
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలోని రైతు కుటుంబాలు 2018లో సగటున రూ.2,45,554 మేర అప్పుల పాలయ్యారని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) నిర్వహించిన ఒక సర్వే తెలిపింది. 2018 జూలై నుంచి డిసెంబర్, 2019 జనవరి నుంచి జూన్ మధ్య తీసుకున్న సమాచారంతో 2019 జనవరి–డిసెంబర్ మధ్య నిర్వహించిన 77వ రౌండ్ సర్వే ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని భూములు, పశు సంపద, వ్యవసాయ కుటుంబాల పరిస్థితి అంచనాపై కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది.
ఈ కాలంలో దేశవ్యాప్తంగా రైతుల అప్పు సగటున రూ.74,121గా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా రైతుల అప్పు సగటున రూ.2,45,554గా ఉంది. ఏపీలో 93.2 శాతం రైతు కుటుంబాలపై అప్పుల భారం ఉంది. అలాగే తెలంగాణలో రైతు కుటుంబాల అప్పు సగటున రూ.1,52,113గా ఉంది. ఇక్కడ 91.7 శాతం రైతు కుటుంబాలపై అప్పుల భారం ఉందని సర్వే వెల్లడించింది.
నెలవారీ ఆదాయం రూ.10 వేలే
2018–19 వ్యవసాయ సంవత్సరంలో వ్యవసాయ కుటుంబానికి నెలవారీ సగటు ఆదాయం రూ.10,218గా ఉందని సర్వే పేర్కొంది. 2018 జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రుణభారం 35 శాతం, పట్టణ ప్రాంతంలో ఇది 22.4 శాతంగా ఉందని మరో సర్వే నివేదికలో వెల్లడించింది.