
ఒప్పందం ప్రకారమే విడిచిపెట్టిన హమాస్
నుసెయిరత్: కాల్పుల విరమణ ఒప్పందంపై నీలినీడలు కమ్ముకుంటున్న వేళ ముందుగా ప్రకటించిన విధంగానే హమాస్ తన చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల్లో ఆరుగురిని వేర్వేరు ప్రాంతాల్లో శనివారం రెడ్ క్రాస్‌కు అప్పగించింది. గాజాలోని నుసెయిరత్‌లో శనివారం ఉదయం ముందుగా ఏర్పాటు చేసిన వేదికపైకి మాస్క్ ధరించిన హమాస్ సాయు ధులు ముగ్గురు బందీలను తీసుకువచ్చారు. వీరు ఒమెర్ వెన్‌కెర్ట్(23), ఒమెర్ షెమ్ టోవ్(22), ఎలియా కోహెన్(27). ముగ్గురూ ఆరోగ్యంగానే కనిపించారు. ఎంతో సంతోషంతో ఉన్న ఒమెర్ షెమ్ టోవ్ పక్కనున్న హమాస్ మిలిటెంట్ నుదుటిపై ముద్దిచ్చాడు.
వీరి విడుదలను గమనిస్తున్న కుటుంబసభ్యులు ఆనంద బాష్పాలతో సంతోషం పట్టలేక కేకలు వేశారు. అనంతరం వీరిని రెడ్ క్రాస్ వాహనాల్లో ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ వీరికి అధికారులు స్వాగతం పలికారు. అంతకుముందు, గాజాలోని రఫాలో జరిగిన కార్యక్రమంలో టల్ షోహమ్(40), అవెరా మెంగిస్టు(38) అనే బందీలను హమాస్ సాయుధులు రెడ్ క్రాస్ సిబ్బందికి అప్పగించారు. ఇక, ఆరో బందీ 36 ఏళ్ల బెడోయిన్ సంచార తెగకు చెందిన హిషామ్ అల్– సయేద్‌ను కూడా విడిచిపెట్టింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఇతడు 2015లో గాజాలోకి ప్రవేశించి, హమాస్ బందీగా మారాడు.
2014 నుంచి బందీగా ఉండి..
శనివారం విడుదలైన వారిలో కోహెన్, షెమ్ టోవ్, వెన్‌కెర్ట్‌లు 2023 అక్టోబర్ 7న కిబ్బుట్జ్‌లో నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ శ్రేణులు జరిపిన మెరుపు దాడిలో చిక్కారు. కిడ్నాపైన సమయంలో సాధారణ దుస్తుల్లో ఉన్న వీరు శనివారం విడుదలైనప్పుడు మాత్రం నకిలీ ఆర్మీ యూనిఫాంతో కనిపించారు. టల్ షోహమ్‌కు ఆ్రస్టేలియా పౌరసత్వం కూడా ఉంది. మ్యూజిక్ ఫెస్టివల్‌కు వచ్చిన ఇతడిని కుటుంబం సహా హమాస్ బందీలుగా పట్టుకుపోయింది. షోహమ్ భార్య, ఇద్దరు పిల్లలు, మరో ముగ్గురు బందీలను 2023 నవంబర్‌లో బందీల మార్పిడి సమయంలో విడుదల చేశారు. ఇంకా, ఇథియోపియా మూలాలున్న ఇజ్రాయెల్ పౌరుడు మెగిట్సు 2014లో అనుకోకుండా గాజాలోకి ప్రవేశించి హమాస్‌కు పట్టుబడ్డాడు. దశాబ్దానికి పైగా హమాస్ చెరలోనే గడిపిన ఇతడు సజీవంగా రావడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అంతేలేకుండా పోయింది.
షిరి బిబాస్ మృతదేహం అప్పగింత
గురువారం హమాస్ అప్పగించిన బందీల మృత దేహాల్లో ఒకటి షిరి బిబాస్‌ది కాదని, అది గుర్తు తెలియని మరో పాలస్తీనా మహిళదంటూ ఇజ్రాయెల్ ప్రకటించడం తెలిసిందే. ఇది పొరపాటేనంటూ హమాస్ సైతం అంగీకరించింది. ఈ మేరకు పాలస్తీనియన్ ముజాహిదీన్ బ్రిగేడ్స్ అనే సాయుధ గ్రూపు మరో మృతదేహాన్ని శుక్రవారం రాత్రి రెడ్ క్రాస్‌కు అప్పగించింది. పరిశీలించిన కుటుంబ సభ్యులు, పరీక్షలు జరిపిన ఇజ్రాయెల్ ఫోరెన్సిక్ అధికారులు అది షిరి బిబాస్ మృతదేహమేనని ధ్రువీకరించడంతో కథ సుఖాంతమైంది. మొదటి దశలో సజీవంగా ఉన్న బందీల విడుదల శనివారంతో ముగియగా వచ్చే వారంలో చనిపోయిన నలుగురు బందీల మృతదేహాలను అప్పగించనున్నట్లు హమాస్ ప్రకటించింది. కాగా, హమాస్ చెరలో ఇంకా 60 మంది వరకు బందీలుగా ఉన్నట్లు చెబుతున్న ఇజ్రాయెల్ వీరిలో సగం మందివరకు చనిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment