Central statistics agency
-
అభివృద్ధా? అంతరమా?
సాధారణంగా కనిపించే లెక్కలు అసాధారణమైన అనేక అంశాలను మనకు పట్టి ఇస్తాయి. మన దేశ ప్రజలు దేని మీద ఎంత ఖర్చు చేస్తున్నారు లాంటి లెక్కలు చూసినప్పుడు సమాజంలో వచ్చిన అనేక మార్పులు కళ్ళకు కడతాయి. అతి విస్తృత స్థాయిలో దాదాపు 2.61 లక్షల గృహాలను సర్వే చేసి సేకరించిన సమాచారంతో గణాంకాలంటే ఇక వేరే చెప్పేది ఏముంది! ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 2023 ఆగస్ట్ నుంచి 2024 జూలై మధ్య ప్రజల వినియోగాన్ని ఈ తాజా సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. సర్వసాధారణంగా అయిదేళ్ళకోసారి జరిపే ఈ సర్వేను వరుసగా గత ఏడాది, ఈ సంవత్సరం కూడా నిర్వహించడం విశేషమే. ప్రజా క్షేమం కోసం ప్రభుత్వం చేపట్టాల్సిన పథకాలు, అనుసరించాల్సిన విధానాలకు ఇలాంటి సర్వే ఫలితాలు దిక్సూచి. అలాగని వాస్తవాల సమగ్ర స్వరూపాన్ని ఇవి ప్రతిబింబిస్తాయని అనుకోలేం. అనేక ఇతర అంశాలు ఈ గృహవినియోగ వ్యయం లెక్కలను ప్రభావితం చేస్తాయన్న సంగతి విస్మరించి, వీటిని బట్టి జనజీవన ప్రమాణాల స్థాయిని నిర్ధారిస్తే అది సరికాదు. వేతనాలతో సహా అనేక ఇతర అంశాలపై సమాచారంతోనూ బేరీజు వేసుకోవాలి. 2023–24కి గాను కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ గత వారం విడుదల చేసిన ఈ హెచ్సీఈఎస్ సర్వే అనేక అంశాలను విశ్లేషకుల దృష్టికి తెచ్చింది. దేశ ఆర్థిక రంగంలో వినియోగదారుల డిమాండ్ ఏ మేరకుంది, మరీ ముఖ్యంగా మహానగరాల్లో ఎలా ఉంది, దాన్నిబట్టి మన ఆర్థిక వ్యవస్థ ప్రస్థానాన్ని ఎలా అంచనా వేయాలనే దానిపై కొంతకాలంగా అనేక సందేహాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా హెచ్సీఈఎస్ సర్వే ఫలితాల పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది. నిజానికి, దాదాపు 11 ఏళ్ళ విరామం తర్వాత గడచిన రెండేళ్ళుగా ఈ సర్వేలు వెలువడడం విశేషం. గడచిన ఏడాదితో పోలిస్తే 2023–24లో ఆహారపదార్థాలపై జనం వెచ్చించే మొత్తం పెరిగినట్టుగా తాజా సర్వేలోని గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ కుటుంబాలు చేసే మొత్తం ఖర్చులో సైతం... తిండికి వెచ్చించేది మునుపు 2022–23లో 46.4 శాతం ఉండేది. ఇప్పుడు 2023–24లో అది 47.04కి పెరిగింది. పట్టణప్రాంత నివాసాల్లోనూ ఇలాంటి పరిస్థితే. ఆహారంపై జనం ఎక్కువ వ్యయం చేస్తున్నా, ఇప్పటికీ ఇంటి బడ్జెట్లో ఆహారేతర అంశాలదే సింహభాగం. ఆహారం మీద చేస్తున్న ఖర్చు ఏటేటా పెరుగుతున్నదన్నది మాత్రం స్పష్టం. అంత మాత్రం చేత ప్రజలందరి జీవన ప్రమాణాలు, పౌష్టికాహారం పట్ల శ్రద్ధ, ఆహార భద్రత అధికమయ్యాయని అనుకోలేం. ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో తిండిపై జనం చేయాల్సి వస్తున్న ఖర్చు కూడా అనివార్యంగా పెరిగిందన్నది విస్మరించలేం. ఇంకా చెప్పాలంటే, ఈ 2023–24లో గృహవినియోగ వ్యయం 8 – 9 శాతం దాకా పెరిగింది కానీ, అందుకు కూడా ద్రవ్యోల్బణమే ప్రధాన కారణం. దాన్ని గనక తీసేస్తే, అసలు సిసలు లెక్కల్లో వినియోగం ఏ మేరకు పెరిగిందన్నది తేలుతుంది. ఆ రకంగా చూస్తే, గృహవినియోగ వ్యయం కేవలం 3.5 శాతమే పెరిగిందట. ఆ పెరుగుదల కూడా 2024 ఆర్థిక సంవత్సరంలోని వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 8.2 శాతం కన్నా చాలా తక్కువ. అదీ విశ్లేషకులు తేలుస్తున్న మాట. అంటే, సర్వే గణాంకాలు పైకి ఏమి చెప్పినా, అసలు సిసలు వినియోగ వ్యయ వృద్ధి నత్తనడకనే సాగుతోందని అర్థం. దీనికీ మళ్ళీ కారణం – ద్రవ్యోల్బణం, అందులోనూ ఆహార ద్రవ్యోల్బణమే. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలి. సర్కారు సైతం ఈ సంగతి గ్రహించకపోలేదు. ఆహార సరఫరా వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నం కూడా చేసింది. ఆహార నిల్వలు, అలాగే కొన్ని ఆహార పదార్థాలు – కూరగాయల ఎగుమతులపై నిషేధం, వంట నూనెల లాంటి వాటిపై దిగుమతి సుంకాల తగ్గింపు తదితర చర్యలు చేపట్టింది. ఈ చర్యల వల్ల కొంత ఫలితం వచ్చింది. ఆహార ద్రవ్యోల్బణానికి ఒక మేర ముకుతాడు వేయగలిగారు. కానీ, ఇవన్నీ శాశ్వత పరిష్కారం చూపలేవు. ఇవాళ్టికీ మనం వ్యవసాయాధార దేశం కావడం, అందులోనూ మన వ్యవసాయమంతా ప్రధానంగా వర్షాధారమైనది కావడం ప్రధానమైన అవరోధం. ఇక, తాజా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో తలసరి నెలవారీ గృహ వినియోగ వ్యయం నిరుటి రూ. 3,773 నుంచి రూ. 4,122కు పెరిగింది. పట్టణాల్లో అది రూ. 6,459 నుంచి రూ. 6,996కు హెచ్చింది. ఖర్చు విషయంలో గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య అంతరం అంత కంతకూ వేగంగా తగ్గుతోందని ఈ సర్వే డేటా చెబుతోంది. పుష్కరకాలం క్రితం 2011–12లో ఆ వ్యత్యాసం 83.9 శాతం. నిరుడు అది 71.2 శాతం. ఇప్పుడు 69.7కు తగ్గాయని సర్వే మాట. ఖర్చుల్లో అంతరాలు తగ్గినట్టు పైకి కనిపిస్తున్నా, అది వేతనంలో గణనీయమైన పెరుగుదల వల్ల వచ్చినవని చెప్పలేం. ఎందుకంటే, 2023–24తో ముగిసిన అయిదేళ్ళ కాలంలో గ్రామీణ వేతనాలు నామమాత్రంగా 5.2 శాతమే పెరిగాయి. పైగా, వాస్తవ వేతన వృద్ధి మైనస్ 0.4 శాతమే. అంటే, ఇవాళ్టికీ గ్రామీణ – పట్టణ, ధనిక – పేద అంతరాలు గణనీయంగానే ఉన్నాయన్నది నిష్ఠుర సత్యం. ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారన్నది సర్వేల సారమైనా, చాలీచాలని జీతాలతో, బతుకు బండి ఈడుస్తున్న బడుగుల మాట ఏమిటి? అసలు ఖర్చే పెట్టలేని సగటు ప్రాణుల స్వరాలను ఈ సర్వేలు సరిగ్గా పట్టుకోగలుగుతున్నాయా? ఆ అసమానతలు తొలగించగలిగితేనే ప్రయోజనం. తొలగించడానికి తోడ్పడగలిగితేనే ఈ లెక్కలకు సార్థకత. -
సాటిలేని ‘ఉప’కారం.. ఎస్సీ సబ్‌ప్లాన్‌పై కేంద్ర గణాంకాల్లో ఏపీకి అగ్రస్థానం
సాక్షి, అమరావతి: అత్యంత సమర్థంగా ఎస్సీ ఉప ప్రణాళికను అమలు చేస్తూ ఆయా కుటుంబాలకు సాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ ఉప ప్రణాళికను ఈ ఆర్థిక ఏడాది తొలి ఆరు నెలల్లోనే అమలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. 2022–23 రెండో త్రైమాసికం వరకు (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పథకాల అమలు పురోగతిపై రూపొందించిన నివేదికను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఈ నెల 11వ తేదీన విడుదల చేసింది. ఉపప్రణాళిక ద్వారా చిత్తశుద్ధితో ఎస్సీ కుటుంబాలకు సాయం అందించడం, ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల మంజూరుతో పాటు పట్టణ పేదలకు సాయం, వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్ల జారీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మంచి పనితీరు కనపరిచిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రశంసించింది. ► నిర్దేశిత లక్ష్యాల్లో 90 శాతానికిపైగా అమలు చేసిన రాష్ట్రాలను చాలా మంచి పనితీరు కనపరిచినట్లు పరిగణించారు. 80 నుంచి 90 శాతం మేర అమలు చేసిన రాష్ట్రాలను మంచి పనితీరు కనపరిచిన జాబితాలో చేర్చారు. 80 శాతం లోపు అమలు చేసిన రాష్ట్రాలను పనితీరు బాగోలేని వాటిగా నివేదిక వర్గీకరించింది. ► ఎస్సీ ఉప ప్రణాళిక కింద దేశంలోని 22 రాష్ట్రాల్లో మొత్తం 29.84 లక్షల ఎస్సీ కుటుంబాలకు సాయం అందించగా అందులో 29.10 లక్షల ఎస్సీ కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌లో సహాయం అందినట్లు నివేదిక వెల్లడించింది. మిగతా మరే రాష్ట్రం కూడా లక్ష ఎస్సీ కుటుంబాలకు సహాయం చేయలేదని నివేదిక పేర్కొంది. మిగతా రాష్ట్రాలు కేవలం వేల సంఖ్యలో మాత్రమే సాయానికి పరిమితమయ్యాయి. కర్నాటకలో 22,884 మంది ఎస్సీ కుటుంబాలకు ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా సాయం అందించగా మిగతా రాష్ట్రాలు అంతకంటే తక్కువ సంఖ్యకే పరిమితమయ్యాయి. ► ఈ ఆర్థిక ఏడాది తొలి ఆర్నెళ్లలో దేశవ్యాప్తంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 11,80,746 మంది ఎస్సీ విద్యార్థులు సాయం పొందగా అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే 6.15 లక్షల మంది ఎస్సీ విద్యార్ధులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందుకోవడం గమనార్హం. పేదలకు సాయం.. ఇళ్లు.. లక్ష్యానికి మించి వ్యవసాయ కనెక్షన్లు... ► దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి పట్టణ ప్రాంతాల్లోని 3.47 లక్షల పేద కుటుంబాలకు సహాయం అందించగా ఆంధ్రప్రదేశ్‌లోనే 3.28 లక్షల మంది పట్టణ పేద కుటుంబాలకు సాయం అందినట్లు నివేదిక వెల్లడించింది. ► పట్టణ ప్రాంతాల్లో 24 రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ కింద 3.29 లక్షల గృహాలను నిర్మించగా ఒక్క ఆంద్రప్రదేశ్‌లోనే 1,38,245 ఇళ్ల నిర్మాణంతో అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆ తరువాత బిహార్ 99,718 గృహాలను నిర్మించింది. మిగతా రాష్ట్రాలు స్వల్ప సంఖ్యకే పరిమితమయ్యాయి. ► వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో ఏపీ చాలా మంచి పనితీరు కనపరిచినట్లు నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా తొలి ఆర్నెళ్లలోనే లక్ష్యానికి మించి ఏకంగా 46,856 విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడం గమనార్హం. లక్ష్యానికి మించి 754 శాతం నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ► ఏపీలో అంగన్వాడీలు, ఐసీడీఎస్‌లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీలతో పాటు 257 ఐసీడీఎస్‌లు నూటికి నూరు శాతం పని చేస్తున్నట్లు పేర్కొంది. -
మనీ పర్సుకు బైబై.. ప్రధానంగా 3 కారణాలతోనే అలా!
డిజిటల్ పేమెంట్స్ వైపు భారత్ శరవేగంగా దూసుకుపోతోంది. 2021–22లో దేశంలో ఏకంగా 7,422 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు కేం ద్ర గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఒరవడి కొనసాగితే 2026కల్లా దేశంలో డిజిటల్ లావాదేవీలు లక్ష కోట్ల డాలర్లకు చేరతాయన్నది హాంకాంగ్‌కు చెంది న క్యాపిటల్ మార్కెట్ సంస్థ సీఎల్ఎస్ఏ అంచనా.. ఎందుకీ డిజిటల్ చెల్లింపులు? నగదు చెల్లింపులకే ప్రాధాన్యమిచ్చే భారత ప్రజల్లో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కన్పిస్తున్నాయి... 1. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయం జనాన్ని డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించింది. అప్పటికి చలామణిలో ఉన్న 86 శాతం నోట్లు రాత్రికి రాత్రి మాయమైపోయాయి. రోజువారీ లావాదేవీల కోసం ప్రజలు డిజిటల్, ఆన్లైన్ బాట పట్టాల్సి వచ్చింది. తొలుత ఎక్కువగా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే ఆన్లైన్ చెల్లింపులు జరిగాయి. 2. డిజిటల్ చెల్లింపులకు రెండో ప్రధాన కారణం కరోనా. వైరస్ వ్యాప్తి, లాక్డౌన్, సామాజిక దూరంతో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. కరోనా వల్ల బ్యాంకులు, ఆర్థికసంస్థలు విప్లవాత్మక మార్పులు చేపట్టాయి. సులువైన ఆన్లైన్ పేమెంట్లకు సురక్షిత మార్గాలు తెచ్చాయి. 2016 నాటికి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులకు దేశంలో పేటీఎం ఒక్కటే అందుబాటులో ఉండగా ఆ తర్వాత ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్ పే వంటివెన్నో వచ్చాయి. 3. డిజిటల్ చెల్లింపు సంస్థల మధ్య పోటీ పెరిగి ఖాతాదారులను ఆకర్షించడానికి రివార్డులు, రిబేట్లు, పేబ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుండటం మూడో కారణం. ఇతర దేశాల్లో సౌలభ్యం కోసం డిజిటల్ చెల్లింపులు చేస్తుంటే మన దగ్గర మాత్రం వాటి ద్వారా వచ్చే రాయితీల కోసం 60 శాతం మంది చెల్లింపులు చేస్తున్నట్లు గూగుల్–బీసీజీ సర్వేలో తేలింది. డిజిటల్ చెల్లింపులకు మార్గాలు డెబిట్, క్రెడిట్ కార్డులతో మొదలైన డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. యూపీఐ ఆధారిత చెల్లింపులకే ఇప్పటికీ పెద్దపీట వేస్తున్నా ప్రి–పెయిడ్, ఎలక్ట్రానిక్ కార్డులు, స్మార్ట్ ఫోన్ యాప్‌లు, బ్యాంక్ యాప్‌లు, మొబైల్ వ్యాలెట్లు, పేమెంట్ బ్యాంకులు, ఆధార్ ఆధారిత పేమెంట్ పద్ధతులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (బీమ్) యాప్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ వ్యాలెట్లు ఐదు, పది రూపాయల లావాదేవీలనూ అనుమతిస్తుండటంతో తోపుడు బండ్ల నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్ల దాకా వీటిని అందిపుచ్చుకుంటున్నాయి. 2020 అక్టోబర్‌లో 200 కోట్లున్న యూపీఐ లావాదేవీలు గత మార్చిలో 500 కోట్లకు పెరిగాయి. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న భారతీయుల సంఖ్య వచ్చే ఏడాదికల్లా 66 కోట్లకు చేరుతుందని అంచనా. మార్చిలో మారిన ట్రెండు డిజిటల్ చెల్లింపులు ఇంతలా పెరుగుతున్నా గత మార్చిలో అనూహ్యంగా నగదు చెల్లింపులు భారాగా పెరిగాయి. 2021 మార్చిలో రూ.2,62,539 కోట్ల నగదు చెల్లింపులు జరిగితే గత మార్చిలో రూ.31 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రభుత్వాలు పలు పథకాల కింద జనం ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తుండటం, వాటిని డ్రా చేసుకోవడం ఇందుకు కారణంగా కన్పిస్తున్నాయి. ఏటీఎం నగదు విత్‌డ్రాయల్స్ కూడా 2020తో పోలిస్తే 2022 మార్చి నాటికి బాగా పెరిగాయి. ఎలా చెల్లిస్తున్నారు? భారతీయులు అత్యధికంగా యూపీఐ విధా నం వాడుతున్నారు. 2021–22లో రూ.84,17,572.48 కోట్ల విలువైన 4.5 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2020–21తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఆధార్ ఆధారిత విధానం (ఏఐపీఎస్) ద్వారా 3,00,380 కోట్ల రూపాయల విలువైన 23 కోట్ల లావాదేవీలు జరిగాయి. గత మార్చిలోనే 22.5 లక్షల లావాదేవీల ద్వారా 28,522 కోట్ల రూపాయల డిజిటల్ చెల్లింపులు జరిగాయి. తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) ద్వారా 46 కోట్ల లావాదేవీల ద్వారా రూ.37,06,363 కోట్లు చేతులు మారి నట్లు ఎన్పీసీఐ వెల్లడించింది. టోల్గేట్ చెల్లింపులు దాదాపుగా డిజిటైజ్ అయ్యాయి. 2021– 22లో 24 లక్షల ఫాస్ట్‌ట్యాగ్‌ల రూ.38,077 కోట్ల చెల్లింపులు జరిగాయి. మార్చిలో అత్యధికంగా రూ.4,000 కోట్లు ఫాస్ట్‌ట్యాగ్‌ల ద్వారా వసూలయ్యాయి. ఇంతలా డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తున్నా దేశంలో నగదు చెలామణి ఇంకా భారీగానే ఉంది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో జనం నగదు చెల్లింపులకే మొగ్గుతున్నారు. అయితే ఈ దశాబ్దాంతానికల్లా డిజిటల్ చెల్లింపులు నగదు చెల్లింపులను దాటేస్తాయని అంచనా. – నేషనల్ డెస్క్, సాక్షి -
అప్పట్లో అత్యధిక సగటు అప్పు ఏపీ రైతులదే
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలోని రైతు కుటుంబాలు 2018లో సగటున రూ.2,45,554 మేర అప్పుల పాలయ్యారని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) నిర్వహించిన ఒక సర్వే తెలిపింది. 2018 జూలై నుంచి డిసెంబర్, 2019 జనవరి నుంచి జూన్ మధ్య తీసుకున్న సమాచారంతో 2019 జనవరి–డిసెంబర్ మధ్య నిర్వహించిన 77వ రౌండ్ సర్వే ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని భూములు, పశు సంపద, వ్యవసాయ కుటుంబాల పరిస్థితి అంచనాపై కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా రైతుల అప్పు సగటున రూ.74,121గా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా రైతుల అప్పు సగటున రూ.2,45,554గా ఉంది. ఏపీలో 93.2 శాతం రైతు కుటుంబాలపై అప్పుల భారం ఉంది. అలాగే తెలంగాణలో రైతు కుటుంబాల అప్పు సగటున రూ.1,52,113గా ఉంది. ఇక్కడ 91.7 శాతం రైతు కుటుంబాలపై అప్పుల భారం ఉందని సర్వే వెల్లడించింది. నెలవారీ ఆదాయం రూ.10 వేలే 2018–19 వ్యవసాయ సంవత్సరంలో వ్యవసాయ కుటుంబానికి నెలవారీ సగటు ఆదాయం రూ.10,218గా ఉందని సర్వే పేర్కొంది. 2018 జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రుణభారం 35 శాతం, పట్టణ ప్రాంతంలో ఇది 22.4 శాతంగా ఉందని మరో సర్వే నివేదికలో వెల్లడించింది. -
'కూలీలూ' కాడి వదిలేస్తున్నారు
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగం నుంచి రైతులతోపాటు వ్యవసాయ కూలీలు కూడా తప్పుకుంటున్నారా..! కాడి, మేడి పట్టేకన్నా ఏ హోటల్లోనో, రెస్టారెంట్లోనో పనికి వెళ్లడం మేలనుకుంటున్నారా..! వ్యవసాయ కూలీల శాతం నానాటికీ తగ్గిపోతోందా..! అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇదేదో వ్యవసాయ రంగ నిపుణులో, స్వచ్ఛంద సంస్థలో చెబుతున్న మాటలు కావు. సాక్షాత్తు కేంద్ర గణాంకాల శాఖ చెబుతున్న లెక్కలివి. గ్రామీణ భారతంలో సామాజిక, ఆర్థిక సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయనే విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ (పీఎల్ఎఫ్) సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. 2020 నాటికి దేశంలో స్త్రీ, పురుష శ్రామికుల వాటా ఎంత అనే దానిపై కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించిన వివరాలు విశ్లేషకుల్నీ, విధాన నిర్ణేతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. 1987–88 నాటితో పోలిస్తే ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వ్యవసాయ కూలీలు (మహిళ, పురుషులు) శాతం గణనీయంగా తగ్గింది. ఇందుకు తెలుగు రాష్ట్రాలు కూడా మినహాయింపు కాదు. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. గ్రామీణ భారతంలోని వ్యవసాయ రంగంలో 1987–88లో మహిళా కార్మికుల వాటా నూటికి 84.7 శాతం కాగా.. పీఎల్ఎఫ్ సర్వే 2018–19 ప్రకారం 73.2 శాతంగా నమోదైంది. వ్యవసాయంలో పురుష కార్మికుల వాటా 1987–88లో 74.5 శాతం కాగా.. 2018–19 లో 55 శాతంగా నమోదైంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే పురుషుల శాతం 1987–88లో 5.1 శాతం నుంచి 2018–19లో 9.2 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఈ శాతం 21.5 నుంచి 24.5 శాతానికి పెరిగింది. మహిళా కార్మికుల విషయంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో 2.1 శాతం నుంచి 4 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 9.8 శాతం నుంచి 13 శాతం వరకు పెరిగింది. గ్రామీణ రంగంలో కార్మికుల జనాభా నిష్పత్తి (డబ్ల్యూపీఆర్) ప్రకారం మహిళా కార్మికులు 19 శాతంగా ఉండగా.. పురుష కార్మికులు 52.1గా ఉన్నట్టు ఉంది. పట్టణ ప్రాంతాలలో ఈ నిష్పత్తి మహిళా కార్మికులు 14.5 శాతంగా పురుష కార్మికులు 52.7 శాతంగా ఉంది. 1987–88 నాటి నుంచి 2018–19 మధ్య వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికుల శాతం గణనీయంగా తగ్గగా వ్యాపార, వాణిజ్య, హోటల్, రెస్టారెంట్ల రంగాల్లో పనిచేసే వారి శాతం పెరిగింది. అంటే వ్యవసాయ రంగంలో పని చేయడం కంటే హోటళ్లలో పని చేయడం ద్వారా నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చని శ్రామికులు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. వ్యవసాయం రంగంలో ఆదాయం గిట్టుబాటు కాకపోవడం, శారీరక శ్రమ ఎక్కువగా ఉండటంతో పాటు నగరీకరణ వల్ల కూడా వలసలు పెరిగినట్టు సర్వే అభిప్రాయపడింది. మూడొంతుల మంది విద్యకూ దూరమే నేషనల్ సర్వే శాంపిల్ (ఎన్ఎస్ఎస్) 75 వ రౌండ్ (2017–18) డేటా ప్రకారం, 3–35 ఏళ్ల మధ్య వయస్కుల్లో 30.2 శాతం మంది మహిళలు ఇంటి పనుల దృష్ట్యా విద్యకు దూరమవుతున్నారు. వీళ్లలో ఎక్కువ మంది ఇంటి పనులకే పరిమితం అవుతున్నారు. పురుషుల విషయానికొస్తే 3–35 ఏళ్ల మధ్య వయస్కుల్లో 36.9 శాతం మంది ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల చదువుకు దూరమవుతున్నారు. మహిళల్లో 13.6 శాతం, పురుషుల్లో 14.9 శాతం మంది ఆర్థిక పరిస్థితుల కారణంగా విద్యను అభ్యసించడం లేదని ఈ నివేదిక పేర్కొంది. -
వచ్చే ఏడాది 5.6% వృద్ధి: సిటీ గ్రూప్
న్యూఢిల్లీ: వచ్చే 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీడీ) వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండొచ్చని సిటీ గ్రూప్ అంచనా వేసింది. అయితే, రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం కొలువుదీరటం, పెట్టుబడులు పుంజుకోవడం, మెరుగైన రుతుపవనాలు వంటివి దీనికి అత్యంత కీలకమని నివేదికలో పేర్కొంది. ‘ఎల్ నినో’ ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవచ్చని.. దీంతో వ్యవసాయ ఉత్పాదకత తగ్గే రిస్క్‌లు పొంచిఉన్నట్లు సీటీ గ్రూప్ వెల్లడించింది. కంపెనీలు పెట్టుబడులపై నిర్ణయాలకు ఎన్నికలు పూర్తయ్యేదాకా వేచిచూడనున్నాయని అభిప్రాయపడింది. కేంద్రీయ గణంకాల సంస్థ(సీఎస్ఓ) ఈ ఏడాది(2013-14) వృద్ధి రేటు 4.9%గా ఉండొచ్చని ముందస్తు అంచనాల్లో పేర్కొనడం తెలిసిందే. సిటీ గ్రూప్ ఈ ఏడాది వృద్ధి 4.8%గా అంచనా వేసింది. ద్రవ్యలోటు 4.7 శాతానికి: ఆర్థిక శాఖ ఈ ఏడాది(2013-14) ద్రవ్యలోటు 4.7 శాతానికి కట్టడికావచ్చని(లక్ష్యం 4.8%) ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. 2జీ స్పెక్ట్రం వేలానికి స్పందన బాగుండటం(6 రోజుల్లో రూ.56,500 కోట్ల బిడ్లు లభించాయి), కోల్ ఇండియా భారీ డివిడెండ్ ఇతరత్రా అంశాలు ఇందుకు దోహదం చేయనున్నాయని చెప్పారు.