Andhra Pradesh Farmers
-
అవాస్తవాలే పరమావధిగా ఈనాడు!
సాక్షి, విజయవాడ: అవాస్తవాలు, అసత్య ప్రచారాలు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అక్కసు.. ఇవే ఈరోజుల్లో ఈనాడుకు పతాక శీర్షికలుగా మారాయి. తాజాగా ‘ధాన్యం కొనుగోలు నిలిపివేత!’ అనే శీర్షికతో తప్పుడు కథనం ప్రచురించింది. దీంతో ఈ కథనం ఆధారంగా ఏపీ రైతులు ఆందోళనకు గురి కావొద్దని అధికారులు వాస్తవాలను తెలియజేశారు. అవేంటంటే.. ‘‘పౌరసరఫరాల సంస్థ తమ లక్ష్యం పూర్తయిదని తేల్చేసింది. రైతుల వద్ద ఇంకా నిల్వలు ఉన్నాయి. ఎదురుచూపులు తప్పట్లేదు. బ్యాంకు గ్యారంటీలు లేక కొనడానికి నిరాకరిస్తున్న మిల్లర్లు, రంగు మారిన ధాన్యం సేకరణకూ మొండి చెయ్యి’’ అంటూ పూర్తిగా అంటూ అవాస్తవాలనే ప్రచురించింది ఈనాడు. అయితే.. ధాన్యం సేకరణకు సంబంధించిన ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెల్లడించిన వాస్తవాలను ఒకసారి పరిశీలిస్తే.. ధాన్యం కొనుగోలు నిలిపివేత పూర్తిగా అవాస్తవం. కొనుగోలు ఏ జిల్లాలోనూ బ్రేకులు పడలేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తెలియజేసింది. ప్రతిజిల్లా లోని రైతు భరోసా కేంద్రము పరిధిలో.. రైతుల వద్ద ధాన్యము నిల్వ లేదని నిర్దారించుకొన్న తర్వాతనే ధాన్యం సేకరణ ప్రక్రియ ముగించడం జరుగుతుంది. సదరు రైతు భరోసా కేంద్రము వద్ద.. అధికారుల తనిఖీ చేసి రెవిన్యూ, సివిల్ సప్లై, అగ్రికల్చర్ అధికారుల ద్వారా ఆమోద పత్రం పొందిన తర్వాత మాత్రమే సంబంధిత రైతు భరోసా కేంద్రము వద్ద ధాన్యము సేకరణ ప్రక్రియ మూసి వేస్తారు. అంతేకాదు సేకరణ ప్రక్రియ మూసేసే వారం రోజులు ముందు నుంచే గ్రామంలో చాటింపు వేస్తారు. లక్ష్యమంటూ ఏదీ లేదు ఏపీలో పౌరసరఫరాల సంస్థ ధాన్యం సేకరణలో ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోదు. కేవలం తాత్కాలిక అంచనా మాత్రమే ఉంటుంది. వరి పండించే ప్రతి ఒక్క రైతుకు మద్దతు ధర కల్పించటం, ఏ ఒక్క రైతుకూ మద్దతు ధర కంటే తక్కువ ధరకంటే తక్కువకు అమ్ముకునే పరిస్థితి లేకుండా చూడటం ప్రభుత్వ ఉద్దేశాలు. అలాంటప్పుడు టార్గెట్ అనే టాపికే ఉండదు. ఇంకా నిల్వలు.. ఎదురుచూపులంటూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ.. రైతుల వద్ద ఉన్న ధాన్యము నిల్వల తనిఖీ చేసిన తర్వాతే.. సదరు ధాన్యము నిల్వలను భరోసా కేంద్రము ద్వారా కొనుగోలు చేస్తుంది. కానీ, నిల్వలు ఉన్నాయంటూ, రైతులు ఎదురుచూపులంటూ అవాస్తవాలను హైలెట్ చేస్తోంది. అది అవాస్తవం బ్యాంకు గ్యారంటీలు లేక.. కొనడానికి నిరాకరిస్తున్న మిల్లర్లు అని ఈనాడు కథనంలో పేర్కొన్న విషయం పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్ జిల్లాలకు బ్యాంకు గారంటీల యొక్క రేషియోను పెంచింది ఏపీ పౌర సరఫరాల శాఖ. తద్వారా ధాన్యము సేకరణ ప్రక్రియకు సంబంధించి సంబంధిత జిల్లాలకు కేటాయింపు కూడా పెంచారు. ధాన్యము సేకరణ: తేది18-01-2023 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారు 4,77,098 రైతుల వద్ద నుంచి.. రూ.5,373.82 కోట్ల విలువ గల 26,32,372 మెట్రిక్ టన్నుల ధాన్యమును కొనుగోలు చేసింది. అందుకు గాను రూ.4768.79 కోట్ల (89%)ను 4,65,967 రైతుల ఖాతాలో జమ చేయటం జరిగింది. గోనె సంచుల చార్జీలు, హమాలీ ఛార్జీలు, రవాణా చార్జీలు తాలుకు రూ.65.01 కోట్లరూపాయలను చెల్లించవలసి ఉండగా రూ. 26.28 కోట్ల రూపాయలను (40%) రైతుల ఖతాలో జమ చేయటం జరిగింది. కాబట్టి, ఈనాడు పత్రికలో వచ్చిన వార్త పూర్తిగా అసత్యం. రైతులందరికి విజ్క్షప్తి ఏంటంటే.. దళారులను, మధ్య వర్తులను నమ్మి మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్మి మోసపోవద్దు. ధాన్యము సేకరణలో ఎటువంటి సమస్య వచ్చిన సత్వరమే పరిష్కరించేలా ప్రతి మండలంలో అధికారులను నియమించారు. ఒక వేళ రైతులకు సమస్య వస్తే సదరు సమస్య పరిష్కారం కోసం సంబంధిత మండల అధికారి దృష్టికి తీసుకువెళ్లాలి అని ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ వైఎస్ చైర్మన్ & ఎండీ వీరపాండియన్(ఐఏఎస్) ద్వారా ఒక ప్రకటన విడుదల అయ్యింది. -
అప్పట్లో అత్యధిక సగటు అప్పు ఏపీ రైతులదే
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలోని రైతు కుటుంబాలు 2018లో సగటున రూ.2,45,554 మేర అప్పుల పాలయ్యారని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) నిర్వహించిన ఒక సర్వే తెలిపింది. 2018 జూలై నుంచి డిసెంబర్, 2019 జనవరి నుంచి జూన్ మధ్య తీసుకున్న సమాచారంతో 2019 జనవరి–డిసెంబర్ మధ్య నిర్వహించిన 77వ రౌండ్ సర్వే ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని భూములు, పశు సంపద, వ్యవసాయ కుటుంబాల పరిస్థితి అంచనాపై కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా రైతుల అప్పు సగటున రూ.74,121గా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా రైతుల అప్పు సగటున రూ.2,45,554గా ఉంది. ఏపీలో 93.2 శాతం రైతు కుటుంబాలపై అప్పుల భారం ఉంది. అలాగే తెలంగాణలో రైతు కుటుంబాల అప్పు సగటున రూ.1,52,113గా ఉంది. ఇక్కడ 91.7 శాతం రైతు కుటుంబాలపై అప్పుల భారం ఉందని సర్వే వెల్లడించింది. నెలవారీ ఆదాయం రూ.10 వేలే 2018–19 వ్యవసాయ సంవత్సరంలో వ్యవసాయ కుటుంబానికి నెలవారీ సగటు ఆదాయం రూ.10,218గా ఉందని సర్వే పేర్కొంది. 2018 జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రుణభారం 35 శాతం, పట్టణ ప్రాంతంలో ఇది 22.4 శాతంగా ఉందని మరో సర్వే నివేదికలో వెల్లడించింది. -
పూలింగ్‌లో రైతులకు పరిహారం పెంపు
- 48 గంటల్లో గడువు ముగియనుండగా సీఎం ప్రకటన - జరీబు రైతులకు అదనంగా 150 చ.గ. వాణిజ్య భూమి ఇస్తామని వెల్లడి - మంగళగిరి చుట్టుపక్కలున్న 5 గ్రామాల రైతులందరికీ జరీబు భూములకిచ్చే పరిహారం - పూల, పండ్ల తోటలకిచ్చే పరిహారం రూ.లక్షకు పెంపు - భూములివ్వకపోతే.. చట్టపరంగా ముందుకు పోతామని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చే రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం కొత్త పరిహార ప్యాకేజీని ప్రకటించారు. ఆ మేరకు రైతులకిచ్చే పరిహారాన్ని పెంచారు. ల్యాండ్‌పూలింగ్ విధానం కింద భూసమీకరణ ప్రక్రియ మరో 48 గంటల్లో ముగియనున్న తరుణంలో ఈ ప్యాకేజీని ప్రకటించడం గమనార్హం. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) పరిధిలోని నవులూరు, పెనుమాక, ఉండవల్లి, బేతపూడి, ఎర్రబాలెం గ్రామాలకు చెందిన రైతులతో గురువారం హైదరాబాద్ సచివాలయంలోని తన చాంబర్లో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రైతులతో చర్చలు ముగిశాక సాయంత్రం 6.45 గంటలకు మంత్రుల కమిటీతో భేటీఅయ్యారు. అనంతరం మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో కలసి విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. - జరీబు భూముల రైతులకు ముందు ప్రకటించిన 1,300 చదరపు గజాల పరిహారాన్ని 1,450 చదరపు గజాలకు పెంచుతున్నాం. ఎకరాకు వెయ్యిగజాల నివాస ప్రాంతంతోపాటు 450 గజాల వాణిజ్య భూమిని ఇస్తాం. జరీబు భూములకు ఆ ప్రాంతంలో ఉన్న ధరల విషయాన్ని రైతులు నా దృష్టికి తెచ్చిన నేపథ్యంలో పరిహారం పెంచాలన్న వారి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. - నవులూరు, ఎర్రబాలెం, పెనుమాక, ఉండవల్లి, బేతపూడి గ్రామాలు మంగళగిరి పట్టణానికి సమీపంలో ఉన్నందున.. అక్కడి భూములన్నింటికీ జరీబు రైతులకు ప్రకటించిన పరిహార ప్యాకేజీ అందజేస్తాం. ఎకరాకు వెయ్యి గజాల నివాస ప్రాంతంతోపాటు 450 గజాల వాణిజ్య భూమిని ఇస్తాం. - ఎకరాలోపు భూమి ఇచ్చే మెట్టరైతుకు ఏటా రూ.30 వేల చొప్పున, జరీబు రైతుకు రూ.50 వేల చొప్పున పదేళ్లపాటు అందజేస్తాం. - రాజధాని ప్రాంతంలో మల్లె, నిమ్మ, జామ, సపోట, ఉసిరి, మామిడి వంటి పూల, పండ్లతోటలు వేసుకున్న రైతులకు ప్రత్యేక సాయంగా గతంలో ఒకే విడతగా రూ.50 వేలు ఇస్తామని చెప్పాం. దానిని రూ.లక్షకు పెంచుతున్నాం. - ఈ ప్రాంతంలో పండ్లతోటలు, ఉద్యానవన పం టలు వేసుకున్న రైతులకు రుణ విముక్తి(రుణమాఫీ) పథకంలో రూ.లక్షన్నర వరకు అవకాశం కల్పిస్తాం. - పౌల్ట్రీ రైతుల వివరాలను సేకరిస్తున్నాం. వివరాలందాక వారికి చేసే సాయాన్ని ప్రకటిస్తాం. - ఇప్పటికే భూములప్పగించిన రైతులకు మార్చి 1 నుంచి ప్రభుత్వం ఏటా చెల్లించే పరిహారం అందజేస్తాం. అంగీకార పత్రాలిచ్చిన రైతులు ఏప్రిల్ నెలాఖరు వరకు తమ భూములను అప్పగించవచ్చు. అలాంటివారికి అప్పగించే సమయాన్ని బట్టి పరిహారం అందిస్తాం. భూములివ్వకపోతే వెనక్కిపోం.. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే గుర్తించిన గ్రామాల్లో ఎవరైనా భూములివ్వనప్పటికీ ఆయా గ్రామాల్లో ప్రాజెక్టును ఆపే పరిస్థితి మాత్రం ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. చట్టపరంగా ఏం చేయాలో అది చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళతామన్నారు. చట్టపరంగా అంటే భూ సేకరణేనా? అని ప్రశ్నించగా.. అంతకంటే మరో మార్గముందా? అని ఆయన ఎదురుప్రశ్నించారు. రాజధానికోసం రైతులు ఇప్పటికే 25 వేల ఎకరాల భూమిని ల్యాండ్‌పూలింగ్ పద్ధతిన అందజేశారంటూ.. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జరీబు భూమి మరో ఏడువేల ఎకరాల వరకు సమీకరించాల్సి ఉందన్నారు. రాజధాని విషయంలో కొందరు అక్కడి రైతుల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించినా.. రైతులు మాత్రం తనపైనున్న నమ్మకంతో సహకరిస్తూ వస్తున్నారని చెప్పుకొచ్చారు. అసత్యాలు చెప్పేవారి మాటవిని రైతులు భూములివ్వడం జాప్యంచేస్తే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమై అక్కడి భూముల ధరలు వేగంగా పెరగవని సీఎం హెచ్చరించారు. పుకార్లు, అసత్య ప్రచారాలను రైతులు నమ్మవద్దన్నారు. రాజధానిని నిర్మించుకోకపోతే అభివృద్ధిలో మనం ఇతర రాష్ట్రాలతో పోటీపడలేమని చెప్పారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై స్థాయిలో మనం రాజధానిని నిర్మించుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రానికి ఇబ్బందులున్న ఈ తరుణంలో ప్రజలు తమ సహకారాన్ని అందజేయాలని కోరారు. సీఆర్డీఏ పరిధిలోని రైతుల ఇబ్బందుల పరిష్కారానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. -
ఈ నెల 28 తర్వాత భూసేకరణే..!
- ల్యాండ్‌పూలింగ్‌కు సహకరిస్తే సరి.. లేదంటే భూసేకరణ అస్త్రం ప్రయోగిస్తాం - సీఆర్డీఏ గ్రామాల రైతులకు తెగేసి చెప్పిన సీఎం చంద్రబాబు - సచివాలయంలో సీఎంతో సమావేశమైన రాజధాని ప్రాంత రైతులు సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) పరిధిలోని గ్రామాల్లో భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను బెదిరించి దారికి తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండలాల పరిధిలోని 29 గ్రామాల నుంచి దాదాపు వందమంది రైతులను గురువారం హైదరాబాద్‌కు రప్పించి సమావేశమయ్యారు. తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే ల్యాండ్‌పూలింగ్‌కు సహకరిస్తామన్న రైతులపై సీఎం ఈ సందర్భంగా కన్నెర్ర చేశారు. ‘‘ల్యాండ్ పూలింగ్‌కు సహకరిస్తే సరి.. లేదంటే ఈ నెల 28 తర్వాత భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగిస్తాం’ అని తెగేసిచెప్పారు. రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సీఎం చంద్రబాబు ఆ దేశ మంత్రి షణ్ముగం గురువారం హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో రైతులను హుటాహుటీన రప్పించడం గమనార్హం. షణ్ముగంతో భేటీ పూర్తయిన కొద్దిగంటల్లోనే రైతులతో సీఎం సమావేశమయ్యారు. కర్షకులు తమ డిమాండ్లను ఏకరువు పెట్టారు. ‘‘జరీబు భూములకు ఎకరానికి 1000 గజాలు కాకుండా 1400 గజాల ప్లాట్లు ఇవ్వాలి. మల్లెతోటలు.. పండ్ల తోటలకు ఎకరానికి రూ.50 వేలు కాకుండా కనీసం రూ.రెండు లక్షలివ్వాలి. సీఆర్డీఏ పరిధిలో గతంలో రియల్ వెంచర్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను ల్యాండ్పూలింగ్నుంచి మినహాయించాలి. పశువుల మేతకోసం గ్రామం చుట్టూ 500 మీటర్ల మేరకు భూమిని ఖాళీగా ఉంచాలి’’ అని విన్నవించారు. సీఎం ముక్తసరిగా స్పందిస్తూ.. ‘‘మీ డిమాండ్లపై మంత్రుల కమిటీతో చర్చించి.. ఓ నిర్ణయం చెబుతా. రాజధాని నిర్మాణం వేగంగా జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కొందరు రైతులవల్ల రాజధాని నిర్మాణంలో జాప్యం చోటుచేసుకుంటోంది. ల్యాండ్‌పూలింగ్‌కు సహకరిస్తే సరి.. లేదంటే 28 తర్వాత భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తాం’’ అని తెగేసిచెప్పారు. కాగా తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే ల్యాండ్‌పూలింగ్‌కు సహకరిస్తామని.. లేదంటే సీఆర్డీఏ గ్రామాల్లో సమావేశాలుపెట్టి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేస్తామన్న తమను చంద్రబాబు తీవ్రస్థాయిలో బెదిరించినట్లు కొందరు రైతులు పేర్కొంటూ భయాందోళన వ్యక్తం చేశారు. సీఎంతో సమావేశానంతరం మంగళగిరి మండలం ఎర్రబాలెంకు చెందిన కె.శివసత్యనారాయణ, చావలి లింగయ్య, వెంకట నారాయణలు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే ల్యాండ్‌పూలింగ్‌కు సహకరిస్తామని చెప్పారు. -
ఆదర్శగ్రామాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రైతులు
ఆర్మూర్ : వ్యవసాయాన్ని ఆధునిక పద్దతిలో చేస్తూ అధిక దిగుబడులను రాబట్టి లాభాలు పోందుతూ రాష్ట్రంలోనే ఆదర్శగ్రామంగా నిలిచిన అంకాపూర్ గ్రామాన్ని పలు జిల్లాలకు చెందిన రైతులు సందర్శించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామం వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతిలో చేస్తూ ముందంజలో ఉంది. ఆ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు సందర్శించారు. వారు ఆ గ్రామంలోని రైతులు అనుసరిస్తున్న నూతన వ్యవసాయ పద్ధతులను అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. -
బందోబస్తుతో ఎందుకు తిరగాల్సివస్తోంది?
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమర్థత కారణంగా రాష్ట్ర రైతులు కుదేలయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేతగానితనంతో అన్నదాతలకు కనీసం పంటల బీమా కూడా లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫించన్లు ఐదు రెట్లు పెంచితే పాలకవర్గాలు పోలీసుల బందోబస్తుతో గ్రామాల్లో తిరగాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రజాధనాన్ని టీడీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. -
'ఏపీ రైతులు అమాయకులు కాదు'
హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీయిచ్చిన చంద్రబాబు ఇప్పుడు రీషెడ్యూల్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రు విమర్శించారు. రుణమాఫీ చేస్తారా, లేదా అనే దానిపై చంద్రబాబు సూటీగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకీ దాటవేత ధోరణి అంటూ ప్రశ్నించారు. ఏపీ రైతాంగం చంద్రబాబు మాటలు నమ్మే అమాయకులు కాదన్నారు. ప్రజలను పూర్తిగా మోసం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఏదైనా హామీ ఇచ్చి కుదవపెట్టిన రైతుల డాక్యుమెంట్లు తిరిగి ఇప్పిస్తుందా అని ప్రశ్నించారు. బ్యాంక్‌ల నుంచి రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లను ప్రభుత్వమే ఇప్పించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చంద్రబాబు ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని, మీ సమాధానం కోసం రైతులు ఎదురు చూస్తున్నారని జ్యోతుల నెహ్రు అన్నారు. -
'ఏపీ రైతులు అమాయకులు కాదు'