సాక్షి, విజయవాడ: అవాస్తవాలు, అసత్య ప్రచారాలు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై అక్కసు.. ఇవే ఈరోజుల్లో ఈనాడుకు పతాక శీర్షికలుగా మారాయి. తాజాగా ‘ధాన్యం కొనుగోలు నిలిపివేత!’ అనే శీర్షికతో తప్పుడు కథనం ప్రచురించింది. దీంతో ఈ కథనం ఆధారంగా ఏపీ రైతులు ఆందోళనకు గురి కావొద్దని అధికారులు వాస్తవాలను తెలియజేశారు. అవేంటంటే..
‘‘పౌరసరఫరాల సంస్థ తమ లక్ష్యం పూర్తయిదని తేల్చేసింది. రైతుల వద్ద ఇంకా నిల్వలు ఉన్నాయి. ఎదురుచూపులు తప్పట్లేదు. బ్యాంకు గ్యారంటీలు లేక కొనడానికి నిరాకరిస్తున్న మిల్లర్లు, రంగు మారిన ధాన్యం సేకరణకూ మొండి చెయ్యి’’ అంటూ పూర్తిగా అంటూ అవాస్తవాలనే ప్రచురించింది ఈనాడు. అయితే.. ధాన్యం సేకరణకు సంబంధించిన ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెల్లడించిన వాస్తవాలను ఒకసారి పరిశీలిస్తే..
ధాన్యం కొనుగోలు నిలిపివేత పూర్తిగా అవాస్తవం. కొనుగోలు ఏ జిల్లాలోనూ బ్రేకులు పడలేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తెలియజేసింది. ప్రతిజిల్లా లోని రైతు భరోసా కేంద్రము పరిధిలో.. రైతుల వద్ద ధాన్యము నిల్వ లేదని నిర్దారించుకొన్న తర్వాతనే ధాన్యం సేకరణ ప్రక్రియ ముగించడం జరుగుతుంది. సదరు రైతు భరోసా కేంద్రము వద్ద.. అధికారుల తనిఖీ చేసి రెవిన్యూ, సివిల్ సప్లై, అగ్రికల్చర్ అధికారుల ద్వారా ఆమోద పత్రం పొందిన తర్వాత మాత్రమే సంబంధిత రైతు భరోసా కేంద్రము వద్ద ధాన్యము సేకరణ ప్రక్రియ మూసి వేస్తారు. అంతేకాదు సేకరణ ప్రక్రియ మూసేసే వారం రోజులు ముందు నుంచే గ్రామంలో చాటింపు వేస్తారు.
లక్ష్యమంటూ ఏదీ లేదు
ఏపీలో పౌరసరఫరాల సంస్థ ధాన్యం సేకరణలో ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోదు. కేవలం తాత్కాలిక అంచనా మాత్రమే ఉంటుంది. వరి పండించే ప్రతి ఒక్క రైతుకు మద్దతు ధర కల్పించటం, ఏ ఒక్క రైతుకూ మద్దతు ధర కంటే తక్కువ ధరకంటే తక్కువకు అమ్ముకునే పరిస్థితి లేకుండా చూడటం ప్రభుత్వ ఉద్దేశాలు. అలాంటప్పుడు టార్గెట్ అనే టాపికే ఉండదు.
ఇంకా నిల్వలు.. ఎదురుచూపులంటూ..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ.. రైతుల వద్ద ఉన్న ధాన్యము నిల్వల తనిఖీ చేసిన తర్వాతే.. సదరు ధాన్యము నిల్వలను భరోసా కేంద్రము ద్వారా కొనుగోలు చేస్తుంది. కానీ, నిల్వలు ఉన్నాయంటూ, రైతులు ఎదురుచూపులంటూ అవాస్తవాలను హైలెట్ చేస్తోంది.
అది అవాస్తవం
బ్యాంకు గ్యారంటీలు లేక.. కొనడానికి నిరాకరిస్తున్న మిల్లర్లు అని ఈనాడు కథనంలో పేర్కొన్న విషయం పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్‌టీఆర్ జిల్లాలకు బ్యాంకు గారంటీల యొక్క రేషియోను పెంచింది ఏపీ పౌర సరఫరాల శాఖ. తద్వారా ధాన్యము సేకరణ ప్రక్రియకు సంబంధించి సంబంధిత జిల్లాలకు కేటాయింపు కూడా పెంచారు.
ధాన్యము సేకరణ:
తేది18-01-2023 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారు 4,77,098 రైతుల వద్ద నుంచి.. రూ.5,373.82 కోట్ల విలువ గల 26,32,372 మెట్రిక్ టన్నుల ధాన్యమును కొనుగోలు చేసింది. అందుకు గాను రూ.4768.79 కోట్ల (89%)ను 4,65,967 రైతుల ఖాతాలో జమ చేయటం జరిగింది.
గోనె సంచుల చార్జీలు, హమాలీ ఛార్జీలు, రవాణా చార్జీలు తాలుకు రూ.65.01 కోట్లరూపాయలను చెల్లించవలసి ఉండగా రూ. 26.28 కోట్ల రూపాయలను (40%) రైతుల ఖతాలో జమ చేయటం జరిగింది. కాబట్టి, ఈనాడు పత్రికలో వచ్చిన వార్త పూర్తిగా అసత్యం. రైతులందరికి విజ‍్క్షప్తి ఏంటంటే.. దళారులను, మధ్య వర్తులను నమ్మి మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్మి మోసపోవద్దు.
ధాన్యము సేకరణలో ఎటువంటి సమస్య వచ్చిన సత్వరమే పరిష్కరించేలా ప్రతి మండలంలో అధికారులను నియమించారు. ఒక వేళ రైతులకు సమస్య వస్తే సదరు సమస్య పరిష్కారం కోసం సంబంధిత మండల అధికారి దృష్టికి తీసుకువెళ్లాలి అని ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ వైఎస్ చైర్మన్ & ఎండీ వీరపాండియన్(ఐఏఎస్) ద్వారా ఒక ప్రకటన విడుదల అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment