప్పటికీ రూ.65 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. ఇన్పుట్ జాబితాలో అధికార పార్టీ జోక్యం మితిమీరిపోవడంతో వేలాది రైతులకు పరిహారం రాలేదు. దీంతో అర్జీలు ఇస్తే పరిహారం ఇస్తామంటూ ప్రకటించడంతో 1.15 లక్షల మంది అర్జీలు సమర్పించారు. అర్జీలు పరిశీలించిన తర్వాత రూ.143 కోట్లు ఇన్పుట్ అవసరమంటూ అధికారులు నివేదిక ప్రభుత్వానికి పంపినా ఉలుకూ పలుకు లేదు. 2018లో 45 శాతం లోటు వర్షపాతం నమోదుతో ఖరీఫ్, రబీ పంటలు 100 శాతం దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖరీఫ్‌లో జిల్లాలోని 63 మండలాలు, రబీలో 32 మండలాలను కరువు జాబితాలోకి ప్రకటించింది. ఈ క్రమంలో ఖరీఫ్ పంట నష్టం కింద రూ.967 కోట్లు, రబీ పంట నష్టం కింద రూ.100 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ సొమ్మునూ ఇవ్వకుండా మోసం చేశారు. ఇవి కాకుండా మధ్య మధ్యలో అకాల వర్షాలు, అధిక వర్షాలు, వడగండ్లు, ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి రూ.10 కోట్ల వరకు పరిహారం అందాల్సి ఉంది. ఇలా... కేవలం ఇన్పుట్ సబ్సిడీ కిందనే రూ.2,460 కోట్లకు పైగా పరిహారాన్ని రైతులకు చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. దగా చేశారు నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. బత్తలపల్లిలోని కార్పొరేషన్ బ్యాంక్‌లో రూ.80వేలు పంట రుణం తీసుకున్నా. రుణమాఫీ కింద రూ.30 వేలు మాత్రమే మాఫీ చేశారు. మిగిలిన మొత్తం అలాగే ఉంది. పంట నష్ట పరిహారం కానీ, ఇన్పుట్ సబ్సిడీ కాని ఒక్క రూపాయి కూడా అందలేదు. పంటలు నష్టపోయినా ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా డబ్బులు పడలేదు. – బి.లక్ష్మీరెడ్డి, రైతు, ఎం.చెర్లోపల్లి, బత్తలపల్లి మండలం ఎలాంటి సాయమూ అందలేదు నాకు 5.15 ఎకరాల భూమి ఉంది. బత్తలపల్లి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో రూ.1.20 లక్ష పంట రుణం తీసుకున్నా. రెండు విడతల్లో రూ.56 వేలు మాఫీ అయింది. మూడో విడత బాండ్‌తో సరిపెట్టారు. 4, 5 విడతలకు నిధులు విడుదల చేయలేదు. పంట నష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీలు ఏదీ అందలేదు. రైతులకు ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నది పచ్చి నిజం. – పాళ్యం అప్పస్వామి, రైతు, గంటాపురం, బత్తలపల్లి మండలం చంద్రబాబు పచ్చి మోసకారి నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. వర్షాలు రాక పంటలు ఎండిపోయాయి. 2013లో రొళ్ల ఏబీజీబీలో పంట రుణం కింద రూ.90 అప్పు తీసుకున్నా. చంద్రబాబు లెక్క ప్రకారం పూర్తిగా రుణమాఫీ కావాల్సి ఉంది. అయితే రూ.50వేలు పైబడి రుణాలు పొందిన రైతులకు ప్రతి ఏడాది 20 శాతం చొప్పున మాఫీ చేస్తామని చెప్పి మూడు విడతలు మాత్రమే అందించారు. మిగిలిన 4, 5 విడతల మాఫీ సొమ్ము జమ చేయలేదు. దీంతో వడ్డీ, అసలు కలుపుకుని ప్రస్తుతం రూ.లక్షకు అప్పు చేరుకుంది. ఈ చంద్రబాబు పచ్చి మోసకారి. నమ్మగూడదు. – రైతు సన్నదాసప్ప, ఆర్.గొల్లహట్టి గ్రామం, రొళ్ల మం‘‘ రూపాయి పరిహారం ఇచ్చుంటే ఒట్టు నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఏటా ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు చేస్తుంటాను. 2015, 2016లో జరిగిన పంట నష్టాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదు. పలుమార్లు అధికార కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. నాతో పాటు మా ఊళ్లో మరో పది రైతులకూ పరిహారం అందలేదు. టీడీపీ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి మేలు జరగదు అనేందుకు మేమే ఉదాహారణ. – లెనిన్ బాబు, రైతు, బెస్తరపల్లి, కుందుర్పి మం‘‘ -
సేద్యానికి ‘చంద్ర’గ్రహణం
పరిహారంపై సన్నగిల్లుతున్న ఆశలు గత ఏడాది డిసెంబర్లో కేంద్ర కరువు బృందం పర్యటించి జిల్లా కరువు తీవ్రతను గుర్తించింది. జిల్లాలో 6.77 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా 6.95 లక్షల మంది రైతులకు రూ.937.40 కోట్లు పంట నష్టం వాటిల్లినట్లు తేల్చారు. మొత్తమ్మీద గత ఏడాది పంట పెట్టుబడులు, దిగుబడులు పరిగణలోకి తీసుకుంటే జిల్లా రైతులకు రూ.3,600 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అయితే ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రకారం రూ.937 కోట్లు ఇన్పుట్ సబ్సిడీకి ఇంకా ఆమోదం తెలపకపోవడంతో పరిహారంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. రబీదీ అదే దుస్థితి ఖరీఫ్ 2018 కల్లోలం కాగా కనీసం ఆదుకుంటుందనుకున్న రబీ కూడా దారుణంగా దెబ్బతీసింది. 77 వేల హెక్టార్లలో చేపట్టిన పప్పుశనగ సాగులో ఎక్కడా ఎకరాకు 50 కిలోలు కూడా దిగుబడులు రాలేదు. రూ.600 కోట్లకు పైగా రైతులు భారీగా నష్టపోయారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 155.5 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 50 మి.మీ నమోదైంది. 67 శాతం లోటు వర్షపాతంతో రబీ ప్రధానపంట పప్పుశనగతో పాటు మరికొన్ని పంటలు దాదాపు 2 లక్షల ఎకరాల్లో దారుణంగా దెబ్బతిన్నాయి. గత రబీలో జిల్లా రైతులకు రూ.700 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. రబీలో కూడా 32 మండలాలను కరువు జాబితాలోకి ప్రకటించి చంద్రబాబు సర్కారు చేతులుదులుపుకుంది. రూ.100 కోట్లు పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదించినా... పరిహారం ఇచ్చే అంశంపై చంద్రబాబు ప్రభుత్వం ఉలుకుపలుకూ లేదు. రుణమాఫీ పరిస్థితి ఇలా... 2014 నాటికి జిల్లాలో రైతు రుణాలు రూ.6,817కోట్లు కమిటీలు, కొర్రీల కింద పక్కన పెట్టిన రుణాలు రూ.4,073కోట్లు చివరకు పంట,బంగారు రుణాల మాఫీకి అర్హత రూ.2,744కోట్లు ఒకేసారి మాఫీ అయిన మొత్తం రూ.650కోట్లు మొదటి విడతగా మాఫీ అయిన మొత్తం రూ.418కోట్లు రెండో విడతగా మాఫీ అయిన మొత్తం రూ.461కోట్లు మూడో విడత మాఫీ రూ.502కోట్లు ఇప్పటిదాకా జమ అయిన మాఫీ సొమ్ము రూ.1,906కోట్లు రెండు,మూడు విడతల్లో పెండింగ్ రూ.33కోట్లు గిట్టుబాటూ ఎండమావే జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేదు. గిట్టుబాటు ధర కూడా ఎండమావిగానే మారింది. గత ఏడాది వేరుశనగ క్వింటాకు రూ.4,890 ప్రకారం కనీస మద్ధతు ధర ప్రకటించినా మార్కెట్లో కనీసం రూ.3,500 ప్రకారం కూడా కొనలేదు. వేరుశనగతో పాటు పత్తి, ఆముదం, మొక్కజొన్న లాంటి ఉత్పత్తులకు కూడా మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కలేదు. ప్రకటించిన ఎంఎస్పీ కన్నా మార్కెట్లో తక్కువ ధర ఉన్న సమయంలో ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, నాఫెడ్ లాంటి ప్రభుత్వరంగ నోడల్ ఏజెన్సీల ద్వారా పంట దిగుబడులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఈ ఐదేళ్లలో రెండు సార్లు మాత్రమే అరకొరగా రైతుల నుంచి వేరుశనగ, కంది, మొక్కజొన్న, çపప్పుశనగను ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పండిన పంటలో 25 శాతం కూడా కొనకపోవడంతో రైతులు నష్టాలపాలయ్యారు. జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేదు. గిట్టుబాటు ధర కూడా ఎండమావిగానే మారింది. గత ఏడాది వేరుశనగ క్వింటాకు రూ.4,890 ప్రకారం కనీస మద్ధతు ధర ప్రకటించినా మార్కెట్లో కనీసం రూ.3,500 ప్రకారం కూడా కొనలేదు. వేరుశనగతో పాటు పత్తి, ఆముదం, మొక్కజొన్న లాంటి ఉత్పత్తులకు కూడా మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కలేదు. ప్రకటించిన ఎంఎస్పీ కన్నా మార్కెట్లో తక్కువ ధర ఉన్న సమయంలో ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, నాఫెడ్ లాంటి ప్రభుత్వరంగ నోడల్ ఏజెన్సీల ద్వారా పంట దిగుబడులను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే ఈ ఐదేళ్లలో రెండు సార్లు మాత్రమే అరకొరగా రైతుల నుంచి వేరుశనగ, కంది, మొక్కజొన్న, çపప్పుశనగను ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పండిన పంటలో 25 శాతం కూడా కొనకపోవడంతో రైతులు నష్టాలపాలయ్యారు. పై చిత్రంలోని రైతు పేరు ప్రభాకర్‌రెడ్డి. పోతులనాగేపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు రెండు ఎకరాలలో బెండ పంట సాగు చేశాడు. బోరు బావిలో అరకొర వస్తున్న నీటితో పంటను కాపాడుకుంటూ వచ్చాడు. ఉన్న ఫలంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పని చేయకుండా పోయింది. ఈ విషయాన్ని తోటి రైతులతో కలసి పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా వారి నుంచి స్పందన లేదు. ఈక్రమంలో నీరందక పంట ఎండిపోతోంది. చేతి కొచ్చిన పంటను ఎండిపోకుండా ఒక్కో ట్యాంకర్‌కు రూ.600 చెల్లించి నీటిని తోలుతున్నాడు. తన కష్టం ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట ఎండిపోతే తీవ్రంగా నష్టపోతానని, ఇలా ఎన్ని రోజులు ట్యాంకర్‌తో నీళ్లు తోలుకోవాలో దిక్కు తెలియడం లేదని ఆందోళన చెందుతున్నాడు. ఇలాంటి పరిస్థితి ఈ రైతు ఒక్కడిదే కాదు పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసిన రైతులందరిదీ. – ధర్మవరం రూరల్ ఈ ఫొటోలోని రైతు పేరు నాగేంద్రప్ప, వలస గ్రామం, అమరాపురం మండలం. ఈయన పేరిట 4–50 ఎకరాల పొలం ఉంది. పంటలు సాగు చేయడానికి స్థానిక సిండికేట్ బ్యాంకులో 2013లో రూ. 1.2 లక్షల రుణం తీసుకున్నాడు. ఏటా సకాలంలో రుణం రెన్యూవల్ చేయించుకుని వడ్డీ రాయితీ పొందేవాడు. అయితే 2014 ఎన్నికల్లో రైతు రుణాలను మాఫీ చేస్తామని, రైతులు రుణాలు కట్టొద్దని చంద్రబాబుతోపాటు టీడీపీ నాయకులు చెప్పడంతో ఈ రైతు కూడా రుణానికి సంబంధించి వడ్డీ కూడా చెల్లించలేదు. తర్వాత ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ మొత్తం వడ్డీకే సరిపోయింది. బ్యాంకులో అప్పు మాత్రమే అలాగే ఉంది. – అమరాపురం పొలంలోనే వదిలేశా.. రూ.లక్ష పెట్టుబడి పెట్టి గత ఖరీప్‌లో వర్షాధారం కింద 8 ఎకరాల్లో వేరుశనగ సాగుచేశా. కానీ పంట సాగుచేసిన తర్వాత రెండు నెలలైనా వాన జాడ లేకపోవడంతో పంటంతా నిట్టనిలువునా ఎండిపోయింది. ఒక్క వర్షం పడినా పెట్టుబడులు వచ్చి, పశువుల మేత అయినా దక్కుతుందనుకున్నా. కాని చివరి వరకు వర్షం రాకపోవడంతో పంటను పొలంలోనే వదిలేశా. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటుందనుకుంటే అసలు పట్టించుకోవడం లేదు. – తలారి నరసింహులు, వేరుశనగ రైతు, కనగానపల్లి బీమా పరిహారం నిల్ ఫసల్ బీమా కింద 11 వేల మంది పప్పుశనగ రైతులు 2017 రబీలో రూ.2 కోట్లు ప్రీమియం చెల్లించారు. వర్షాభావంతో పంట చేతికి అందకుండా పోయింది. ఇందుకు సంబంధించిన పరిహారం నేటికీ అందలేదు. 2018 ఖరీఫ్‌లో 5.40 లక్షల మంది వేరుశనగ రైతులు రూ.82 కోట్లు ప్రీమియం కట్టారు. ఈ పరిహారం ఇంకా ప్రకటించలేదు. అదే ఏడాది రబీలో కూడా 1.05 లక్షల మంది పప్పుశనగ రైతులు రూ.5 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించినా పరిహారం అతీగతి లేకుండా పోయింది. అంతకు మునుపు కూడా 2014, 2015, 2016లో వేరుశనగ ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. జిల్లా రైతులు ఏటా రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్లు వరకు బీమా ప్రీమియం చెల్లించనా... పరిహారం మాత్రం కంటితుడుపుగా విడుదల చేశారు. ప్రభుత్వంతో పాటు బీమా కంపెనీలు కూడా దగా చేయడంతో రైతులు ఆర్థికంగా చితికిపోయారు. రైతు విలవిల అధికారిక లెక్కల ప్రకారం గత 25 ఏళ్ల జిల్లా వ్యవసాయ చరిత్ర తిరగేస్తే.. కేవలం నాలుగు సంవత్సరాల్లో మాత్రమే వేరుశనగ పంట అంతో ఇంతో చేతికొచ్చింది. మిగిలిన 20 సంవత్సరాలు పెట్టుబడులు కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. సగటున ఎకరాకు 10 బస్తాలు లేదా హెక్టారుకు వెయ్యి కిలోల వరకు దిగుబడులు వస్తే పంట బాగా వచ్చినట్లు లెక్క. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1995 నుంచి 2018 వరకు వేరుశనగ పంట దిగుబడులు పరిగణలోకి తీసుకుంటే అందులో 1995, 1998, 2000, 2006లో మాత్రమే పంట పండింది. ఆ తర్వాత 1996, 2004, 2017లో పెట్టుబడులు దక్కించుకున్నారు. ఇక మిగిలిన 18 ఏళ్లు సర్వం కోల్పోయారు. శతాబ్దాల చరిత్ర పునరావృతం జిల్లా గత 140 సంవత్సరాల వర్షపాతం చరిత్ర తీసుకుంటే ఈ ఏడాదే అతి తక్కువ వర్షం కురిసింది. జిల్లా సాధారణ వర్షపాతం 552.3 మి.మీ కాగా గత జూన్ నుంచి ఇప్పటివరకు కేవలం 274 మి.మీ వర్షం కురిసింది. అంటే సా«ధారణం కన్నా 45 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు రెండూ ఈ సారి మొహం చాటేయడంతో వర్షం జాడ కరువైపోయింది. ఈ శతాబ్ధిలో నమోదైనంతగా లోటు వర్షపాతం గతంలో ఎన్నడూ లేదు. ఈ‘సారీ’ దారుణం గత ఏడాది పరిస్థితి మరింత దారుణంగా మారింది. కీలకమైన ఖరీఫ్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 338.4 మి.మీ గానూ 261 మి.మీ వర్షం కురిసింది. అంటే కురవాల్సిన దాని కన్నా 37 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో 7 లక్షల హెక్టార్లలో సాగు చేసిన ప్రధాన, ప్రత్యామ్నాయ పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తుగానే 2018 ఆగస్టులో తొలి విడతలో 44 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత రెండో విడతగా అదే ఏడాది సెప్టెంబర్‌లో మిగిలిన 19 మండలాలను కూడా కరువు జాబితాలోకి చేర్చింది. పడకేసిన ప్రత్యామ్నాయం చంద్రబాబు హయాంలో వ్యవసాయంతో పాటు ప్రత్యామ్నాయమైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్లతోటల మనుగడ కూడా పడకేసింది. సబ్సిడీ, రాయితీలు, పథకాలు, బడ్జెట్ కేటాయింపుల్లో రైతులను సీఎం చంద్రబాబు దగా చేస్తూ వచ్చారు. కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయనియ్యకుండా అంతో ఇంతో తిరిగి ప్రభుత్వ ఖజానాకే జమ అయ్యేలా చేశారు. ఈ ఐదేళ్లలో ఉద్యానశాఖ ద్వారా రూ.50 కోట్లు వెనక్కి మళ్లిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యానహబ్ అంటూ ఊరించినా దాని ఊసే లేకుండా చేశారు. పండిన పండ్ల ఉత్పత్తులు అమ్ముకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గిట్టుబాటు ధరలు లేక చాలా సార్లు టమాట పంట రోడ్డున పడేస్తున్న దుస్థితి నెలకొంది. చీనీ, దానిమ్మ, అరటి, మామిడి, కర్భూజా, కళింగర, దోస, బొప్పాయి, మిరప లాంటి పంట ఉత్పత్తులకు కూడా గిట్టుబాటు ధరలు లభించక నష్టాలపాలవుతున్నారు. పశుశాఖకు కేటాయించిన బడ్జెట్ ఐదేళ్లలో రూ.60 కోట్లు కాగా, ఇందులో పాడి రైతులకు ఉపయోగపడే ఒక్క పథకమూ అమలు చేయలేదు. చంద్రబాబు ప్రైవేట్ డైయిరీను ప్రోత్సహిస్తుండటంతో ప్రభుత్వ డెయిరీ నిర్వీర్యమైపోయింది. పదేళ్ల కిందటనే రోజుకు 60 నుంచి 70 వేల లీటర్లు పాలు సేకరిస్తున్న ప్రభుత్వ డెయిరీలో ఇపుడు రోజుకు 6 వేల లీటర్లు కూడా రావడం లేదు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో 1.81 లక్షల హెక్టార్లలో విస్తరించిన పండ్లతోటల మనుగడకు విఘాతం ఏర్పడింది. అలాగే ఏటా రూ.800 కోట్లు టర్నోవర్ కలిగిన పట్టుపరిశ్రమను నమ్ముకున్న రైతులూ రూ.200 కోట్లకు పైగా నష్టాలు మూటగట్టుకున్నారు. రుణమాఫీ పూర్తిగా చేయలేదు అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబునాయుడు తిరిగి ఎన్నికలు వచ్చినా పూర్తిగా మాఫీ చేయలేదు. గత మూడు విడతల రుణమాఫీ మొత్తం గత అప్పు¯నకు చెల్లించాల్సిన వడ్డీకే సరిపోయింది. ఇక 4, 5 విడతల రుణమాఫీ మొత్తం బ్యాంకు ఖాతాకు ఇప్పటికీ జమ కాలేదు. తిరిగి ఎన్నికలు వచ్చాయి. అయినా ఇప్పటికీ మాఫీ చేసింది లేదు. హామీ నెరవేర్చలేని చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెబుతాం. – బాలునాయక్, తిప్పేపల్లి, ఓడీచెరువు నయాపైసా మాఫీ కాలేదు నాకు మా గ్రామ సమీపంలో 4 ఎకరాల పొలం ఉంది. సిండికేట్ బ్యాంకులో రూ.1.5 లక్షల అప్పు ఉంది. సీఎం చంద్రబాబునాయడు 2014 ఎన్నికల ముందు రైతుల రుణాలు మాఫీ చేస్తానని గొప్పగా ప్రకటించారు. అయినా నాకు ఇంత వరకూ నయాపైసా కూడా మాఫీ కాలేదు. ఈ ప్రభుత్వం ప్రచారం చేయడమే తప్ప రైతులను ఆదుకోవడం లేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదు. – శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి, లేపాక్షి మం -
పీఎం–కిసాన్‌పై రైతుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: పీఎం–కిసాన్ పథకం లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేదంటూ వేలాది మంది రైతులు వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేస్తున్నారు. గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో) జాబితాలను ప్రదర్శిస్తుండటంతో వాటిల్లో తమ పేరు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం రైతుల కోసం పీఎం–కిసాన్ పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ పథకం కింద ఐదెకరాలలోపున్న రైతులకు నిబంధనల మేరకు ఏడాదికి రూ.6 వేలు సాయం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. విడతకు రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో సాయం చేస్తారు. ఆ పథకం కింద సన్నచిన్నకారు రైతులు లబ్ధిపొందుతారు. అందుకు సంబంధించి అర్హులను గుర్తించే పనిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ వద్ద ఉన్న లెక్కల ప్రకారం దాదాపు 26 లక్షల మంది సన్నచిన్నకారు రైతులకు అర్హత ఉండొచ్చని అంటున్నారు. వారి జాబితాలను గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారు. అయితే అర్హులైనవారి పేర్లు కూడా జాబితాల్లో కనిపించడం లేదు. దీంతో వేలాది మంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అనేకమంది వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు తరలివస్తున్నారు. చేతులెత్తేస్తున్న అధికారులు... నల్లగొండ జిల్లాకు చెందిన యాదయ్యకు మూడున్నర ఎకరాల భూమి ఉంది. భూమి కూడా అతని పేరు మీదే ఉంది. కానీ పీఎం–కిసాన్ పథకంకోసం తయారు చేసిన జాబితాలో అతని పేరు కనిపించలేదు. అతను శనివారం వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు వచ్చి తన పే రు ఎందుకు లేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే సిద్దిపేట జిల్లాకు చెందిన చంద్రయ్య అనే రైతుకు నాలుగుంబావు ఎకరా ల భూమి ఉంది. తన భార్య పేరు మీద రెండెకరాలు, తన పేరు మీద రెండుంబావు ఎకరాల భూమి ఉంది. నిబంధనల ప్రకారం అతను పీ ఎం–కిసాన్ పథకానికి అర్హుడు. కానీ అతని పే రు కూడా జాబితాలో లేదు. చంద్ర య్య కూడా వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. అధికారులు తమ పే ర్లు నమోదు చేయకపోవడంపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైతుల నుంచి ఫి ర్యాదులు వస్తుంటే ఏంచేయాలో అర్థంగాక అధికారులు చేతులెత్తేస్తున్నారు. తాము పరిశీలించి న్యాయం చేస్తామని రైతులను తిప్పి పంపు తున్నారు. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు వ్యవసాయశాఖ వర్గాలు ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయలేదు. కేంద్రం ఫిర్యాదు విభాగం ఏర్పాటు చేయాలని చెప్పి నా అధికారులు పెద్దగా పట్టించుకోవడంలేదు. ఎస్బీఐ ద్వారా రైతులకు సొమ్ము కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని బ్యాంకుల ద్వారా రైతు ఖాతాల్లోకి పంపిస్తుంది. అందుకోసం రాష్ట్ర స్థాయిలో ఎస్బీఐ బ్యాంకులో ఖాతా తెరవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయశాఖ కమిషనర్ పేరుతో ఆ బ్యాంకు ఖాతా తెరుస్తారు. ఒకట్రెండు రోజుల్లో ఖాతా తెరిచే అవకాశముం దని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అటవీ భూములపై హక్కులు ఉంటే అర్హులే అటవీ భూములు సాగు చేసుకునే గిరిజనులు, ఆదివాసీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాగు హక్కులు కల్పిస్తే, వారికి కూడా పీఎం కిసాన్ వర్తిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా 8.6 శాతం గిరిజనులు ఉన్నారని, వారంతా కూడా చిన్న, సన్నకారు రైతులేనని అందులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఆర్వోఎఫ్ఆర్ కింద రైతుబంధు పథకం ద్వారా లబ్ధిపొందిన కుటుంబాలు కూడా పీఎం కిసాన్ పథకం తో లబ్ధిపొందనున్నాయి. వారిలో ఐదెకరా ల కంటే తక్కువ భూమి కలిగిన రైతుకు టుంబాల సంఖ్య 73,056గా ఉంది. వీరందరికీ కూడా పీఎం కిసాన్ వర్తించనుంది. -
పొలం నుంచి వంట గదికి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రైతు పండించే పంట వినియోగదారునికి చేరే క్రమంలో మధ్యలో పెద్ద తతంగమే ఉంటుంది. మిల్లర్, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్.. ప్రతీ వ్యవస్థనూ దాటుకొని ఉత్పత్తులు కస్టమర్‌కు చేరాలి. అలా కాకుండా పంట ఉత్పత్తులు రైతు నుంచి నేరుగా కస్టమర్‌కు చేరితే? దీంతో అన్నదాతకు సరైన ధర రావటంతో పాటూ ఉత్పత్తుల వేస్టేజ్, నాణ్యత ఇబ్బందులూ ఉండవు. ఇదే – హైదరాబాద్‌కు చెందిన అగ్రిప్రెన్యూర్ స్టార్టప్ అవర్‌ఫుడ్ కాన్సెప్ట్! మరిన్ని వివరాలు కంపెనీ ఫౌండర్ బాలారెడ్డి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మా సొంతూరు సూర్యాపేటలోని ఆత్మకూరు గ్రామం. ఎన్ఐటీ వరంగల్‌లో బీటెక్ పూర్తయ్యాక.. కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరా. రైతు కుటుంబం కావటంతో పొలం పనులు, అందులోని ఇబ్బందులు బాగా తెలిసినవాణ్ని. టెక్నాలజీ సహాయంతో అగ్రికల్చర్లో మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా ఆలోచనలు చేసేవాణ్ణి. అందుకే ఐఐఎం అహ్మదాబాద్‌లో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశా. ఆ తర్వాత మరో ఇద్దరు మిత్రులు రఘు ప్రసాద్, శశికాంత్‌లతో కలిసి రూ.3 కోట్ల పెట్టుబడులతో 2016 జనవరిలో అవర్‌ఫుడ్.కో.ఇన్ ప్రారంభించాం. గ్రామీణ యువతతో పొలం దగ్గర్లోనే ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయించి.. ఆయా ఉత్పత్తులను రెస్టారెంట్లు, హోటల్స్, కేటరింగ్, వ్యాపారస్తుల వంటి రిటైలర్లకు విక్రయించడమే అవర్‌ఫుడ్ ప్రత్యేకత. డిసెంబర్ నాటికి 500 యూనిట్లు.. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో మొత్తం 85 ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతతో లీజ్ రెంటల్ మోడల్లో ప్రాసెసింగ్ యూనిట్లను పెట్టిస్తున్నాం. ఒక్క యూనిట్ ఏర్పాటుకు రూ.5 లక్షలు ఖర్చవుతుంది. ప్రతి నెలా 50 యూనిట్లను జత చేస్తూ.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 500 యూనిట్లను పెట్టాలని లకి‡్ష్యంచాం. వచ్చే ఏడాది నుంచి రాజస్తాన్, జార్ఖండ్, గుజరాత్లో యూనిట్లను నెలకొల్పుతాం. నెలకు రూ.15 కోట్ల ఆదాయం.. ప్రస్తుతం ప్రతి నెలా రిటైలర్ల నుంచి 180 టన్నుల ఉత్పత్తుల ఆర్డర్లు వస్తున్నాయి. గత నెలలో 1.2 కోట్ల ఆదాయం ఆర్జించాం. డిసెంబర్ నుంచి నెలకు రూ.15 కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మియాపూర్‌లో 4 వేల చ.అ.ల్లో సొంత గిడ్డంగి ఉంది. ఇందులోనే అన్ని రకాల ఉత్పత్తులను నిల్వ చేస్తున్నాం. త్వరలోనే వరంగల్, కరీంనగర్ వంటి అన్ని జిల్లా కేంద్రాల్లో గిడ్డంగులను అద్దెకు తీసుకోనున్నాం. ఆయా జిల్లాలో సేల్స్ ఆఫీసులు ఏర్పాటు చేసి.. లోకల్ మార్కెట్లో విక్రయిస్తాం. 2 నెలల్లో రూ.21 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం మా కంపెనీలో 35 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో 200 మంది ఉద్యోగులను నియమించుకుంటాం. ‘‘ప్రస్తుతం ఆపరేషనల్ బ్రేక్ఈవెన్కు వచ్చాం. ఇటీవలే అమెరికాకు చెందిన ఓ వెంచర్ క్యాపిటలిస్ట్ మా కంపెనీలో రూ.2 కోట్ల పెట్టుబడులు పెట్టింది. త్వరలోనే మన దేశానికి చెందిన ఓ వీసీ ఫండ్ నుంచి రూ.21 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పేపర్ వర్క్ పూర్తయింది. 2 నెలల్లో డీల్ క్లోజ్ అవుతుంది’’ అని బాలారెడ్డి వివరించారు. -
రైతుకు రొక్కం!
న్యూఢిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్ రైతులపై వరాల జల్లు కురిపించింది. పెట్టుబడి సాయంగా ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల నగదు సాయం ప్రకటించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పేరిట ప్రకటించిన ఈ పథకంలో భాగంగా చిన్న, సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు వెళుతుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఈ పథకం కోసం ఏటా 75 వేల కోట్లు కేటాయించనున్నట్టు మంత్రి వెల్లడించారు. మూడు వాయిదాల్లో డబ్బు లబ్ధిదారులకు చేరుతుందన్నారు. తొలి విడతగా రూ.2వేల ఆర్థిక సాయం ఈ ఏడాది మార్చి లోగా రైతులకు అందజేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లిస్తామని గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలలో ఈ పథకం కోసం రూ. 20 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు ఉత్తరాది కీలక రాష్ట్రాలలో బీజేపీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశముందని గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది. ఈ మూడు రాష్ట్రాలలో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాలలో పెరిగిన అసంతృప్తే కారణమని విశ్లేషణలు వినిపించాయి. అందువల్లే రైతుల కోసం ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని కేంద్రం ప్రకటించిందని విశ్లేషకులంటున్నారు. రైతులకు 2 శాతం వడ్డీ రాయితీ ప్రకృతి వైపరీత్యాలు, అననుకూల వాతావరణ పరిస్థితులతో నష్టపోయే రైతులకు 2 శాతం వడ్డీ రాయితీని కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. రుణాలను సకాలంలో చెల్లించేవారికి 3 శాతం అధికంగా అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. చేపల పెంపకం, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతులకు కూడా 2 శాతం వడ్డీ రాయితీని ప్రకటించారు. చేపల పెంపకం, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతుల కోసం రూ.750 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్ సందర్భంగా కిసాన్ క్రెడిట్ కార్డులను చేపల పెంపకం, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతులకు కూడా అందించాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే.. ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులందరికీ పంటరుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ వర్తింపజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రైతులకు జాతీయ వైపరీత్యాల సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి అందించే సహాయంతో పాటు రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు ఇచ్చే 3 శాతం ప్రోత్సాహాన్ని వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతాంగానికి కూడా వర్తింపజేస్తామని మంత్రి తెలిపారు. ఈ ప్రోత్సాహాన్ని రుణాలు రీషెడ్యూల్ చేసిన కాలం మొత్తానికి అందించనున్నట్లు గోయల్ వివరించారు. ‘‘ప్రకృతి వైపరీత్యాలు వాటిల్లినపుడు రైతులు సహజంగానే తమ రుణాలను తిరిగి చెల్లించలేరు. అలాంటి రైతులకు రుణాలను రీషెడ్యూల్ చేస్తున్నారు. వారికి రీషెడ్యూల్ చేసిన తొలి సంవత్సరం మాత్రమే 2 శాతం వడ్డీ రాయితీ వర్తింపజేస్తున్నారు.’’ అని గోయల్ పేర్కొన్నారు. రాయితీతో కూడిన రుణాలను సులభంగా అందజేయడానికి, రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు అందించడానికి గాను ఒక పరిపూర్ణమైన ప్రక్రియను ప్రారంభించనున్నామని,ఇందుకోసం సులభంగా పూర్తిచేసే దరఖాస్తు ఫారాలను అందించనున్నామని తెలిపారు. పేద, భూమిలేని రైతులు ఉత్పాదక వ్యయాలను ఎదుర్కోవడానికి వారికి నిర్మాణాత్మక ఆదాయం అవసరమని తెలిపారు. సంచార తెగలను పైకి తీసుకురావడానికి ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తామన్నారు. పెరిగిన కేటాయింపులు.. రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు 2019–20 మధ్యంతర బడ్జెట్లో పాడి రైతులకు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు కూడా ఉపశమన చర్యలను ప్రతిపాదించారు. పశుసంవర్థక, మత్స్యకార రుణాలకు కూడా వడ్డీ రాయితీ వర్తిస్తుందని ప్రకటించారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రూ. 1,49,981 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలు రూ. 86,602 కోట్లతో పోలిస్తే రానున్న ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఎరువుల సబ్సిడీ రూ. 70,075 కోట్లు కాగా రానున్న ఆర్థిక సంవత్సరం రూ.74,986 కోట్లు. పేద రైతాంగానికి నిర్దిష్ట ఆదాయ సహాయాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి.. సాగులో ఆదాయం తగ్గిపోవడానికి చిన్న కమతాలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనం వంటి పలు కారణాలున్నాయని పేర్కొన్నారు. 12 కోట్లమందికి లబ్ధి.. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామగ్రి, కూలీలు ఇంకా ఇతర అవసరాలు తీర్చడం కోసం రైతులకు పీఎం కిసాన్ పథకం ఉపకరిస్తుందని గోయల్ తెలిపారు. రైతు అప్పుల ఊబిలో చిక్కకుండా ఈ పథకం కాపాడుతుందని, ముఖ్యంగా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి రక్షిస్తుందని మంత్రి వివరించారు. ఈ పథకానికి నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని, దాదాపు 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం వల్ల లబ్ధి చేకూరుతుందని గోయల్ పేర్కొన్నారు. రైతులు సంపాదించడానికి, గౌరవప్రదమైన జీవనం సాగించడానికి ఈ పథకం దారి చూపుతుందని ఆయన వివరించారు. దీనివల్ల అత్యంత నిరుపేద రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూరడమే కాక, సాగు సీజన్‌కు ముందు అవసరమయ్యే అత్యవసర ఖర్చులకు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి తెలిపారు. గోకుల్ మిషన్‌కు నిధుల పెంపు.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ రుణ లక్ష్యం ఎంత అనేది ఆర్థిక మంత్రి వివరించలేదు. 2018–19లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.11 లక్షల కోట్లను దాటి రూ. 11.68 లక్షల కోట్లకు చేరుకుందని మంత్రి గోయల్ తెలిపారు. రైతులకు రుణాలను అందుబాటులో ఉంచడం కోసం గత ఐదేళ్లలో వడ్డీ రాయితీని రెట్టింపు చేసినట్లు ఆర్థికమంత్రి వివరించారు. అందువల్లే 2018–19లో పంట రుణాలు రూ.11.68 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. రైతుల కష్టాలు తొలగించడానికి మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి వివరిస్తూ.. మట్టి నాణ్యతా కార్డులు, నాణ్యమైన విత్తనాలు, నీటి పారుదల పథకాలు, ఎరువుల కొరత లేకుండా చూడడం వంటివాటి గురించి వివరించారు. పశుసంవర్థక శాఖ, మత్స్యకార రంగాలకు కూడా గణనీయమైన మద్దతు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఆ రంగాల ప్రాధాన్యతను గుర్తించినందునే ఈ ఆర్థిక సంవత్సరంలో ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’కు నిధులను రూ.750 కోట్లకు పెంచినట్లు గోయల్ తెలిపారు. కొత్తగా ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ కొత్తగా ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆవుల ఉత్పాదకతను పెంచడం, గో వనరుల వృద్ధికి అవసరమైన జన్యుపరమైన ప్రయోగాలను విస్తరించడం వంటి పనులను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. గో సంరక్షణ కోసం రూపొందించిన సంక్షేమ పథకాలను, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయించడం కూడా ఈ వ్యవస్థ విధుల్లో భాగమే. మత్స్యకారుల అభివృద్ధిపై ప్రత్యేకంగా కేంద్రీకరించడం కోసం ఫిషరీస్‌కి ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు గోయల్ వెల్లడించారు. అత్యధికంగా మత్స్య సంపదను ఉత్పత్తి చేసే దేశాలలో రెండో అతి పెద్ద దేశం భారతదేశమేనని, ప్రపంచ ఉత్పత్తిలో భారత్ వాటా 6.3శాతమని మంత్రి వివరించారు. ఇటీవలి సంవత్సరాలలో చేపల ఉత్పత్తిలో సగటున 7శాతం వృద్ధి రేటు కూడా నమోదు చేశామని ఆయన తెలిపారు. 1.45 కోట్ల మందికి ఇది ప్రధాన జీవనాధారంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో ఉత్పాదక వ్యయం కన్నా కనీసం 50 శాతం ఎక్కువ ఉండేలా కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నామని గోయల్ వివరించారు. చరిత్రలోనే తొలిసారిగా ఈ ప్రభుత్వం 22 పంటల కనీస మద్దతు ధరలు 50 శాతం పెంచిందని ఆయన తెలిపారు. ఆహార ధాన్యాలు, నూనెగింజలు, చెరకు,పత్తి, ఇతర ఉద్యానవన పంటల ఉత్పత్తి భారీగా జరగడం వల్ల ధరలు పడిపోతున్నాయని,దాంతో సరైన ఆదాయం రాక దేశంలోని అనేక ప్రాంతాల రైతులు పూర్తి నిస్పృహలో ఉన్నారని ఆర్ధికమంత్రి వివరించారు. తెలంగాణ, ఒడిశా పథకాలతో పోల్చలేం రైతులకు నేరుగా నగదు బదిలీ చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పీఎం కిసాన్’ పథకాన్ని వ్యవసాయ రంగ నిపుణులు స్వాగతించారు. అయితే ఈ పథకాన్ని ప్రస్తుతం తెలంగాణలోనూ, ఒడిశాలోనూ కొనసా గుతున్న పథకాలతో పోల్చలేమని వారు వ్యాఖ్యా నించారు. ఆ రాష్ట్రాలలో రైతులకు ఇస్తున్న మొత్తం కన్నా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం కింద ఇచ్చే మొత్తం చాలా తక్కువని పేర్కొంటున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకం లేదా ఒడిశాలో అమలు చేస్తున్న కాలియా పథకం కన్నా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం మొత్తం చాలా తక్కువని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ ఎంజేఖాన్ వ్యాఖ్యానించారు. పీఎం కిసాన్ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తేనే రైతులకు ఆ ఫలాలు అందుతాయని ఇన్సెక్టిసైడ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ అగర్వాల్ వ్యాఖ్యానిం చారు. ధరల పతనం, పెరుగుతుండే ఖర్చులు వంటి ఇబ్బందుల నుంచి రైతులను కాపాడడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని పీడబ్లు్యసీ ఇండియాకు చెందిన అజయ్ వ్యాఖ్యానించారు. రైతన్నల కష్టాలు తీరాలంటే వారు ఎదుర్కొన్న సమస్యలన్నిం టినీ కలిపి చూడాల్సిన అవసరం ఉంది. ధరలు, పంట సేకరణ, పంపిణీల్లో సమస్యలకు సమష్టిగానే పరిష్కార మార్గాలు కనుగొనాలి. – ఎంఎస్ స్వామినాథన్, వ్యవసాయ శాస్త్రవేత్త రైతులకు ప్రయోజనం కలిగించే బడ్జెట్: నాబార్డ్ ముంబై: కేంద్ర బడ్జెట్‌ను జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) స్వాగతిం చింది. వ్యవసాయ రంగంపై దృష్టి సారించిందని, బడ్జెట్ ప్రతిపాదనలతో చిన్న రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడింది. కొత్త ప్రభుత్వం తన పూర్తి స్థాయి బడ్జెట్‌ను రైతులకు మార్కెట్ అనుసంధాన వసతులు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, వాటి తయారీపై పెట్టొచ్చని నాబార్డ్ చైర్మన్ హెచ్‌కె భన్వాలా పీటీఐతో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో వడ్డీ రాయితీతోపాటు అనేక స్వాగత చర్యలున్నాయని అన్నారు. ప్రాథమిక ఆదాయ మద్దతుతో చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. ఫిషరీస్, యానిమల్ హజ్బెండరీ రంగాలకు 5 శాతం వరకు వడ్డీ రాయితీని కల్పించడం వల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, వీటి అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రైతులకు ఏడాదికి ఇచ్చే రూ.6,000 నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని దీంతో విత్తనాలు, ఎరువులు, తదితరాల కొనుగోలుకు వినియోగించవచ్చన్నారు. అన్నదాత కరుణిస్తాడా? ఓట్ల కోసమైతేనేం.. చిన్న రైతుల ఖాతాల్లోకి నాలుగు నెలలకోసారి 2వేల రూపాయలు వచ్చిపడతాయి. అందరి ఆకలీ తీర్చే అన్నదాతకు.. ఇదేమీ కడుపు నింపేసేది కాకపోయినా.. విత్తనాలకోసం వడ్డీ వ్యాపారిని ఆశ్రయించాల్సిన దుస్థితి తప్పుతుంది. ఐదెకరాల లోపు కమతాలున్న 12 కోట్ల మంది రైతులపై నరేంద్ర మోదీ విసిరిన అస్త్రమిది. వీరికి తొలివిడత మొత్తం కూడా ఈ ఏడాది మార్చి 31లోగా.. అంటే ఎన్నికల్లోగానే చేతికందుతుంది. దీంతో పాటు వైపరీత్యాల బారినపడ్డ రైతుల రుణాలకు వడ్డీ రాయితీని కూడా పెంచారు. మోదీ తీసుకున్న ఈ ‘జై కిసాన్’ నినాదం ఏ తీరానికి చేరుస్తుందో! దేశంలో 5 ఎకరాలలోపు భూములున్న రైతులు 12 కోట్ల మంది మార్చి 31లోగా ఇవ్వటానికి కేటాయించింది రూ.20వేల కోట్లు 2019–20 బడ్జెట్లో పూర్తి కేటాయింపులు రూ.75వేల కోట్లు -
వ్యాపార దృక్పథంతో వ్యవసాయం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగాన్ని వ్యాపార దృక్పథంతో చూడాలని, అప్పుడే రైతుకు మెరుగైన ఆదాయం సమకూరుతుందని కేంద్రం కీలక సిఫార్సు చేసింది. రైతు ఆదాయం రెట్టింపుపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికపై వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతోంది. రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే కేవలం వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలతోనే సరిపోదని, వ్యవసాయాన్ని వ్యాపారం వైపు బదలాయించాల్సిన అవసరముందని విశ్లేషించింది. వినియోగదారుడి అవసరాలే కేంద్రంగా వ్యవసాయం చేస్తే పెద్ద ఎత్తున లాభాలు గడించవచ్చని పేర్కొంది. అలాగే వ్యవసాయ రంగాన్ని ఆధునికత వైపు పరుగులు పెట్టించాలని పేర్కొంది. దేశంలో 85 శాతం మంది రైతులు సన్న, చిన్నకారు రైతులేనని, వారి చేతుల్లో అత్యంత తక్కువ విస్తీర్ణం కలిగిన కమతాలు ఉన్నాయని పేర్కొంది. అటువంటి వారికి సాగు ఖర్చు తగ్గించేలా వ్యవసాయ యాంత్రీకరణ కల్పించాలని వివరించింది. దేశంలో వ్యవసాయం రైతుకు లాభసాటిగా లేదు. 2011–12 నాటి లెక్కల ప్రకారం సాగుచేసే రైతు ఆదాయం ఏడాదికి రూ. 78,264 ఉంటే, వ్యవసాయ కూలీ ఆదాయం రూ. 32,311 ఉండగా, వ్యవసాయేతర కార్మికుడి ఆదాయం రూ. 2.46 లక్షలుగా ఉంది. మొదటి నుంచీ రైతు పరిస్థితి ఇలాగే ఉంది. దీంతో రైతులు అప్పులపాలవుతున్నారు. ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. దేశంలో మూడో వంతు రైతులు వరి లేదా గోధుమలే పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం పలు సిఫార్సులు చేసింది. ప్రధాన సిఫార్సులు.. - యాంత్రీకరణను అందిబుచ్చుకుంటే ఉత్పాదకతలో ఉన్న భారీ తేడాను అధిగమించవచ్చు. దీనివల్ల ఆహార భద్రతకు భంగం కలగకుండా చూసుకోవచ్చు. - సూక్ష్మసేద్యంతో ఉత్పాదకతను పెంచుకోవచ్చు. అలాగే సాగునీటి వసతులు కల్పిస్తే ఉత్పాదకత పెరుగుతుంది. - అధిక ఉత్పత్తినిచ్చే వంగడాలను తయారు చేయడం వల్ల కూడా ఉత్పాదకత పెరుగుతుంది. దీనివల్ల రైతులకు అధిక ఆదాయం సమకూరుతుంది. - వ్యవసాయ పరిశోధనలపై పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అందువల్ల పరిశోధన, విస్తరణ రంగాలపై దృష్టి సారించాలి. - ప్రస్తుత ధరల విధానాన్ని ఆధునీకరించాలి. గత నాలుగున్నర దశాబ్దాలుగా దేశంలో కేవలం వరి, గోధుమల మద్దతు ధరపైనే దృష్టి సారించారు. దీనివల్ల ఇతర ఆహారధాన్యాల సాగు, ఆదాయంలో అనేక తేడాలు కనిపించాయి. వాటి ధరలు తగ్గడంతో రైతులు ఆదాయం కోల్పోయారు. - మార్కెట్లో ధరల తీరుపై రైతుకు ఎప్పటికప్పుడు అందించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని కల్పించాలి. - సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులో ఉంచితే వారి ఆదాయం కూడా పెరుగుతుంది. - గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. గ్రామీణ రోడ్లు, విద్యుత్ సరఫరా, రవాణా సదుపాయాలు కల్పించాలి. తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించాలంటే ఇవన్నీ అవసరం. ఫలితంగా వారు అధిక ఆదాయం పొందుతారు. - మార్కెట్లలోనూ మౌలిక సదుపాయాలు కల్పించాలి. దీనివల్ల పంటల నాణ్యత పెరుగుతుంది. నష్టం తగ్గుతుంది. ప్రధానంగా నిల్వ, ట్రేడ్ రంగాల్లో అనేక మార్పులు తీసుకురావాలి. - అత్యంత కీలకమైన రుణ సదుపాయం రైతుకు అందాలి. అప్పుడే పంటల సాగు, విత్తనాలు, ఎరువుల వంటి వాటికి ఇబ్బంది ఉండదు. ఈ విషయంపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. -
మద్దతు మాటే మరిచారు
భూమి మనదే... కష్టం మనదే... దానిపై పండే పంటకు మద్దతుధర మాత్రం మనది కాదు. ఎక్కడో నాలుగు గోడల మధ్య అధికారులే నిర్ణయిస్తారు. అదైనా క్షేత్రస్థాయిలో అమలవుతుందా అంటే దానికీ లేనిపోని సాంకేతిక కారణాలు చూపి వర్తింపజేయట్లేదు. ఏటా సాగు వ్యయం పెరుగుతోంది. ఎరువులు... విత్తనాలు... పురుగుమందుల ధరలతోపాటు కూలిమొత్తాలూ పెరుగుతున్నాయి. కానీ పండించిన పంటకు ఆ స్థాయిలో ధర నిర్థారించకపోవడమే ఇక్కడున్న సమస్య. ఫలితం ఏటా రైతాంగం అప్పుల్లో కూరుకుపోతోంది. వారి కష్టం మట్టిపాలవుతోంది. గరుగుబిల్లి(కురుపాం): దేశానికి రైతే వెన్నెముక అంటారు. వారిని ఆదుకోవడమే తమ ప్రధాన కర్తవ్యం అంటారు. కానీ వారు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించరు. ప్రకృతి విపత్తులవల్లో... మరే కారణాలవల్లో పంట నష్టపోతే కనీసం పరిహారం న్యాయబద్ధంగా అందించరు. అలా రైతు వెన్ను విరిచేస్తున్నారు. ఆరుగాలం కష్టించి... ఎన్నో సమస్యలకు ఎదురీది... ఎలాగోలా పండించిన పంటకు మద్దతు ధర పెంచాలని వేడుకుంటున్నా సర్కారు మా త్రం చేతులు విదల్చడం లేదు. ఈ ఏడాదైనా మద్దతుధర పెరుగుతుందని ఆశగా ఎదురుచూసే అన్నదాతకు తీవ్ర నిరాశే మిగిలింది. క్వింటాలుకు రూ.200లు మాత్రమే పెంచి చేతులు దులుపు కున్నారు. అమలు కాని ఎన్నికల హామీలు 2014 ఎన్నికల్లో రైతులు పండించే పంట ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా చెల్లిస్తామని తెలు గుదేశం నాయకులు హామీలు గుప్పించారు. వరి పంట ఉత్పత్తి చేసేందుకు క్వింటాలుకు రూ.2వేల వరకు వ్యయం అవుతుందని ప్రభుత్వం చెబుతున్న లెక్క. కానీ ప్రభుత్వమే కేవలం రూ.1,770లుగా మద్దతు ధర నిర్ణయించి విశేషం. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా రైతుకు క్వింటాలుకు రూ.300వరకు నష్టం వస్తోంది. ఉత్పత్తి వ్యయంకన్నా 50 శాతం పెంచడం అటుంచితే పెట్టిన వ్యయం కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. వరికి కనీస మద్దతుధర క్వింటాలుకు రూ.2,800లు ఉంచాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోనే నాథుడే కరువయ్యారు. ’రైతులను పట్టించుకోని ప్రభుత్వం ధాన్యం మద్దతు« ధరన పెంచాలని రైతులు, సంఘాలుచేసిన పోరాటాలు ప్రభుతాన్ని కదిలించలేకపోతున్నాయి. కంటితుడుపుగా మద్దతు ధరను ప్రకటించి ప్రభుత్వాలు మమ అనిపించాయి. ఎరువుల ధరలను పెంచిన ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంచకపోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీల ధరలు రెట్టింపు అవడంతో పెట్టుబడులకోసం అధిక వడ్డీలకు అప్పుచేయాల్సి వస్తోంది. ఇంత జరిగినా ప్రకృతి సహకరించకపోతే ఆశించిన దిగుబడి కూడా రావడం లేదు. తీరా వచ్చిన పంటను సైతం గిట్టుబాటు ధరకు అమ్ముకోలేకపోతున్నారు. దళారీల దందా ప్రభుత్వం తరఫున సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆర్థిక అవసరాల నిమిత్తం రైతులు ముందుగా కళ్లాల్లో వాలిపోతున్న ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వారు ప్రభుత్వ ధరతో నిమిత్తం లేకుండా వారు తమ ఇష్టానుసారం రేటు నిర్ణయించి రైతాంగాన్ని దోచుకుంటున్నారు. పల్లెల్లో సాగుతున్న ఈ దందాను అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక సాగు చేయడమంటేనే భయంగా మారి సాగుకు విరామం ప్రకటించాల్సి వస్తుందేమోనన్న ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. రైతు వ్యతిరేక ప్రభుత్వాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకులుగా ముద్రవేసుకున్నాయి. ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం కూడా రైతుల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు. వరికి కనీసం రూ.2,500 మద్దతు ధరవుంటే రైతుకు నష్టాలు తగ్గుతాయి. ప్రభుత్వాలు రైతులపై చిన్నచూపు వల్ల తీరని అన్యాయం చేస్తున్నాయి. – గొట్టాపు త్రినాథస్వామి, కొత్తపల్లి, గరుగుబిల్లి మండలం కార్పొరేట్లకే రాయితీలు ఏటా లాభనష్టాలను ఆలోచించకుం డా సాగుచేస్తున్న అన్నదాతలకు వివిధ రకాల సాకులు చూపి కనీస మద్దతు ధర కల్పించని కేంద్రం బ డా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్లకు రకరకాల రాయితీలు కల్పిస్తోంది. కేవలం రైతుల విషయానికి వచ్చేసరికే ఆర్థిక సంక్లిష్టతలను చూపి గొంతు నొక్కేస్తోంది. ప్రభుత్వాలు రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. – కె.రవీంద్ర, సీపీఎం నాయకుడు, గరుగుబిల్లి -
ధీమానివ్వని బీమా
విజయనగరం గంటస్తంభం: రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తున్న విషయం విదితమే. రైతులు 10శాతం ప్రీమియం చెల్లిస్తే మిగతా సొమ్ము కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా బీమా ప్రీమియం డీఆర్డీఏ అధికారులు కట్టిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 27వేల మంది ప్రీమి యం చెల్లించారు. గడిచిన మూడేళ్లలో 25వేల నుంచి 30వేల మంది వరకు ఐసీఐసీఐ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం కట్టినట్టు సమాచా రం. ప్రీమియం చెల్లించిన రైతులు పంట నష్టపోతే ఆ కంపెనీ రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా 2015–16 సంవత్సరానికి సం బంధించి 25వేల మంది వరకు రైతులు బీమా కట్ట గా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వి డుదల చేస్తున్నారు. ఇందులో అనేక వింతలు చోటు చేసుకుంటున్నాయి. ప్రీమియం చెల్లించిన రైతులందరికీ పరిహారం రావడం లేదు. మంజూరైన జాబితాలో కూడా చాలామంది రైతుల పేర్లు లేవు. వాస్తవానికి పంటల బీమా గ్రామం యూనిట్‌గా కట్టిస్తారు. కానీ ఒకే గ్రామంలో కొందరికి పరిహారం రావడం, మరికొందరికి రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇక ప్రీమియం చెల్లించిన రైతులకు పరిహారం వచ్చినట్లు అధికారులకు సమాచారం వచ్చింది. ఆ జాబితాలో పేర్లున్నా... బ్యాంకు ఖాతాలో కొందరికి జమ కావట్లేదు. పట్టించుకోని అధికారులు బీమా ప్రీమియం కట్టినా పరిహారం రాకపోవడం, పరిహారం వచ్చినా బ్యాంకు ఖాతాలో సొమ్ము లేకపోవడంతో రైతులు, రైతు సంఘాల నాయకులు డీఆర్డీఏ, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రీమియం చెల్లించినా అసలు నష్టపరిహారం రాకపోతే డీఆర్డీఏ, వ్యవసాయాధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. పరిహారం సొమ్ము పడకపోతే బీమా కంపెనీ కూడా స్పందించాలి. కానీ ఎవరూ ట్టించుకోకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. వివరాలు చెబితే పరిష్కరిస్తాం ఐసీఐసీఐ కంపెనీకి 2015–16 సంవత్సరం బీమాతో సంబంధం లేదు. తర్వాత నుంచి పంటల బీమా మా కంపెనీ కట్టించుకుం టోంది. కాబట్టి ఆ ఏడాది నుంచి ఎవరికైనా సమస్య ఉంటే వివరాలు తెలియజేస్తే పరిష్కరిస్తాం. సోమవారం సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తాం. ప్రీమియం కట్టినా పరి హారం రాకపోయినా, పరిహారం మంజూరై జమ కాకపోయినా రైతుల వివరాలు తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – మల్లికార్జున, ఐసీఐసీఐ లాంబోర్డు బీమా అధికారి ప్రీమియం కట్టినా రాలేదు నాకు పినవేమలి రెవెన్యూలో మూడు ఎకరాల భూమి ఉంది. బీమా కోసం రూ.1540 చెల్లిం చాను. పంట నష్టపోవడంతో బీమా పరిహారానికి ఆ గ్రామం ఎంపికైంది. కొందరు రైతులకు పరిహారం వచ్చింది. కానీ నాకు మాత్రం రాలేదు. ఇదేమని అడిగితే ప్రీమియం మీపేరున కట్టలేదని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. కావాలంటే ప్రీమియం సొమ్ము వెనక్కి ఇచ్చేస్తామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇదేమి ఘోరం. – సిరిపురం క్రిష్ణంనాయుడు,రైతు కోరుకొండపాలెం -
రైతును లక్ష్యపెట్టని రాజకీయం
స్వాతంత్య్రం సాధించి ఏడు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా మన దేశంలోని రైతుల్లో 58 శాతం మంది నేటికీ ప్రతిదినం రాత్రిపూట పస్తులతో పడుకుంటున్నారని తెలిసినప్పుడు యావద్దేశం షాక్‌కు గురికావాలి. పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంగా ఆర్థిక సంస్కరణలు కొనసాగుతూ రైతును చిన్నచూపు చూడటమే ఈ జాతీయ విషాదానికి కారణం అని రైతాంగం గ్రహించనంతవరకు వారు సార్వత్రిక ఎన్నికల్లోనూ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోసపోతూనే ఉంటారు. కుల, మత, రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా మేల్కొని రైతులుగా మాత్రమే తమ ఓటు వేసినప్పుడే మన దేశ రాజకీయ వాతావరణంలో మార్పు సంభవిస్తుంది. సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ తన చెవులను తాను నమ్మలేకపోయారు. బహుళ ప్రజాదరణ పొందిన కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో తన ముందు హాట్ సీట్లో మహారాష్ట్రకు చెందిన, నాలుగు ఎకరాల పొలాన్ని సాగు చేస్తున్న ఒక సన్నకారు రైతు కూర్చుని ఉన్నాడు. సంవత్సరంలో ఎంత సంపాదిస్తారు అని అడిగిన ప్రశ్నకు అనంత్‌కుమార్ అనే ఆ రైతు చెప్పిన సమాధానం ఇది. ‘సంవత్సరానికి రూ. 60,000కు మించి సంపాదన ఉండదు. దాంట్లో సగం డబ్బులు పెట్టి విత్తనాలు కొంటాను, మిగిలిన మొత్తం నా కుటుంబానికి రోజుకు ఒక పూట భోజనానికి మాత్రమే సరిపోతుంది’. అమితాబ్ బచ్చన్ నమ్మలేనట్లుగా మళ్లీ ప్రశ్నించారు. అన్నదాత బాధామయగాథను మరోసారి విన్న తర్వాత, రైతులను ఆదుకోవడానికి ముందుకు రావలసిందని, తోచిన సాయం చేయవలసిందని అమితాబ్ కోరుతూ జాతిని అభ్యర్థించారు. భారతీయ చిత్రపరిశ్రమ కన్న ఈ ధీరోదాత్త దిగ్గజ నటుడు ప్రదర్శించిన ఈ సానుభూతిని, కనికరాన్ని ప్రశంసించకుండా ఉండలేను. కానీ, ఈ దేశంలో అనంత్ కుమార్ వంటివారు అరుదైన రైతులు కారన్న వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు అమితాబ్ స్పందన ఎలా ఉంటుంది అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ రైతు చెప్పింది భారతీయ వ్యవసాయం విషయంలో చాలావరకు వాస్తవమే. ఈ దేశంలోని రైతుల్లో 58 శాతం మంది నేటికీ ప్రతిదినం రాత్రిపూట పస్తులతో పడుకుంటున్నారని పలు తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. స్తంభించిపోయిన రైతు రాబడి ఎకనమిక్ సర్వే 2016 ప్రకారం, భారతదేశంలోని 17 రాష్ట్రాలలో (అంటే దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల్లో) ఒక రైతు సగటు ఆదాయం సంవత్సరానికి రూ. 20,000 మాత్రమేనని తెలిసింది. మరో వైపున దేశంలో గత అయిదేళ్లలో (2010–2015 మధ్య) దేశవ్యాప్తంగా రైతుల నిజ ఆదాయంలో వార్షిక పెరుగుదల అర్ధశాతం కంటే తక్కువేనని సాక్షాత్తూ నీతి ఆయోగ్ చెబుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 0.44 శాతం పెరుగుదల మాత్రమే ఉంది. గత నలభై ఏళ్లలో ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసి చూస్తే రైతుల ఆదాయం కాస్త ఎక్కువగా లేక కాస్త తక్కువగా ఉంటూ స్తంభించిపోయి ఉంది. వ్యవసాయ రంగ వ్యధ ఇప్పుడు పరాకాష్టకు చేరుకుంది. ప్రధానంగా ఈ కారణం వల్లే దేశ రైతులు ఆగ్రహంతో వీధులకెక్కుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో రైతుల ఆందోళన, నిరసన ప్రదర్శనలు జరగకుండా ప్రశాంతంగా గడుస్తున్న వారాన్ని దాదాపుగా మనం చూడడం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం, 2014లో 687 రైతు ప్రదర్శనలు జరగగా 2015లో ఒక్క ఏడాదిలోపే 2,683 నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. ఒక సంవత్సరం తర్వాత అంటే 2016లో రైతు నిరసనల సంఖ్య రెట్టింపై 4,837కు చేరుకుంది. మరోమాటలో చెప్పాలంటే కేవలం మూడేళ్ల వ్యవధిలోపే రైతుల నిరసన ప్రదర్శనలు ఏడు రెట్లు పెరిగాయి. రైతుల్లో పెరుగుతున్న ఆగ్రహావేశాలకు ఇది స్పష్టమైన సంకేతంగా చెప్పవచ్చు. నాసిక్ నుంచి ముంబై వరకు రైతుల లాంగ్ మార్చ్ తర్వాత ఇటీవల హరిద్వార్ నుంచి న్యూఢిల్లీ వరకు కిసాన్ యాత్ర జరిగిన తదనంతరం మరిన్ని భారీ రైతు నిరసన ప్రదర్శనలకు పథకం రచించారు. వీటిలో ఆదివాసీలు, భూమిలేని రైతులతో కూడిన అతి పెద్ద ప్రదర్శన కూడా ఒకటి. నిశితంగా పరిశీలించి చూస్తే రైతుల ఆగ్రహ ప్రదర్శనలు రెట్టింపు అవుతున్నాయని బోధపడుతుంది. వరుసగా మూడేళ్లుగా వ్యవసాయ పంటల ధరలు పతనమవడమే ఇంత భారీస్థాయిలో రైతుల ప్రదర్శనలకు, వారి ఆగ్రహజ్వాలలకు ప్రధాన కారణం. 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరగడానికి ముందుగా 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో గ్రామీణ ఓటర్ల వాటా చాలా ఎక్కువగా ఉంది. సరిగ్గా ఈ రాష్ట్రాల్లోనే రైతుల నిరసనలు క్రమంతప్పకుండా జరుగుతున్నాయి. రైతుల ఆందోళనలే ఈ రాష్ట్రాల్లో అధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నగర కేంద్రాలకు కూరగాయలు, పాల ఉత్పత్తులను నిలిపివేసి మరీ నిరసనలకు రైతులు పూనుకున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో అయితే రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో అయిదుగురు రైతులు చనిపోయారు. రైతుల ఆగ్రహం ఇలా స్పష్టంగా గోచరిస్తుండగా, ఇప్పుడు దేశం ముందున్న పెద్ద ప్రశ్న ఏదంటే, ఈ రైతాంగ నిరసనలు రాజకీయ పార్టీలను వాటి ఎన్నికల అజెండాను పునర్నిర్వచించుకునేలా చేసి, ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయానికి అగ్రస్థానం ఇచ్చేలా ఒత్తిడి పెట్టగలవా అన్నదే. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలూ తమ సిద్ధాంతాలతో పనిలేకుండా రైతులు కోరినవల్లా ఇస్తామని వాగ్దానం చేస్తున్నాయి. కానీ ఎన్నికలు ముగియగానే ఆర్థిక రాడార్ స్క్రీన్‌పై రైతులు కనుమరుగైపోతున్నారు. మరోలా చెప్పాలంటే రైతుల సమస్యలను పూర్తిగా వదిలివేస్తున్నారు. రైతును దగా చేస్తున్న రాజకీయ పార్టీలు గత 30 ఏళ్లుగా నేను ఈ పరిణామాలను చూస్తూ వస్తున్నాను. ప్రతి ఎన్నికల సమయంలోనూ రాజకీయ పార్టీలు రైతులను వంచిస్తూ తాము అధికారంలోకి వస్తే అవి కల్పిస్తాం, ఇవి కల్పిస్తాం అంటూ ఆర్థిక ప్రలోభాలకు గురిచేస్తూవస్తున్నాయి. ఎన్నికలు ముగిశాక తదుపరి నాలుగేళ్ల పాలనలో అధికార పార్టీ రైతులను బాదిపడేస్తోంది. చివరి సంవత్సరంలో మాత్రం రైతులకు తాయిలాలు ప్రకటిస్తూ ఆకర్షిస్తున్నారు. కనీసం ఇలాంటి వాగ్దానాలను కూడా నెరవేర్చడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రైతులకు సంబంధించిన అన్ని రకాల రుణాలనూ మాఫీ చేస్తామని యోగి ఆదిత్యనాథ్ దంబాలు పలికారు కానీ వాస్తవానికి సన్నకారు రైతులకు గరిష్టంగా 1 లక్ష రూపాయల వరకు మాత్రమే రుణ మాఫీ చేశారు. ఇక పంజాబ్‌లో కేప్టెన్ అమరిందర్ సింగ్ అయితే రైతుల అప్పులను తీర్చేస్తానని, ప్రైవేట్ బ్యాంకులు, జాతీయ బ్యాంకుల్లో తీసుకున్న అన్ని రుణాలను కూడా మాఫీ చేస్తామని ఆర్భా టంగా ప్రకటించారు. కానీ ఎన్నికలు ముగిశాక ఇంతవరకు రూ. 900 కోట్ల మొండి రుణాలను మాత్రమే రద్దు చేశారు. పంజాబ్‌లో రైతుల మొత్తం రుణాలు రూ. 86,000 కోట్లు. మహారాష్ట్రలో ఇంతవరకు రూ.16,000 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. రూ. 34,000 కోట్ల మొత్తం రుణాలలో ఇది సగంకంటే తక్కువే. రైతాంగ ఉద్యమాలు పాలకుల వ్యవసాయ దృక్పథంలోనూ, ఆర్థిక విధానాల్లోనూ మార్పు తీసుకురావడంలో విఫలమయ్యాయనడం వాస్తవం. దేశీయ రైతాంగం తీవ్రంగా పోరాడింది కానీ నేటికీ వారి ఉద్యమాలు రెండు ప్రధాన డిమాండ్లకే కట్టుబడి ఉంటున్నాయి. అన్నిరకాల రుణాలను మాఫీ చేయడం, స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల మేరకు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను పెంచడం. ఇవి రెండూ చాలా అత్యవసరమైనవే. కానీ, సమాజంలోని ఇతర విభాగాలకు, రంగాలకు ప్రభుత్వాలు కేటాయిస్తున్న పెట్టుబడులను, అంది స్తున్న ఆర్థిక మద్దతును రైతు సంఘాలు అధ్యయనం చేసి, విశ్లేషించి బోధపర్చుకోకుంటే, ప్రభుత్వ విధానం ఫలితంగానే దేశీయ వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతోందన్న వాస్తవాన్ని గ్రహించడం అంత సులభం కాదని నా అభిప్రాయం. పరిశ్రమల కోసం వ్యవసాయం బలి మన దేశ ఆర్థిక విధానాలు తొలి నుంచి వ్యవసాయాన్ని ఆర్థికంగా లాభదాయకం కాని విధంగా ఉద్దేశపూర్వకంగా మలుస్తున్నాయి. రైతుల పట్ల ప్రభుత్వాల బాదుడు మొదట్నుంచి ఇదేరకంగా కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో భవంతర్ భూగ్టన్ పథకం ప్రవేశపెట్టడం లేక వ్యవసాయ పంటల సేకరణపై తగు నిబంధనలు చేర్చకుండానే పంటలకు కనీస మద్దతు ధరను కాస్త అధికంగా ప్రకటించడం వంటి కొన్ని చెదురుమదురు పథకాలు తప్పితే వ్యవసాయ సంస్కరణలకు సంబంధించి మౌలిక మార్పులు ఏవీ చోటుచేసుకోవడం లేదు. దీనిఫలితంగా వ్యవసాయదారుల్లో అశాంతి అధికమవుతోంది. వ్యవసాయ రంగంలో ప్రశాంతతను నెలకొల్పాలంటే, రైతుల ముఖాల్లో చిరునవ్వులు చిందించాలంటే ప్రభుత్వ విధానాలను పూర్తిగా మార్చాల్సిందే. పైగా వ్యవసాయ భూమిని పరిశ్రమ రంగం సులభంగా, తాము కోరుకున్నవిధంగా చేజి క్కించుకోవడానికి తగినట్లుగా భూ చట్టాలను ఇష్ట్రపకారం మార్చివేయడం ప్రధాన సమస్యగా మారింది. వాస్తవానికి ఆర్థిక సంస్కరణల కొనసాగింపు కోసం వ్యవసాయ రంగాన్ని బలిపెడుతున్నారు. రానున్న 2019 ఎన్నికలు మార్పు తీసుకురానున్నాయా? నాకయితే అలా అనిపించడం లేదు. ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది లెమ్మని రైతులు గుర్తించి తగు కార్యాచరణకు దిగనట్లయితే, వారు మరింత దుర్భర పరిస్థితుల్లో కూరుకుపోవడం ఖాయం. అప్పుడు రైతులు తమను తాము తప్పుపట్టుకోవలసిందే. అన్ని రకాల పార్టీల రాజకీయ నాయకులు తమపై సులభంగా స్వారీ చేస్తుంటే గత 70 సంవత్సరాలుగా వ్యవసాయదారులు చూస్తూ ఉండిపోయారు. కుల, మత, రాజకీయ భావజాలాలకు అతీతంగా రైతులు మేల్కొని కేవలం రైతులుగా మాత్రమే తమ ఓటు వేసినప్పుడు మాత్రమే మన దేశ రాజకీయ వాతావరణం మారిపోతుంది. రైతులు తమ ఓటును రైతులుగా మాత్రమే వేసిన రోజున దేశ ఆర్థిక విధానాలు కూడా మారిపోతాయి. ఆరోజు ఎప్పుడొస్తుంది అనేది మన రైతుల చేతుల్లోనే ఉంది. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు -
రైతన్నల ఖరీఫ్ నష్టం 10,000 కోట్లు + శరీర కష్టం
సాక్షి, అమరావతి: ఖరీఫ్ రైతుకు దెబ్బమీద దెబ్బ. ఏ పంటా చేతికి వచ్చేలా లేదు. మొన్న వేరుశనగ.. నిన్న మొక్కజొన్న.. నేడు మినుము, మిర్చి.. రేపేమిటన్నది బెంగగా మారింది. ఎటు చూసినా అగమ్య గోచరమే. రాష్ట్ర స్థూల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెబుతున్న వ్యవసాయం ఈ ఏడాది అన్నదాతకు ఏమాత్రం కలిసివచ్చే పరిస్థితి లేదు. వ్యవసాయం, అనుబంధ రంగాలలో అభివృద్ధి సూచికలలో ఎంపిక చేసిన తొమ్మిది ప్రధాన పంటల్లో రెండింటిని ఈ రబీలో (శనగ, పొగాకు) సాగు చేయాల్సి ఉంటే మరొకటి (వరి) ప్రస్తుతం సాగులో ఉంది. మిగతా పంటలైన – మొక్కజొన్న, మినుము, పెసర, వేరుశనగ, పత్తి,మిర్చి దారుణంగా దెబ్బతిన్నాయి. చెరకు పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఖరీఫ్ కకావికలం కావడంతో రైతులు పెట్టుబడుల రూపంలోనే దాదాపు రూ.10 వేల కోట్లు నష్టపోయినట్టు అనధికార అంచనా. విత్తనం వేసి చిత్తయిన వారు కొందరైతే వేసిన పంట చేతికి వస్తుందో రాదోనన్న బెంగతో ఉన్నవారు మరికొందరు. ఖరీఫ్ సీజన్లో మొత్తం సాగు విస్తీర్ణం 39.53 లక్షల హెక్టార్లు కాగా, 35.47 లక్షల హెక్టార్లలో సాగయినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. వేరుశనగ రైతులకు పెట్టుబడి నష్టం 3 వేల కోట్ల పైమాటే రాయలసీమ జిల్లాల్లో ఖరీఫ్ ప్రధాన పంట వేరుశనగ. 9.23 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉన్నప్పటికీ 8.31 లక్షల హెక్టార్లుగా నిర్ణయిస్తే ఈ ఏడాది ఖరీఫ్‌లో 6.68 లక్షల హెక్టార్లలో విత్తనాలు పడ్డాయి. వాతావరణ పరిస్థితులు సరిగా లేక, సకాలంలో వర్షాలు పడక రైతులు ఆదిలోనే పంటను పశువుల మేపునకు వదిలేశారు. హెక్టార్‌కు 42 నుంచి 43 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టి విత్తనాలు వేస్తే ఈ ఏడాది చేతికి వచ్చేది ఏమీ లేకుండా పోతోంది. ఈ లెక్కన పెట్టుబడి వ్యయమే 6.68 లక్షల హెక్టార్లకు రైతులు 3 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారు. ఈ ఏడాది దిగుబడి లక్ష్యం 10.2 లక్షల టన్నులుగా వ్యవసాయ శాఖ అంచనా వేస్తే ఇప్పుడు కనీసం పది శాతం అంటే లక్ష టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఫలితంగా వేరుశనగ రైతులు మరికొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోనున్నారు. పత్తి రైతుకు రూ.2,100 కోట్ల నష్టం రాష్ట్రంలో మొత్తం పత్తి సాగు విస్తీర్ణం 5.94 లక్షల హెక్టార్లు కాగా.. వర్షాభావం, తెగుళ్లతో దాదాపు సగం విస్తీర్ణంలో ఇప్పటికే దెబ్బతింది. అధికారిక లెక్కల ప్రకారం రైతులు ఒక్కో హెక్టార్లో పత్తి సాగుకు రూ.66 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేస్తారు. అంటే రైతులు పెట్టుబడి వ్యయం కింద దాదాపు రూ.2,100 కోట్లు నష్టపోయారు. మిగిలిన ప్రాంతంలోనైనా పంట చేతికి వస్తుందన్న నమ్మకం లేదు. మామూలుగా ఎకరానికి 20, 25 క్వింటాళ్లు రావాల్సిన పంట.. ఈ ఏడాది 5, 6 క్వింటాళ్లు కూడా దాటకపోవచ్చని రైతులు వాపోతున్నారు. రూ.375 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే రాష్ట్రంలో మొక్క జొన్న 1.25 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం కాగా ప్రస్తుత ఖరీఫ్‌లో లక్ష హెక్టార్లలో సాగవుతోంది. వర్షాభావంతో వచ్చిన కత్తెర తెగులుతో 75 శాతం పంట దెబ్బతింది. దీంతో రైతులు పంటను తొలగిస్తున్నారు. హెక్టార్ మొక్కజొన్న సాగుకు సగటున రూ.50 వేల వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన రైతులు పెట్టుబడిగా పెట్టిన రూ.375 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు కాగా మిగిలిన పంటైనా దక్కుతుందన్న ఆశలేదు. ప్రస్తుత లెక్క ప్రకారం పంట నష్టం వేయి కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇతర పంటల నష్టం రూ.225 కోట్లపైమాటే.. సజ్జ, జొన్న వంటి ఇతర ఆహార పంటలు సుమారు లక్షా 15 వేల హెక్టార్లలో సాగవుతుండగా జొన్న పంట 42 వేల హెక్టార్లలో సాగులో ఉన్నట్టు వ్యవసాయ శాఖ అంచనా. ఈ పంటల సాగునకు హెక్టార్‌కు సగటున రూ.22 వేల వరకు ఖర్చవుతుంది. కత్తెర పురగు, ఇతర తెగుళ్ల ప్రభావంతో జొన్న తీవ్రంగా దెబ్బతింది. ఒక్క జొన్నపైనే పెట్టిన పెట్టుబడులు సుమారు రూ.93 కోట్లు. సజ్జ, రాగి, ఇతర చిరుధాన్యాలను కూడా కలుపుకుంటే ఈ నష్టం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గే పరిస్థితి లేదు. కంది, పెసర, మినుము వంటి పప్పు ధాన్యాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రోత్సహించినా గత అనుభవాలతో రైతులు ఆసక్తి చూపకపోవడంతో 3.19 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సిన ఈ పంటలు 2.85 లక్షల హెక్టార్లకు పడిపోయాయి. కంది హెక్టార్ సాగునకు రూ.29 వేలు, మినుము, పెసరకు హెక్టార్‌కు రూ.25 వేల వరకు ఖర్చవుతుంది. వర్షాలు సకాలంలో పడకపోవడంతో ఇప్పటికే మినుము 20 వేల హెక్టార్లలో, పెసర పది వేల హెక్టార్లలో దెబ్బతింది. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో ఈ పంటల్ని పీకేశారు. ఫలితంగా రైతులు పెట్టుబడి వ్యయం కింద రూ.75 కోట్లు, కొన్ని ప్రాంతాలలో సాగును మధ్యలోనే వదిలి వేయడంతో కంది రైతులు రూ.55 కోట్ల వరకు నష్టపోయినట్టు రైతు సంఘాలు పేర్కొన్నాయి. మిరప పంట 1.30 లక్షల హెక్టార్లలో సాగవ్వగా, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బొబ్బ తెగులు (జెమినీ వైరస్) సోకి పంటను ఊడ్చేస్తోంది. ఈ వైరస్‌తో రైతులు దాదాపు రూ.2 వేల కోట్ల పెట్టుబడులను నష్టపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు అక్కడక్కడా నిలిచిన పంట సైతం సరైన దిగుబడులు ఇచ్చే పరిస్థితి లేదు. చెరకు పరిస్థితి ఏమవుతుందో.. రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం 1.20 లక్షల హెక్టార్లుగా ఉన్నప్పటికీ లక్ష హెక్టార్లలో మాత్రమే సాగవుతోంది. నీటి వసతి ఉన్నప్పటికీ వర్షపాతంలో సమతూకం దెబ్బతిని పంటకు వివిధ రకాల తెగుళ్లు సోకాయి. దీంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. పంట పూర్తిగా దెబ్బతినకపోయినా దిగుబడి, పంచదార రికవరీ శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. హెక్టార్‌కు 52 వేల రూపాయలు వ్యయం చేసినా, క్వింటాల్‌కు ప్రస్తుతం ఉన్న ధర రూ.275 మాత్రమే. అయితే పది శాతం పంచదార రికవరీ ఉండాలి. అది అరపాయింట్ తగ్గినా క్వింటాల్ రేటు రూ.261కి పడిపోతుంది. ఇదే జరిగితే రైతులు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. వరి రైతులకు రూ.1,480 కోట్ల నష్టం అధికారిక లెక్కల ప్రకారం 15.50 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. అంటే మొత్తం సాగు విస్తీర్ణంలో కాస్త కుడి ఎడంగా సగం. ఇప్పటికే తిత్లీ తుపానుతో 1.50 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. నీటి వసతి లేక రాయలసీమ ప్రాంతంలో 50 వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్టు రైతు సంఘాలు చెబుతున్నాయి. అంటే 2 లక్షల హెక్టార్లలో పంట పోయినట్టే. హెక్టార్ వరి సాగునకు సుమారు రూ.74 వేల వరకు ఖర్చవుతుంది. ఫలితంగా రైతులు పెట్టుబడుల రూపేణా రూ.1,480 కోట్లు నష్టపోయినట్టు అంచనా. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి డెల్టాలోని రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోపక్క కత్తెర తెగులు, నవంబర్, డిసెంబర్ నెలల్లో రానున్న వర్షాలు రైతుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఉల్లి, టమాటా రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కలిపితే దాదాపు పది వేల కోట్ల రూపాయల వరకు రైతులు పెట్టుబడుల రూపంలోనే నష్టపోయారు. ఇక ఉత్పత్తి నష్టాన్ని మాటల్లో వర్ణించనలవి కాకుండా ఉంటుందని రైతులు, రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కూలీలూ లేరు.. యంత్రాలూ లేవు
సాక్షి, హైదరాబాద్: రబీ వరి నాట్లు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ఉపాధి హామీ పథకం పనుల్లో ఉండటం వల్ల నాట్ల కోసం కూలీలు దొరకడంలేదు. పైపెచ్చు ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో అనేకమంది కూలీలు పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో గ్రామాల్లో నాట్లు వేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వరి నాటు యంత్రాలు సరఫరా చేయాల్సి ఉండగా వ్యవసాయశాఖ చేతులెత్తేసింది. ఎన్నికల కోడ్ పేరుతో వాటిని నిలుపుదల చేసినట్లు చెబుతున్నారు. ఆ పేరుతో మొత్తం వ్యవసాయ యంత్రాల సరఫరానే నిలిపివేసింది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా కొనసాగుతున్న కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ వర్తించదని చెబుతున్నారు. పైగా దుక్కిదున్నే నాగళ్లు, స్ప్రేయర్లు వంటి చిన్నచిన్న వాటిని కూడా నిలుపుదల చేయాల్సిన అవసరమేంటో అంతుబట్టడంలేదు. ఈ చర్యతో రైతులు తీవ్రం గా నష్టపోతున్నారు. వరి నాటు యంత్రాలు పంపిణీ చేస్తే తమకు కూలీలు దొరక్కపోయినా ఇబ్బంది ఉండేది కాదంటున్నారు. మండలానికి 10 చొప్పున.. రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇకనుంచి నాట్లు పుంజుకోనున్నాయి. రబీకి ముందే అన్ని మండలాల్లో పది చొప్పున వరి నాటు యంత్రాలు అందుబాటులోకి తెస్తామని వ్యవసాయశాఖ ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోలేదు. గత ఖరీఫ్ సీజన్లోనే 50 శాతం సబ్సిడీపై యంత్రాలను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ కసరత్తు చేసింది. వివిధ కంపెనీల నుంచి యంత్రాలను రప్పించింది. పనితీరును శాస్త్రవేత్తలు పరిశీలించారు. జూన్, జూలై నెలల్లోనే యంత్రాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే అప్పటికి రైతులకు, డ్రైవర్లకు శిక్షణ ఇవ్వలేదు. రైతులకు, వ్యవసాయ అధికారులకు అవగాహన సదస్సులు నిర్వహించలేదు. యంత్రాల విక్రయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. దీంతో ఆలస్యమైపోయింది. అయితే మెదక్ జిల్లాలో కొందరు రైతులు సొంతంగా యంత్రాలు కొనుగోలు చేశారు. మరికొందరు ఎకరానికి రూ.3,500 అద్దె చెల్లించి వరి నాట్లు వేయిస్తున్నారు. కాగా వరి నాటు యంత్రాలను పంపిణీ చేయటానికి ఏడు కంపెనీలు ముందుకొచ్చాయి. కనిష్ట ధర రూ.2.25 లక్షలు ఉండగా... గరిష్ట ధర రూ.18.15 లక్షలు ఉంది. కానీ ఇప్పటివరకు పంపిణీ జరగలేదు. బడ్జెట్ రాకపోవడం వల్లే పంపిణీ చేయడం లేదని చెబుతున్నారు. వాస్తవంగా ఇప్పటికే ఏళ్లుగా పంపిణీ చేస్తున్న చిన్నచిన్న యంత్రాలను కూడా నిలుపుదల చేయడంలో అర్థంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రోజువారీ అవసరాలకు ఉపయోగపడే వెయ్యి, రెండు వేల రూపాయల ధర పలికేవాటిని నిలుపుదల చేయడం వల్ల తమకు మరో ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రాక్టర్లను కూడా పంపిణీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల తర్వాతే వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. -
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: బుధవారం నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 267 జిన్నింగ్ మిల్స్‌లో పత్తి కొనుగోలు కేంద్రాలను, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 11 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, రైతులు తొందరపడి పత్తి అమ్మకాలు చేయవద్దని, పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే ధర తక్కువ పలుకుతుందని, తేమ 12% ఉంటే ఎక్కువ ధర అందుతుందని తెలిపారు. పత్తి ఆరిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తేవాలన్నారు. నిజామాబాద్‌లో 40, సిద్దిపేటలో 8, నిర్మల్ జిల్లాలో 21 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్వింటాలు రూ. 1,700 మద్దతు ధరతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. పెసల కొనుగోలుకు 6 కేంద్రాలు ఏర్పాటుచేసి రూ.6,975 మద్దతు ధరతో 9,411 క్వింటాళ్ల పెసలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మినుములు, సోయ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. -
రైతు కుటుంబాలకు బీమా ధీమా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబీమా 90 శాతం సన్నచిన్నకారు రైతు కుటుంబాల్లో వెలుగు నింపిందని వ్యవసాయ శాఖ తెలిపింది. రైతుబీమా పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. యాభై రోజుల్లో రైతుబీమా ద్వారా ఎంతమంది రైతు కుటుంబాలకు ప్రయోజనం కలిగిందో వ్యవసాయశాఖ సమగ్ర నివేదిక తయారు చేసి మంగళవారం ప్రభుత్వానికి పం పింది. ఇప్పటివరకు మొత్తం 1,910 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోయారు. అందులో 1,739 మందికి క్లెయిమ్స్ కోసం ఎల్ఐసీకి సమాచారం పంపారు. వాటిల్లో 1,602 మంది రైతుల క్లెయిమ్స్‌ను పరిష్కరించారు. ఆయా కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.80.01 కోట్ల పరిహారం అందజేసినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఇంకా 137 క్లెయిమ్స్ ప్రక్రియలో ఉన్నట్లు తెలిపింది. పరిహారం పొందిన రైతుల్లో 90 శాతం మంది ఐదెకరాలలోపువారే ఉన్నారని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఆ నివేదికలో వెల్లడించారు. రైతుబీమా పరిహారం పొందిన 1,602 మంది రైతుల్లో ఎకరాలోపున్న రైతులు 401 మంది, ఎకరా నుంచి రెండున్నర ఎకరాలున్న రైతులు 748 మంది, రెండున్నర ఎకరాల నుంచి ఐదెకరాల వరకున్న రైతులు 294 మంది ఉన్నారు. ఐదు నుంచి పదెకరాల వర కున్న రైతులు 146 మంది, పది, అంతకుమించి భూమి కలిగిన రైతులు 13 మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు 85 శాతం సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే పరిహారం అందుకున్న 1,602 మంది రైతుల్లో బీసీలు 816 మంది (51%) ఉండటం గమనార్హం. ఎస్సీ రైతులు 236 మంది (15%), ఎస్టీ రైతులు 329 మంది (21%), మైనారిటీలు 11 మంది (1%), ఇ తరులు 210 మంది (13%) ఉన్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే 85 శాతం రైతుబీమా పరిహారం పొందారు. వ్యవసాయశాఖ ఆయా రైతుల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే వారి ఆర్థిక స్తోమత విస్మయం కలిగించేలా ఉంది. సన్న, చిన్నకారు రైతుల్లో చాలామంది బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.34 నుంచి వెయ్యి వరకే ఉండటం గమనార్హం. ఆయా కుటుంబాల్లో తమ కుటుంబ పెద్ద చనిపోయిన వెంటనే బజారున పడే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో రైతుబీమా కింద ఒకేసారి రూ.5 లక్షలు జమ చేయడం వల్ల ఆయా కుటుంబాలు కుదుట పడటానికి వీలు కలుగుతుందని వ్యవసాయశాఖ తెలిపింది. అంతేకాదు సన్న, చిన్నకారు రైతులే 90 శాతం మంది ఉన్నారంటే వారి ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందనే అంశం కూడా తెలుస్తోంది. సరైన పోషకాహారం లేకపోవడం, వైద్య సదుపాయాలు లేకపోవడం తదితర కారణాలతో అనేకమంది సన్న, చిన్నకారు రైతులు చనిపోతున్నారనేది వాస్తవం. రైతుబీమా కింద చనిపోయిన రైతు కుటుంబానికి ఒకేసారి రూ.5 లక్షలు వస్తుండటంతో బీమాలో చేరని రైతులు ఇప్పుడు ముందుకు వస్తున్నారని వ్యవసాయశాఖ తన నివేదికలో ప్రస్తావించింది. కొత్తగా మరో లక్ష మంది రైతులు తమ పేర్లను రైతుబీమాలో నమోదు చేసుకున్నారు. మొదట్లో అనేకమంది రైతుబీమాలో చేరడానికి ముందుకు రాని సంగతి విదితమే. -
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయిలో రైతు రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడంపై ఉమ్మడి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు నెలల్లోగా ఏర్పాటు చేస్తామన్న హామీని అమలు చేయడంలో ఇబ్బంది ఉంటే ఆ విషయాన్ని హైకోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని శుక్రవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కె.విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. హామీని అమలు చేయకపోవడం కోర్టు ధిక్కార చర్యగా ఎందుకు పరిగణించరాదో తెలపాలని పేర్కొంది. రైతు రుణ విమోచన కమిషన్ ఏర్పాటు చేయాలన్న వ్యాజ్యాన్ని దాఖలు చేసిన బీజేపీ సీనియర్ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి తరఫు న్యాయవాది గత హామీని అమలు చేయకపోవడాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మరికొంత సమయం ఇస్తే కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ నవంబర్ 21తో ముగిసిందని, ఇంతవరకు కనీస సమాచారం లేకుండా గడువు కోరడంలో ఔచిత్యం ఏమిటో అర్థం కావడం లేదని ధర్మాçనం వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. -
ఈ వ్యవ‘సాయం’తో మరో గాయం
చంద్రబాబు హయాంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయి, పండినా గిట్టుబాటు ధరలు లేక, కనీస పెట్టుబడులు రాక, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే స్థితి వచ్చింది. అయినా రైతు రుణాలు రద్దు కాదుకదా, కనీసం వడ్డీ రద్దు కూడా ప్రకటించలేదు. 22 జిల్లా కేంద్ర సహకార సంఘాలలో 18 దివాలా తీసే పరిస్థితి వచ్చింది. వ్యవసాయానికి మొదట అవసరమయ్యేది సకాలం లో పెట్టుబడి. ఈ సౌక ర్యం లేకే రైతు ఆర్థిక సం క్షోభంలో చిక్కుకుంటు న్నాడు. ఈ బాధ నుంచి రైతుకు విముక్తి కలిగించ డానికి కొంత ప్రయత్నం జరిగింది. కానీ ప్రైవేట్ వ్యాపారుల బారి నుంచి రైతులను తప్పించి వడ్డీభారాన్ని ముందుగా ఉన్న 11% నుంచి ‘0’% వరకు తీసుకువచ్చిన క్రమంలో చంద్రబాబు పాత్ర, ప్రమేయం, కనీసం ఆలోచన ఏ దశలోనూ లేదు. ఇప్పుడు ఆయన రైతులను ఆదు కుంటానని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రుణ బాధ నుంచి రైతులు బయట పడాలంటే రైతుల భాగస్వామ్యంతో ఉండే సంస్థల ద్వారా సకా లంలో రైతులకు రుణాలు అందించాలని బ్రిటిష్ పాలనలోనే ’నికల్సన్‘ అనే ఐసీఎస్ అధికారి ఇచ్చిన రిపోర్టు మేరకు వచ్చిందే సహకారచట్టం. ఈ చట్టం ఫలితమే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా లు. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయంచేసి, ప్రతీ బ్యాంకు వ్యవసాయరంగానికిచ్చే 18% రుణా లను 11% వడ్డీకే ఇవ్వాలని, వ్యవసాయరంగాని కిచ్చే 18% రుణాలలో 13% డెరైక్ట్ రుణాలుగా రైతు లకు స్వల్పకాల, దీర్ఘకాల పంటరుణాలుగా ఇవ్వా లని చట్టం తీసుకువచ్చారు. 5% ఇన్డెరైక్టు రుణా లుగా అంటే వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, వ్యవసాయ యాంత్రీ కరణ తయారీ పరిశ్రమలకు ఇవ్వాలని కూడా ఆ చట్టంలో ఉంది. వ్యవసాయోత్పత్తుల ధరలను ప్రభుత్వం నియంత్రించటం మూలంగా, పెరుగు తున్న పెట్టుబడులకు అనుగుణంగా ధరలు పెరగ టంలేదు. కాబట్టి రైతులను కొంతవరకైనా ఆదుకో వాలని భావించి ఎన్.టి.రామారావు, రైతులు తమ రుణాలను మార్చి 31 లోపు చెల్లిస్తే సహకార బ్యాం కుల్లో ఐదున్నర శాతం వడ్డీ రాయితీ ఇప్పించారు. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉండగా రైతులకు బ్యాంకులు ఇచ్చే 13% రుణాలపై వడ్డీని 11% నుండి 9% తగ్గిస్తూ పార్లమెంటులో చట్టం తీసుకొచ్చా రు. యూపీఏ ప్రభుత్వం ఈ 9% వడ్డీలో 2% వడ్డీ కేంద్రప్రభుత్వం బ్యాంకులకు చెల్లించి, రైతులకు వడ్డీని 7% తీసుకు వచ్చింది. ఆ తర్వాత కాలంలో మన రాష్ట్రంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశే ఖరరెడ్డి రైతు రుణాలను 3% అంటే పావలా వడ్డీకి తీసుకువచ్చారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రైతుకు కొంతవరకైనా రుణభారం తగ్గించాలనే ఆలోచనతో మొట్టమొద టిసారిగా దేవీలాల్ ఉప ప్రధానిగా ఉండగా ‘ఏఆర్ ఆర్-1900’ పథకం ద్వారా 01-10-1989 నాటికి వాయిదా మీరిన రైతుల, గ్రామీణ చేతివృత్తుల వారికి రుణం ఎంతవున్నా రూ.10,000 వరకు రద్దు ప్రకటించి దేశవ్యాప్తంగా రూ.6,000 కోట్లు రద్దు చేశారు. యూపీఏ-1 హయాంలో అగ్రికల్చర్ డెట్ వైపర్ అండ్ డెట్ రిలీఫ్ 2008 పథకం పేరుతో 31- 12-2007 నాటికి రుణం తీసుకుని 29-09-2009 నాటికి వాయిదా మీరి ఉండి పథకం ప్రకటించే నాటికి అప్పు చెల్లించకుండా ఉన్న సన్న, చిన్నకారు రైతులకు మాత్రం మొత్తం బకాయిలు రద్దు, మిగి లిన రైతులకు వన్ టైమ్ సెటిల్మెంట్గా 75% బాకీని చెల్లిస్తే 25% రాయితీని అమలు చేయటం ద్వారా దేశవ్యాప్తంగా రద్దయిన రుణాలు రూ.65, 318 కోట్లు. దేశ చర్రితలోనే ఈ రుణాల రద్దు సకా లంలో సక్రమంగా బాకీ చెల్లించే రైతులకు లబ్ధి జర గలేదని గ్రహించి 36 లక్షల మంది రైతులకు ఒక్కొ క్కరికీ రూ.5,000 వంతున ప్రోత్సాహకాలు అం దించిన ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల రుణాల రద్దుకు ముందుకు రాలేదు. చంద్రబాబు హయాంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోయి, పండినా గిట్టుబాటు ధరలు లేక, కనీస పెట్టుబడులు రాక, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే స్థితి వచ్చింది. అయినా రైతు రుణాలు రద్దు కాదుకదా, కనీసం వడ్డీ రద్దు కూడా ప్రకటించలేదు. రాష్ట్రంలో 22 జిల్లా కేంద్ర సహకార సంఘాలలో 18 దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అనంతపురం జిల్లాలో పాద యాత్రలో రైతుల పరిస్థితికి మనసు కరిగి, వ్యవ సాయ రుణాల రద్దుకు నిర్ణయం తీసుకున్నానని చంద్రబాబు ప్రకటించారు. 9 ఏళ్లు సీఎంగా, 8 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నపుడు నోరు మెదపకుండా, 2012లో ‘నా మనసు ద్రవించిపోయింద’ని చెప్ప డం మొత్తం రైతాంగాన్ని మోసం చేయడమే. మరొక అడుగువేసి రుణాలను కట్టవద్దని, తాను అధికారం లోకి రాగానే రైతులు తాకట్టు పెట్టుకున్న దస్తావే జులు, పుస్తెలతాళ్లు మీ ఇంటికి తెచ్చి ఇస్తారని ఊరూరా ప్రచారం చేయించారు. రైతుల పంట రుణాలతో పాటు హెరిటేజ్ ఫ్రెష్ తీసుకున్న రుణాలను కూడా రద్దు చేస్తామని అంటు న్నారు. ఇదెలా అని అడిగితే ‘ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నా. నాకు అన్నీ తెలుసు’ అంటూ వ్యవ సాయ రుణాలన్నీ రద్దు చేస్తామని ఎన్నికల కమి షన్‌కు లేఖ రాశారు. జూన్ 12వ తేదీన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రోజు ఉదయం అన్ని పత్రికల్లో రాష్ర్ట ప్రభుత్వం తరఫున సమాచార ప్రసార శాఖ అధికారికంగా వ్యవసాయ రుణాల రద్దు గురించి చేసిన ప్రకటనలు కూడా ఉన్నాయి. కానీ జరిగినది- కోటయ్య కమిటీ నియామకం. వ్యవసాయ రుణా లు, పంట రుణాలు అయ్యాయి. తరువాత హామీని ఇంకా పలచబరుస్తూ, నేడు ఆధార్ కార్డు ఉంటేనే రద్దు అంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలకై స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తాం అని కూడా చంద్రబాబు చెప్పారు. రూ.5,000 కోట్ల తో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు వాటి ఊసే లేదు. ఎవరినీ మోసం చెయ్యనిది, మోసం చెయ్యాలనే ఆలోచన లేని వాళ్లు రైతులే. దేశానికి అన్నం పెట్టే అలాంటి రైతును మోసం చేస్తున్న వ్యక్తి క్షమార్హుడు కాదు. (వ్యాసకర్త వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు) - ఎం.వి.ఎస్. నాగిరెడ్డి