![Thailand agricultural workers released by Hamas](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/THAILAND-GAZA-HOSTAGES.jpg.webp?itok=_5QeqQwu)
బ్యాంకాక్: 500 రోజులపాటు హమాస్ చెరలో ఉన్న థాయ్‌లాండ్ వ్యవసాయ కార్మికులు స్వదేశానికి చేరుకున్నారు. 2023 అక్టోబర్లో జరిగిన దాడుల్లో దక్షిణ ఇజ్రాయెల్‌లో పనిచేస్తున్న పొంగ్సాక్ థేన్నా, సతియాన్ సువన్నాఖమ్, వాచరా శ్రీవూన్, బన్నావత్ సేథావో, సురసాక్ లామ్నావోలను కూడా హమాస్ అపహరించింది. ఎట్టకేలకు వారు ఆదివారం ఉదయం బ్యాంకాక్‌కు చేరకున్నారు. సువర్ణభూమి ఎయిర్‌పోర్టులో దిగిన ఐదుగురు కుటుంబాలను కలుసుకోవడంతో విమానాశ్రయంలో భావోద్వేగ వాతావావరణ నెలకొంది.
కాగా, వారు మళ్లీ తిరిగి ఇజ్రాయెల్‌కు వెళ్లకుండా ఉండేందుకు నెలకు 725 పౌండ్ల వేతనంతో పాటు సుమారు 14,510 పౌండ్లను ఒకేసారి ఇవ్వనున్నట్లు థాయ్ కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. ఒక థాయ్ బందీ ఆచూకీ లభించలేదు. గాజాలో ఇంకా ఉన్న ఆరో థాయ్ బందీ విడుదల కోసం ప్రయత్నిస్తామని, గెలుస్తామనే ఆశ ఉందని విదేశాంగ మంత్రి సంగియంపోంగ్సా అన్నారు. అక్టోబర్ 2023 నుంచి మొత్తం 46 మంది థాయ్ కార్మికులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది హమాస్ దాడిలో, కొందరు హెజ్‌బొల్లా ప్రయోగించిన క్షిపణుల వల్ల మరణించారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా జనవరి 30న విడుదలయ్యారు. అయితే 10 రోజులపాటు వారికి ఇజ్రాయెల్ ఆసుపత్రిలోనే ఉంచి ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. అనంతరం స్వస్థలాలకు పంపించారు. బ్యాంకాక్ చేరుకున్న అనంతరం బందీలు మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. మేం ఇక్కడ నిలబడానికి సహాయం చేసిన అధికారులందరికీ కృతజ్ఞతలు. స్వదేశానికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉన్నాం’’అని చెప్పారు. తమవారిని మళ్లీ ఇంటికి దూరంగా పంపించాలనుకోవడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment