సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగం నుంచి రైతులతోపాటు వ్యవసాయ కూలీలు కూడా తప్పుకుంటున్నారా..! కాడి, మేడి పట్టేకన్నా ఏ హోటల్‌లోనో, రెస్టారెంట్‌లోనో పనికి వెళ్లడం మేలనుకుంటున్నారా..! వ్యవసాయ కూలీల శాతం నానాటికీ తగ్గిపోతోందా..! అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇదేదో వ్యవసాయ రంగ నిపుణులో, స్వచ్ఛంద సంస్థలో చెబుతున్న మాటలు కావు. సాక్షాత్తు కేంద్ర గణాంకాల శాఖ చెబుతున్న లెక్కలివి. గ్రామీణ భారతంలో సామాజిక, ఆర్థిక సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయనే విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ (పీఎల్‌ఎఫ్) సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. 2020 నాటికి దేశంలో స్త్రీ, పురుష శ్రామికుల వాటా ఎంత అనే దానిపై కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించిన వివరాలు విశ్లేషకుల్నీ, విధాన నిర్ణేతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. 1987–88 నాటితో పోలిస్తే ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వ్యవసాయ కూలీలు (మహిళ, పురుషులు) శాతం గణనీయంగా తగ్గింది. ఇందుకు తెలుగు రాష్ట్రాలు కూడా మినహాయింపు కాదు.
గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
గ్రామీణ భారతంలోని వ్యవసాయ రంగంలో 1987–88లో మహిళా కార్మికుల వాటా నూటికి 84.7 శాతం కాగా.. పీఎల్‌ఎఫ్ సర్వే 2018–19 ప్రకారం 73.2 శాతంగా నమోదైంది. వ్యవసాయంలో పురుష కార్మికుల వాటా 1987–88లో 74.5 శాతం కాగా.. 2018–19 లో 55 శాతంగా నమోదైంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే పురుషుల శాతం 1987–88లో 5.1 శాతం నుంచి 2018–19లో 9.2 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఈ శాతం 21.5 నుంచి 24.5 శాతానికి పెరిగింది. మహిళా కార్మికుల విషయంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో 2.1 శాతం నుంచి 4 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 9.8 శాతం నుంచి 13 శాతం వరకు పెరిగింది. గ్రామీణ రంగంలో కార్మికుల జనాభా నిష్పత్తి (డబ్ల్యూపీఆర్) ప్రకారం మహిళా కార్మికులు 19 శాతంగా ఉండగా.. పురుష కార్మికులు 52.1గా ఉన్నట్టు ఉంది. పట్టణ ప్రాంతాలలో ఈ నిష్పత్తి మహిళా కార్మికులు 14.5 శాతంగా పురుష కార్మికులు 52.7 శాతంగా ఉంది. 1987–88 నాటి నుంచి 2018–19 మధ్య వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికుల శాతం గణనీయంగా తగ్గగా వ్యాపార, వాణిజ్య, హోటల్, రెస్టారెంట్ల రంగాల్లో పనిచేసే వారి శాతం పెరిగింది. అంటే వ్యవసాయ రంగంలో పని చేయడం కంటే హోటళ్లలో పని చేయడం ద్వారా నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చని శ్రామికులు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. వ్యవసాయం రంగంలో ఆదాయం గిట్టుబాటు కాకపోవడం, శారీరక శ్రమ ఎక్కువగా ఉండటంతో పాటు నగరీకరణ వల్ల కూడా వలసలు పెరిగినట్టు సర్వే అభిప్రాయపడింది.
మూడొంతుల మంది విద్యకూ దూరమే
నేషనల్ సర్వే శాంపిల్ (ఎన్‌ఎస్‌ఎస్) 75 వ రౌండ్ (2017–18) డేటా ప్రకారం, 3–35 ఏళ్ల మధ్య వయస్కుల్లో 30.2 శాతం మంది మహిళలు ఇంటి పనుల దృష్ట్యా విద్యకు దూరమవుతున్నారు. వీళ్లలో ఎక్కువ మంది ఇంటి పనులకే పరిమితం అవుతున్నారు. పురుషుల విషయానికొస్తే 3–35 ఏళ్ల మధ్య వయస్కుల్లో 36.9 శాతం మంది ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల చదువుకు దూరమవుతున్నారు. మహిళల్లో 13.6 శాతం, పురుషుల్లో 14.9 శాతం మంది ఆర్థిక పరిస్థితుల కారణంగా విద్యను అభ్యసించడం లేదని ఈ నివేదిక పేర్కొంది.
'కూలీలూ' కాడి వదిలేస్తున్నారు
Published Thu, Apr 22 2021 5:50 AM | Last Updated on Thu, Apr 22 2021 5:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment